IDH colony
-
డబుల్ బెడ్రూమ్ కోసం దారుణం!
-
డబుల్ బెడ్రూమ్ కోసం దారుణం!
హైదరాబాద్: నగరంలోని బన్సీలాల్ పేట ఐడీహెచ్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇల్లులో భాగం కావాలంటూ బంధువులు ఓ జంటను భవనం పైనుంచి కిందకి నెట్టివేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ లోని ఐడీహెచ్ కాలనీలో సోమవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. అతడికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. బాధితుడి కథనం ప్రకారం.. బన్సీలాల్‌పేటలో నివాసం ఉంటున్న దంపతులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అయింది. ఆ డబుల్ బెడ్ రూమ్ ఇల్లులో తమకు వాటా ఇవ్వాలంటూ తరచూ బంధువులు గొడవపడేవారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న తమను బంధువులే భవనం పైనుంచి నెట్టివేశారని భర్త ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
దేశ చరిత్రలోనే ఇది కొత్త అంకం
-
దేశ చరిత్రలోనే ఇది కొత్త అంకం: కేసీఆర్
సికింద్రాబాద్ : తెలంగాణ ముఖ్యంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం సికింద్రాబాద్‌లో ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే వారి కోసం డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించామన్నారు. భారతదేశ చరిత్రలోనే ఇది కొత్త అంకమన్నారు. ఇక నుంచి పేదలకు కట్టే ఇళ్లన్నీ డబుల్ బెడ్ రూంలే ఉంటాయని కేసీఆర్ తెలిపారు. నియోజకవర్గానికి 400 చొప్పున డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టిస్తామని ఆయన పేర్కొన్నారు. అర్హులకు ఇళ్ల పట్టాలను అందచేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి, పద్మారావు తదితరులు హాజరయ్యారు. -
గవర్నర్ జీ.. గృహప్రవేశాలకు రండి
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభానికి రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పటికే స్వయంగా కేసీఆర్ పలుమార్లు ఈ కాలనీని సందర్శించారు. ఈ ఇళ్ల గృహప్రవేశాలకు రావాలని గవర్నర్ నరసింహన్ ను ఆయన ఆహ్వానించారు. దాంతోపాటు ట్యాంక్ బండ్ మీద జరిగే బతుకమ్మ ముగింపు వేడుకలకు హాజరుకావాలని కూడా ఆయనను కోరినట్లు సమాచారం. అయితే ఐడీహెచ్ కాలనీ ఇళ్ల ప్రారంభోత్సవం, ఏపీ రాజధాని శంకుస్ధాపన కూడా ఓకే సమయంలో జరగనున్నాయి. ఏపీ రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు రానున్నారు. మరి గవర్నర్ ఏ కార్యక్రమానికి హాజరు అవుతారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
దేశానికే ‘మోడల్’..
- ఐడీహెచ్ కాలనీలో సకల వసతులతో పేదింటి కలల సౌధం - పూర్తవుతున్న పనులు.. దసరా రోజున ప్రారంభించనున్న సీఎం సాక్షి, హైదరాబాద్: ఐడీహెచ్ కాలనీ..! ఇప్పటిదాకా స్థానికులకు మాత్రమే తెలిసిన పేరిది! కానీ ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పేదల గృహనిర్మాణానికి ‘మోడల్’గా నిలిచిన కాలనీ. పేదల కోసం నిర్మించే గృహ నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకంగా పరిగణనలోకి తీసుకుంటున్న కాలనీ. గవర్నర్‌తోపాటు కేంద్రం, నేతలు, ఐఏఎస్‌లు ప్రశంసలు కుమ్మరిస్తున్న కాలనీ! సాధారణంగా పేదల గృహ నిర్మాణమంటే ఇరుకు గదులు, నామ్కేవాస్తే టాయ్‌లెట్, అరకొర సౌకర్యాలు అన్న భావనను పూర్తిగా తుడిచిపడేస్తూ ఐడీహెచ్‌లో ఇళ్లు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. గతేడాది దసరా రోజున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ కాలనీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈనెల 22న దసరా రోజున ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇదీ ఐడీహెచ్ కాలనీ: మొత్తం ఇళ్లు 396 ఒక్కో ఇంటికి నిర్మాణ వ్యయం: రూ. 7.90 లక్షలు మౌలిక సదుపాయాలకు రూ. 5.26 కోట్లు నిర్మాణ సంస్థ: ఎన్‌జేఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రై.లి. బ్లాకులు 33 (జీ ప్లస్ 2 చొప్పున) మొత్తం ఇళ్ల నిర్మాణ వ్యయం రూ. 31.28 కోట్లు మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 36.54 కోట్లు కాంట్రాక్టర్లకు స్థలం ఇచ్చింది: 2014, డిసెంబర్ 18 ఇళ్ల నిర్మాణం, వసతులు ఇలా.. - ఐడీహెచ్ కాలనీ కోసం ప్రత్యేకంగా ‘ఎర్త్‌క్వేక్’ డిజైన్ రూపొందించారు. భూకంపాలు వంటివి సంభవించినా తట్టుకునేలా అదనపు స్టీలు, ఫ్లైయాష్ వంటివి వినియోగించారు. - గతంలో వాంబే పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్ల తలుపులు, కిటికీల ఫ్రేమ్లకు సిమెంటునే వాడగా.. ఈ కాలనీలో ఎంతకాలమైనా తుప్పు పట్టకుండా ఉండే ప్రత్యేక మెటీరియల్‌ను వినియోగించారు. - గతంలో నిర్మించిన ఇళ్ల గోడలు వర్షానికి తడిసిపోయేవి. ప్రస్తుతం అలాంటి లీకేజీలుండవు. కిటికీలకు జెడ్ యాంగిల్ తలుపులు వాడుతున్నారు. - సామాన్లు పెట్టుకునేందుకు సజ్జలు(అటకలు), వంట గదిలో షెల్ఫ్‌లు, కిచెన్‌లో ప్లాట్ఫారం వంటి సదుపాయాలున్నాయి - నేలకు సిమెంట్ ఫ్లోరింగ్ కాకుండా టైల్స్ వాడారు - ఇంటిలో రెండు టాయిలెట్స్ ఉన్నాయి. ఒకటి యూరోపియన్ తరహాలో, మరొకటి దేశవాళీ పద్ధతిలో నిర్మించారు - గతంలో నిర్మించిన ఇళ్ల నీటి సరఫరాకు ఒకే వ్యవస్థ ఉండేది. ప్రస్తుతం తాగునీటికి ఒక పైప్‌లైన్, ఇతర అవసరాలకు మరో లైన్ ఏర్పాటు చేస్తున్నారు - కాలనీలో సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. మురుగునీరు, వర్షపు నీరు వెళ్లే లైన్లు, వీధి దీపాల ఏర్పాటు పనులు సాగుతున్నాయి - 30 అడుగుల రహదారితోపాటు దానికి సెంట్రల్ మీడియన్, ఇరువైపులా మొక్కల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నడకదారులకు సదుపాయం కల్పిస్తున్నారు - అంగన్వాడీతో కూడిన కమ్యూనిటీ హాల్ ఏర్పాటు. 11 దుకాణాలతో స్థానికుల అవసరాల కోసం షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు - డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో లివింగ్హాల్, ప్యాసేజ్, మాస్టర్ బెడ్రూమ్, మరో బెడ్రూమ్, కిచెన్, యుటిలిటీ, బాత్/టాయ్‌లెట్, కారిడార్లున్నాయి. ఢిల్లీలో ఐఏఎస్ క్వార్టర్లకు దీటుగా.. ఢిల్లీలో ఐఏఎస్‌ల క్వార్టర్లకు దీటుగా ఈ కాలనీ ఉంది. ఇంతమంచి కాలనీని చక్కగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత లబ్ధిదారులపై ఉంది. కాలనీలోని స్థానికులతోనే కమిటీగా ఏర్పడి నిర్వహణ బాధ్యత చూడాలి. - ఇటీవల ఐడీహెచ్ కాలనీకి వచ్చినప్పుడు గవర్నర్ నరసింహన్ వాంబే పథకంలో నిర్మించిన ఇళ్లకు, ఐడీహెచ్ కాలనీ ఇళ్లకు తేడా ఇదీ వాంబే ఐడీహెచ్ మోడల్ కాలనీ ఫ్లాట్ విస్తీర్ణం 267 చదరపు అడుగులు ఫ్లాట్ విస్తీర్ణం 580 చదరపు అడుగులు నిర్మాణ వ్యయం రూ.1.30 లక్షలు (అప్పటి ధరల మేరకు) రూ. 7.90 లక్షలు ప్రభుత్వ సబ్సిడీలు పోను లబ్ధిదారు రూ.30 వేలు చెల్లించాలి పూర్తిగా ఉచితం -
‘డబుల్ బెడ్రూమ్’పై పంద్రాగస్టున ప్రకటన?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది పేదలు ఎదురుచూస్తున్న ‘రెండు పడక గదుల ఇళ్ల పథకం’ విధి విధానాలను స్వాతంత్య్ర దినోత్సవ వేదిక మీద ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించనున్నారు. కలెక్టర్లు చైర్మన్లుగా జిల్లా స్థాయిలో కమిటీలకు రూపమిచ్చిన ప్రభుత్వం... అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపట్టే విధానంపై కసరత్తు చేస్తోంది. గ్రామసభల ద్వారా అర్హులను గుర్తించాలని ఇప్పటికే నిర్ణయించింది. కానీ అది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. గతంలో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఇళ్లులేని వారుగా తేలిన కుటుంబాల సంగతేమిటనే విషయంలోనూ స్పష్టత రాలేదు. వీటికి సంబంధించి ఆగస్టు 15న గోల్కొండ కోటలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవాల్లో సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ పథకం కోసం ప్రతి జిల్లాకు కలెక్టర్ చైర్మన్‌గా కమిటీలను ప్రకటించనున్నారు. ఇందులో గృహనిర్మాణ శాఖ జిల్లా పీడీ, రోడ్లు భవనాల శాఖ ఎస్ఈ, పంచాయతీరాజ్‌శాఖ ఎస్ఈ, పురపాలక సంఘాల పరిధిలో అయితే మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా ఉండనున్నారు. నియోజకవ ర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎంపిక చేపట్టే అవకాశం ఉంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేదిక మీదుగా సీఎం కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్ల పథకం యూనిట్ కాస్ట్, ఇంటి నిర్మాణ వైశాల్యం వివరాలను ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.5.04లక్షలతో, 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం ఉంటుందని పేర్కొన్న ఆయన... ఈ ఆర్థిక సంవత్సరంలో 50 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఎక్కడా ఒక్క ఇంటి నిర్మాణం కూడా మొదలు కాలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీలో చేపడుతున్న బహుళ అంతస్తుల నిర్మాణాలనే రెండు పడక గదుల పథకం పనులుగా పేర్కొంటున్నారు. కానీ అవి ఈ పథకం యూనిట్ కాస్ట్ కంటే చాలా ఎక్కువ మొత్తంతో చేపట్టిన ప్రత్యేక ఇళ్లు. ఇక గతంలో మహబూబ్‌నగర్, వరంగల్ పట్టణాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఇచ్చిన హామీ మేరకు... అక్కడ ఇళ్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ విధివిధానాలు ఖరారు కాకపోవటంతో ఏప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేయాలో తెలియక అధికారులు మిన్నకుండిపోయారు. -
వడివడిగా.. ఐడీహెచ్ గృహాలు
పక్కాగా నిర్మాణం - రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని సీఎం ఆదేశం - వచ్చే దసరానాటికి గృహప్రవేశం సాక్షి, సిటీబ్యూరో: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఎన్నికల హామీల అమలులో భాగంగా ఐడీహెచ్‌కాలనీలో చేపట్టిన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వడివడిగా సాగుతోంది. గత అక్టోబర్‌లో ఈ పథకానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి పనులు పూర్తి చేసి పేదలకు అందిస్తామని ప్రకటించారు. అయితే వివిధ కారణతో పనుల్లో జాప్యం జరిగింది. దీంతో వాటిని పూర్తి చేసేందుకు అధికారులు యుద్ధప్రాతిపాదికన పనులు చేస్తున్నారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 2వ తేదీన ఒక్క బ్లాక్‌కైనా ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ పథకం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాల్సి ఉన్నందున హడావుడిగా పనులు చేసి ఆగమాగంగా చేయవద్దని సీఎం సూచించారు. దీంతో కొద్దిగా ఆలస్యమైనా పకడ్బందీగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ నిరంతర పర్యవేక్షణతో పనులు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం 33 బ్లాకులకుగాను 15 బ్లాకులు ఫినిషింగ్ దశలో ఉండగా, మిగతావాటిని సెప్టెంబర్‌లోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో వచ్చే దసరా నాటికి ప్రారంభోత్సవం జరిగే అవకాశాలున్నాయి. లబ్ధిదారులపై ఎలాంటి భారం పడకుండా రూ.36.54 కోట్లతో చేపట్టిన ఈ పథకంలో ఇళ్లతో పాటుగా రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, కూరగాయల మార్కెట్, కమ్యూనిటీహాల్ తదితర సదుపాయాలు కల్పించనున్నారు. ఇందుకు గాను త్వరలో టెండర్లు పిలవనున్నారు. పథకం వివరాలు.. - ఐడీహెచ్‌కాలనీ, పార్థివాడ, సుభాష్‌చంద్రబోస్‌నగర్, భగత్‌సింగ్‌నగర్, అమ్ముగూడ బస్తీల్లోని వారికి గృహ సదుపాయం. - ఐడీహెచ్ కాలనీ వారికి 216, అమ్ముగూడ బస్తీవాసులకు 101, సుభాష్ చంద్రబోస్‌నగర్ నివాసితులకు 26, భగత్‌సింగ్‌నగర్ వాసులకు 12, పార్థివాడకు చెందిన వారికి 31 ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. జీప్లస్2 విధానంలో నిర్మాణం చేపట్టారు. - మొత్తం 33 బ్లాకుల్లో 396 ఇళ్లు నిర్మిస్తుండగా, ఎస్సీలకు 276, ఎస్టీలకు 31, బీసీలకు 79, మైనార్టీ(ఒసీ)లకు 10 గృహాలను కేటాయించారు. - 69 చ.గ.ల స్థలంలో 580 ఎస్ఎఫ్టీ ప్లింత్ఏరియాతో నిర్మాణం. - జీప్లస్ టూ విధానంలో ఒక్కో బ్లాక్‌లో 12 ఇళ్ల నిర్మాణం - ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 7.90 లక్ష లు, మౌలిక సదుపాయాలకు రూ. 1.30 లక్షలు వంతున రూ. 9.20 లక్షలు వినియోగం - రోడ్లకు రూ. 1.16 కోట్లు, వరద కాలువలకు రూ. 56 లక్షలు, డ్రైనేజీ సదుపాయానికి రూ. 62 లక్షలు, విద్యుత్ సదుపాయానికి రూ. 72 లక్షలు, పార్కు, కూరగాయల మార్కెట్, ఇతరత్రా సదుపాయాలకు రూ. 30 లక్షలు వెచ్చించనున్నారు. - ఇందిరానగర్, హమాలీబస్తీ, తదితర ప్రాంతాల్లోనూ ఈ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. -
ఆదర్శంగా ఐడీహెచ్ కాలనీ
పూర్తికావస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం రాష్ట్రావతరణ దినోత్సవం నాడే ప్రారంభిస్తానన్న సీఎం ఒక్కో ఇంటికి రూ. 7.90 లక్షల వ్యయంతో పేదలకు 396 ఇళ్లు పనులను స్వయంగా పరిశీలించిన కేసీఆర్ హైదరాబాద్: రాజధానిలో ఐడీహెచ్ కాలనీలోని ఇళ్ల సముదాయాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. గురువారం ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. గత అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన ఈ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల తీరును, నాణ్యతను, ఇతరత్రా అంశాలను పరిశీలించేందుకు కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ఐడీహెచ్ కాలనీకి వచ్చారు. పనులన్నింటినీ పరిశీలిస్తూ కాలనీలో ఆయన కలియతిరిగారు. పనుల పురోగతి, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ఇళ్లనే హైదరాబాద్‌లోని పేద ప్రజలందరికీ నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఐడీహెచ్ కాలనీలో నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, జూన్ 2న తానే ఈ సముదాయానికి ప్రారంభోత్సవం చేస్తానని సీఎం పేర్కొన్నారు. ఈ కాలనీ దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తన కోరిక అని, అందుకే వారికోసం డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇళ్ల డిజైన్‌పై స్థానిక మహిళల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణంపై సంతోషం వ్యక్తం చేసిన మహిళలు.. సామాన్లు పెట్టుకోడానికి సబ్జలు కట్టించాలని కోరారు. వెంటనే స్పందించిన కేసీఆర్.. అన్ని ఇళ్లలో వాటిని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, టి.హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ తదితరులున్నారు. ఇదీ నేపథ్యం.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే కేసీఆర్ ఐడీహెచ్ కాలనీలోని పేదల దుర్భర పరిస్థితిని కళ్లారా చూశారు. వారందరికీ ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. ఆ మేరకు గత అక్టోబర్ 3న గృహ నిర్మాణ పనులకు ఆయనే శంకుస్థాపన చేశారు. సీఎం ఆదేశాలు, ఆలోచనలకు అనుగుణంగా జీహెచ్ ఎంసీ అధికారులు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మొత్తం 32 బ్లాకుల్లో జీ ప్లస్ టూ పద్ధతిలో 396 ఇళ్లు కడుతున్నారు. ఇందుకు రూ.37 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రతి ఇంట్లో రెండు బెడ్రూంలు, హాల్, కిచెన్, రెండు మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. 580 చ దరపు అడుగుల విస్తీర్ణంలో కడుతున్న ఒక్కో ఇంటికి రూ. 7.90 లక్షలు ఖర్చు చేస్తున్నారు. విద్యుత్, నల్లా కనెక్షన్లు కూడా ఇస్తున్నారు. మురికి నీటి కాలువలు, వర్షపు నీటి కాలువలు, మంచి నీటి పైపులైన్లు నిర్మించారు. -
సనత్‌నగర్‌లో సీఎం కేసీఆర్
-
కొత్తకొత్తగా...
సాక్షి, సిటీబ్యూరో: స్లమ్‌ఫ్రీ సిటీలో భాగంగా నగరంలోని మురికివాడల స్థానే అందమైన కాలనీల నిర్మాణానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం... వీటిని త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లపై దృష్టి పెట్టింది. ఇప్పటికే సనత్‌నగర్ నియోజకవర్గంలోని ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయగలమని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. నిర్మాణ వ్యయం కొంత అధికమైనప్పటికీ, పనులు తొందరగా పూర్తవు తాయని... సమయం కలిసి వస్తుందని అంటున్నారు. స్లమ్‌ఫ్రీ సిటీలో భాగంగా తొలిదశలో మరో 12 బస్తీల్లో ఇళ్లు నిర్మించాలని యోచిస్తున్నారు. అందులో ఇప్పటికే 8 బస్తీలను ఎంపిక చేసినట్లు తెలిసింది. రూ.500 కోట్లతో పనులు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ప్రస్తుత, కొత్త ఆర్థిక సంవత్సరాలకు జీహెచ్ఎంసీకి ప్రభుత్వం రూ.250 కోట్ల వంతున (మొత్తం రూ.500 కోట్లు) మంజూరు చేసింది. ఈ నిధులతో పేదలకు డబుల్ బెడ్రూమ్, డబుల్ టాయ్‌లెట్, హాల్, కిచెన్లతో కూడిన ఇళ్లను నిర్మిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. వీటితో పాటేరహదారులు, పార్కులు, షాపింగ్‌కాంప్లెక్స్‌లు, కమ్యూనిటీ హాళ్లు, ఆటస్థలాల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. తొలి దశలో 12 బస్తీల్లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఇళ్లు నిర్మించాలని యోచిస్తున్నారు. కూకట్‌పల్లిలోని అమ్రునగర్ తండాలో ప్రయోగాత్మకంగా తొలి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. తొలి ప్రాధాన్యం వారికే... ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కావడంతో ఆ వర్గాలు అధిక సంఖ్యలో ఉన్న బస్తీలను ఎంపిక చేశారు. ఒక్కో ఇంటికి దాదాపు రూ. 6 లక్షలు ఖర్చు కాగలదని తొలుత అంచనా వేశారు. రహదారులు, పార్కులు, తాగునీటి సరఫరా, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలతో కలిపి ఐడీహెచ్ కాలనీలో ఒక్కో ఇంటికి ప్రస్తుతం రూ.9.20 లక్షల వంతున ఖర్చవుతోంది. దీని కంటే వ్యయం కాస్త అధికమైనా సమయం, నాణ్యత ఉంటాయని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఆకట్టుకునేలా... తొలి దశలో నిర్మించే ఈ ఇళ్లను చూసి మిగతా బస్తీల్లోని ప్రజలు ఆసక్తి చూపేలా నిర్మాణం... సదుపాయాలు ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టే చోట స్థానికులను ఒప్పించేందుకు అధికారులు తిప్పలు పడాల్సి వస్తోంది. తక్కువ విస్తీర్ణం, సదుపాయాలు లేనప్పటికీ... తమకు ప్రత్యేకంగా ఉండాలని... అపార్ట్మెం ట్లు వద్దని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తొలిదశ ఇళ్లను చూసిన తరువాత వారి అభిప్రాయం లో మార్పు రావచ్చని అధికారులు ఆశిస్తున్నారు. తద్వారా మిగతా ప్రాంతాల వారు ఇలాంటి ఇళ్ల నిర్మాణానికి అంగీకరించవచ్చని భావిస్తున్నారు. తొలిదశలో ఎంపిక చేసిన బస్తీలు... కుటుంబాలు... సామాజికవర్గాల వివరాలు సర్కిల్ బస్తీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు జనరల్ మొత్తం కాప్రా సింగం చెరువు 1 58 0 0 1 60 చార్మినార్-4 జంగమ్మెట్ 110 8 0 0 199 317 చార్మినార్-5 గోడేకి ఖబర్ 162 1 0 0 10 173 చార్మినార్-5 స్వామి వివేకానంద నగర్ 235 279 0 0 24 538 చార్మినార్-5 పార్థివాడ 7 150 0 0 0 157 అబిడ్స్-9 లంబాడీతండా 1 85 0 0 4 90 ఖైరతాబాద్-10 అంబేద్కర్ నగర్ 62 6 27 2 1 98 కూకట్పల్లి-14 అమ్రునగర్ తండా 0 155 0 0 0 155 మొత్తం 578 742 27 2 239 1588 -
నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్
హైదరాబాద్ : సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్‌పేట ఐడీహెచ్ కాలనీలో జరుగుతున్న పక్కా ఇళ్ల నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పరిశీలించారు. పనుల్లో ప్రగతిపై అధికారులతో శుక్రవారం మాట్లాడారు. నిర్మాణాలు చకచకా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పేదల కోసం రూ.36 వేల కోట్ల ఖర్చుతో దాదాపు 400 ఇళ్లను నిర్మించటం దేశంలో ఇదే ప్రథమమని చెప్పారు. (బన్సీలాల్‌పేట) -
దొంగెవరో...దొరెవరో తేలింది: కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో దొంగెవరో...దొరెవరో తేలిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన శుక్రవారం బోయిగూడ ఐడీహెచ్ కాలనీలో 396 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇళ్లులేని వారికి ఇళ్లు కట్టించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏ బస్తీలోని ప్రజలకు ఆ బస్తీలోనే భవనాలు నిర్మించి ఇస్తామని కేసీఆర్ తెలిపారు. నగరంలో లక్షల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యారని, కబ్జాకు గురైన భూములను వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పద్మారావు, ఎంపీ బండారు దత్తాత్రేయ, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.