ccs police
-
అసభ్య పోస్టులపై జీహెచ్ఎంసీ మేయర్ ఫిర్యాదు
హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వీడియోలు పోస్ట్ చేశారని హైదారబాద్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా వీడియోలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు, తనను ట్రోల్స్ చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు ఎక్కడెక్కడ వీడియోలు పోస్ట్ చేశారో అన్న వివరాలతో ఆమె పోలీసులకు దృష్టికి తీసుకువెళ్లారు. అసభ్యకర వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. మేయర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
హైదరాబాద్ సీసీఎస్ ప్రక్షాళన.. 12 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీసు విభాగానికి గుండెకాయ వంటి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అవినీతికి అడ్డాగా మారిపోవడంతో సీసీఎస్ ప్రక్షాళనకు హైదరాబాద్ సీపీ చర్యలు చేపట్టారు. 12 మంది సీసీఎస్ ఇన్స్పెక్టర్లను మల్టీజోన్-2కు బదిలీ చేశారు. వెంటనే రిపోర్ట్ చేయాలని హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 21న ఏసీపీ టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా గురువారం ఈఓడబ్ల్యూ టీమ్–7 ఇన్స్పెక్టర్ సుధాకర్ రూ.3 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రతిష్టాత్మకమైన ఈ విభాగం ప్రతిష్ట దిగజారుతోందనే ఆరోపణ వినిపిస్తోంది.సంచలనాత్మక నేరాలతో పాటు భారీ స్కాములను సీసీఎస్ అధికారులు దర్యాప్తు చేస్తారు. రూ.25 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడి ఉన్న సొత్తు సంబంధిత నేరాలు, రూ.75 లక్షలకు మించిన మొత్తంతో కూడిన మోసాల కేసులు సీసీఎస్ పరిధిలోని వస్తాయి. ఈ విభాగమే నేరుగా కొన్ని కేసులు నమోదు చేస్తుంది. నగరంలోని ఇతర పోలీసుస్టేషన్లలో నమోదైన వాటిని సిటీ పోలీసు కమిషనర్ దర్యాప్తు నిమిత్తం ఈ విభాగానికి బదిలీ చేస్తుంటారు. సీసీఎస్ దర్యాప్తు చేసే కేసుల్లో అత్యధికం రూ.కోట్లతో ముడిపడి ఉంటాయి. -
Rachakonda: ఉత్సవ విగ్రహంలా మారిన సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్
సాక్షి, హైదరాబాద్: రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ ఉత్సవ విగ్రహంలా మారింది. రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. రాచకొండ సైబర్ ఠాణాలో పనిచేసేందుకు అధికారులు ఆసక్తి చూపించడం లేదు. ఇక్కడికి పోస్టింగ్ ఇచ్చినా పైరవీలతో ఒక ట్రెండు రోజుల్లోనే వేరే చోటుకు బదిలీ చేయించుకుంటున్నారు. పర్యవేక్షణ అధికారులు లేక కేసుల దర్యాప్తు అటకెక్కింది. దీంతో బాధితులు రోజు స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మిగిలింది ఒక్క ఇన్స్పెక్టరే.. రాచకొండ సైబర్ క్రైమ్ పీఎస్‌లో డీసీపీ నుంచి కానిస్టేబుల్ వరకు సుమారు 70 మంది సిబ్బంది ఉంటారు. కొత్త ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత పోలీసు శాఖలో బదిలీల క్రమంలో అప్పటి మహిళా డీసీపీ వేరే చోటుకు బదిలీ అయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఖాళీగా ఉన్న ఈ పోస్టు ఇటీవలే భర్తీ అయింది. ఇదే సమయంలో ఏసీపీని సైతం భర్తీ చేశారు. కానీ, రెండు రోజులకే మల్టీజోన్–2కు తిరిగి బదిలీపై వెళ్లారు. దీంతో ఈ పోస్టు మళ్లీ ఖాళీ అయింది. ఇక ఇన్స్పెక్టర్లు మాకొద్దీ పోస్టింగ్ అంటూ పారిపోతున్నారు. ఒకప్పుడు రాచకొండ సైబర్ క్రైమ్ పీఎస్‌లో ఏడుగురు ఇన్స్పెక్టర్లు ఉండగా.. ప్రస్తుతం ఒక్కరే మిగిలారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లోకసభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో బదిలీ అయిన ఇన్స్పెక్టర్ల స్థానంలో కొత్త వారిని నియమించారు. కానీ, రిపోర్ట్ కూడా చేయకుండానే పైరవీలతో ఒక ట్రెండు రోజుల్లోనే వేరే చోటుకు బదిలీ కావడం కొసమెరుపు. ఇక్కడ జేబుకు చిల్లే.. ఇతర రాష్ట్రాల్లో దాక్కున నిందితులను పట్టుకునేందుకు విచారణాధికారులు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే రాచకొండలో ఈ ప్రక్రియ మూలనపడింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లి నాలుగైదు రోజులు అక్కడ ఉండాలంటే జేబు గుళ్ల తప్ప ప్రయోజనం ఉండటం లేదని పలువురు పోలీసుల అధికారులు వాపోయారు. కష్టపడి నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తే ఉన్నతాధికారుల దృష్టిలో గుర్తింపు ఉంటుందా అంటే అదీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బదులుగా ఇతర విభాగంలో డ్యూటీ చేయడమే ఉత్తమమని భావిస్తున్నారు. మరోవైపు రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం పెరిగింది. కేసుల దర్యాప్తు వేగంగా, పారదర్శకంగా చేసే క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా తమ కెరీర్‌కు ఇబ్బంది అవుతుందని ఇన్స్పెక్టర్లు భావిస్తున్నారు. కానిస్టేబుళ్ల తీరు వేరు.. రాచకొండ సైబర్ ఠాణాలోని కానిస్టేబుళ్ల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఐదారేళ్ల నుంచి ఇదే ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు పది మంది ఉన్నారు. కానిస్టేబుళ్ల నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించినా ఇక్కడే తిష్ట వేసుకు కూర్చున్నారు. వేరే చోటుకు వెళితే పని భారం పెరుగుతుందనో, లేక ఇక్కడి లొసుగులతో అమ్యామ్యాలు రావనే భావనలో ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ వీరికి వర్తించదా అని పలువురు వాపోతున్నారు. -
వివాహేతర సంబంధం.. సీఐపై కానిస్టేబుల్ దాడి!
సాక్షి, మహబూబ్ నగర్: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్, సీఐపై దాడికి పాల్పడ్డాడు. మర్మాంగాలు కొసేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడికి అతని భార్య, తోటి కానిస్టేబుళ్లు సైతం సాయం చేయడం గమనార్హం. మహబూబ్ నగర్ జిల్లా సీసీఎస్(సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్) సీఐ ఇఫ్తేకార్ హమ్మద్‌పై గురువారం ఉదయం హత్యాయత్నం జరిగింది. జిల్లా కేంద్రంలో పని చేసే కానిస్టేబుల్ జగదీష్, సీఐకి దాడికి పాల్పడ్డాడు. కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడిన సీఐని స్థానికులు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. సీఐ పరిస్ధితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. తన భార్యతో సీఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణతోనే జగదీష్ ఈ దాడికి తెగబడినట్లు సమాచారం. ఘటనాస్థలానికి డీఐజీ చౌహన్, ఎస్పీ హర్షవర్ధన్ చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. సాయంత్రంకల్లా పూర్తి వివరాలు తెలియజేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
సెలబ్రిటీలపై అసత్య ప్రచారం.. పోలీసులను ఆశ్రయించిన నటి
సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్ అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని సినీ నటి హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం తన భర్తతో ఉన్న ఫొటోలు, వీడియోలను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాత ఫోటోలు, వీడియోలకు ఫేక్ థంబ్‌నైల్స్ పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని హేమ ఆరోపించారు. దీంతో పాటు ఇటీవల కొంత మంది సెలబ్రిటీలు చనిపోయారని దుష్ప్రచారం చేయడంపై కూడా ఆమె ప్రస్తావించారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిపై తప్పుడు వార్తలు రాసి సొమ్ము చేసుకుంటున్నాయని హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: డబ్బుల కోసం అలాంటి వార్తలు రాయడం దుర్మార్గం: కోటా శ్రీనివాసరావు) సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు బతికే ఉన్నా.. ఆయనపై తప్పుడు వార్తలు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వేధింపులు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
సోషల్ మీడియాలో ‘చీకోటి’ ట్వీట్స్ హల్చల్!
హైదరాబాద్: క్యాసినో, హవాలా వ్యవహారాలకు సంబంధించి చీకోటి ప్రవీణ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే చికోటి ప్రవీణ్ ట్వీట్స్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చీకోటి ప్రవీణ్ పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినట్లు తెలిసింది. @praveenchikotii పేరుతో ట్విట్టర్లో నకిలీ ఖాతాను గుర్తించాడు చీకోటి ప్రవీణ్. వాటి ద్వారా ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతలను ప్రవీణ్ బెదిరిస్తున్నట్టు.. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను సైతం ఆయా ట్వీట్లలో ప్రస్తావిస్తు ఫేక్ పోస్ట్‌లు పెట్టినట్లు సమాచారం. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు.. సోషల్ మీడియాల్లో ఫేక్ అకౌంట్లపై ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు చీకోటి ప్రవీణ్. తప్పుడు ఫేక్ అకౌంట్లపై చర్యలు తీసుకుంటానని పేర్కొన్నాడు. ఆయా నకిలీ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని.. సీసీఎస్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు ప్రవీణ్. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదీ చదవండి: ‘చీకోటి’ ల్యాప్‌టాప్‌లో ఏముంది?.. ఈడీ ముందుకు ప్రవీణ్ -
లోన్‌యాప్స్ కేసులో ఛార్జీ షీట్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇన్స్టంట్ లోన్ యాప్స్ కేసులో సైబర్ క్రైమ్స్ (సీసీఎస్) పోలీసులు చార్జిషీట్ సిద్దం చేశారు. గూగుల్ ప్లే స్టోర్‌లోని 197 మొబైల్ యాప్స్ ద్వారా లక్షలాది మందికి అత్యధిక వడ్డీతో పదివేల రూపాయల లోపు రుణాలు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు మొత్తం 22 వేల కోట్ల మేరకు రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దేశంలోని పలు నగరాల్లో లోన్‌యాప్స్ నిర్వహకులపై పోలీసులు దాడిచేశారు. ఇప్పటివరకు 20 మంది నిర్వహకులను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఆరుగురు, హైదరాబాద్‌లో ఆరుగురు, బెంగుళూరులో ఏడుగురు, కర్నూల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. చైనాకు చెందిన లాంబోను లోన్ యాప్స్ ముఠా ప్రధాన నిర్వాహకుడిగా పోలీసులు గుర్తించారు. బెంగుళూరు కేంద్రంగా పిన్ పింగ్ టెక్నాలజీస్, ల్యూఫాన్గ్ టెక్నాలజీస్, నా బ్లూమ్ టెక్నాలజీస్, హార్ట్ ఫుల్ టెక్నాలజీస్ పేరుతో నాలుగు సంస్థలను లాంబో ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. రాష్ట్రాల వారీగా స్థానిక ఫైనాన్స్ వ్యాపారులను ఉచ్చులోకి లాగారు. ఎన్‌బిఎఫ్‌సీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు విచ్చలవిడిగా వాడి, అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చాడు. వేగంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి రుణాలను ఇచ్చేవారని పోలీసులు తెలిపారు. అమాయకులైన నిరుద్యోగ బీటెక్ విద్యార్థులను ఉద్యోగాల పేరిట మోసం చేసి, వారిపేరు మీద రుణాలను పొందేవారని పోలీసులు పేర్కొన్నారు. పైసా పెట్టుబడి లేకుండా వేలకోట్ల వ్యాపారానికి పడగలేత్తారని వివరించారు. ప్రధాన సూత్రధారి అయిన చైనా దేశీయుడు యోన్ యౌన్ అలియాస్ జెన్నిఫర్ చైనా నుంచే లాంబో ద్వారా భారత్ లో కార్యకలాపాలు నిర్వహించే వాడని పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన ఛార్జీషీట్‌ను బుధవారం పోలీసులు కోర్టులో దాఖలు చేయనున్నారు. (చదవండి: కారుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి మరి ప్రేమ వేధింపులు) -
'ఆసరా' పెన్షన్ పథకంలో భారీ గోల్మాల్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చార్మినార్ తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా ఆసరా పెన్షన్ల పథకంలో భారీ గోల్మాల్ జరిగింది. ఆ కార్యాలయ ఉద్యోగుల ప్రమేయంపై ఆధారాలు లభించకపోయినా వారి నిర్లక్ష్యం ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. నలుగురితో కూడిన ముఠా 8 నెలల్లో 255 మంది పేర్లతో రూ.25 లక్షల వరకు స్వాహా చేసింది. దీనిపై హైదరాబాద్ ఆర్డీఓ డి.శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఒక నిందితుడు 2017లో వెలుగులోకి వచ్చిన ఇదే తరహా ఆసరా స్కామ్‌లోనూ అరెస్టు అయినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. సూత్రధారి ఇమ్రాన్‌ఖాన్ ప్రతీకాత్మక చిత్రం; పోలీసుల అదుపులో నిందితులు ఆసరా పథకం కింద పెన్షన్ కోరుకునే అర్హులు దరఖాస్తు, ఆధారాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడి పూర్వాపరాలు పరిశీలించిన రెవెన్యూ అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా అర్హుల దరఖాస్తును తహసీల్దార్ అప్రూవ్ చేస్తారు. ఈ తంతు ముగిసిన తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో ఉండే డేటా ఎంట్రీ ఉద్యోగులు దరఖాస్తుదారుడి వివరాలను తమ సంస్థాగత ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తారు. దీనికోసం ప్రతి తహసీల్దార్‌కు ఓ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటాయి. ఇలా అప్లోడ్ చేసిన వివరాలు కలెక్టరేట్ ద్వారా ‘సెర్ఫ్’ కార్యాలయానికి చేరతాయి. దీంతో అక్కడి అధికారులు లబ్ధిదారుడి ఖాతాలో నెలనెలా పెన్షన్ జమ చేస్తుంటారు. ఈ పెన్షన్‌ను కియోస్క్ యంత్రంలో వేలిముద్రలు వేయడం ద్వారా లబ్ధిదారులు విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తతంగం మొత్తం తెలిసిన మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ అనే వ్యక్తి ఈ స్కామ్‌కు సూత్రధారిగా మారాడు. ఆరేడేళ్లుగా బండ్లగూడ, చార్మినార్ తహసీల్దార్ కార్యాలయాల కేంద్రంగా ఇతగాడు దళారీగా పని చేస్తున్నాడు. దీంతో ఇతడికి ఆయా కార్యాలయాల్లోని అధికారులు, ఉద్యోగులతో పరిచయాలు ఏర్పడ్డాయి. చార్మినార్ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇమ్రాన్ ఎమ్మార్వో వినియోగించే యూజర్ ఐడీ, పాస్వర్డ్ సంగ్రహించాడు. వీటిని తన స్నేహితుడు, నల్లగొండలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మహ్మద్ అస్లంతో పాటు సయ్యద్ సొహైలుద్దీన్‌లకు అందించాడు. వీరి ద్వారా ఈ రహస్య వివరాలు నగరానికి చెందిన మహ్మద్ మోసిన్‌కు చేరాయి. కియోస్క్ యంత్రాలు నిర్వహిస్తూ లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం ఇతడి వృత్తి. ఈ నలుగురూ ఇలా సంగ్రహించిన వివరాలతో ఆసరా పెన్షన్లు స్వాహా చేయడానికి దాదాపు ఎనిమిది నెలల క్రితం పథకం వేశారు. ఖాతా నంబర్లు మార్చి.. బండ్లగూడ, చార్మినార్, చాంద్రాయణగుట్ట ప్రాంతాలకు చెందిన 255 మందితో కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ఈ బ్యాంకు ఖాతాల నంబర్లను అప్పటికే పెన్షన్ పొందుతున్న ఆసరా లబ్ధిదారుల వాటికి బదులుగా రీప్లేస్ చేశారు. కొన్ని పేర్లను వీరే లబ్ధిదారులుగా చేర్చారు. చార్మినార్ ఎమ్మార్వో యూజర్ ఐడీ, పాస్వర్డ్ తెలిసి ఉండడంతో వాటి ఆధారంగా కొత్త లబ్ధిదారులు, బ్యాంకు ఖాతా నంబర్ల అప్రూవల్ పొందారు. అనివార్య కారణాల నేపథ్యంలో కొందరు వృద్ధులు తమ బంధువులు, సంబంధీకుల బ్యాంకు ఖాతాలను ఆసరా పెన్షన్ కోసం ఇస్తూ/మారుస్తూ ఉంటారు. ఆ నెపంతో వీరంతా అప్రూవల్ పొందారు. దీంతో అప్పటి నుంచి ఆయా లబ్ధిదారులకు చేరాల్సిన పెన్షన్ డబ్బు వీరి పొందుపరిచిన కొత్త ఖాతాల్లోకి వస్తోంది. ఆ డబ్బును ఖాతాదారుల సాయంతో వీళ్లు స్వాహా చేస్తున్నారు. ఇలా మొత్తం రూ.25 లక్షల వరకు ఈ గ్యాంగ్ కాజేసింది. ఇలా గుర్తింపు... ఇటీవల కొందరు వృద్ధులు తమకు ఆసరా పెన్షన్లు అందట్లేదని, ఆ డబ్బు తమ ఖాతాల్లో పడడం ఆగిపోయిందని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. అంతర్గత విచారణ చేపట్టిన ఆయన స్కామ్ జరిగినట్లు గుర్తించారు. వెంటనే సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ భద్రంరాజు రమేష్ దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై మదన్ సహకారంతో సాంకేతిక దర్యాప్తు చేసి స్కామ్ మూలాలు కనిపెట్టారు. దీంతో మంగళవారం అస్లంతో పాటు సొహైల్, మోసిన్, ఇమ్రాన్‌లను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో వీరికి ఓ మహిళ సైతం సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోపక్క చార్మినార్ ఎమ్మార్వో యూజర్ ఐడీ, పాస్వర్డ్ బయటకు రావడం వెనుక ఇంటి దొంగల పాత్ర ఉందా? నిర్లక్ష్యమే కారణమా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. దీనికోసం నిందితుల్ని న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అస్లం గతంలో బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేశాడు. 2017లో మరికొందరితో ముఠా కట్టి ఆసరా పెన్షన్లనే కాజేశాడు. దాదాపు రూ.40 లక్షలు కాజేసిన ఆ స్కామ్‌లోనూ ఇతగాడు అరెస్టు అయ్యాడు. -
సీసీఎస్ ‘చేతికి’ సీసీటీఎన్ఎస్!
సాక్షి, సిటీబ్యూరో: వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పోలీసు విభాగాలు–ఏజెన్సీల మధ్య సమన్వయం, సమాచార మార్పిడి, నేరాల నిరోధం, కేసులను కొలిక్కి తీసుకురావడం లక్ష్యంగా దేశ వ్యాప్తంగా అమలులోకి వస్తున్న వ్యవస్థే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్). దేశంలోని ఇతర నగరాల కంటే తెలంగాణలో, రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, జిల్లాల కంటే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఇది వేగంగా అమలవుతోంది. ఈ నేపథ్యంలోనే దీనిని త్వరితగతిన పూర్తి చేయడానికి పర్యవేక్షణ ఏజెన్సీని ఏర్పాటు చేస్తూ నగర పోలీస్ కమిసనర్ అంజనీకుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఆ బాధ్యతలను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులకు అప్పగించారు. ఇటీవల సీసీఎస్ సందర్శనకు వచ్చిన ఆయన ఈ విషయం ప్రకటించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు, నగరాల నుంచి నిత్యం అనేక మంది సిటీకి వచ్చిపోతుండటం, స్థిరపడటం జరుగుతోంది. ఇలాంటి వారిలో కొందరు నేరచరితులై ఉండి, ఇక్కడా అలాంటి వ్యవహారాలే నెరపుతారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పాత నేరగాళ్ల జాబితా మొత్తం ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. వీరితో పాటు గతంలో ఇక్కడ నేరం చేసినా బయటి రాష్ట్రాల వారి వివరాలు సైతం రికార్డుల్లో ఉంటాయి. అయితే కేవలం ఆయా రాష్ట్రాల్లో మాత్రమే నేర చరిత్ర ఉండి, తొలిసారిగా ఇక్కడ నేరం చేసిన వివరాలు మాత్రం అందుబాటులో ఉండట్లేదు. ఈ రికార్డులన్నీ ఆయా రాష్ట్రాలకే పరిమితం కావడంతో ఈ సమస్య ఎదురవుతోంది. సీసీటీఎన్ఎస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలయితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. దేశంలోని అన్ని పోలీసు విభాగాలు, ఇతర ఏజెన్సీలకు సంబంధించిన రికార్డులు, వివరాలన్నీ ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తాయి. ఫలితంగా ఓ వ్యక్తి దేశంలోని ఏ మారుమూల ప్రాంతంలో అరెస్టయినా, ఎవరికి వాంటెడ్‌గా ఉన్నా క్షణాల్లో తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఓ అనుమానితుడు, ఘటనాస్థలిలో దొరికిన వేలిముద్ర, ఇతర ఆధారాలను సెర్చ్ చేయడం ద్వారా వారి వివరాలు, చిరునామా సహా పూర్తి సమాచారం పొందవచ్చు. అయితే సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే అన్ని పోలీసుస్టేషన్లతో పాటు ఏజెన్సీలు రికార్డులను ఆన్లైన్ చేయాలి. అరెస్టు చేసిన నిందితుల వివరాలు, జారీ అయిన నాన్–బెయిలబుల్ వారెంట్లు తదితరాలు మాత్రమే కాదు... చివరకు నిందితులు వెల్లడించిన నేరాంగీకార వాంగ్మూలాలు, పోలీసుల దర్యాప్తు సంబంధించిన రికార్డులు సైతం ఆన్లైన్ కావాలి. దీనికోసం నగర పోలీసు విభాగం గడచిన కొన్నేళ్లుగా ప్రణాళిక బద్ధంగా ముందుకుసాగుతోంది. ఇప్పుడు అరెస్టు చేసిన వారి వివరాలు, దర్యాప్తు చేస్తున్న కేసుల అంశాలతో పాటు పాత వాటినీ అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయా ఠాణాలు, విభాగాలకు చెందిన ఈ–కాప్స్ సిబ్బంది ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. నగరానికి సంబంధించి దీని అమలు విధానాన్ని పర్యవేక్షించే బాధ్యతలను నగర కొత్వాల్ అంజనీకుమార్ సీసీఎస్‌కు అప్పగించారు. ఈ విభాగంలో ఉన్న ఏసీపీ నుంచి ఎస్సై స్థాయి అధికారుల వరకు కొందరిని ఎంపిక చేసి ఒక్కొక్కరిని ఒక్కో ఠాణాకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. వీరు తరచూ ఆయా ఠాణాలకు వెళ్లడంతో పాటు ప్రతి నిత్యం సీసీటీఎన్ఎస్ అమలు తీరును పర్యవేక్షిస్తుండాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఆ రెండింటి సమన్వయానికి... సాంకేతికంగా రాజధానిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ.. ఇలా మూడు కమిషనరేట్లు ఉన్నాయి. అయితే భౌగోళికంగా మాత్రం ఇవి కలిసే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఒక ప్రాంతంలో నేరం చేసిన వారు మరో చోట దాక్కోవడం, ఓ కమిషనరేట్‌కు చెందిన ముఠాలు మరో చోట పంజా విసరడం జరుగుతోంది. సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు అమలులోకి వచ్చే లోగా భారీ నేరాలు జరిగినప్పడు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో సమన్వయం కోసం పోలీసు ఉన్నతాధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం సీసీఎస్ ఆధీనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కీలకమైన కేసులు, భారీ నేరాల విషయంలో సైబరాబాద్ అధికారులతో సమన్వయం చేసుకునే బాధ్యతలను సీసీఎస్ స్పెషల్ టీమ్–1కు, రాచకొండతో కో–ఆర్డినేషన్ బాధ్యతను సీసీఎస్ స్పెషల్ టీమ్–2కు అప్పగించారు. నగర నేర పరిశోధన విభాగం ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు రెండు కమిషనరేట్లలో ఉన్న సైబర్ క్రైమ్ ఠాణాలతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేయనున్నారు. ఈ చర్యలు కేసులను త్వరగా కొలిక్కి తీసుకురావడంతో పాటు నేరాల నిరోధానికి ఉపకరిస్తాయని అధికారులు చెబుతున్నారు. -
అది బయటకు రాకూడదనే యాక్సిడెంట్ డ్రామా
సాక్షి, సిటీబ్యూరో: తీవ్రగాయాలతో ఆస్పత్రికి వచ్చి... రోడ్డు ప్రమాదంగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కి, అనుమానాస్పద మృతిగా మారి... పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన మహ్మద్ బేగ్ మరణం వెనుక ఉన్న మిస్టరీని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు ఛేదించారు. ఓ భవనం పైనుంచి పడటంతోనే అతడికి తీవ్ర గాయాలయ్యాయని, వాటి ప్రభావంతోనే చనిపోయాడని తేల్చారు. స్నేహితులతో చేసిన ‘ఎంజాయ్మెంట్’ విషయం బయటికి రాకూడదనే ఉద్దేశంతోనే యాక్సిడెంట్ డ్రామా ఆడినట్లు వెలుగులోకి వచ్చింది. సంక్లిష్టంగా మారిన ఈ కేసు కొలిక్కి రావడంతో అఫ్జల్‌గంజ్ నుంచి బదిలీ అయి వచ్చిన ఈ కేసును మూసివేసేందుకు సీసీఎస్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేసు మిస్టరీని ఛేదించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు ఆపై అఫ్జల్‌గంజ్ ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) వెళ్లడం యాదృచ్ఛికం. ఉస్మానియా నుంచి మొదలై... చంచల్‌గూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ బేగ్‌ను (22) అతని స్నేహితులు జూలై 19న ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని చేర్చుకునే సమయంలో వైద్యులు ఆరా తీయగా, మహ్మద్ బేగ్ బైక్‌పై కోఠి నుంచి చంచల్‌గూడకు వస్తుండగా చాదర్‌ఘాట్ చౌరస్తా వద్ద నలుపు రంగు స్విఫ్ట్ కారు వెనుక నుంచి ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయిందని చెప్పారు. దీంతో వైద్యులు అఫ్జల్‌గంజ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రమాదం కేసుగా నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత వెలుగులోకి వచ్చే వివరాలు ఆధారంగా ఈ వ్యవహారం ఏ ఠాణా పరిధిలోకి వస్తే అక్కడకు కేసు బదిలీ చేయాల్సి ఉంటుంది. నాలుగు రోజులకే బేగ్ మృతి... ప్రాథమిక దర్యాప్తు జరుగుతుండగానే జూలై 23న బేగ్ మృతి చెందాడు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తీవ్ర గాయాల ప్రభావంతోనే చనిపోయినట్లు నిర్థారించారు. దర్యాప్తులో భాగంగా ప్రమాదానికి కారణం తెలుసుకోవడంతో పాటు కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు అఫ్జల్‌గంజ్ పోలీసులు ప్రమాదం జరిగిన రోజున చాదర్‌ఘాట్ చౌరస్తాతో పాటు పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఎక్కడా ప్రమాదం జరిగిన ఆనవాళ్లు లేకపోవడం, అప్పటికే బేగ్ చనిపోవడంతో కేసు మిస్టరీగా మారింది. దీంతో బేగ్ కుటుంబీకులు అతడి స్నేహితులపై అనుమానం వ్యక్తం చేశారు. అయినా దర్యాప్తు పక్కాగా సాగలేదనే ఆరోపణలతో అతడి కుటుంబ సభ్యులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పూర్వాపరాలు పరిశీలించిన సీపీ స్థానిక పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు గత నెలలో కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని డీసీపీ అవినాష్ మహంతి ఆదేశించడంతో యాంటీ హోమిసైడ్ టీమ్ (ఏహెచ్‌టీ) ఇన్స్పెక్టర్గా పనిచేసిన టీఎస్ ఉమామహేశ్వరరావు రంగంలోకిదిగారు. ఆ విషయం బయటకు రాకూడదనే... ఈ కేసును అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేసిన ఆయన మృతుడి కుటుంబీకుల వాంగ్మూలం నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఉదంతం జరగడానికి ముందు బేగ్‌తో పాటు అతడి స్నేహితుల కదలికలపై ఆరా తీశారు. అనేక మందిని పిలిచి వారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే అనేక ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. బేగ్ నిత్యం తన స్నేహితులతో కలిసి ఖిల్వత్ ప్రాంతంలో ఓ నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం వద్దకు వెళ్తుంటాడు. అక్కడి వాచ్మెన్ కళ్లుగప్పి పైకి ఎక్కి వీరంతా కావాల్సినంతసేపు ‘ఎంజాయ్’ చేస్తుంటారు. జూలై 19న సైతం ఇలాగే వెళ్లిన వీరు చాలాసేపు అక్కడే గడిపారు. కిందికు దిగుతున్న సమయంలో పట్టుతప్పి బేగ్ కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. తాను భవనం పైనుంచి పడిన విషయం వెలుగులోకి వస్తే తమ ఎంజాయ్మెంట్ విషయం కుటుంబ సభ్యులకు తెలుస్తుందని భావించిన అతను ప్రమాదం జరిగినట్లు చెప్పాలని స్నేహితులను కోరడంతో పాటు తానూ అలాగే చెప్పాడు. దీంతో సీసీఎస్ పోలీసులు ఆ భవనం వద్దకు వెళ్లి పరిశీలించారు. కొందరి నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేయడంతో పాటు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించారు. అందులో క్షతగాత్రుడైన బేగ్‌ను అతడి స్నేహితులు తీసుకువెళ్తున్నట్లు రికార్డు అయిఉంది. వివిధ కోణాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఈ ఉదంతం ప్రమాదవశాత్తు జరిగినట్లు తేల్చారు. బేగ్ కుటుంబీలకూ సీసీఎస్ అధికారుల దర్యాప్తుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడంతో కేసు క్లోజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
దుబాయ్ ట్రిప్పంటూ 67 మందిని..
సాక్షి, సిటీబ్యూరో : తక్కువ రేటుకు దుబాయ్ ట్రిప్పు ఏర్పాటు చేస్తామంటూ 67 మందిని రూ.17 లక్షల మేర మోసం చేసిన ఇద్దరు నిందితులను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఓ సంస్థతో ఒప్పందం ఉన్నప్పటికీ వీరిద్దరూ ఆ సంస్థకు డబ్బు చెల్లించకుండా స్వాహా చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. విశాఖపట్నానికి చెందిన రాజ్‌కుమార్ హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. మలేషియాలో మంచి జీతంతో ఉన్న ఉద్యోగాలు దొరుకుతాయనే ఉద్దేశంతో కౌలాలంపూర్ వెళ్లిన అతడికి అక్కడ గుంటూరుకు చెందిన శ్యాంకుమార్‌తో పరిచయం ఏర్పడింది. 2016లో తిరిగి వచ్చిన ఇరువురూ ట్రావెల్స్ వ్యాపారం చేయాలని భావించారు. రాజ్‌కుమార్ ఢిల్లీలో ఉంటూ బ్యాంకాక్, సింగపూర్, దుబాయ్‌లకు వెళ్లే టూరిస్ట్‌లు వెతికే వాడు. అందుకు అవసరమైన విమాన టిక్కెట్లను శ్యామ్‌కుమార్ ఏర్పాటు చేసే వాడు. ఈ వ్యాపారం లాభసాటిగా లేకపోవడం మోసాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీకి చెందిన ఓవర్సీస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థతో రాజ్‌కుమార్ ఒప్పందం చే సుకుని దాని ఏజెంట్‌గా మారాడు. కొన్ని లావాదేవీల తర్వాత అసలు కథకు శ్రీకారం చుట్టాడు. దుబాయ్ టూర్ ప్యాకేజ్‌ను రూ.40 వేలుగా ఓవర్సీస్ సంస్థ నిర్దేశించింది. అయితే నగరంలోని అశోక్‌నగర్ ప్రాంతానికి చెందిన జె.ప్రతాప్‌రెడ్డి సహా 67 మందికి తాము కేవలం రూ.25 వేలకే సదరు ప్యాకేజ్ ఇస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు. అడ్వాన్స్ చెల్లిస్తే టిక్కెట్లు, వీసా ఏర్పాటు చేస్తామని, ఢిల్లీకి చెందిన ఓవర్సీస్ సంస్థతో తమకు ఒప్పందం ఉందని చెప్పారు. బాధితులు ఆ సంస్థను సంప్రదించగా రాజ్‌కుమార్ తమ ఏజెంటే అని చెప్పారు. దీంతో రూ.17 లక్షలు ఆన్లైన్ ద్వారా శ్యాంకుమార్‌కు బదిలీ చేశారు. ఈ సొమ్మును అతడు రాజ్‌కుమార్ వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేశాడు. ప్రయాణ సమయం దగ్గర పడుతున్నా వీసా, టిక్కెట్లు అందకపోవడంతో బాధితులు ఓవర్సీస్ ట్రావెల్స్‌ను సంప్రదించగా, రాజ్‌కుమార్ నుంచి తమకు నగదు అందలేదని వారు తెలిపారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. రాజ్‌కుమార్ ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసుల అతడికి అక్కడ అరెస్టు చేసి తీసుకువచ్చారు. ఈ విషయం తెలిసిన శ్యాం సీసీఎస్ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో అతడినీ అరెస్టు చేశారు. ఫ్లాట్ల పేరుతో మోసం కేసులో... పద్మారావునగర్‌లో 35 ఫ్లాట్లతో కూడిన అపార్ట్మెంట్ నిర్మిస్తూ 60 మంది నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు సునీల్ జె.సచ్దేవ్ను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సుల్తాన్‌బజార్ ప్రాంతంలో ఘరోండా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ పేరుతో కా ర్యాలయం నిర్వహిస్తున్న సునీల్‌పై 2010 నుంచి ఇప్పటి వరకు నగరంలోని సుల్తాన్‌బజార్, చిక్కడపల్లి, చిలకలగూడ, సీసీఎస్‌ల్లో 25 కేసులు నమోదైనట్లు డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. ముంబైకి చెందిన ఎస్.శ్రీహరి 1581 గజాల ఫ్లాట్ కోసం రూ.18.75 లక్షలు చెల్లించి మోసపోయారు. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం సునీల్‌ను అరెస్టు చేసి మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇతడిపై సీసీఎస్‌లో మొత్తం ఐదు కేసులు నమోదై ఉన్నాయి. -
నటి శ్రీరెడ్డిపై పవన్ కల్యాణ్ ఫిర్యాదు
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు రెండు రోజుల క్రితం టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. న్యాయ నిపుణుల సలహా మేరకు కేసు నమోదు చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. పలు వార్తా చానళ్లు, యూట్యాబ్ చానళ్లతో మాట్లాడుతూ.. తెలుగు సినిమా ప్రముఖులపై శ్రీరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగు అమ్మాయిలను తక్కువగా చూస్తున్నారని, అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయారు. పరభాషా నటీనటులను ప్రోత్సహిస్తున్నారని, తెలుగువారిని అక్కునచేర్చుకోవడం లేదని ఆమె ఆరోపించారు. -
సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరైన రామ్‌గోపాల్ వర్మ
-
వెంకటేశ్ మృతి కేసులో ఎస్పీకి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా సీసీఎస్ పోలీసులు తన భర్త కడమంచి వెంకటేశ్‌ను హత్య చేశారని కె.రేణుక అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌తో ఆ జిల్లా ఎస్పీ, వైద్యాధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జిల్లా సీసీఎస్ పోలీసులు విచారణ పేరుతో రిమాండ్ ఖైదీ వెంకటేశ్‌ను వేధింపులకు గురిచేసి హత్య చేశారని రేణుకతోపాటు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ విచారించారు. మృతుడిపై పోలీసులు నమోదు చేసిన కేసుతోపాటు, అనుమానాస్పద మృతిపై సీఆర్పీసీలోని సెక్షన్ 174 కింద పెట్టిన కేసుల రికార్డుల్ని సీల్డు కవర్లో తమకు నివేదించాలని జిల్లా ఎస్పీని న్యా యమూర్తి ఆదేశించారు. పోస్టుమార్టం, ఇతర వైద్య నివేదికలు అందజేయాలని జిల్లా వైద్యాధికారి, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్లను కూడా ఆదేశించారు. తన భర్త మృతికి కారణమైన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని, మృతదేహానికి తిరిగి పోస్టుమార్టం నిర్వహించాలని, ఈ కేసును సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును అభ్యర్థించారు. న్యాయమూర్తి తదుపరి విచారణ 20కి వాయిదా వేశారు. -
కాంగ్రెస్ నాయకుడి హత్యకు పన్నాగం
కాంగ్రెస్ నాయకుడి హత్యకు పన్నాగం హత్య చేసేందుకు వెళ్తూ వాహనాల తనిఖీలో పోలీసులకు చిక్కిన వైనం నాగార్జునసాగర్ : కాంగ్రెస్ నాయకుడిని హతమార్చేందుకు వెళ్తున్న ఓ హంతక ముఠా పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. దక్షిణవిజయపురి పోలీస్టేషన్ పరిధిలోని పెద్దవూర మండలం తిమ్మాయిపాలెం తం డాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రమావత్ శౌరినాయక్కు అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మూడావత్‌రామారావు, దేపావత్‌బుజ్జి, బానావత్ స్వామినాయక్, చంగునాయక్, పాండునాయక్‌కు రాజకీయ కక్షలు ఉన్నాయి. రమావత్ శౌరి గత ఎన్నికల్లో తన సోదరుడు రమావత్ లకుపతిని పోటీచేయిం చి ఎంపీటీసీగా గెలిపించాడు. అయితే శౌరి బతికిఉంటే రాజకీయంగా తాము ఎదుగలేమని ఆ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు శౌరిని హత్య చేయించేందుకు రెండేళ్ల క్రితం ఒకహంతక మూఠాతో రూ.5 లక్షలతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. పోలీసులను చూసి.. రెండు రోజుల క్రితం హంతక ముఠా కారులో తిమ్మాయిపాలెం బయలు దేరింది. జిల్లా కేంద్రం శివారులోనే వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి కారులో ఉన్న ముఠా సభ్యులు పరుగు తీశారు. వారిని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఠాలో తిమ్మాయిపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో టీడీపీ కార్యకర్తలు మూడావత్‌రామారావు,దేపావత్‌బుజ్జి,బానావత్ స్వామినాయక్, చంగునాయక్, పాండునాయక్‌ను మంగళవారం సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ కుట్రలో హాలియాకు చెందిన ఓ దిన్నపత్రిక విలేకరి భాగస్వామ్యం కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే ఇప్పటికే పోలీసులు వీరందరినీ విచారిస్తున్నట్టు సమాచారం. -
పోలీసులమంటూ దోపిడీ
♦ నలుగురు సూడో పోలీసుల అరెస్టు ♦ రూ.59 వేల నగదు,ఆటో, 9 సెల్ఫోన్లు స్వాధీనం సుల్తాన్‌బజార్ : సీసీఎస్ పోలీసులమని చెప్పి విద్యార్థులను చితకబాది.. వారి వద్ద డబ్బు, సెల్ఫోన్లు దోచుకున్న నలుగురు కేటుగాళ్లను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుల నుంచి 9 సెల్ఫోన్లు, రూ.59 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సుల్తాన్‌బజార్ ఏసీపీ రావుల గిరిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీ నగర్ శ్రీనగర్‌కాలనీకి చెందిన ఈ.హనుమంతు, మీర్పేట్ తిరుమలహిల్స్‌కు చెందిన నల్ల భార్గవ్, గాయత్రినగర్‌కు చెందిన అశోక్ డిగ్రీ చదువుతున్నారు. ఈనెల 13న కాచిగూడ లింగంపల్లిలోని నృపతుంగ కళాశాలలో డిగ్రీ పరీక్షలు రాసిన వారు తమ ఐఫోన్ రిపేర్ చేయించుకొనేందుకు కోఠి గుజరాతి గల్లీలోని దేవి మొబైల్‌షాపునకు వచ్చారు. అదే సమయంలో నాంపల్లి అఫ్జల్‌సాగర్‌కు చెందిన మహ్మద్ మహబూబ్అలీ (28), ఫలక్‌నూమా కుర్మవాడికి చెందిన మహ్మద్ సోహిల్ అలీ(25), మల్లేపల్లికి చెందిన సయ్యద్ సాజిద్‌అలీ(32), హబీబ్‌నగర్‌కు చెందిన మహ్మద్ అజార్(18) దేవీ మొబైల్‌షాప్‌కు వచ్చారు. తాము సీసీఎస్ పోలీసులమని విద్యార్థులపై దాడి చేశారు. వారిని కొట్టుకుంటూ ఆటో (ఏపీ 12 వి 8426)లో తీసుకెళ్లారు. భరత్ అనే విద్యార్థిని పాతబస్తీ సిటీకాలేజీ వద్ద విడిచి పెట్టారు. హనుమంతు వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లు లాక్కొని అతడిని కామాటిపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో, అశోక్ వద్ద రూ.700లు లాక్కొని అతడిని రాజేంద్రనగర్‌లో విడిచిపెట్టారు. దోపిడీకి గురైన విద్యార్థులు సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రెండు బృందాలను రంగంలోకి దింపారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా.. నిందితుల్లో ఇద్దరు పాతనేరస్తులు ఉన్నట్లు నిర్థారణైంది. కాగా, నిందితులు గురువారం మరో దోపిడీ వేసేందుకు దారుస్సలాం వచ్చి టీ తాగుతూ పోలీసులకు చిక్కారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. జల్సాల కోసం పోలీసుల అవతారమెత్తి విద్యార్థులను దోచుకున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి 9 సెల్ఫోన్లు, ఆటో, రూ.59 వేలు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్లు జి.శ్రీనివాస్, అంజయ్య, డీఐ కిశోర్‌బాబు పాల్గొన్నారు.