indiramma homes
-
ఇందిరమ్మ ఇళ్ల బకాయిల చెల్లింపు!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల బకాయిలను చెల్లించాలని నిర్ణయించినట్లు గృహనిర్మాణ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శాసనసభలో గృహ నిర్మాణ శాఖ వార్షిక బడ్జెట్ పద్దులపై గురువారం జరిగిన చర్చలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి అసంపూర్తిగా మిగిలిన 4,12,218 ఇందిరమ్మ గృహాలకు బిల్లులు చెల్లించాల్సి ఉండగా వీటిలో అర్హులైన లబ్ధిదారులకే బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. అర్హుల గుర్తింపు కోసం సర్వే నిర్వహించగా 2,09,012 గృహాల లబ్ధిదారులు అర్హులని, మరో 1,29,633 మంది లబ్ధిదారులు అనర్హులని తేలిందన్నారు. మిగిలిన 73,573 గృహాల సర్వే పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. ఇప్పటివరకు అర్హులకు రూ.396.63 కోట్లు చెల్లించామని, మరో రూ.1133.55 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. బీసీల స్థితిగతులపై బీసీ కమిషన్ నివేదిక రాగానే ఎంబీసీలకు స్వయం ఉపాధి పథకాల కింద రాయితీ రుణాలను పంపిణీ చేస్తామన్నారు. ఏపీలోని 23 బీసీ కులాలను బీసీ జాబితాలో చేర్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి అందించే రూ.10 వేల ప్రోత్సాహకాన్ని పెంచే ప్రతిపాదనను సైతం ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. -
మోడల్ హౌజ్ ప్రారంభమెప్పుడో ?
బేల: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ప్రక్కన 2013 సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభించిన మోడల్ హౌజ్ నేటికి ప్రారంభానికి నోచుకోవడం లేదు. దాదాపు భవనం పనులు పూర్తి అయినప్పటికి అలంకార ప్రాయంగానే మిగిలిపోయింది. ఈ భవనానికి తలుపులు, కిటికిలు బిగింపు సైతం పూర్తి అయింది. కేవలం వైట్‌వాష్ వేసేస్తే మోడల్ హౌజ్ పూర్తి అయ్యే అవకాశం ఉన్నప్పటికి, దీన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. 2013సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రూ.2.50 లక్షల వ్యయంతో మండల కేంద్రంలో ఒక మోడల్ హౌజ్ నిర్మించడానికి నిధులు విడుదల చేసింది. మండల కేంద్రంలో ఇలా ఏర్పాటు చేసిన మోడల్ హౌజ్ నమూనాతో మండల వాసులు ఇందిరమ్మ గృహలను నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఈ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. గత మూడు సంవత్సరాలుగా కొద్దిపాటి పనులతో ఈ మోడల్ భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇకనైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఈ అసంపూర్తి భవన నిర్మాణ పనులు పూర్తి చేయించి ప్రారంభిస్తే మండల కేంద్రంలో పనిచేసే సంబంధిత అధికారులకు మరో నూతన కార్యాలయం అందుబాటులోకి వస్తుందని మండలవాసులు అంటున్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల బకాయిలు ఇవ్వరా?
