టార్గెట్ ‘ఇందిరమ్మ’ | Target 'indiramma' | Sakshi
Sakshi News home page

టార్గెట్ ‘ఇందిరమ్మ’

Published Sun, Sep 1 2013 3:45 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

Target 'indiramma'

జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినీతి రాజ్యమేలుతోంది. లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో అందాల్సిన ఫలాలు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటి అమలులో ఉన్నతస్థాయి అధికారులు మొదలుకొని కిందిస్థాయి సిబ్బంది వరకు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇలా చేసి దొరికినవారు కొందరుంటే.. చేతికి మట్టి అంటకుండా ఇంకా దండుకుంటున్న వారు మరికొందరున్నారు. దీంతో లబ్ధిదారులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తున్నారు.
 
 జిల్లాలో ఏసీబీకివస్తున్న ఫిర్యాదుల్లో అధిక శాతం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు సంబంధించివే ఉండడంతో ఏసీబీ అధికారులు సైతం కంగుతింటున్నారు. ఇందిరమ్మలో జరుగుతున్న అవినీతిని ఆటకట్టించేందుకు అధికారులు నిఘా ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. గూడులేని నిరుపేదలకు నీడ కల్పించాలన్న లక్ష్యంతో జిల్లాలో 2005 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం వివిధ దశల్లో 2.61 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి పూర్తయ్యే వరకు దశల వారీగా బిల్లులు మంజూరు చేస్తోంది. ఈ క్రమంలో లబ్ధిదారులకు బిల్లులు రాకపోవడం.. మంజూరు చేయడంలో అధికారులు చేతివాటం ప్రదర్శించడంతో బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కోసారి అడిగింది ఇచ్చినా హౌసింగ్ అధికారులు మాత్రం ఆలస్యంగానే బిల్లులు జారీ చేస్తున్నారు.
 
 చాలావరకు ఇంటి నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు లబ్ధిదారులకు తెలియకుండానే ఆ శాఖ అధికారులు కాజేసిన సంఘటనలున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అప్పుడప్పుడు కిందిస్థాయి అధికారులు సస్పెన్షన్‌కు గురవుతున్నా అవినీతి మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఏఈలపైనే ప్రధానంగా ఆరోపణలు వస్తున్నప్పటికీ.. పైస్థాయి అధికారులకు సైతం భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 1.55 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా.. చాలామంది లబ్ధిదారులకు బిల్లులు అందక కార్యాలయాల చుట్టు తిరుగుతూనే ఉన్నారు. పునాది దశలో రావాల్సిన బిల్లు ఇంటి నిర్మాణం పూర్తయితే గానీ రాని పరిస్థితి నెలకొంది. పూర్తయిన నిర్మాణాలకు బిల్లులు ఇచ్చేది ఎప్పటికీ అనేది తెలియకుండా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల్లో బిల్లులు చెల్లించినట్లు కనిపించినా అధిక శాతం లబ్ధిదారులకు చేరడం లేదని ఆ శాఖకు చెందిన అధికారులే ఆరోపిస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందిరమ్మ పథకం ప్రారంభంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఒక్కో ఇంటికి రూ.50 వేల నుంచి రూ.80వేల వరకు వచ్చేవి. ఇప్పుడు ఇంటి నిర్మాణం వ్యయం పెరగడంతో ఎస్టీలకు రూ.1.05 లక్షలు ఎస్సీలకు రూ.లక్ష, గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు రూ.70 వేలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.80వేలు చెల్లిస్తున్నారు. దీంతో అధికారులు మరింత ఉత్సాహంతో అవినీతికి తెగబడుతున్నారు. ఈ క్రమంలో విసిగెత్తిన లబ్ధిదారులు కొందరు అవినీతి అధికారులపై ఫిర్యాదు చేస్తున్నారు.
 
 ఎస్‌ఎంఎస్‌కు స్పందిస్తాం..
 : ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్
 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడిన అధికారులపై బాధితులు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారమందించినా తాము స్పందిస్తామని ఏసీబీ డీఎస్పీ తాళ్లపల్లి సుదర్శన్‌గౌడ్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో బాధితులు ఫోన్‌లు చేస్తున్నారని, వారికి న్యాయం చేసే విధంగా ఎస్‌ఎంఎస్ పద్ధతిని పరిశీలిస్తున్నామన్నారు. ఇలా వచ్చిన ఎస్‌ఎంఎస్ ఆధారంగా ఏవిధంగా ఫిర్యాదు చేయాలన్న విషయాన్ని బాధితునికి వివరించి వారికి న్యాయం చేస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement