దొంగెవరో...దొరెవరో తేలింది: కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో దొంగెవరో...దొరెవరో తేలిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన శుక్రవారం బోయిగూడ ఐడీహెచ్ కాలనీలో 396 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇళ్లులేని వారికి ఇళ్లు కట్టించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఏ బస్తీలోని ప్రజలకు ఆ బస్తీలోనే భవనాలు నిర్మించి ఇస్తామని కేసీఆర్ తెలిపారు. నగరంలో లక్షల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యారని, కబ్జాకు గురైన భూములను వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పద్మారావు, ఎంపీ బండారు దత్తాత్రేయ, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.