సొంత జాగా లేని అర్హులకు వాటి కేటాయింపు
అర్హుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు
దాదాపు లక్షన్నర ఇళ్ల పంపిణీకి అవకాశం
సాక్షి, హైదరాబాద్: పేదల కోసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ఇందిరమ్మ పథకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లతోపాటు అసంపూర్తిగా ఉన్న వాటిని సిద్ధం చేసి.. ఇందిరమ్మ లబ్ధిదారులకు అందజేయబోతోంది. తొలి విడత ఇందిరమ్మ ఇళ్లను సొంత జాగా ఉన్న వారికే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. తాజాగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లున్న ప్రాంతాల్లో.. వాటిని సొంత జాగా లేని అర్హులైన నిరుపేదలకు అందజేయాలని నిర్ణయించింది.
దాదాపు లక్షన్నర డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు సొంత జాగా లేని ‘ఇందిరమ్మ’లబ్ధిదారులకు అందనున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2.90 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. వాటిలో 2.28 లక్షల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. కానీ, లబ్ధిదారుల ఎంపిక చేయకుండానే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం ఆక్షేపించి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను పూర్తిగా ఇవ్వకుండా నిలిపేసింది.
సొంత నిధులను కావాల్సినన్ని కేటాయించకపోవటంతో ఆ ఇళ్ల నిర్మాణం మందగించింది. చివరకు పథకమే గందరగోళంగా మారింది. ఇప్పుడు ఆ ఇళ్లలో దాదాపు 60 వేలను లబ్ధిదారులకు మంజూరు చేయగా, మిగతావి వృధాగా ఉన్నాయి. పూర్తయిన వాటిని, అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసి.. ఇందిరమ్మ పథకం కింద పంపిణీ చేయాలని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. అసంపూర్తి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ఆ పనులు జరుగుతున్నాయి.
సొంత జాగా లేనివారికి కూడా జాబితాలో చోటు..
ఈ నెల 21 నుంచి ఊరూరా గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయబోతున్నారు. ఈ దఫాలో కేవలం సొంత జాగా ఉన్న వారికే ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కానీ, సొంత జాగా లేనివారిలో అర్హులైనవారిని గుర్తించి, వారి జాబితాను కూడా సిద్ధం చేయాలని తాజాగా ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. గ్రామ సభల్లో వారి జాబితాను కూడా ప్రదర్శించాలని పేర్కొంది.
ప్రజా పాలనలో భాగంగా అందిన దరఖాస్తుల్లో సొంత జాగా లేని వారి వివరాలను కూడా తనిఖీ చేసి, వారు అర్హులైతే ఆ జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు. తనిఖీ కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో, ఇక గ్రామ సభల్లో అర్హుల జాబితాను రూపొందించటమే తరువాయి. అలా సొంత జాగా లేని అర్హులున్న గ్రామాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఉంటే.. వాటిని వారికి మంజూరు చేస్తారు. అందుకోసం కలెక్టర్లు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment