సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీసు విభాగానికి గుండెకాయ వంటి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అవినీతికి అడ్డాగా మారిపోవడంతో సీసీఎస్ ప్రక్షాళనకు హైదరాబాద్ సీపీ చర్యలు చేపట్టారు. 12 మంది సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లను మల్టీజోన్-2కు బదిలీ చేశారు. వెంటనే రిపోర్ట్ చేయాలని హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 21న ఏసీపీ టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా గురువారం ఈఓడబ్ల్యూ టీమ్–7 ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రూ.3 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రతిష్టాత్మకమైన ఈ విభాగం ప్రతిష్ట దిగజారుతోందనే ఆరోపణ వినిపిస్తోంది.
సంచలనాత్మక నేరాలతో పాటు భారీ స్కాములను సీసీఎస్ అధికారులు దర్యాప్తు చేస్తారు. రూ.25 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడి ఉన్న సొత్తు సంబంధిత నేరాలు, రూ.75 లక్షలకు మించిన మొత్తంతో కూడిన మోసాల కేసులు సీసీఎస్ పరిధిలోని వస్తాయి. ఈ విభాగమే నేరుగా కొన్ని కేసులు నమోదు చేస్తుంది. నగరంలోని ఇతర పోలీసుస్టేషన్లలో నమోదైన వాటిని సిటీ పోలీసు కమిషనర్ దర్యాప్తు నిమిత్తం ఈ విభాగానికి బదిలీ చేస్తుంటారు. సీసీఎస్ దర్యాప్తు చేసే కేసుల్లో అత్యధికం రూ.కోట్లతో ముడిపడి ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment