Inspectors
-
హైదరాబాద్ సీసీఎస్ ప్రక్షాళన.. 12 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీసు విభాగానికి గుండెకాయ వంటి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అవినీతికి అడ్డాగా మారిపోవడంతో సీసీఎస్ ప్రక్షాళనకు హైదరాబాద్ సీపీ చర్యలు చేపట్టారు. 12 మంది సీసీఎస్ ఇన్స్పెక్టర్లను మల్టీజోన్-2కు బదిలీ చేశారు. వెంటనే రిపోర్ట్ చేయాలని హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 21న ఏసీపీ టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా గురువారం ఈఓడబ్ల్యూ టీమ్–7 ఇన్స్పెక్టర్ సుధాకర్ రూ.3 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రతిష్టాత్మకమైన ఈ విభాగం ప్రతిష్ట దిగజారుతోందనే ఆరోపణ వినిపిస్తోంది.సంచలనాత్మక నేరాలతో పాటు భారీ స్కాములను సీసీఎస్ అధికారులు దర్యాప్తు చేస్తారు. రూ.25 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడి ఉన్న సొత్తు సంబంధిత నేరాలు, రూ.75 లక్షలకు మించిన మొత్తంతో కూడిన మోసాల కేసులు సీసీఎస్ పరిధిలోని వస్తాయి. ఈ విభాగమే నేరుగా కొన్ని కేసులు నమోదు చేస్తుంది. నగరంలోని ఇతర పోలీసుస్టేషన్లలో నమోదైన వాటిని సిటీ పోలీసు కమిషనర్ దర్యాప్తు నిమిత్తం ఈ విభాగానికి బదిలీ చేస్తుంటారు. సీసీఎస్ దర్యాప్తు చేసే కేసుల్లో అత్యధికం రూ.కోట్లతో ముడిపడి ఉంటాయి. -
సీఐకి రివర్స్ పంచ్
సాక్షి, హైదరాబాద్: భూ కబ్జాను అడ్డుకుని, అక్రమాన్ని బయటపెట్టిన పోలీసు అధికారికి పదోన్నతి రాకపోయినా గుర్తింపు, ఉన్నతాధికారుల మన్ననలు లభిస్తాయి. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. కబ్జాకోరులపై తన అనుమతి లేకుండా చర్యలు ఎలా తీసుకుంటావంటూ సదరు ఇన్స్పెక్టర్పై ఓ ఎమ్మెల్యే కస్సుమన్నారు. పట్టుబట్టి మరీ ఆ అధికారిని బదిలీ చేయించారు. వెస్ట్‌జోన్‌లోని ఓ ఠాణాలో పోస్టింగ్ ఇచ్చిన మూడు నెలలు కూడా కాకుండానే ఉన్నతాధికారులు ఆయన్ను బదిలీ చేశారు. ఇందులో కొసమెరుపు ఏంటంటే.. కబ్జా అంశంపై కేసు నమోదు, దర్యాప్తు, అరెస్టులు ప్రతిదీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరగటం. సమర్థుడిగా గుర్తింపు ఉండటంతోనే పోస్టింగ్... అత్యంత ప్రముఖులు నివసించే, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పశ్చిమ మండలంలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో ఏప్రిల్ 2న జరిగిన రేవ్ పార్టీ తీవ్ర కలకలం సృష్టించింది. ఆ సందర్భంలో స్థానిక ఇన్స్పెక్టర్పై బదిలీ వేటు వేసిన ఉన్నతాధికారులు ఆ స్థానంలో సమర్థుడిగా గుర్తింపు ఉన్న అధికారిని నియమించారు. ఈ నియామకానికి ముందే ఉన్నతాధికారులు సదరు అధికారి వ్యవహారశైలి, పనితీరు తదితరాలను పరిగణనలోకి తీసుకున్నారు. కబ్జా కేసుతో విభేదాలు.. పశ్చిమ మండలంలో ఉన్న రూ.40 కోట్ల విలువైన స్థలం కబ్జా వ్యవహారం గత నెలలో వెలుగులోకి వచ్చింది. దీనిపై కన్నేసిన కొందరు అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు, బోగస్ వ్యక్తులతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలా ఆ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతి పొందారు. బాధితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఓ ఎమ్మెల్సీ వారికి అండగా నిలిచారు. కబ్జా పర్వాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారి ఆదేశాల మేరకు కేసు నమోదైంది. ఆద్యంతం అన్ని అంశాలను సదరు ఇన్స్పెక్టర్ పరిశీలించి.. కబ్జా నిజమేనని తేల్చారు. అడ్డా కూలీలను స్థల యజమానులుగా మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. ఈ వివరాలు ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి, వారు అనుమతించిన తర్వాతే నిందితులను అరెస్టు చేశారు. మొత్తం 16 మంది నిందితులుగా ఉండగా అయిదుగురిని కటకటాల్లోకి పంపారు. అనుమతి రద్దు చేసిన జీహెచ్ఎంసీ... పశ్చిమ మండల పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, అరెస్టు చేసిన నిందితుల వివరాలు పరిగణనలోకి తీసుకున్న జీహెచ్ఎంసీ అంతర్గత విచారణ జరిపింది. ఇందులో అసలు విషయం తేలడంతో సదరు నిర్మాణానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. ఈ విషయాన్ని కబ్జాకోరుల ద్వారా తెలుసుకున్న నగర ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. తనకు తెలియకుండా కబ్జాపై కేసు ఎలా నమోదు చేస్తారని, అరెస్టుల వరకు ఎలా వెళ్తారంటూ సదరు ఇన్స్పెక్టర్పై రంకెలు వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, తనకు లభించిన ఆధారాలను బట్టే ముందుకు వెళ్లానంటూ సదరు ఇన్స్పెక్టర్ చెప్పడాన్ని ఎమ్మెల్యే జీర్ణించుకోలేక అతడిని బదిలీ చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. చేతులెత్తేసిన ఉన్నతాధికారులు... ఓ దశలో ఈ విషయం రాష్ట్రంలోనే కీలక కార్యాలయం వరకు వెళ్లింది. అక్కడి అత్యున్నత అధికారులు జరిగిన అంశంపై నివేదిక కోరారు. ఆద్యంతం ప్రతి అంశాన్నీ వివరిస్తూ నగర పోలీసులు రిపోర్టు కూడా సమర్పించారు. దీన్ని పరిశీలించిన ఆ కీలక కార్యాలయంలో ఇన్స్పెక్టర్ తప్పులేదని భావించింది. అయినప్పటికీ ఎమ్మెల్యే ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చారు. ఇన్స్పెక్టర్ను బదిలీ చేయించారు. కబ్జాపై కేసు, దర్యాప్తు, అరెస్టుకు ఆదేశించిన ఉన్నతాధికారులు చేతులెత్తేశారు. ఎమ్మెల్యే ఒత్తిడి తట్టుకోలేక సదరు ఇన్స్పెక్టర్ను బదిలీ చేస్తూ మరో పోలీసుస్టేషన్లో ఎస్హెచ్ఓగా నియమించారు. నగరంలో ముగ్గురు ఇన్స్పెక్టర్ల బదిలీ.. నగర కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ముగ్గురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎం.నరేందర్‌ను బంజారాహిల్స్‌కు బదిలీ చేశారు. ఇక్కడ ఉన్న కె.నాగేశ్వర్రావుకు మారేడ్‌పల్లి ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. మారేడ్‌పల్లి ఇన్స్పెక్టర్ ఎం.మట్టయ్యను సీసీఎస్‌కు మార్చారు. (చదవండి: ఫారిన్ ట్రేడింగ్ మాయాజాలం.. రూ.152 కోట్లతో పలాయనం) -
ఔరా.. ముగ్గురేనా?
సాక్షి, హైదరాబాద్: కోటిమంది జనాభా ఉన్న మహా నగరంలో ఆహారకల్తీ నిరోధానికి తగిన యంత్రాంగం లేదు. కేవలం ముగ్గురంటే ముగ్గురే ఫుడ్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో అడ్డూఅదుపూ లేకుండా సాగుతోన్న కల్తీతో ప్రజలు తరచూ అనారోగ్యసమస్యల బారిన పడుతున్నారు. దాదాపుగా పదినెలలుగా కరోనా నేపథ్యంలో బయటి ఫుడ్ తినేవారు తగ్గినప్పటికీ..ఇప్పుడిప్పుడే తిరిగి హోటళ్లు, తదితర ప్రాంతాల్లో ఎగబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీ జరగకుండా.. తగిన పరిశుభ్రతతో, ఇతరత్రా జాగ్రత్తలతో వ్యవహరించాల్సి ఉండగా అలాంటివేమీ కనిపించడం లేదు. తగినంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేక తనిఖీలు జరగకపోవడం ఇందుకు ప్రధాన కారణం. 30 సర్కిళ్లకు 30 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా..పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వం గత సంవత్సరం ఎంపిక చేసిన 20 మందికి శిక్షణ పూర్తికావాల్సి ఉంది. అందుకు మరో 40 రోజులు పట్టనుంది. అది పూర్తయితే కానీ వీరు విధులు నిర్వహించలేరు. జీహెచ్ఎంసీకి సంబంధించి మొత్తం 26 పోస్టులు మంజూరైనప్పటికీ , కోర్టు వివాదాలు ఇతరత్రా కారణాలతో 20 మందినే ఎంపిక చేశారు. ఆరు జోన్లకు ఆరుగురు గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అవసరం కాగా, ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు. వీరిలో ఇద్దరు రిటైరైనా పొడిగింపుతో కొనసాగుతున్నారు, రైగ్యులర్‌గా ఉన్నది ఒక్కరే. జీహెచ్ఎంసీ లెక్కల మేరకు నగరంలో.. చిన్న హోటళ్లు, కర్రీ పాయింట్లు : 10,000 సాధారణ నుంచి స్టార్ హోటళ్లు : 3,000 ఇతరత్రా తినుబండారాల దుకాణాలు: 2,000 ఏటా 230 శాంపిల్సే.. ఇన్ని ఈటరీస్ ఉన్నా ఏటా 230 శాంపిల్స్ మించి తీయలేకపోతున్నారు. పలు పర్యాయాలు కల్తీ గుర్తించినప్పటికీ, జరిమానాలు మించి పెద్దగా శిక్షలు పడటం లేదు. హోటళ్లలో పరిశుభ్రత నుంచి అన్నీ సవ్యంగా ఉండాలని, లేని పక్షంలో ఆటోమేటిక్‌గానే వేటికి ఎంత జరిమానానో పేర్కొంటూ చర్యలు తీసుకునేలా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా, కార్యరూపం దాల్చలేదు. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఆర్డర్లపై జరిగే ఆహారాల్లోనూ కల్తీపై పలు ఫిర్యాదులందుతున్నాయి. పలు సంస్థల విజ్ఞప్తి.. ఆహారకల్తీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఫోరమ్ ఫర్ గుడ్‌గవర్నెన్స్ సెక్రటరీ ఎం.పద్మనాభరెడ్డి మునిసిపల్ మంత్రి కేటీర్‌ను ఇటీవల కోరారు. కల్తీ ఫిర్యాదులకు ప్రత్యేక సెల్ ఏర్పాటుతోపాటు అదనంగా మరో ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని నివేదించారు. ఇతరత్రా సంస్థలు సైతం ఆహారకల్తీ నిరోధంతోపాటు కరోనా నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రత, కనీస దూరం పాటింపు వంటివి అమలు చేయాలని కోరుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ఎక్కడ? ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించిన ఎఫ్ఎస్ఎస్ఏ (‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2002) గ్రేటర్లో అమలుకు నోచుకోలేదు. 2011 ఆగస్టు నుంచే ఇది అమల్లోకి వచ్చినప్పటికీ, నగరంలో అమలు కావడం లేదు. ఈ చట్టం మేరకు, ఆస్తిపన్ను వివరాల మాదిరిగా ప్రతి ఆహార విక్రయ కేంద్రం వివరాలు జీహెచ్ఎంసీ వద్ద ఆన్లైన్లో జాబితా ఉండాలి. నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు జరగాలి. కల్తీని గుర్తించేందుకు తగినన్ని పరీక్షల కేంద్రాలుండాలి. కల్తీ నిర్ధారణ అయినప్పుడు కఠిన శిక్షలుండాలి. ఇవేవీ అమలు కావడం లేదు. అంతటా కల్తీ.. ఆహారపదార్థాలు ఉత్పత్తయ్యే ప్రాంతం నుంచి మొదలుపెడితే ప్యాకింగ్, రవాణా, విక్రయం, వినియోగం దాకా ఎక్కడా కల్తీకి ఆస్కారం ఉండొద్దు. దీన్ని అమలు చేసేందుకు తగిన పరిపాలనాధికారులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ అవసరం ఉండగా, అమలు కావడం లేదు. -
క్రమశిక్షణ తప్పుతున్నారు.. కట్టడి చేయండి!
ఇన్స్పెక్టర్లకు కర్నూలు డీఎస్పీ ఆదేశం కర్నూలు: ‘‘కొంతమంది సిబ్బంది నిర్వాకంతో పోలీసు శాఖకే చెడ్డ పేరు వస్తోంది.. క్రమశిక్షణ తప్పుతున్నవారిని కట్టడి చేయండి’’అని కర్నూలు డీఎస్పీ రమణమూర్తి.. ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. ఆదివారం కర్నూలు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్లతో తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. సర్కిళ్ల వారీగా నేరాలతో పాటు సిబ్బంది వ్యక్తిగత క్రమశిక్షణపై చర్చించారు. పోలీసు సిబ్బంది వాట్సాప్‌ల వినియోగంపై నిఘా ఉంచాలన్నారు. స్టేషన్ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న పోలీసు సిబ్బంది నుంచి బయటి వ్యక్తులకు సమాచారం చేరవేయకుండా కట్టడి చేయాలని సూచించారు. సీఐలు మహేశ్వరరెడ్డి, నాగరాజరావు, నాగరాజు యాదవ్, శ్రీనివాసరావు, కృష్ణయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో దిద్దుబాటు చర్యలు... కర్నూలులో హోంగార్డుపై స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు మనోజ్ కుమార్, మణికుమార్ల దాడి, అనంతరం సస్పెన్షన్, డో¯ŒSలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్, కానిస్టేబుల్ యాగంటయ్య విధుల నుంచి తొలగింపు, శ్రీశైలంలో ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో కానిస్టేబుల్ ఉమ్లానాయక్ వేధింపులు, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు.. కానిస్టేబుల్ సస్పెన్షన్, రాజమండ్రికి చెందిన పెళ్లి బృందంలోని ఓ మహిళ పట్ల ఆకతాయిగా వ్యవహరించిన మిడుతూరు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్‌పై నంద్యాల వన్‌టౌన్‌లో కేసు నమోదు, ఆపై సస్పెన్షన్... ఇలా పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహార తీరుపై వరుస సంఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. సబ్ డివిజన్ స్థాయిలో సిబ్బంది వ్యవహార శైలిపై ఇన్స్పెక్టర్లతో సమీక్షకు ఆదేశించిన నేపథ్యంలో కర్నూలు డీఎస్పీ రమణమూర్తి తన పరిధిలోని ఇన్స్పెక్టర్లతో సమావేశమై చర్చించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సర్కిళ్ల వారీగా నేరాలతో పాటు సిబ్బంది పనితీరు, వ్యక్తిగత క్రమశిక్షణపై చర్చించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. -
పోలీస్ శాఖలో ప్రమోషన్ల వివాదం!
- నూతన జిల్లాల నేపథ్యంలో అడ్హాక్ ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయం - ఇప్పటికే పదోన్నతుల కోసం ఇచ్చిన జీవోలు 54, 108 వివాదాస్పదం - ఐదో జోన్ 1991 బ్యాచ్ ఎస్సైలకు కలవని నోషనల్ ఇంక్రిమెంట్ - నిరసనగా మూకుమ్మడి సెలవులకు సిద్ధమవుతున్న 200 మంది ఇన్స్పెక్టర్లు సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో పదోన్నతులు వివాదాస్పదంగా మారుతున్నాయి. గతంలో జరిగిన పదోన్నతుల విషయంలో ఇప్పటికీ న్యాయస్థానంలో కేసులు కొనసాగుతున్నాయి. తాజాగా కొత్త జిల్లాల నేపథ్యంలో అడ్హాక్ పేరిట ఇవ్వనున్న పదోన్నతులు అగ్నికి ఆజ్యం పోసినట్లవుతున్నాయి. రాష్ట్ర విభజన పూర్తయి దాదాపు రెండున్నరేళ్లు గడిచినా ఇంకా సిబ్బంది నియామకాలు పూర్తి కాలేదు. కమలనాథన్ కమిటీ తుది కేటాయింపులు జరపకపోవడంతో ఇప్పటికీ కొంత మంది ఏపీకి చెందిన అధికారులు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అడహక్ పేరిట ఇవ్వనున్న పదోన్నతులు ఏపీకి చెందిన వారికి కూడా దక్కనుండటంతో తెలంగాణ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పదోన్నతులకు సంబంధించి జీవోలు 54, 108లలో దొర్లిన తప్పుల కారణంగా చాలా మందికి అన్యాయం జరిగిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంలో ఐదో జోన్‌కు చెందిన 1991, 95 బ్యాచ్‌లకు చెందిన సబ్ఇన్స్పెక్టర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని నిపుణుల కమిటీ తేల్చింది. దీనిపై ఐదేళ్లుగా పోరాడుతున్నా ప్రయోజనం లేకపోవడంతో ఐదో జోన్‌కు చెందిన దాదాపు 200 మంది పోలీసు అధికారులు మూకుమ్మడి సెలవులు పెట్టాలని యోచిస్తున్నారు. నాలుగేళ్ల సర్వీసును విస్మరించారు ఐదో జోన్‌కు చెందిన ఎస్సైలకు 1991 బ్యాచ్‌కు చెందిన వేరే జోన్లకు చెందిన వారితో పాటు నాలుగేళ్ల సీనియారిటీ కలవలేదు. దీంతో ఒకే బ్యాచ్‌కు చెందిన వారి బదిలీలో తేడా ఏర్పడింది. 1991 బ్యాచ్‌కు చెందిన సబ్ఇన్స్పెక్టర్లు 15 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఇన్స్పెక్టర్ హోదాలోనే కొనసాగుతున్నారు. ఆరో జోన్‌కు చెందిన ఎస్సైలు మాత్రం ప్రస్తుతం డీఎస్పీ, ఏఎస్పీలుగా కొనసాగుతున్నారు. దీనిపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా వారికి అనుకూలమైన తీర్పు వచ్చింది. దీంతో జరిగిన తప్పును సరిదిద్దేందుకు డీజీపీ అనురాగ్ శర్మ, అప్పటి వరంగల్ డీఐజీ కాంతారావు నేతృత్వంలో కమిటీ వేశారు. నాలుగేళ్ల నోషనల్ ఇంక్రిమెంట్ కలవలేదని డీఐజీ కూడా నివేదిక ఇచ్చారు. అయినా ఇప్పటికీ 1991కి చెందిన ఐదో జోన్ ఎస్సైలకు న్యాయం జరగలేదు. ప్రస్తుతం జోన్ విధానాన్ని ఎత్తేయాలని ప్రభుత్వం యోచిస్తున్నందున ఇప్పుడు న్యాయం జరగకపోతే తీవ్రంగా నష్టపోతామంటూ ఆందోళన చెందుతున్నారు. -
మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఉద్ధృతం
విజయనగరం మున్సిపాలిటీ:సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. ఏడు రోజులుగా సమ్మె చేపడుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో వినూత్న పద్ధతుల్లో వారు నిరసనలు తెలుపుతున్నారు. వీరి ఆం దోళనతో మున్సిపాలిటీలన్నీ మురికిమయంగా మారుతున్నాయి. శుక్రవారం నుంచి మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు సమ్మె బాట పట్టనున్నారు. ఈమేరకు గు రువారం సాయంత్రం విజయనగరం మున్సిపల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. విజయనగరం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల రిలే దీక్షలు మూడో రోజు గురువారం కొనసాగాయి. కార్మికుల దీక్షలకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభూజితో పాటు జిల్లా పింఛన్‌దారుల సంఘం ప్రతినిధి పెద్దింటి అప్పారావు తదితరులు సంఘీభావం తెలిపారు. బొబ్బిలిలో ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. సాలూరులో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. -
ఎన్ఆర్ఐపై దాడి, ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్
-
ఎన్ఆర్ఐపై దాడి: ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్
ముషీరాబాద్: ప్రవాస భారతీయుడిపై ముషీరాబాద్ పోలీసులు దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి ఇద్దరు ఎస్సై లతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల మహేంద్ర హిల్స్ కు చెందిన మల్లాపురం వాసుపై ముషీరాబాద్ పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన డీసీపీ కమాలాసన్ రెడ్డి.. ఆ ఘటనకు కారణమైన ఇద్దరు ఎస్సైలను, ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు. ఈనెల 25న ముషీరాబాద్‌కు చెందిన తన స్నేహితులు ప్రీతమ్, నిఖిల్‌లతో కలిసి కోఠిలో ఓ హోటల్లో మద్యం తాగిన అనంతరం వారిని దింపేందుకు ముషీరాబాద్ అనూషా అపార్ట్ మెంట్ కు వెళ్లిన వాసు అనే ఎన్ఆర్ఐ కారును పక్కగా ఆపి స్నేహితులతో మాట్లాడుతుండగా అక్కడికి చేరుకున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది అర్ధరాత్రి రోడ్డుపై ఏమి చేస్తున్నారంటూ దాడికి దిగినట్లు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాడు. దీనిపై ప్రశ్నించడంతో పోలీసులకే ఎదురు చెప్తారా? తమను స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టినట్లు తెలిపా రు. అనంతరం సీఐ దగ్గరకు తీసుకెళ్లగా అతను తమను దారుణంగా అవమానించడమేగాక, తమ ఫోన్లు లాక్కున్నారని, రూ. రూ.5 లక్షలు ఇస్తే వదిలి వేస్తానని, లేనిచో పాస్‌పోర్టులు సీజ్ చేస్తానని బెదిరించినట్లు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాడు. దీంతో హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు డీసీపీ కమాలాసన్ రెడ్డి దర్యాప్తు చేయించారు. ఆ ఘటనకు కారణమైన ఇద్దరు ఎస్సైలను, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. -
‘మహా’ బెదురు
బాబోయ్... ఈ డ్యూటీలు చేయలేం - ప్రత్యామ్నాయం వైపు 22 మంది సీఐల చూపు - అసెంబ్లీ సమావేశాల తరువాత మరో 20 మంది సిక్ లీవ్? - వసూళ్లను కమిషనర్ నియంత్రించడమే కారణం సాక్షి, సిటీబ్యూరో: మహా నగరంలో పోలీస్ ఉద్యోగమంటే ఆ మజానే వేరు. జీతంతో పాటు గీతమూ బాగానే ఉండేది. ఇక్కడ పని చేయడమంటే అదృష్టం ఉండాలనేది పోలీసు వర్గాల మాట. లా అండ్ ఆర్డర్ స్టేషన్ హౌస్ఆఫీసర్ (ఎస్‌హెచ్ ఓ)గా పోస్టింగ్ తెచ్చుకునేందుకు కొందరు ఇన్స్పెక్టర్లు తీవ్ర కసరత్తే చేసేవారు. భారీ స్థాయిలో పోటీ ఉండేది. దీనికి ఖద్దర్ సిఫారసుతో పాటు రూ.లక్షలు వెచ్చించేందుకు ముందుకొచ్చేవారు. కొన్ని సందర్భాలలో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చు చేసిన వారూ ఉన్నారు. నగరంలో ఎస్హెచ్ఓగా పని చేసేందుకు ఏళ్ల తరబడి ‘క్యూ’లో ఉన్న ఇన్స్పెక్టర్ల సంఖ్యా తక్కువేం కాదు. రాజకీయ పలుకుబడి, డబ్బు, ఇతరత్రా అండదండలు ఉన్న వారికే పోస్టింగ్‌లు వచ్చేవి. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎస్హెచ్ఓ పోస్టు అంటేనే కొందరు ఇన్స్పెక్టర్లు భయపడుతున్నారు. పలుకుబడి, డబ్బు, రాజకీయ అండదండల వంటివి లేని వారికి సైతం నగరంలో ఎస్హెచ్ఓ పోస్టింగ్ ఇస్తామన్నా ‘మేం రాలేం మహాప్రభో’ అంటున్నారు. ఒకప్పుడు నగరంలో ఎలాగైనా స్థానం సంపాదించాలని ఆశించిన వారు ప్రస్తుతం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి బయట పడాలని చూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ‘మామూలు’గా వచ్చే ఆదాయం కోల్పోవడమేనన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గత మూడు నెలలుగా ఠాణాల పరిధిలో నెలవారీ మామూళ్లు, కలె క్షన్లు బంద్ చేయించారు. ఇప్పటికే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్లకు చెందిన సుమారు 80 మంది కలెక్షన్ కింగ్‌లపై కమిషనర్ బదిలీ వేటు వేశారు. ఇప్పటికీ వారికి పోస్టులు ఇవ్వలేదు. మరోపక్క ఠాణాలో ఎవరైనా ఒక్క పైసా వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. మామూళ్ల తంతుపై ఠాణాలపై స్పెషల్ బ్రాంచ్‌తో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు డేగ కన్నేశారు. ఫిర్యాదుదారుల నుంచి నయాపైసా ఆశించకుండా సిబ్బంది పనితీరుపై బాధితుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునే విధానం అమలు చేశారు. ఎప్పుడూ మామూళ్ల కనకవర్షంతో తడి సిముద్దయ్యే లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగంలోని ఇన్స్పెక్టర్లు ఒక్కసారిగా వచ్చిన ‘మార్పు’తో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నేర రహిత నగరంగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్, సేఫ్ కాలనీ ప్రాజెక్ట్, ఠాణాలో రిసెప్షనిన్ వ్యవస్థ, పనితీరుపై రోజువారీ అప్రయిజల్ రిపోర్టు రాయడం, స్నాచింగ్‌లు, దొంగతనాలు జరగకుండా గస్తీని పెంచడం, కంప్యూటర్ పరిజ్ఞానం కోసం సిబ్బందికి తరగతులు నిర్వహించడం...ఇలా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు పనిభారం పెరిగింది. బయటి ఆదాయం తగ్గడంతో పాటు పనిభారం పెరగడాన్ని కొంతమంది ఇన్స్పెక్టర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 22 మంది ఇన్స్పెక్టర్లు లూప్‌లైన్ (ఇంటెలిజెన్స్, ఎస్బీ, జీహెచ్ఎంసీ, ట్రాన్స్‌కో, విజిలెన్స్ విభాగాలు)కు వెళ్లిపోతామని భీష్మించుకు కూర్చుకున్నారు. దీనికోసం ఇప్పటికే దరఖాస్తు చేశారు. మరికొందరు ఇన్స్పెక్టర్లు అసెంబ్లీ బందోబస్తు పూర్తయిన తరువాత ఏకంగా సిక్ లీవ్ పేరిట దీర్ఘకాలిక సెలవులో వెళ్లడానికి సిద్దపడుతున్నారు. గత మూడు నెలలుగా పోలీసు కమిషనర్ తీసుకున్న చర్యలతో చాలా స్టేషన్లకు ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. దీనిపై సామాన్యులు హర్షిస్తుండగా... ఇన్నాళ్లూ మామూళ్ల మత్తులో గడిపిన ఇన్స్పెక్టర్లు తట్టుకలేకపోతున్నారు. ఇదీ లెక్క.. నగరంలో 60 శాంతిభద్రతల ఠాణాలు, 3 మహిళా పోలీసు స్టేషన్లు, 25 ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. వీటిలో మామూళ్లలో మొదటి స్థానంలో ఉన్న ఠాణాల వివరాలు ఇవీ.. వెస్ట్‌జోన్: ఎస్ఆర్నగర్, పంజగుట్ట, బంజారాహిల్స్, నార్త్‌జోన్: బోయిన్పల్లి, బేగంపేట, ఈస్ట్‌జోన్: కాచిగూడ, చాదర్‌ఘాట్, సుల్తాన్‌బజార్, సెంట్రల్‌జోన్: నారాయణగూడ, సైఫాబాద్, చిక్కడపల్లి, సౌత్‌జోన్: చాంద్రాయణగుట్ట, బహ దూర్‌పురా, ఛత్రినాక -
42 సీఐల బదిలీ
పోలీసు శాఖ ఉత్తర్వులు వెల్లడించిన డీఐజీ మల్లారెడ్డి వెయిటింగ్లో తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లు వరంగల్ క్రైం :వరంగల్ రేంజ్ పరిధిలో మంగళవారం భారీగా ఇన్స్పెక్టర్ల(సీఐ) బదిలీలు జరిగారుు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఒకేసారి 101 మందిని బదిలీ చేస్తూ వరంగల్ రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారని డీఐజీ మల్లారెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లాలో 42 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యా రు. సీఐల బదిలీలకు సంబంధించి గత నెల 23న ‘సాక్షి’ కథనంలో ఇచ్చినట్లుగానే ఎక్కువ పోస్టింగ్‌లు ఖరారయ్యాయి. సాధారణ ఎన్నికల తర్వాత ఇన్స్పెక్టర్ల బదిలీలు జరగడం ఇదే మొదటిసారి. పోస్టింగ్‌ల విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలను ప్రాధాన్యం ఇచ్చినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 29 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీసు శాఖ అక్టోబర్ 17న ఉత్తర్వులు ఇచ్చింది. 24 గంటల్లోనే నిలిపివేసింది. మళ్లీ ఇప్పుడు బదిలీలు జరిగాయి. -
ప్ర‘దక్షిణలు’!
* అధికార పార్టీ నేతలను చుట్టేస్తున్న త్రిబుల్స్టార్లు * పోట్లదుర్తికి క్యూ * ఎంపీకి పత్రికా ప్రకటన ఇచ్చిన సీఐకి చిన్నచౌక్ ఖరారు * కొన్ని సర్కిళ్లకు రూ.10 లక్షలు పలుకుతున్న వైనం సాక్షి ప్రతినిధి, కడప: వారంతా ఉన్నతోద్యోగులు. సమాజంలో బాధ్యతాయుతంగా మెలగాల్సిన అధికారులు. అయితే కాసులు కురిపించే సర్కిళ్లలో పోస్టింగ్ కోసం అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కోరుకున్న పోస్టింగ్ కోసం లక్షలను వెచ్చించేందుకు సైతం ఏమాత్రం వెనుకాడటం లేదు. త్వరలో పోలీసు ఇన్స్పెక్టర్ల బదిలీలు ఉంటాయనే సమాచారం రావడంతో పైరవీలను ముమ్మరం చేశారు. గతంలో జిల్లాలో పనిచేసి బదిలీపై వెళ్లిన అధికారి ఒకరు ఏకంగా ఓ సర్కిల్ కోసం రూ.10 లక్షలు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలకు జీఓ నెంబర్ 175 కలిసి వస్తోంది. ఆ ఉత్తర్వుల కారణంగా కాసుల వర్షం కురుస్తోంది. అవసరాన్ని బట్టి ఎగ్జిక్యూటివ్ అధికారుల నియామకాలు చేపట్టవచ్చని ఉత్తర్వులు వివరిస్తున్నాయి. దీంతో అధికారపార్టీ నేతలకు డిమాండ్ పెరిగింది. కోరుకున్న పోస్టింగ్ కోసం పోలీసు ఇన్స్పెక్టర్లు అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఆ క్రమంలో త్రిబుల్‌స్టార్ అధికారులు పోట్లదుర్తికి అధికంగా వెళ్తున్నట్లు సమాచారం. జిల్లాలో పనిచేసి వెళ్లిన కొంతమంది పోలీసు అధికారులు పాత పరిచయాలతో నేతలను మచ్చిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నంలో అధికార పార్టీ నేతలు ఉన్నారు. ఎంపీకి శుభాకాంక్షలు చెప్పినందుకు..... రాజ్యసభ సభ్యుడిగా సీఎం రమేష్‌కు అవకాశం దక్కడంతో ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పట్లో పోలీసు యూనిఫాంతో శుభాకాంక్షలు చెబుతూ పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆయన కోరుకున్న చిన్నచౌక్ సర్కిల్లో పోస్టింగ్ ఖరారైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇటీవల హోమంత్రి పర్యటనలో కాపులు నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో ఖర్చులు భరించిన ఓ సీఐకి కడప అర్బన్ సర్కిల్ ఖరారైనట్లు సమాచారం. అదే సర్కిల్లో తనకు అవకాశం ఇవ్వాలని అందుకోసం రూ.10లక్షల వరకూ ఇవ్వగలనని జిల్లా కేంద్రంలో పనిచేసి వెళ్లిన ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సర్కిల్ కుదరకపోతే యర్రగుంట్ల సర్కిల్లో అవకాశం ఇచ్చినా సమ్మతమే అన్నట్లుగా సమాచారం. డీఎస్పీలుగా పదోన్నతి పొందడంతో ఖాళీలు పడ్డ కడప రూరల్, వన్‌టౌన్ సర్కిళ్లకు పోటీ తీవ్రతరంగా ఉన్నట్లు సమాచారం. కాగా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల పరిధిలోని పోస్టింగ్‌లకు ఏకపక్షంగా పనిచేసే అధికారుల కోసం ఆన్వేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది. చెరొక సర్కిల్‌ను పంచుకున్న మహిళా నేతలు... జిల్లాలోని మాజీ మహిళా ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకురాలు ఇరువురు సర్కిల్ ఇన్స్పెక్టర్ల నియామకాలలో పోటీ పడుతున్నారు. ఇటీవల ఇరువురు ఓ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. వారి వారి నివాసాల పరిధిలోని సర్కిళ్లకు వారు సూచించిన అధికారిని నియమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు మాజీ ఎమ్మెల్యే తన హయాంలో హెడ్‌క్వార్టర్‌లో ఎస్‌ఐగాను, కొండాపురం సర్కిల్ సీఐగా పనిచేసి వెళ్లిన అధికారి పేరును సిఫార్సు చేసినట్లు సమాచారం. మరోనేత ఎన్నికల్లో పనిచేసి వెళ్లిన అధికారితోపాటు, తన సామాజిక వర్గానికి చెందిన ఓ సీఐ పేరు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన అధికారులకు అవకాశం ఇవ్వాలని మైదుకూరు, రిమ్స్ సర్కిళ్ల కోసం ఆయా ప్రాంతాలకు చెందిన ఇరువురు నేతలు పట్టుబడుతున్నారు. ఇలా ఎవరి పరిధిలో అధికారులు, నాయకులు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. -
నేడు తుది పోరు
ప్రాదేశిక పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి నల్లగొండ, న్యూస్‌లైన్ ప్రాదేశిక ఎన్నికల తుదివిడత పోరు శుక్రవారం జరగనుంది. నల్లగొండ, భువనగిరి డివిజన్ల పరిధిలోని 26మండలాల్లో గల 358 ఎంపీటీసీ, 26 జెడ్పీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 8,85,559 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రెండు డివిజన్ల పరిధిలో మొత్తం 362 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటిలో 4 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 358 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహిస్తారు. పోలింగ్ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జెడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు, ఎంపీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగు ఉన్న బ్యాలెట్ పత్రాలను వినియోగిస్తారు. ఈ ఎన్నికలకు 2,454 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. 696 ప్రాంతాల్లో 1,185 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను భువనగిరి సమీపంలోని అనాజిపురం వద్ద ఉన్న దివ్యబాల విద్యాలయానికి నల్లగొండ డివిజన్‌కు చెందిన బ్యాలెట్ బాక్సులను శ్రీరామానందతీర్థ ఇంజినీరింగ్ కాలేజీకి తరలిస్తారు. స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులను కంటికి రెప్పలా కాపాడేందుకు పోలీస్ శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎన్నికలకు భారీ బందోబస్తు ఎన్నికలు పూర్తయిన సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్ల పోలీస్ సిబ్బందిని మలి విడత ఎన్నికలకు బందోబస్తుకు మళ్లించారు. డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో కలుపుకుని సుమారు 3వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. వీరితో పాటు బయటి జిల్లాల నుంచి కూడా శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లను రప్పించారు. జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక స్ట్రెకింగ్ ఫోర్స్, మొబైల్ టీములను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో పోలింగ్ సర ళిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 105 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. ఈ గ్రామాల్లో వెబ్ కాస్టింగ్, వీడియో చిత్రీకరణ ద్వారా పోలింగ్ సరళిని రికార్డు చేస్తారు. -
టార్గెట్ ‘ఇందిరమ్మ’
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినీతి రాజ్యమేలుతోంది. లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో అందాల్సిన ఫలాలు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటి అమలులో ఉన్నతస్థాయి అధికారులు మొదలుకొని కిందిస్థాయి సిబ్బంది వరకు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇలా చేసి దొరికినవారు కొందరుంటే.. చేతికి మట్టి అంటకుండా ఇంకా దండుకుంటున్న వారు మరికొందరున్నారు. దీంతో లబ్ధిదారులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ఏసీబీకివస్తున్న ఫిర్యాదుల్లో అధిక శాతం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు సంబంధించివే ఉండడంతో ఏసీబీ అధికారులు సైతం కంగుతింటున్నారు. ఇందిరమ్మలో జరుగుతున్న అవినీతిని ఆటకట్టించేందుకు అధికారులు నిఘా ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. గూడులేని నిరుపేదలకు నీడ కల్పించాలన్న లక్ష్యంతో జిల్లాలో 2005 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం వివిధ దశల్లో 2.61 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి పూర్తయ్యే వరకు దశల వారీగా బిల్లులు మంజూరు చేస్తోంది. ఈ క్రమంలో లబ్ధిదారులకు బిల్లులు రాకపోవడం.. మంజూరు చేయడంలో అధికారులు చేతివాటం ప్రదర్శించడంతో బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కోసారి అడిగింది ఇచ్చినా హౌసింగ్ అధికారులు మాత్రం ఆలస్యంగానే బిల్లులు జారీ చేస్తున్నారు. చాలావరకు ఇంటి నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు లబ్ధిదారులకు తెలియకుండానే ఆ శాఖ అధికారులు కాజేసిన సంఘటనలున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అప్పుడప్పుడు కిందిస్థాయి అధికారులు సస్పెన్షన్‌కు గురవుతున్నా అవినీతి మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలపైనే ప్రధానంగా ఆరోపణలు వస్తున్నప్పటికీ.. పైస్థాయి అధికారులకు సైతం భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 1.55 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా.. చాలామంది లబ్ధిదారులకు బిల్లులు అందక కార్యాలయాల చుట్టు తిరుగుతూనే ఉన్నారు. పునాది దశలో రావాల్సిన బిల్లు ఇంటి నిర్మాణం పూర్తయితే గానీ రాని పరిస్థితి నెలకొంది. పూర్తయిన నిర్మాణాలకు బిల్లులు ఇచ్చేది ఎప్పటికీ అనేది తెలియకుండా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల్లో బిల్లులు చెల్లించినట్లు కనిపించినా అధిక శాతం లబ్ధిదారులకు చేరడం లేదని ఆ శాఖకు చెందిన అధికారులే ఆరోపిస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందిరమ్మ పథకం ప్రారంభంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఒక్కో ఇంటికి రూ.50 వేల నుంచి రూ.80వేల వరకు వచ్చేవి. ఇప్పుడు ఇంటి నిర్మాణం వ్యయం పెరగడంతో ఎస్టీలకు రూ.1.05 లక్షలు ఎస్సీలకు రూ.లక్ష, గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు రూ.70 వేలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.80వేలు చెల్లిస్తున్నారు. దీంతో అధికారులు మరింత ఉత్సాహంతో అవినీతికి తెగబడుతున్నారు. ఈ క్రమంలో విసిగెత్తిన లబ్ధిదారులు కొందరు అవినీతి అధికారులపై ఫిర్యాదు చేస్తున్నారు. ఎస్ఎంఎస్కు స్పందిస్తాం.. : ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడిన అధికారులపై బాధితులు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారమందించినా తాము స్పందిస్తామని ఏసీబీ డీఎస్పీ తాళ్లపల్లి సుదర్శన్‌గౌడ్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో బాధితులు ఫోన్లు చేస్తున్నారని, వారికి న్యాయం చేసే విధంగా ఎస్ఎంఎస్ పద్ధతిని పరిశీలిస్తున్నామన్నారు. ఇలా వచ్చిన ఎస్ఎంఎస్ ఆధారంగా ఏవిధంగా ఫిర్యాదు చేయాలన్న విషయాన్ని బాధితునికి వివరించి వారికి న్యాయం చేస్తామన్నారు.