టీచర్ల కౌన్సెలింగ్ ప్రశాంతం 44 మందికి పదోన్నతి
= సక్సెస్ పాఠశాలలకు వెళ్లేందుకు ససేమిరా
= ఇంగ్లిష్‌లో బోధించాల్సి ఉండటమే కారణం
= ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలుగా వెళ్లేందుకు ఎక్కువమంది ఆసక్తి
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయుల పదోన్నతి కౌన్సెలింగ్ డీఈవో కార్యాలయంలో శనివారం ప్రశాంతంగా ముగిసింది. సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పనిచేస్తున్నవారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కౌన్సెలింగ్ ప్రక్రియను డీఈవో డీ దేవానందరెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. శనివారం మొత్తం 44 మందికి పదోన్నతి కల్పించారు. వారిలో స్కూల్ అసిస్టెంట్లుగా 22 మంది, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలుగా మరో 22 మంది పదోన్నతులు పొందారు.
ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైంది. తొలుత డీఈవో కార్యాలయం వద్ద పదోన్నతి కోసం వచ్చిన ఉపాధ్యాయుల సర్టిఫికెట్లు పరిశీలించారు. తూర్పు కృష్ణా ప్రాంతంలో పదోన్నతి పొందే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉండటం, పశ్చిమకృష్ణా ప్రాంతంలో పోస్టుల ఖాళీలు ఎక్కువగా ఉండటంతో దూర ప్రాంతానికి వెళ్లేందుకు ఉపాధ్యాయులు అంతగా ఆసక్తి చూపలేదు.
సక్సెస్ పాఠశాలల్లోనే అధికం...
1994 నుంచి 2004 వరకు ఉపాధ్యాయులుగా ఎంపికైన వారంతా తెలుగు మీడియంలోనే బీఈడీ చదివినవారు. అప్పట్లో బీఈడీ తెలుగు మీడియం చదివినవారికే పోస్టులు కేటాయించారు. కాలక్రమేణా విద్యావ్యవస్థలో సక్సెస్ పాఠశాలలు వచ్చాయి. వీటిలో ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యాంశాలు బోధించాల్సి ఉంది. తెలుగు మీడియంలో డిగ్రీ, బీఈడీ చదివిన ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యాంశాల బోధన కష్టమైన పనే.
ప్రస్తుతం జరుగుతున్న పదోన్నతి కౌన్సెలింగ్‌లో పెనుమల్లి, గుడ్లవల్లేరు, చినముత్తేవి, వడ్లమన్నాడు, మొవ్వ పాఠశాలలు సక్సెస్ స్కూళ్లుగా ఉన్నాయి. వీటిలోనే అధిక శాతం పోస్టులు ఖాళీగా ఉండటంతో పదోన్నతిపై ఈ పాఠశాలలకు వెళ్లేందుకు చాలామంది ఉపాధ్యాయులు వెనుకంజ వేశారు. కొంతమంది ఉపాధ్యాయులు పదోన్నతిని సైతం వదులుకున్నారు. ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలుగా వెళ్లేందుకు అధిక శాతం ఉపాధ్యాయులు ప్రయత్నాలు చేశారు. కౌన్సెలింగ్‌లో డీఈవో కార్యాలయ ఏడీ రత్నకుమారి, రాజీవ్ విద్యామిషన్ కార్యాలయ సూపరింటెండెంట్ సుబ్బారావు పాల్గొన్నారు.