
మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఏర్పాటుకు ఆసక్తి
262 పరిశ్రమల స్థాపనతో తొలి స్థానంలో మేడ్చల్
టీజీ–ఐపాస్ ద్వారా 24,112 పరిశ్రమల ఏర్పాటు
రూ.1,29,332 కోట్ల పెట్టుబడులు.. 6.6 లక్షల మందికి ఉపాధి
సామాజిక, ఆర్థిక సర్వే 2024– 2025లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధికంగా పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. నైపుణ్యం ఉన్న కార్మిమకుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, కాస్మొపాలిటన్ కల్చర్, మెరుగైన మౌలిక వసతులు తదితర కారణాలతో ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో ఇక్కడ కంపెనీల స్థాపనకు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని ఇటీవల రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడించింది.
తెలంగాణ పారిశ్రామిక ప్రాజెక్ట్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ (టీజీ–ఐపాస్) ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో 24,112 సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ తరహా సంస్థలు ఏర్పాటయ్యాయి. ఆయా కంపెనీలు రూ.1,29,332 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. వీటిల్లో 6,60,428 మంది ఉపాధి పొందుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులపై ఆర్థిక సర్వేలో పేర్కొన్న మరికొన్ని వివరాలు..
» 2016 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన టీజీ–ఐపాస్ ద్వారా రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీలలో సూక్ష్మ తరహా సంస్థలే అత్యధికం.
» రాష్ట్రంలో ఏర్పాటైన మొత్తం పరిశ్రమలలో సూక్ష్మ సంస్థల వాటా 67.23 శాతం ఉండగా, పెట్టుబడుల్లో కేవలం 1.70 శాతం, ఉద్యోగాల్లో 24.97 శాతం వాటా మాత్రమే ఉంది.
» పరిశ్రమల ఏర్పాటులో భారీ సంస్థల వాటా 3.56 శాతం మాత్రమే ఉన్నా.. పెట్టుబడుల్లో 74.96 శాతం, ఉద్యోగ అవకాశాల్లో 35.04 శాతం వాటా కలిగి ఉన్నాయి.
» చిన్న, మధ్య తరహా సంస్థల వాటా 29.21 శాతం ఉండగా.. పెట్టుబడుల్లో 23.34 శాతం, ఉదోగాల్లో 39.99 శాతం వాటా ఉంది.
» 2024–25 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి చివరి నాటికి రాష్ట్రంలో రూ.9,850.23 కోట్ల పెట్టుబడులతో 1,476 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 38,598 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.
» ఈ పరిశ్రమలలో మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా మేడ్చల్–మల్కాజిగిరిలో రూ.832.17 కోట్ల పెట్టుబడులతో 262 పరిశ్రమలు ఏర్పాటు కాగా.. 6,760 మంది ఉపాధి పొందారు.
» సంగారెడ్డిలో రూ.543.42 కోట్ల పెట్టుబడులతో 165 యూనిట్లు ఏర్పాటు కాగా.. 5,109 మందికి ఉపాధి దొరికింది. రంగారెడ్డి జిల్లాలో రూ.5,155.35 కోట్ల పెట్టుబడులతో 130 పరిశ్రమలు ఏర్పాటు కాగా.. 8,857 మందికి ఉపాధి లభించింది.
» అత్యల్పంగా హైదరాబాద్‌లో రూ.5.91 కోట్ల పెట్టుబడులతో కేవలం ఏడు యూనిట్లు ఏర్పాటు కాగా.. 515 మందికి పని దొరికింది.
» ఇప్పటివరకు టీజీ–ఐపాస్ ద్వారా హైదరాబాద్‌లో రూ.190 కోట్ల పెట్టుబడులతో కేవలం 50 పరిశ్రమలు ఏర్పాటు కాగా.. 1,828 మందికి ఉపాధి లభించింది.
Comments
Please login to add a commentAdd a comment