సాక్షి, సిటీబ్యూరో: తీవ్రగాయాలతో ఆస్పత్రికి వచ్చి... రోడ్డు ప్రమాదంగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కి, అనుమానాస్పద మృతిగా మారి... పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన మహ్మద్ బేగ్ మరణం వెనుక ఉన్న మిస్టరీని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు ఛేదించారు. ఓ భవనం పైనుంచి పడటంతోనే అతడికి తీవ్ర గాయాలయ్యాయని, వాటి ప్రభావంతోనే చనిపోయాడని తేల్చారు. స్నేహితులతో చేసిన ‘ఎంజాయ్‌మెంట్’ విషయం బయటికి రాకూడదనే ఉద్దేశంతోనే యాక్సిడెంట్ డ్రామా ఆడినట్లు వెలుగులోకి వచ్చింది. సంక్లిష్టంగా మారిన ఈ కేసు కొలిక్కి రావడంతో అఫ్జల్‌గంజ్ నుంచి బదిలీ అయి వచ్చిన ఈ కేసును మూసివేసేందుకు సీసీఎస్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేసు మిస్టరీని ఛేదించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వరరావు ఆపై అఫ్జల్‌గంజ్ ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్‌హెచ్‌ఓ) వెళ్లడం యాదృచ్ఛికం.
ఉస్మానియా నుంచి మొదలై...
చంచల్‌గూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ బేగ్‌ను (22) అతని స్నేహితులు జూలై 19న ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని చేర్చుకునే సమయంలో వైద్యులు ఆరా తీయగా, మహ్మద్ బేగ్ బైక్‌పై కోఠి నుంచి చంచల్‌గూడకు వస్తుండగా చాదర్‌ఘాట్ చౌరస్తా వద్ద నలుపు రంగు స్విఫ్ట్ కారు వెనుక నుంచి ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయిందని చెప్పారు. దీంతో వైద్యులు అఫ్జల్‌గంజ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రమాదం కేసుగా నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత వెలుగులోకి వచ్చే వివరాలు ఆధారంగా ఈ వ్యవహారం ఏ ఠాణా పరిధిలోకి వస్తే అక్కడకు కేసు బదిలీ చేయాల్సి ఉంటుంది.
నాలుగు రోజులకే బేగ్ మృతి...
ప్రాథమిక దర్యాప్తు జరుగుతుండగానే జూలై 23న బేగ్ మృతి చెందాడు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తీవ్ర గాయాల ప్రభావంతోనే చనిపోయినట్లు నిర్థారించారు. దర్యాప్తులో భాగంగా ప్రమాదానికి కారణం తెలుసుకోవడంతో పాటు కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు అఫ్జల్‌గంజ్ పోలీసులు ప్రమాదం జరిగిన రోజున చాదర్‌ఘాట్ చౌరస్తాతో పాటు పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఎక్కడా ప్రమాదం జరిగిన ఆనవాళ్లు లేకపోవడం, అప్పటికే బేగ్ చనిపోవడంతో కేసు మిస్టరీగా మారింది. దీంతో బేగ్ కుటుంబీకులు అతడి స్నేహితులపై అనుమానం వ్యక్తం చేశారు. అయినా దర్యాప్తు పక్కాగా సాగలేదనే ఆరోపణలతో అతడి కుటుంబ సభ్యులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పూర్వాపరాలు పరిశీలించిన సీపీ స్థానిక పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు గత నెలలో కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని డీసీపీ అవినాష్ మహంతి ఆదేశించడంతో యాంటీ హోమిసైడ్ టీమ్ (ఏహెచ్‌టీ) ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన టీఎస్ ఉమామహేశ్వరరావు రంగంలోకిదిగారు.
ఆ విషయం బయటకు రాకూడదనే...
ఈ కేసును అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేసిన ఆయన మృతుడి కుటుంబీకుల వాంగ్మూలం నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఉదంతం జరగడానికి ముందు బేగ్‌తో పాటు అతడి స్నేహితుల కదలికలపై ఆరా తీశారు. అనేక మందిని పిలిచి వారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే అనేక ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. బేగ్ నిత్యం తన స్నేహితులతో కలిసి ఖిల్వత్ ప్రాంతంలో ఓ నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం వద్దకు వెళ్తుంటాడు. అక్కడి వాచ్‌మెన్ కళ్లుగప్పి పైకి ఎక్కి వీరంతా కావాల్సినంతసేపు ‘ఎంజాయ్’ చేస్తుంటారు. జూలై 19న సైతం ఇలాగే వెళ్లిన వీరు చాలాసేపు అక్కడే గడిపారు. కిందికు దిగుతున్న సమయంలో పట్టుతప్పి బేగ్ కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. తాను భవనం పైనుంచి పడిన విషయం వెలుగులోకి వస్తే తమ ఎంజాయ్‌మెంట్ విషయం కుటుంబ సభ్యులకు తెలుస్తుందని భావించిన అతను ప్రమాదం జరిగినట్లు చెప్పాలని స్నేహితులను కోరడంతో పాటు తానూ అలాగే చెప్పాడు. దీంతో సీసీఎస్ పోలీసులు ఆ భవనం వద్దకు వెళ్లి పరిశీలించారు. కొందరి నుంచి స్టేట్‌మెంట్స్ రికార్డు చేయడంతో పాటు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించారు. అందులో క్షతగాత్రుడైన బేగ్‌ను అతడి స్నేహితులు తీసుకువెళ్తున్నట్లు రికార్డు అయిఉంది. వివిధ కోణాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఈ ