ప్రత్యర్థులంతా ఏకమై మట్టుబెట్టారు..
► ఏడుగురు నిందితుల అరెస్టు
కర్నూలు: బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన పేరపోగు రాజు (42) హత్య కేసు మిస్టరీ వీడింది. రాజు ప్రత్యుర్థులంతా ఏకమై అతడిని మట్టుబెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందులో ఇద్దరు హతుడికి స్వయానా సోదరులుండడం గమనార్హం. నిందితులు పేరపోగు బుజ్జన్న, పేరపోగు బాబురావు, అదే గ్రామానికి చెందిన ఆకెపోగు ఇసాక్, సందెపోగు కృష్ణ, ఆకెపోగు రవి, పేరపోగు ప్రేమ్‌కుమార్, తేనెల రాజు అలియాస్ మున్నా రాజు (నందనపల్లె)పడిదెంపాడు సమీపంలోని కేసీ కెనాల్ కట్ట వద్ద ఉండగా పోలీసులు వారిని అరెస్టు చేసి నేరానికి ఉపయోగించిన పట్టుడు కట్టెలు, పిడిబాకులను స్వాధీనం చేసుకున్నారు.
తాలూకా పోలీస్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం కర్నూలు డీఎస్పీ రమణమూర్తి వివరాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. గ్రామానికి చెందిన మారెన్న, వెంకటరమణ దంపతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం కాగా హతుడు రాజు రెండవ కుమారుడు. తల్లి వెంకటమ్మ పేరుతో ఉన్న రెండు ఎకరాల పొలం విషయంలో తమ్ముళ్లు బాబురావు, బుజ్జన్నలతో విభేదాలు ఉన్నాయి. ఆస్తి కోసం హతుడితో గొడవ పడి సోదరులిద్దరూ ఊరు వదిలారు.
ఎమ్మార్పీఎస్ మాజీ నేత పెద్ద లక్ష్మన్నకు వ్యతిరేకంగా ఉన్న వర్గంతో పేరపోగు రాజు సన్నిహితంగా ఉంటూ పెత్తనం చలాయించేవాడు. ఈ క్రమంలో ప్రత్యర్థులంతా ఏకమై గత నెల 29 రాత్రి గ్రామ శివారులోని బ్యాంక్ ఆఫీసర్స్ కాలనీకి వెళ్లే దారిలో పొలంలో మద్యం తాపించి హత్య చేశారు. ఎమ్మార్పీఎస్ మాజీ నేత పెద్ద లక్ష్మన్న ఇందులో ప్రధాన సూత్రధారి, అతడితో పాటు బాబు, మహేష్ పరారీలో ఉన్నారు. ప్రత్యేక పోలీసు బృందాలను నియమించి వారి కోసం గాలిస్తున్నారు. మద్యంలో విష ప్రయోగం చేసినట్లుగా అనుమానం ఉండడంతో నిర్ధారణ కోసం వైద్య పరీక్షలకు పంపారు. స్వల్ప వ్యవధిలోనే కేసు మిస్టరీని ఛేదించిన తాలూకా పోలీసులను డీఎస్పీ అభినందించారు. సీఐ మహేశ్వరరెడ్డి ఎస్‌ఐ గిరిబాబు పాల్గొన్నారు.