- భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి
- గుర్తింపులేని స్కూళ్ల వివరాలతో కరపత్రాలు పంపిణీ
- జిల్లావ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు
- డీఈవో దేవానందరెడ్డి వెల్లడి
విజయవాడ : ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి దేవానందరెడ్డి తల్లిదండ్రులకు సూచించారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని కోరుతూ బుధవారం నగరంలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యాన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మారుతీనగర్‌లోని ఇండియన్ డిజిటల్ స్కూల్ వద్ద నుంచి ఈ ప్రదర్శన ప్రారంభమైంది.
ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పిల్లలను పాఠశాలల్లో చేర్చే ముందు ఆ స్కూలుకు తగిన గుర్తింపు ఉందా.. లేదా.. అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలని సూచించారు. నగరంలోని పలు కార్పొరేట్ స్కూళ్లకు సైతం గుర్తింపు లేదని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని చెప్పారు. జిల్లాలో 15లక్షల మంది చదువుకునేందుకు అవసరమైన గుర్తింపు పొందిన స్కూళ్లు ఉన్నాయని, వాటిలో కేవలం ఐదు లక్షల మంది మాత్రమే విద్యాభ్యాసం చేస్తున్నార ని పేర్కొన్నారు. తాను 2012లో డీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పుడు జిల్లాలో 300కు పైగా గుర్తింపు లేని స్కూళ్లు ఉన్నాయని, కఠిన చర్యలు చేపట్టడం వల్ల ఇప్పుడు ఆ సంఖ్య బాగా తగ్గిందని వివరించారు.
ఈ ఏడాది నుంచి సీసీఈ విధానం అమలు
ఈ విద్యా సంవత్సరం నుంచి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్(సీసీఈ) విధానం అమలు చేస్తున్నామని డీఈవో చెప్పారు. దీని వల్ల గుర్తింపు లేని స్కూళ్లలో విద్యను అభ్యసించిన వారు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఒక స్కూల్లో చదివిన విద్యార్థులను మరో పాఠశాల పేరుమీద పరీక్షలకు పంపించటం నేరమని తెలిపారు. ఆ విధంగా పరీక్షలు రాసిన విద్యార్థులు టీసీలు తీసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.
జిల్లాలో గుర్తింపు లేని స్కూళ్ల వివరాలతో కూడిన ప్రచార వాహనం ద్వారా విద్యార్థులకు తల్లితండ్రులకు బుధవారం నుంచి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే గుర్తింపు లేని స్కూళ్లలో చేరితే కట్టిన ఫీజును తిరిగి ఇప్పించడానికి తాము సహకరిస్తామని డీఈవో హామీ ఇచ్చారు. డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ రవికుమార్ మాట్లాడుతూ గుర్తింపు లేని స్కూళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్పప్పటికీ, కార్పొరేట్ స్కూళ్లు చట్టాల్లోని లొసుగులను వినియోగించుకుని ముందుకు సాగుతున్నాయన్నారు.
జిల్లాలో 82 గుర్తింపు లేని స్కూళ్లు ఉన్నాయని, వాటిలో చేరినవారు ఇబ్బందులు పడక తప్పదని హెచ్చరించారు. మారుతీనగర్‌లోని సాయి టాలెంట్ స్కూల్, నారాయణ, ఇండియన్ డిజిటల్, దుర్గాపురంలోని చైతన్య స్కూళ్లకు గుర్తింపు లేదని తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలంటూ నినాదాలు చేస్తూ ప్ల కార్డులు పట్టుకుని మారుతీనగర్, మాచవరం, ఏలూరు రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. గుర్తింపు లేని స్కూళ్ల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీవైఈవో టీఎస్ బాబు, సీఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.
ఫీజులపై నియంత్రణ
కార్పొరేట్, ప్రయివేటు స్కూళ్లలో ఫీజులపై కూడా దృష్టి సారించామని విద్యా శాఖ అధికారులు తెలిపారు. నిబంధనలకు అనుగణంగా ఫీజులు వసూలు చేయాలని, పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.