Devananda Reddy
-
పదో తరగతి హాల్‌టికెట్లు సిద్ధం
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 18 నుంచి 30 వరకు జరిగే పరీక్షలకు విద్యార్థుల హాల్‌టికెట్లను సిద్ధం చేసినట్లు పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ కోడ్ నంబర్‌తోను, విద్యార్థులు తమ పుట్టిన తేదీని నమోదు చేసి సోమవారం మధ్యాహ్నం నుంచి www.bse.ap.gov.in నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలున్నారు. గతేడాది పదో తరగతి తప్పి తిరిగి ప్రవేశం పొందినవారు మరో 1,02,528 మంది కూడా రెగ్యులర్‌గా పరీక్షలు రాయనున్నారు. ఈ ఏడాది మొత్తంగా 7,25,620 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28వ తేదీతో ముగుస్తుండగా, మరో రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలుంటాయి. విద్యాశాఖ 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్వాడ్స్‌ను సిద్ధం చేసింది. 130కి పైగా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. -
పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదలైంది. శనివారం నుంచి నవంబర్ 10వ తేదీలోగా ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ నుంచి 16 వరకు రూ.50, 17వ తేదీ నుంచి 22 వరకు రూ.200, 23వ తేదీ నుంచి 30 వరకు రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. పాఠశాలల హెచ్ఎంలు నిర్ణి త సమయంలో ఫీజులు చెల్లించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని తెలిపారు. -
కట్టుదిట్టంగా టెన్త్ పరీక్షలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి మంగళవారం అధికారులకు పలు సూచనలు జారీచేశారు. పరీక్ష కేంద్రాల్లో అక్రమాలు, అవకతవకలు జరిగితే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, సి–సెంటర్ కస్టోడియన్లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ♦ పరీక్ష కేంద్రాలన్నీ నో మొబైల్ జోన్లుగా ప్రకటించిన నేపథ్యంలో పరీక్ష విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ మొబైల్ ఫోన్ ఇంట్లోనే ఉంచి రావాలి. లేదా సెంటర్లో పోలీస్ పికెట్ వద్ద అప్పగించాలి. ♦ఒకసారి పరీక్ష కేంద్రంలోకి వచ్చిన సిబ్బంది పరీక్ష ముగిసేవరకు బయటికి రాకూడదు. అటెండర్లు, ఇతర సహాయకులు కూడా టీ, శీతల పానీయాలు వంటి అవసరాలకు కూడా బయటకు రాకూడదు. ♦పరీక్ష విధులు లేని ఉపాధ్యాయులు పరీక్ష జరిగే సమయంలో ఆ పరిసరాల్లో ఉండకూడదు. ♦ పరీక్ష కేంద్రాలుగా ఉన్న కె.జి.బి.వి., రెసిడెన్షియల్ పాఠశాలల ఉపాధ్యాయులు పరీక్ష విధులు లేకపోతే ఆ సమయంలో పాఠశాలలో ఉండకూడదు. ♦ పరీక్ష కేంద్రంలో ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఉండకూడదు. ♦ ప్రశ్నపత్రాలు, వాటిపై వదంతులు వాట్సాప్ గ్రూప్‌లలోగానీ, సామాజిక మాధ్యమాల్లోగానీ ప్రచారం చేయకూడదు. ♦ చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షకు హాజరుకాని అభ్యర్థుల ప్రశ్నపత్రాలను, మిగిలిన ప్రశ్నపత్రాలను ఉదయం 10 గంటలలోపు అకౌంట్ రాసి సీల్ చేయాలి. ♦ ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి పరీక్షల చట్టం 25/97 ప్రకారం ఏడేళ్ల వరకు జైలుశిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. -
10న పదో తరగతి పరీక్షల ఫలితాలు
