సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణలో ప్రజల స్థితిగతులు, వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు చేపట్టనున్న సామాజిక, ఆర్థిక సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా అధికార యంత్రాం గాన్ని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో హైటెక్స్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్ జగన్మోహన్‌తోపాటు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అంశాలపై సుమారు 20 నిమిషాలపాటు చర్చించారు.
ఈనెల 19న నిర్వహించతలపెట్టిన సర్వేను పకడ్బందీగా జరిగేలా పర్యవేక్షించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో 8.95 లక్షల కుటుంబాలకు సంబంధించి సర్వేలో పేర్కొన్న అన్ని అంశాల సమాచారం సేకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భౌగోళికంగా జిల్లా పెద్దగా ఉన్నప్పటికీ, జనాభా, కుటుంబాల సంఖ్య పరంగా తెలంగాణలో 8వ స్థానంలో ఉంది. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఈ సర్వేలో తప్పనిసరిగా భాగస్వామం కావాలని ఆదేశించారు.
ఒక్కో ఉద్యోగి 20 నుంచి 25 కుటుంబాలను సర్వే చేయాలని, జిల్లా వ్యాప్తంగా ఒకేరోజు ఈ సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు, పల్స్‌పోలియో చుక్కల మందు వంటి కార్యక్రమాలు చేపట్టిన విధంగా ఈ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ సర్వేలో తేలిన సమాచారం ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. బంగారు తెలంగాణకు బాటలు వేస్తుందని అన్నారు.
సర్వే పకడ్బందీగా నిర్వహించండి
Published Sat, Aug 2 2014 2:29 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement
Advertisement