దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకో ?
► దేశంలో పరిస్థితిపై ఆందోళన
►మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకటాద్రి
కల్లూరు (రూరల్): దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఓ అమ్మాయి మిస్సింగ్ జాబితాలో నమోదవుతోందని, ఇది చాలా ఆందోళనకరమైన విషయమని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకటాద్రి అన్నారు. సూరజ్ గ్రాండ్ హోటల్‌లో గురువారం గల్స్ అడ్వకెసి ప్రోగ్రామ్ (అమ్మాయిల అక్రమ రవాణా)పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాల్య వివాహాలు, అమ్మాయిల అక్రమ రవాణా, చిన్నవయసులో గర్భం దాల్చడం తదితర పరిస్థితులపై హైదరాబాద్ మహిత ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ ఆఫీసర్ అమోఘ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో పేద అమ్మాయిలను నమ్మించి మధ్యవర్తులు అమ్మేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఊహ తెలియని చిన్నపిల్లలు సైతం అపహరణకు గురవుతున్నారన్నారు. పేదరికంలో నలుగుతున్న చెంచులు ఎక్కువగా మోసపోతున్నారని, వీరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో గల్స్ అడ్వకెసి ప్రోగ్రాం స్టేట్ కో ఆర్డినేటర్ గోడె ప్రసాద్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ మద్దిలేటి, పరమేశ్వరి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధి మోహన్‌రాజు పాల్గొన్నారు.