ఆదర్శంగా ఐడీహెచ్ కాలనీ
పూర్తికావస్తున్న
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం
రాష్ట్రావతరణ దినోత్సవం నాడే ప్రారంభిస్తానన్న సీఎం
ఒక్కో ఇంటికి రూ. 7.90 లక్షల వ్యయంతో పేదలకు 396 ఇళ్లు
పనులను స్వయంగా పరిశీలించిన కేసీఆర్
హైదరాబాద్: రాజధానిలో ఐడీహెచ్ కాలనీలోని ఇళ్ల సముదాయాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. గురువారం ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. గత అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన ఈ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల తీరును, నాణ్యతను, ఇతరత్రా అంశాలను పరిశీలించేందుకు కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ఐడీహెచ్ కాలనీకి వచ్చారు. పనులన్నింటినీ పరిశీలిస్తూ కాలనీలో ఆయన కలియతిరిగారు. పనుల పురోగతి, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇలాంటి ఇళ్లనే హైదరాబాద్‌లోని పేద ప్రజలందరికీ నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఐడీహెచ్ కాలనీలో నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, జూన్ 2న తానే ఈ సముదాయానికి ప్రారంభోత్సవం చేస్తానని సీఎం పేర్కొన్నారు. ఈ కాలనీ దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తన కోరిక అని, అందుకే వారికోసం డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇళ్ల డిజైన్‌పై స్థానిక మహిళల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణంపై సంతోషం వ్యక్తం చేసిన మహిళలు.. సామాన్లు పెట్టుకోడానికి సబ్జలు కట్టించాలని కోరారు. వెంటనే స్పందించిన కేసీఆర్.. అన్ని ఇళ్లలో వాటిని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, టి.హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ తదితరులున్నారు.
ఇదీ నేపథ్యం..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే కేసీఆర్ ఐడీహెచ్ కాలనీలోని పేదల దుర్భర పరిస్థితిని కళ్లారా చూశారు. వారందరికీ ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. ఆ మేరకు గత అక్టోబర్ 3న గృహ నిర్మాణ పనులకు ఆయనే శంకుస్థాపన చేశారు. సీఎం ఆదేశాలు, ఆలోచనలకు అనుగుణంగా జీహెచ్ ఎంసీ అధికారులు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మొత్తం 32 బ్లాకుల్లో జీ ప్లస్ టూ పద్ధతిలో 396 ఇళ్లు కడుతున్నారు. ఇందుకు రూ.37 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రతి ఇంట్లో రెండు బెడ్రూంలు, హాల్, కిచెన్, రెండు మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. 580 చ దరపు అడుగుల విస్తీర్ణంలో కడుతున్న ఒక్కో ఇంటికి రూ. 7.90 లక్షలు ఖర్చు చేస్తున్నారు. విద్యుత్, నల్లా కనెక్షన్లు కూడా ఇస్తున్నారు. మురికి నీటి కాలువలు, వర్షపు నీటి కాలువలు, మంచి నీటి పైపులైన్లు నిర్మించారు.