Rachakonda: ఉత్సవ విగ్రహంలా మారిన సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌ | - | Sakshi
Sakshi News home page

Rachakonda: ఉత్సవ విగ్రహంలా మారిన సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

Published Wed, Mar 6 2024 7:50 AM | Last Updated on Wed, Mar 6 2024 8:50 AM

- - Sakshi

రాచకొండ సైబర్‌ ఠాణాలో కుర్చీలన్నీ ఖాళీ

ఇక్కడ పని చేసేందుకు అధికారుల నిరాసక్తత

పోస్టింగ్‌ ఇచ్చినా ఒక ట్రెండు రోజులకే వేరే చోటుకు బదిలీ

జేబుకు చిల్లు, కేసుల ఒత్తిడే ప్రధాన కారణం

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక అటకెక్కిన దర్యాప్తు

స్టేషన్‌ చుట్టూ బాధితుల ప్రదక్షిణలు

సాక్షి, హైదరాబాద్: రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌ ఉత్సవ విగ్రహంలా మారింది. రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. రాచకొండ సైబర్‌ ఠాణాలో పనిచేసేందుకు అధికారులు ఆసక్తి చూపించడం లేదు. ఇక్కడికి పోస్టింగ్‌ ఇచ్చినా పైరవీలతో ఒక ట్రెండు రోజుల్లోనే వేరే చోటుకు బదిలీ చేయించుకుంటున్నారు. పర్యవేక్షణ అధికారులు లేక కేసుల దర్యాప్తు అటకెక్కింది. దీంతో బాధితులు రోజు స్టేషన్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

మిగిలింది ఒక్క ఇన్‌స్పెక్టరే..
రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పీఎస్‌లో డీసీపీ నుంచి కానిస్టేబుల్‌ వరకు సుమారు 70 మంది సిబ్బంది ఉంటారు. కొత్త ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత పోలీసు శాఖలో బదిలీల క్రమంలో అప్పటి మహిళా డీసీపీ వేరే చోటుకు బదిలీ అయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఖాళీగా ఉన్న ఈ పోస్టు ఇటీవలే భర్తీ అయింది. ఇదే సమయంలో ఏసీపీని సైతం భర్తీ చేశారు. కానీ, రెండు రోజులకే మల్టీజోన్‌–2కు తిరిగి బదిలీపై వెళ్లారు. దీంతో ఈ పోస్టు మళ్లీ ఖాళీ అయింది. ఇక ఇన్‌స్పెక్టర్లు మాకొద్దీ పోస్టింగ్‌ అంటూ పారిపోతున్నారు. ఒకప్పుడు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పీఎస్‌లో ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు ఉండగా.. ప్రస్తుతం ఒక్కరే మిగిలారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లోకసభ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్ల స్థానంలో కొత్త వారిని నియమించారు. కానీ, రిపోర్ట్‌ కూడా చేయకుండానే పైరవీలతో ఒక ట్రెండు రోజుల్లోనే వేరే చోటుకు బదిలీ కావడం కొసమెరుపు.

ఇక్కడ జేబుకు చిల్లే..
ఇతర రాష్ట్రాల్లో దాక్కున నిందితులను పట్టుకునేందుకు విచారణాధికారులు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే రాచకొండలో ఈ ప్రక్రియ మూలనపడింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లి నాలుగైదు రోజులు అక్కడ ఉండాలంటే జేబు గుళ్ల తప్ప ప్రయోజనం ఉండటం లేదని పలువురు పోలీసుల అధికారులు వాపోయారు. కష్టపడి నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తే ఉన్నతాధికారుల దృష్టిలో గుర్తింపు ఉంటుందా అంటే అదీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బదులుగా ఇతర విభాగంలో డ్యూటీ చేయడమే ఉత్తమమని భావిస్తున్నారు. మరోవైపు రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం పెరిగింది. కేసుల దర్యాప్తు వేగంగా, పారదర్శకంగా చేసే క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా తమ కెరీర్‌కు ఇబ్బంది అవుతుందని ఇన్‌స్పెక్టర్లు భావిస్తున్నారు.

కానిస్టేబుళ్ల తీరు వేరు..
రాచకొండ సైబర్‌ ఠాణాలోని కానిస్టేబుళ్ల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఐదారేళ్ల నుంచి ఇదే ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు పది మంది ఉన్నారు. కానిస్టేబుళ్ల నుంచి హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించినా ఇక్కడే తిష్ట వేసుకు కూర్చున్నారు. వేరే చోటుకు వెళితే పని భారం పెరుగుతుందనో, లేక ఇక్కడి లొసుగులతో అమ్యామ్యాలు రావనే భావనలో ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ వీరికి వర్తించదా అని పలువురు వాపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement