‘డబుల్ బెడ్‌రూమ్’పై పంద్రాగస్టున ప్రకటన?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది పేదలు ఎదురుచూస్తున్న ‘రెండు పడక గదుల ఇళ్ల పథకం’ విధి విధానాలను స్వాతంత్య్ర దినోత్సవ వేదిక మీద ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించనున్నారు. కలెక్టర్లు చైర్మన్లుగా జిల్లా స్థాయిలో కమిటీలకు రూపమిచ్చిన ప్రభుత్వం... అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపట్టే విధానంపై కసరత్తు చేస్తోంది. గ్రామసభల ద్వారా అర్హులను గుర్తించాలని ఇప్పటికే నిర్ణయించింది. కానీ అది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.
గతంలో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఇళ్లులేని వారుగా తేలిన కుటుంబాల సంగతేమిటనే విషయంలోనూ స్పష్టత రాలేదు. వీటికి సంబంధించి ఆగస్టు 15న గోల్కొండ కోటలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవాల్లో సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ పథకం కోసం ప్రతి జిల్లాకు కలెక్టర్ చైర్మన్‌గా కమిటీలను ప్రకటించనున్నారు. ఇందులో గృహనిర్మాణ శాఖ జిల్లా పీడీ, రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఈ, పంచాయతీరాజ్‌శాఖ ఎస్‌ఈ, పురపాలక సంఘాల పరిధిలో అయితే మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా ఉండనున్నారు.
నియోజకవ ర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎంపిక చేపట్టే అవకాశం ఉంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేదిక మీదుగా సీఎం కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్ల పథకం యూనిట్ కాస్ట్, ఇంటి నిర్మాణ వైశాల్యం వివరాలను ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.5.04లక్షలతో, 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం ఉంటుందని పేర్కొన్న ఆయన... ఈ ఆర్థిక సంవత్సరంలో 50 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఎక్కడా ఒక్క ఇంటి నిర్మాణం కూడా మొదలు కాలేదు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీలో చేపడుతున్న బహుళ అంతస్తుల నిర్మాణాలనే రెండు పడక గదుల పథకం పనులుగా పేర్కొంటున్నారు. కానీ అవి ఈ పథకం యూనిట్ కాస్ట్ కంటే చాలా ఎక్కువ మొత్తంతో చేపట్టిన ప్రత్యేక ఇళ్లు. ఇక గతంలో మహబూబ్‌నగర్, వరంగల్ పట్టణాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఇచ్చిన హామీ మేరకు... అక్కడ ఇళ్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ విధివిధానాలు ఖరారు కాకపోవటంతో ఏప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేయాలో తెలియక అధికారులు మిన్నకుండిపోయారు.