చిత్తూరు కలెక్టరేట్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు జూన్ 10న వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నట్టు పాఠశాల విద్య రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి వెల్లడించారు. ఆయన సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి మూల్యాంకన ప్రక్రియను తనిఖీ చేశారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరం 6,22,537 మంది పరీక్షలు రాసినట్టు తెలిపారు. ఈ నెల 13 నుంచి పేపర్ వాల్యుయేషన్ జరుగుతోందని, ఇప్పటికే దాదాపు 25 శాతం పేపర్ల వాల్యుయేషన్ పూర్తయిందన్నారు. అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లా డీఈవోలు క్యాంప్ ఆఫీసర్లుగా మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనంతరం విజయవాడలోని రాష్ట్ర పరీక్షల విభాగం కార్యాలయంలో డీ కోడింగ్ ప్రక్రియ నిర్వహించి.. జూన్ 10న ఫలితాల వెల్లడికి చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 26 జిల్లాలను యూనిట్‌గా తీసుకుని పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని దేవానందరెడ్డి వివరించారు. -
ఇద్దరు టీచర్ల సస్పెన్షన్
శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాకాధికారి దేవానందరెడ్డి సోమవారం సాయంత్రం తెలిపారు. 9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రాజాం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వి. రామ్మూర్తి నాయుడు ని సస్పెండ్ చేశారు. కాగా.. విధులకు సరిగా హాజరుకాని మరో టీచర్ పై కూడా సస్పెన్షన్ వేటు పడింది. రాజాం మండలం గోపాలపురం ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తున్న సీహెచ్ మురళి స్కూలుకు హాజరుకాకుండా డుమ్మా కొడుతుండటంతో.. ఆతనిని సస్పెండ్ చేసిన ట్లు డీఈవో తెలిపారు. -
ప్రభుత్వ గుర్తింపులేని స్కూళ్లలో పిల్లలను చేర్చొద్దు
భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి గుర్తింపులేని స్కూళ్ల వివరాలతో కరపత్రాలు పంపిణీ జిల్లావ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు డీఈవో దేవానందరెడ్డి వెల్లడి విజయవాడ : ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి దేవానందరెడ్డి తల్లిదండ్రులకు సూచించారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని కోరుతూ బుధవారం నగరంలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యాన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మారుతీనగర్‌లోని ఇండియన్ డిజిటల్ స్కూల్ వద్ద నుంచి ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పిల్లలను పాఠశాలల్లో చేర్చే ముందు ఆ స్కూలుకు తగిన గుర్తింపు ఉందా.. లేదా.. అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలని సూచించారు. నగరంలోని పలు కార్పొరేట్ స్కూళ్లకు సైతం గుర్తింపు లేదని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని చెప్పారు. జిల్లాలో 15లక్షల మంది చదువుకునేందుకు అవసరమైన గుర్తింపు పొందిన స్కూళ్లు ఉన్నాయని, వాటిలో కేవలం ఐదు లక్షల మంది మాత్రమే విద్యాభ్యాసం చేస్తున్నార ని పేర్కొన్నారు. తాను 2012లో డీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పుడు జిల్లాలో 300కు పైగా గుర్తింపు లేని స్కూళ్లు ఉన్నాయని, కఠిన చర్యలు చేపట్టడం వల్ల ఇప్పుడు ఆ సంఖ్య బాగా తగ్గిందని వివరించారు. ఈ ఏడాది నుంచి సీసీఈ విధానం అమలు ఈ విద్యా సంవత్సరం నుంచి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్(సీసీఈ) విధానం అమలు చేస్తున్నామని డీఈవో చెప్పారు. దీని వల్ల గుర్తింపు లేని స్కూళ్లలో విద్యను అభ్యసించిన వారు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఒక స్కూల్లో చదివిన విద్యార్థులను మరో పాఠశాల పేరుమీద పరీక్షలకు పంపించటం నేరమని తెలిపారు. ఆ విధంగా పరీక్షలు రాసిన విద్యార్థులు టీసీలు తీసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. జిల్లాలో గుర్తింపు లేని స్కూళ్ల వివరాలతో కూడిన ప్రచార వాహనం ద్వారా విద్యార్థులకు తల్లితండ్రులకు బుధవారం నుంచి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే గుర్తింపు లేని స్కూళ్లలో చేరితే కట్టిన ఫీజును తిరిగి ఇప్పించడానికి తాము సహకరిస్తామని డీఈవో హామీ ఇచ్చారు. డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ రవికుమార్ మాట్లాడుతూ గుర్తింపు లేని స్కూళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్పప్పటికీ, కార్పొరేట్ స్కూళ్లు చట్టాల్లోని లొసుగులను వినియోగించుకుని ముందుకు సాగుతున్నాయన్నారు. జిల్లాలో 82 గుర్తింపు లేని స్కూళ్లు ఉన్నాయని, వాటిలో చేరినవారు ఇబ్బందులు పడక తప్పదని హెచ్చరించారు. మారుతీనగర్‌లోని సాయి టాలెంట్ స్కూల్, నారాయణ, ఇండియన్ డిజిటల్, దుర్గాపురంలోని చైతన్య స్కూళ్లకు గుర్తింపు లేదని తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలంటూ నినాదాలు చేస్తూ ప్ల కార్డులు పట్టుకుని మారుతీనగర్, మాచవరం, ఏలూరు రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. గుర్తింపు లేని స్కూళ్ల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీవైఈవో టీఎస్ బాబు, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఫీజులపై నియంత్రణ కార్పొరేట్, ప్రయివేటు స్కూళ్లలో ఫీజులపై కూడా దృష్టి సారించామని విద్యా శాఖ అధికారులు తెలిపారు. నిబంధనలకు అనుగణంగా ఫీజులు వసూలు చేయాలని, పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
టీచర్ల కౌన్సెలింగ్ ప్రశాంతం 44 మందికి పదోన్నతి
= సక్సెస్ పాఠశాలలకు వెళ్లేందుకు ససేమిరా = ఇంగ్లిష్‌లో బోధించాల్సి ఉండటమే కారణం = ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా వెళ్లేందుకు ఎక్కువమంది ఆసక్తి మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయుల పదోన్నతి కౌన్సెలింగ్ డీఈవో కార్యాలయంలో శనివారం ప్రశాంతంగా ముగిసింది. సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పనిచేస్తున్నవారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కౌన్సెలింగ్ ప్రక్రియను డీఈవో డీ దేవానందరెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. శనివారం మొత్తం 44 మందికి పదోన్నతి కల్పించారు. వారిలో స్కూల్ అసిస్టెంట్లుగా 22 మంది, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా మరో 22 మంది పదోన్నతులు పొందారు. ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైంది. తొలుత డీఈవో కార్యాలయం వద్ద పదోన్నతి కోసం వచ్చిన ఉపాధ్యాయుల సర్టిఫికెట్లు పరిశీలించారు. తూర్పు కృష్ణా ప్రాంతంలో పదోన్నతి పొందే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉండటం, పశ్చిమకృష్ణా ప్రాంతంలో పోస్టుల ఖాళీలు ఎక్కువగా ఉండటంతో దూర ప్రాంతానికి వెళ్లేందుకు ఉపాధ్యాయులు అంతగా ఆసక్తి చూపలేదు. సక్సెస్ పాఠశాలల్లోనే అధికం... 1994 నుంచి 2004 వరకు ఉపాధ్యాయులుగా ఎంపికైన వారంతా తెలుగు మీడియంలోనే బీఈడీ చదివినవారు. అప్పట్లో బీఈడీ తెలుగు మీడియం చదివినవారికే పోస్టులు కేటాయించారు. కాలక్రమేణా విద్యావ్యవస్థలో సక్సెస్ పాఠశాలలు వచ్చాయి. వీటిలో ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యాంశాలు బోధించాల్సి ఉంది. తెలుగు మీడియంలో డిగ్రీ, బీఈడీ చదివిన ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యాంశాల బోధన కష్టమైన పనే. ప్రస్తుతం జరుగుతున్న పదోన్నతి కౌన్సెలింగ్‌లో పెనుమల్లి, గుడ్లవల్లేరు, చినముత్తేవి, వడ్లమన్నాడు, మొవ్వ పాఠశాలలు సక్సెస్ స్కూళ్లుగా ఉన్నాయి. వీటిలోనే అధిక శాతం పోస్టులు ఖాళీగా ఉండటంతో పదోన్నతిపై ఈ పాఠశాలలకు వెళ్లేందుకు చాలామంది ఉపాధ్యాయులు వెనుకంజ వేశారు. కొంతమంది ఉపాధ్యాయులు పదోన్నతిని సైతం వదులుకున్నారు. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా వెళ్లేందుకు అధిక శాతం ఉపాధ్యాయులు ప్రయత్నాలు చేశారు. కౌన్సెలింగ్‌లో డీఈవో కార్యాలయ ఏడీ రత్నకుమారి, రాజీవ్ విద్యామిషన్ కార్యాలయ సూపరింటెండెంట్ సుబ్బారావు పాల్గొన్నారు.