దేశానికే ‘మోడల్’..
- ఐడీహెచ్ కాలనీలో సకల వసతులతో పేదింటి కలల సౌధం
- పూర్తవుతున్న పనులు.. దసరా రోజున ప్రారంభించనున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: ఐడీహెచ్ కాలనీ..! ఇప్పటిదాకా స్థానికులకు మాత్రమే తెలిసిన పేరిది! కానీ ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పేదల గృహనిర్మాణానికి ‘మోడల్’గా నిలిచిన కాలనీ. పేదల కోసం నిర్మించే గృహ నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకంగా పరిగణనలోకి తీసుకుంటున్న కాలనీ. గవర్నర్‌తోపాటు కేంద్రం, నేతలు, ఐఏఎస్‌లు ప్రశంసలు కుమ్మరిస్తున్న కాలనీ! సాధారణంగా పేదల గృహ నిర్మాణమంటే ఇరుకు గదులు, నామ్‌కేవాస్తే టాయ్‌లెట్, అరకొర సౌకర్యాలు అన్న భావనను పూర్తిగా తుడిచిపడేస్తూ ఐడీహెచ్‌లో ఇళ్లు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. గతేడాది దసరా రోజున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ కాలనీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈనెల 22న దసరా రోజున ప్రారంభోత్సవం చేయనున్నారు.
ఇదీ ఐడీహెచ్ కాలనీ: మొత్తం ఇళ్లు 396
ఒక్కో ఇంటికి నిర్మాణ వ్యయం: రూ. 7.90 లక్షలు
మౌలిక సదుపాయాలకు రూ. 5.26 కోట్లు
నిర్మాణ సంస్థ: ఎన్‌జేఆర్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి.
బ్లాకులు 33 (జీ ప్లస్ 2 చొప్పున)
మొత్తం ఇళ్ల నిర్మాణ వ్యయం రూ. 31.28 కోట్లు
మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 36.54 కోట్లు
కాంట్రాక్టర్లకు స్థలం ఇచ్చింది: 2014, డిసెంబర్ 18
ఇళ్ల నిర్మాణం, వసతులు ఇలా..
- ఐడీహెచ్ కాలనీ కోసం ప్రత్యేకంగా ‘ఎర్త్‌క్వేక్’ డిజైన్ రూపొందించారు. భూకంపాలు వంటివి సంభవించినా తట్టుకునేలా అదనపు స్టీలు, ఫ్లైయాష్ వంటివి వినియోగించారు.
- గతంలో వాంబే పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్ల తలుపులు, కిటికీల ఫ్రేమ్‌లకు సిమెంటునే వాడగా.. ఈ కాలనీలో ఎంతకాలమైనా తుప్పు పట్టకుండా ఉండే ప్రత్యేక మెటీరియల్‌ను వినియోగించారు.
- గతంలో నిర్మించిన ఇళ్ల గోడలు వర్షానికి తడిసిపోయేవి. ప్రస్తుతం అలాంటి లీకేజీలుండవు. కిటికీలకు జెడ్ యాంగిల్ తలుపులు వాడుతున్నారు.
- సామాన్లు పెట్టుకునేందుకు సజ్జలు(అటకలు), వంట గదిలో షెల్ఫ్‌లు, కిచెన్‌లో ప్లాట్‌ఫారం వంటి సదుపాయాలున్నాయి
- నేలకు సిమెంట్ ఫ్లోరింగ్ కాకుండా టైల్స్ వాడారు
- ఇంటిలో రెండు టాయిలెట్స్ ఉన్నాయి. ఒకటి యూరోపియన్ తరహాలో, మరొకటి దేశవాళీ పద్ధతిలో నిర్మించారు
- గతంలో నిర్మించిన ఇళ్ల నీటి సరఫరాకు ఒకే వ్యవస్థ ఉండేది. ప్రస్తుతం తాగునీటికి ఒక పైప్‌లైన్, ఇతర అవసరాలకు మరో లైన్ ఏర్పాటు చేస్తున్నారు
- కాలనీలో సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. మురుగునీరు, వర్షపు నీరు వెళ్లే లైన్లు, వీధి దీపాల ఏర్పాటు పనులు సాగుతున్నాయి
- 30 అడుగుల రహదారితోపాటు దానికి సెంట్రల్ మీడియన్, ఇరువైపులా మొక్కల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నడకదారులకు సదుపాయం కల్పిస్తున్నారు
- అంగన్‌వాడీతో కూడిన కమ్యూనిటీ హాల్ ఏర్పాటు. 11 దుకాణాలతో స్థానికుల అవసరాల కోసం షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు
- డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో లివింగ్‌హాల్, ప్యాసేజ్, మాస్టర్ బెడ్‌రూమ్, మరో బెడ్‌రూమ్, కిచెన్, యుటిలిటీ, బాత్/టాయ్‌లెట్, కారిడార్‌లున్నాయి.
ఢిల్లీలో ఐఏఎస్ క్వార్టర్లకు దీటుగా..
ఢిల్లీలో ఐఏఎస్‌ల క్వార్టర్లకు దీటుగా ఈ కాలనీ ఉంది. ఇంతమంచి కాలనీని చక్కగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత లబ్ధిదారులపై ఉంది. కాలనీలోని స్థానికులతోనే కమిటీగా ఏర్పడి నిర్వహణ బాధ్యత చూడాలి.
- ఇటీవల ఐడీహెచ్ కాలనీకి వచ్చినప్పుడు గవర్నర్ నరసింహన్
వాంబే పథకంలో నిర్మించిన ఇళ్లకు, ఐడీహెచ్ కాలనీ ఇళ్లకు తేడా ఇదీ
వాంబే ఐడీహెచ్ మోడల్ కాలనీ
ఫ్లాట్ విస్తీర్ణం 267 చదరపు అడుగులు ఫ్లాట్ విస్తీర్ణం 580 చదరపు అడుగులు
నిర్మాణ వ్యయం రూ.1.30 లక్షలు (అప్పటి ధరల మేరకు) రూ. 7.90 లక్షలు
ప్రభుత్వ సబ్సిడీలు పోను లబ్ధిదారు రూ.30 వేలు చెల్లించాలి పూర్తిగా ఉచితం