హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 19వ తేదీన సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించనున్న నేపథ్యంలో.. సర్వే ఏర్పాట్లపై ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులు రేమండ్ పీటర్, బీపీ ఆచార్యలు సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లోని ఇళ్ల ఆధారంగా వాటిని బ్లాకులుగా విభజించాలని, సర్వేకు వెళ్లే ఎన్యుమరేటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా వివరించారు. సర్వేచేసే జిల్లాల్లో ఉన్న ఇళ్ల సంఖ్యను 2011 జనాభా లెక్కల ఆధారంగా తీసుకోవాలని, అందుకు అనుగుణంగా ఎంత మంది ఎన్యుమరేటర్లు కావాలి..? ఎన్ని వాహనాలు కావాలి? తదితర వివరాలను ఈనె ల 8వ తేదీ లోగా సేకరించాలని కలెక్టర్లను కోరారు.
ఎన్యుమరేటర్లు, పర్యవేక్షకులకు ఈనెల 11వ తేదీన శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ఈనెల 19వ తేదీకి ముందుగానే.. సర్వేకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.