
రాష్ట్రంలోదాదాపు4.20 కోట్లఫోన్ కనెక్షన్లు
వైర్‌లెస్ ఫోన్ కనెక్షన్లే 4 కోట్ల 42 వేలు
మొబైల్ కనెక్షన్ డెన్సిటీలో దేశంలో 4వ స్థానం
పట్టణ ప్రాంతాల్లోనే 60.40 శాతం ఫోన్లు
బ్రాండ్‌బ్యాండ్ కనెక్షన్లు మూడున్నర కోట్లు
సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జానాభా కంటే ఫోన్ కనెక్షన్లే అధికంగా ఉన్నాయి. మొబైల్ కనెక్షన్ల డెన్సిటీ (సాంద్రత)లో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక ముఖచిత్రం (సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్)లో 2024 సెప్టెంబర్ వరకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రకటించిన డేటాను పొందుపరిచింది. దేశంలో వైర్‌లెస్ ఫోన్ల డెన్సిటీలో గోవా (152.64 శాతం) మొదటి స్థానంలో ఉంది. కేరళ (115.05 శాతం), హర్యానా (114.08 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. తెలంగాణ (105.82 శాతం) నాలుగో స్థానంలో నిలిచింది.
బలమైన సమాచార వ్యవస్థ
రాష్ట్రంలో మొత్తం ఫోన్ కనెక్షన్లు 41.94 మిలియన్లు (దాదాపు 4 కోట్ల 19 లక్షల 40 వేలు) ఉన్నాయని ఆర్థిక సర్వేలో తెలిపారు. అందులో వైర్‌లెస్ కనెక్షన్లు 40.42 మిలియన్లు (4 కోట్ల 42 వేలు) ఉన్నట్లు తేల్చారు. ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్లు రాష్ట్రంలో 1.52 మిలియన్లు ఉన్నట్లు వెల్లడించారు. సమాచార వ్యవస్థ తెలంగాణలో బలోపేతంగా ఉన్నట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయని సర్వే నివేదికలో ప్రభుత్వం తెలిపింది.
పట్టణాలు, నగరాల్లో వైర్‌లెస్ ఫోన్ నెట్‌వర్క్ బలంగా ఉంది. మొత్తం వైర్‌లెస్ కనెక్షన్లలో పట్టణాల్లో 23.87 మిలియన్లు (59.05 శాతం) ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 16.55 మిలియన్లు (40.95 శాతం) ఉన్నాయి. ల్యాండ్‌లైన్ ఫోన్లలో పట్టణా ల్లో 1.46 మిలియన్ కనెక్షన్లు ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో 0.06 మిలియన్లు ఉన్నాయి.
బ్రాడ్‌బ్యాండ్ జోరు
రాష్ట్రంలో డిజిటల్ ఇన్ఫర్మేషన్ మౌలిక సదుపాయాలు భారీగా విస్తరిస్తున్నాయి. తెలంగాణలో 36.43 మిలియన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నట్లు ట్రాయ్ లెక్కలు తేల్చాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ఈ– పరిపాలన, విద్య, ఆరోగ్యం, ఐటీ రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో బ్రాండ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్లు అధికంగా ఉన్నాయి. బ్రాండ్‌బ్యాండ్, న్యారోబ్రాండ్ ఇంటర్నెట్ కనెక్షన్లలో బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ 98% ఉన్నాయి. మొత్తం 36.43 ఇంటర్నెట్ కనెక్షన్లలో బ్రాండ్‌బ్యాండ్ కనెక్షన్లు 35.68 మిలియన్లు, న్యారోబ్రాండ్ కనెక్షన్లు 0.75 లక్షలు ఉన్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment