క్రమశిక్షణ తప్పుతున్నారు.. కట్టడి చేయండి!
ఇన్‌స్పెక్టర్లకు కర్నూలు డీఎస్పీ ఆదేశం
కర్నూలు: ‘‘కొంతమంది సిబ్బంది నిర్వాకంతో పోలీసు శాఖకే చెడ్డ పేరు వస్తోంది.. క్రమశిక్షణ తప్పుతున్నవారిని కట్టడి చేయండి’’అని కర్నూలు డీఎస్పీ రమణమూర్తి.. ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. ఆదివారం కర్నూలు సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్లతో తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. సర్కిళ్ల వారీగా నేరాలతో పాటు సిబ్బంది వ్యక్తిగత క్రమశిక్షణపై చర్చించారు. పోలీసు సిబ్బంది వాట్సాప్‌ల వినియోగంపై నిఘా ఉంచాలన్నారు. స్టేషన్ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న పోలీసు సిబ్బంది నుంచి బయటి వ్యక్తులకు సమాచారం చేరవేయకుండా కట్టడి చేయాలని సూచించారు. సీఐలు మహేశ్వరరెడ్డి, నాగరాజరావు, నాగరాజు యాదవ్, శ్రీనివాసరావు, కృష్ణయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాలతో దిద్దుబాటు చర్యలు...
కర్నూలులో హోంగార్డుపై స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు మనోజ్ కుమార్, మణికుమార్‌ల దాడి, అనంతరం సస్పెన్షన్, డో¯ŒSలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్, కానిస్టేబుల్ యాగంటయ్య విధుల నుంచి తొలగింపు, శ్రీశైలంలో ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో కానిస్టేబుల్ ఉమ్లానాయక్ వేధింపులు, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు.. కానిస్టేబుల్ సస్పెన్షన్, రాజమండ్రికి చెందిన పెళ్లి బృందంలోని ఓ మహిళ పట్ల ఆకతాయిగా వ్యవహరించిన మిడుతూరు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్‌పై నంద్యాల వన్‌టౌన్‌లో కేసు నమోదు, ఆపై సస్పెన్షన్... ఇలా పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహార తీరుపై వరుస సంఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. సబ్ డివిజన్ స్థాయిలో సిబ్బంది వ్యవహార శైలిపై ఇన్‌స్పెక్టర్లతో సమీక్షకు ఆదేశించిన నేపథ్యంలో కర్నూలు డీఎస్పీ రమణమూర్తి తన పరిధిలోని ఇన్‌స్పెక్టర్లతో సమావేశమై చర్చించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సర్కిళ్ల వారీగా నేరాలతో పాటు సిబ్బంది పనితీరు, వ్యక్తిగత క్రమశిక్షణపై చర్చించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.