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా రెండు పడక గదుల ఇళ్లను పేదలకు అందివ్వని ప్రభుత్వం.. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. అసలు చెల్లించే యోచన ఉందా లేదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు, డీకే అరుణ ఆరోపణలు ప్రత్యారోప ణలు చేసుకోవడంతో పరిస్థితి కాస్త వేడెక్కింది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో డీకే అరుణ మాట్లాడుతుండగా సభలోకి వచ్చిన హరీశ్ రావు కాసేపు వేచి ఉండి.. ఆమె ప్రశ్న అడక్కుండా ఏదేదో మాట్లాడుతున్నారంటూ పేర్కొన్నారు. దీంతో డీకే అరుణ ఆగ్రహానికి గురయ్యారు. ‘ఆయన సభలోకి రాగానే నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు. నేను నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. నా మాటలకు అడ్డు తగలాల్సిన అవసరమేముంది. హామీ ఇచ్చినట్టుగా ఇళ్లు కట్టకుంటే ప్రశ్నించొద్దా, అసలు బిల్లులు చెల్లించే ఉద్దేశం ఉందా లేదా’ అని ప్రశ్నించారు. దీంతో స్పీకర్ మధుసూదనాచారి జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కది ద్దారు. -
ఇందిరమ్మ ఇళ్లపై విజిలెన్స్ తనిఖీలు
* రెండు జిల్లాల్లో వెయ్యి ఇళ్ల పరిశీలన * డీఎస్పీ ప్రసాదరావు బొబ్బిలి, బొబ్బిలి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, బిల్లులు చెల్లింపులపై క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నామని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ బి. ప్రసాదరావు చెప్పారు. బొబ్బిలి మార్కెట్ కమిటీలో పౌరసరఫరాల గోదాంను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో మాట్లాడుతూ బొబ్బిలి మండలం చింతాడ, డెంకాడ మండలంలోని ఒక గ్రామంలో 400 ఇళ్లను పరిశీలిస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలం కేసరిపురం, సీతంపేట మండలంలో పెదరామ, జి.సిగడాం మండలం వాండ్రంగి గ్రామాల్లో 600 ఇళ్లను పరిశీలిస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో మంజూరైన ఇళ్లు నిర్మించారా, అవి ఏయే స్థాయిలో ఉన్నాయి, వాటికి ఇప్పటి వరకు అందిన బిల్లులు అసలు అందాయా లేదా తదితర అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నట్టు తెలి పారు. ఇందిరమ్మ ఇళ్లల్లో అక్రమాలపై ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో ఆరా తీసామన్నారు. పౌరసరఫరాల గోదాంలు, రేషను డిపోలు కూడా పరిశీలి స్తున్నామన్నారు. బొబ్బిలిలోని గోదాం పక్కనే చెత్త డంపింగ్ చేయడం ఆహార ఉత్పత్తులకు ప్రమాదకరమని గతంలో నివేదిక ఇచ్చినా మార్పు కనిపించలేదన్నారు. వీటిపై మళ్లీ నివేదిక ఇస్తామన్నారు. పరిశీలనలో విజిలెన్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎస్.త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. చింతాడలో విజిలెన్సు దర్యాప్తు ఇందిరమ్మ ఇళ్లపై శ్రీకాకుళం విజిలెన్సు డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో విజిలెన్సు సీఐలు ప్రదీప్‌కుమార్, రేవతమ్మలు శుక్రవారం దర్యాప్తు నిర్వహించారు. గ్రామంలో అప్పట్లో మంజూరైన ఇళ్లను పరిశీలించి పంచాయితీ కార్యాలయానికి చేరుకుని పలు వివరాలు నమోదు చేసుకున్నారు. వారివెంట విజిలెన్సు ఎస్ఐ అప్పలనాయుడు ఉన్నారు. -
బిల్లులో జాప్యం.. కుటుంబం ఆత్మహత్యాయత్నం
రెండేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో ఇటుకల వ్యాపారి మనస్తాపం భార్య, కొడుకుతో కలసి ప్రభుత్వ కార్యాలయం పైనుంచి దూకే యత్నం ఖమ్మంలో ఘటన.. నిధులు రాగానే ఇచ్చేస్తామన్న అధికారులు ఖమ్మం: ఇందిరమ్మ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడంతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సాక్షాత్తూ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి కార్యాలయ భవనం పైనుంచి కిందకు దూకే యత్నం చేసింది. మంగళవారం ఖమ్మంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్నిసార్లు తిరిగినా.. వీఆర్‌పురం మండలం రేఖపల్లికి చెందిన చీమల వెంకటేశ్వర్లు ఇటుకల తయారీ వ్యాపారం చేస్తున్నారు. 2013-14 ఏడాదిలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు ఇటుకలు సరఫరా చేసేందుకు అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.11 లక్షల విలువ చేసే ఇటుకలను సరఫరా చేశారు. వీటి బిల్లులు వెంకటేశ్వర్లుకు అందించాల్సి ఉంది. అయితే రూ.6.33 లక్షలు చెల్లించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు మిగిలిన డబ్బులు చెల్లించడం లేదు. దీనిపై వెంకటేశ్వర్లు పలుమార్లు భద్రాచలం డీఈ నారాయణ, ఇతర అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం వెంకటేశ్వర్లు తన భార్య సరోజ, కొడుకు కృష్ణార్జున్తో కలసి మరోసారి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి కార్యాలయానికి వచ్చారు. బిల్లుపై అడగ్గా.. అధికారులు స్పందించలేదు. దీంతో మనస్తాపం చెందిన వెంకటేశ్వర్లు.. భార్య, కొడుకుతో కలసి కార్యాలయ భవనం పైనుంచి దూకే ప్రయత్నం చేశారు. కుమారుడు కృష్ణార్జున్ వెంట తీసుకువచ్చిన కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని స్టేషన్‌కు తరలించి వారిపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు. బిల్లులు రాగానే చెల్లిస్తాం వెంకటేశ్వర్లుకు బిల్లు చెల్లించాల్సిన విషయం వాస్తవమే. రూ.11 లక్షలకుగాను రూ.6.33 లక్షలు చెల్లించాం. మిగిలిన డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం. బిల్లుల్లో జాప్యం వల్లే చెల్లించలేకపోయాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే డబ్బులు ఇస్తాం. - వైద్యం భాస్కర్, పీడీ గృహ నిర్మాణశాఖ -
ఇందిరమ్మ ఇళ్లకు మోక్షం!
