గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం కోసం కొంగరకలాన్ నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు భూసేకరణ
పరిహారం చెల్లింపు విషయంలో స్పష్టత కరువు
రైతులు, మహిళల నిరసన
కందుకూరు/ఇబ్రహీంపట్నం రూరల్: ఫ్యూచర్ సిటీ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వే పనులను మంగళవారం పోలీసు బందోబస్తు మధ్య చేపట్టారు. ఈ సందర్భంగా భూములు ఇచ్చి తామెక్కడికి వెళ్లాలంటూ రైతులు ఆవేదన వెలిబుచ్చారు. భూములు కోల్పోతున్న వారికి ఎంత పరిహారం ఇస్తారు? ఎలా న్యాయం చేస్తారో చెప్పకుండా పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు సర్వే చేస్తుండగా.. కొంగరకలాన్‌లో కలెక్టరేట్ వెనక వైపు చేపట్టిన సర్వే పనులను అడ్డుకుని మహిళలు నిరసన తెలిపారు. రాజు అనే యువ రైతు తమ భూమి తీసుకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో పోలీసులు అతన్ని సముదాయించి అక్కడి నుంచి పంపించారు.
330 అడుగుల రహదారి
రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అక్కడికి చేరుకునేలా ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు 330 అడుగుల రహదారి నిర్మాణానికి ప్రతిపాదించింది. ఇందుకోసం ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్, మహేశ్వరం మండలం కొంగరకుర్దు, కందుకూరు మండలం లేమూరు, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లిలో రిజర్వు ఫారెస్ట్, పంజగూడ, మీర్‌ఖాన్‌పేటలో కలిపి మొత్తం 449.27 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది.
ఫ్యూచర్‌సిటీ రోడ్డు కోసం ఇటువైపు కందుకూరు మండలం రాచులూరుతోపాటు అటువైపు ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో అధికారులు ఏకకాలంలో సర్వే పనులు ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, కందుకూరు తహసీల్దార్ గోపాల్, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐలు సీతారామ్, వెంకట్‌తోపాటు పోలీసుల బందోబస్తు నడుమ సర్వే నిర్వహించారు. అక్కడి రైతులు అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంత పెద్ద రోడ్డు నిర్మిస్తే పొలాలు మొత్తం పోయి, రోడ్డున పడాల్సి వస్తుందని వాపోయారు. సమావేశం ఏర్పాటు చేసి తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పి అధికారులు సర్వేను కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment