
సాక్షి, హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా సీసీఎస్ పోలీసులు తన భర్త కడమంచి వెంకటేశ్‌ను హత్య చేశారని కె.రేణుక అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌తో ఆ జిల్లా ఎస్పీ, వైద్యాధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జిల్లా సీసీఎస్ పోలీసులు విచారణ పేరుతో రిమాండ్ ఖైదీ వెంకటేశ్‌ను వేధింపులకు గురిచేసి హత్య చేశారని రేణుకతోపాటు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ విచారించారు.
మృతుడిపై పోలీసులు నమోదు చేసిన కేసుతోపాటు, అనుమానాస్పద మృతిపై సీఆర్‌పీసీలోని సెక్షన్ 174 కింద పెట్టిన కేసుల రికార్డుల్ని సీల్డు కవర్‌లో తమకు నివేదించాలని జిల్లా ఎస్పీని న్యా యమూర్తి ఆదేశించారు. పోస్టుమార్టం, ఇతర వైద్య నివేదికలు అందజేయాలని జిల్లా వైద్యాధికారి, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌లను కూడా ఆదేశించారు. తన భర్త మృతికి కారణమైన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని, మృతదేహానికి తిరిగి పోస్టుమార్టం నిర్వహించాలని, ఈ కేసును సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును అభ్యర్థించారు. న్యాయమూర్తి తదుపరి విచారణ 20కి వాయిదా వేశారు.