బాన్సువాడ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ పడిపోయిన బిల్లులను ఇక చెల్లించనున్నారు. పది నెలలుగా బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో చాలావరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. కొంతమంది అప్పు చేసి ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగించారు. కాగా ఇటీవల గృహ నిర్మాణ శాఖ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించి ఆన్లైన్ చెల్లింపులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నిధులను సైతం విడుదల చేయడంతో గృహ నిర్మాణదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇందిరమ్మ పథకం కింది జిల్లాలో సుమా రు 1.57లక్షల మంది లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వివిధ దశల్లో నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాకు మూడు విడతల్లో 2,41,992 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 1,57,824 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే 84,168 ఇళ్లు ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు. మరో 6,956 ఇళ్లు ప్రాథమిక స్థాయిలో ఉండగా, 15,390 ఇళ్లు బేస్మిట్ లేవల్లో, 1,689 ఇళ్లు లెంటల్ లెవల్లో , రూఫ్ లెవల్లో 5,398 ఇళ్లు ఉన్నాయి. మరో 29,433 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకొన్నాయి. జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 1,28,391 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ లెక్కన జిల్లాలో 53 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం బిల్లుల చెల్లింపు పున:ప్రారంభమవడంతో గృహ నిర్మాణ అధికారులు ఇంటి నిర్మాణాన్ని బట్టి లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. లే అవుట్ ఉంటేనే .. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించబోయే ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపికలో అనేక నిబంధనలు వర్తించేవిధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో విచ్చలవిడిగా అవినీతి జరగడం, ఒకే ఇంటికి ఐదు నుంచి 10 ఇళ్ల రుణాలు పొందడం లాంటి అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అలాంటి అవకతవకలకు తావులేకుండా, లేఅవుట్ ప్లాట్లు ఉన్న వారికే ఇళ్ల రుణాలు మంజూరు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. నిరుపేదలకు ఇళ్లను ఇకపై ప్రత్యేకంగా లేఅవుట్లు ఉన్న చోటనే నిర్మించాలని నిర్ణయించారు. లేఅవుట్ స్థలం ఉన్న నిరుపేదలను ఎంపిక చేసి వారికి రూ. 3.50 లక్షలతో ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో రెండంతస్తుల భవనాల వారూ ఇందిరమ్మ పథకం ద్వారా నిధులు పొందగా, ప్రస్తుతం వాటిని గుర్తించడం కష్టంగా మారింది. ఇప్పుడలా జరగకుండా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా, అర్హులను గుర్తించనున్నారు. లేఅవుట్ కాలనీల్లో ఇళ్లను నిర్మిస్తే అక్కడ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలు కల్పించ వచ్చని, దీంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్రూం, హాలు, కిచెన్‌కు రూ.3.50 లక్షలు సరి పోవని, రూ.4.60 లక్షల వరకు వ్యయం అవుతుందని గృహనిర్మాణ సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే లబ్ధిదారుడు నేరుగా ఇల్లు నిర్మించుకుంటే రూ.3.50 లక్షలు ఇవ్వవచ్చని వారు అంటున్నారు. ప్రభుత్వం తరపున నిర్మిస్తే 14 శాతం కాంట్రాక్టర్ లాభం, 5 శాతం వ్యాట్, 2 శాతం ఆదాయపు పన్ను, మైనిం గ్ పన్ను 5 శాతం, కార్మిక సెస్ 5 శాతం, పర్యవేక్షణ చార్జీలు 7 శాతం కలిపి సుమారు 30 శాతం వ్యయం అదనంగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుడు నేరుగా నిర్మించుకొంటే ఈ అదనపు భారం తప్పుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి రూ.3.5 లక్షల చొప్పున బిల్లులు చెల్లిస్తామని ప్రకటించడంతో లబ్ధిదారులు గంపెడాశతో ఉన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకొన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేస్తారా? లేదా గత మార్చిలో దరఖాస్తు చేసుకొన్న వారికి సైతం వర్తిం పజేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఈ పథకంలోని విధి విధానాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నిలిచిన ఇళ్ల నిర్మాణాలు పదినెలలుగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోవడంతో సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, సామిల్స్ వ్యాపారులపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఒకవైపు నిర్మాణ దారులు బిల్లులు లేక పనులను ఆపేస్తుండగా, మరోవైపు సంబంధింత వ్యాపారులు అప్పులు చెల్లించలేక విలవిల్లాడుతున్నారు.ఈసారి ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల సాగు విస్తీర్ణం తగ్గడంతో కూలీలకు చేతినిండా పని లేకపోయింది. ఇంటి నిర్మాణాల్లో కూలీ పనులు చేసుకోవాలనుకున్నా, ఇక్కడా వారికి పని దొకరడం లేదు. వెరసి కూలీలు వలస వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
అధికారులు ఏం చేస్తున్నారు?
బీర్కూర్, న్యూస్‌లైన్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా అధికారులు ఏం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మండల స్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా తహశీల్ కార్యాలయాన్ని సందర్శించి, ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. మండలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల పథకం ఎంతవరకు వచ్చిందని ఉపాధి హామీ అధికారులను ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం కలెక్టర్ పొతంగల్ గ్రామం నుంచి బీర్కూర్ గ్రామానికి రాగా, రోడ్లు అధ్వానంగా ఉండడంతో స్థానిక తహశీల్దార్ అంజ య్యపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోడ్లు ఇలా ఉం టే వాహనాలు ఎలా వస్తాయన్నారు. వారంలో ఒకరోజు ‘ఇందిరమ్మ ఇళ్ల’కు ఇసుక మండలంలోని బరంగేడ్గి గ్రామం నుంచి రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్థానిక తహశీల్దార్‌ను పిలిపించి, ఇసుక రవాణా జరుగుతుంటే పట్టించుకోవడం లేదా అని ప్రశ్నించారు. వెంటనే ట్రాక్టర్లు సీజ్ చేయాలని ఆయన ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు వారంలో ఒక రోజు ఇసుక తీసుకువెళ్లడానికి అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. దోషులను గుర్తించారా...? మండలంలోని బరంగేడ్గి గ్రామంలోని పాఠశాలలో విషపు గుళికలు కలిపిన సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించారా అని ఎంఈఓ గోపాల్‌రావును కలెక్టర్ ప్రద్యుమ్న ప్రశ్నించారు. దీనిపై పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారని ఎంఈఓ బదులిచ్చారు. అనంతరం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీ లించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదా రులతో మాట్లాడారు. ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపు తిమ్మాపూర్ గ్రామంలో ఉపాధి హామీలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ రాజయ్య పని తీరు సరిగా లేదని, బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని పలువురు గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని విధుల నుంచి తొలగించి, మరొకరిని నియమించాలని అధికారులను ఆదేశించారు. -
‘ఇందిరమ్మ కలలు’ కల్లలేనా!
సాక్షి, నిజామాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడిచినా ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ (ట్రైకార్)ల కార్యాచరణ ప్రణాళికలకు ఇంతవరకు ప్రభు త్వం ఆమోదం తెలపలేదు. ఇందిరమ్మ కలలు అభా సు పాలవుతున్నాయనడానికి ఇది నిదర్శనం. ఈ సం స్థల ద్వారా స్వయం ఉపాధి, పునరావాస, వ్యవసాయానుబంధ పథకాలు అమలవుతాయి. అయితే సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది ఇవి కుంటుపడిపోయాయి. దీంతో ఈ పథకాల లబ్ధి నిరుపేద దళిత, గిరి జనుల దరి చేరడంలో జాప్యం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల పథకాల యూనిట్ల కోసం జిల్లాలోని నిరుపేద దళిత, గిరిజనులు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు. ఆయా మండలాల ఎంపీడీఓల ద్వారా ప్రతిపాదనలు అందాయి. యూనిట్ల మంజూరు.. నిధుల కేటాయింపులు.. సబ్సిడీల పెంపు వంటి విషయాల్లో సర్కారు నిర్ణయం తీసుకోవడంలో నెలల తరబడి జాప్యం జరుగుతోంది. దీంతో దరఖాస్తుదారులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. ట్రైకార్... మైదాన ప్రాంతాల్లో నివాసముండే గిరిజనుల సంక్షేమం కోసం సర్కారు ట్రైకార్ ద్వారా పలు పథకాలను అమలు చేస్తోంది. కిరాణషాపులు, టైల ర్లు, టెంట్‌హౌజ్, ఇంటర్నెట్ సెంటర్లు, ఫొటోస్టుడియో వంటివి ఏర్పా టు చేసుకుని స్వయం ఉపాధి పొందుతున్న గిరిజన యువతకు సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. ట్రాక్టర్ల కొనుగోలు, భూముల్లో సాగునీటి సదుపాయాల కల్పన, డెయిరీఫాంలు, గొర్రెల పెంపకం వంటి యూనిట్లకు కూడా సబ్సిడీలు మంజూరు చేస్తుంది. లబ్ధిదారులు బ్యాంకుల ద్వారా రుణాలు పొంది వీటిని ఏర్పాటు చేసుకుంటే ట్రైకార్ సబ్సిడీలతో చేయూతనందిస్తుంది. గత ఏడాది జిల్లాకు వివిధ పథకాల కింద 430 యూనిట్లు మంజూరయ్యాయి. కానీ ఏడాది ఏడునెలలు గడిచినప్పటికీ మంజూరు ఊసే ఎత్తడం లేదు. ఈ ఏడాది 480 యూనిట్లకు లబ్ధిదారులనుంచి దరఖాస్తులు తీసుకున్న గిరిజన సంక్షేమశాఖ అధికారులు చేసేదేమీ లేక సర్కారు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్.. ఎస్సీ కార్పొరేషన్‌లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఏడు నెలలుగా కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం లభించకపోవడంతో నిరుపేద దళితులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలతో పాటు, జోగినులు, జైలు నుంచి విడుదలైన దళిత ఖైదీలకు పునరావాసం., సఫాయి, కర్మచారుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తోంది. చిన్ననీటి పారుదల సౌకర్యం, బోర్లు, పంపుసెట్లు, భూమికొనుగోలు, పాడిగేదెలు, గొర్రెల పెంపకం వంటి యూనిట్లకు సబ్సిడీని అందిస్తారు. ఏటా ఆగస్టులోపే ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను ప్రకటించేది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక, యూని ట్ల మంజూరు పత్రాల జారీ వంటి ప్రక్రియ అంతా ఎప్పుడో పూర్తయ్యే ది. ఈసారి ప్రభుత్వం ఇంత వరకు కార్యాచరణ ప్రణాళిక ఊసే ఎత్తకపోవడంతో సాంఘిక సంక్షేమశాఖ అధికారులు ముందుకెళ్లలేకపోతున్నారు. సర్కారు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం.. ఆయా పథకాలకు సబ్సిడీని పెంచే యోచనలో సర్కారు ఉంది. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక అమలులో జాప్యం జరుగుతోంది. అని సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డెరైక్టర్ కాలేబు ‘సాక్షి’తో పేర్కొన్నా రు. ఇప్పటికే రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే యూనిట్ల మంజూరుకు చర్యలు తీసుకుంటాం.. అని జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి రాములు తెలిపారు. -
టార్గెట్ ‘ఇందిరమ్మ’
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినీతి రాజ్యమేలుతోంది. లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో అందాల్సిన ఫలాలు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటి అమలులో ఉన్నతస్థాయి అధికారులు మొదలుకొని కిందిస్థాయి సిబ్బంది వరకు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇలా చేసి దొరికినవారు కొందరుంటే.. చేతికి మట్టి అంటకుండా ఇంకా దండుకుంటున్న వారు మరికొందరున్నారు. దీంతో లబ్ధిదారులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ఏసీబీకివస్తున్న ఫిర్యాదుల్లో అధిక శాతం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు సంబంధించివే ఉండడంతో ఏసీబీ అధికారులు సైతం కంగుతింటున్నారు. ఇందిరమ్మలో జరుగుతున్న అవినీతిని ఆటకట్టించేందుకు అధికారులు నిఘా ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. గూడులేని నిరుపేదలకు నీడ కల్పించాలన్న లక్ష్యంతో జిల్లాలో 2005 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం వివిధ దశల్లో 2.61 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి పూర్తయ్యే వరకు దశల వారీగా బిల్లులు మంజూరు చేస్తోంది. ఈ క్రమంలో లబ్ధిదారులకు బిల్లులు రాకపోవడం.. మంజూరు చేయడంలో అధికారులు చేతివాటం ప్రదర్శించడంతో బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కోసారి అడిగింది ఇచ్చినా హౌసింగ్ అధికారులు మాత్రం ఆలస్యంగానే బిల్లులు జారీ చేస్తున్నారు. చాలావరకు ఇంటి నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు లబ్ధిదారులకు తెలియకుండానే ఆ శాఖ అధికారులు కాజేసిన సంఘటనలున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అప్పుడప్పుడు కిందిస్థాయి అధికారులు సస్పెన్షన్‌కు గురవుతున్నా అవినీతి మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలపైనే ప్రధానంగా ఆరోపణలు వస్తున్నప్పటికీ.. పైస్థాయి అధికారులకు సైతం భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 1.55 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా.. చాలామంది లబ్ధిదారులకు బిల్లులు అందక కార్యాలయాల చుట్టు తిరుగుతూనే ఉన్నారు. పునాది దశలో రావాల్సిన బిల్లు ఇంటి నిర్మాణం పూర్తయితే గానీ రాని పరిస్థితి నెలకొంది. పూర్తయిన నిర్మాణాలకు బిల్లులు ఇచ్చేది ఎప్పటికీ అనేది తెలియకుండా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల్లో బిల్లులు చెల్లించినట్లు కనిపించినా అధిక శాతం లబ్ధిదారులకు చేరడం లేదని ఆ శాఖకు చెందిన అధికారులే ఆరోపిస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందిరమ్మ పథకం ప్రారంభంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఒక్కో ఇంటికి రూ.50 వేల నుంచి రూ.80వేల వరకు వచ్చేవి. ఇప్పుడు ఇంటి నిర్మాణం వ్యయం పెరగడంతో ఎస్టీలకు రూ.1.05 లక్షలు ఎస్సీలకు రూ.లక్ష, గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు రూ.70 వేలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.80వేలు చెల్లిస్తున్నారు. దీంతో అధికారులు మరింత ఉత్సాహంతో అవినీతికి తెగబడుతున్నారు. ఈ క్రమంలో విసిగెత్తిన లబ్ధిదారులు కొందరు అవినీతి అధికారులపై ఫిర్యాదు చేస్తున్నారు. ఎస్ఎంఎస్కు స్పందిస్తాం.. : ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడిన అధికారులపై బాధితులు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారమందించినా తాము స్పందిస్తామని ఏసీబీ డీఎస్పీ తాళ్లపల్లి సుదర్శన్‌గౌడ్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో బాధితులు ఫోన్లు చేస్తున్నారని, వారికి న్యాయం చేసే విధంగా ఎస్ఎంఎస్ పద్ధతిని పరిశీలిస్తున్నామన్నారు. ఇలా వచ్చిన ఎస్ఎంఎస్ ఆధారంగా ఏవిధంగా ఫిర్యాదు చేయాలన్న విషయాన్ని బాధితునికి వివరించి వారికి న్యాయం చేస్తామన్నారు.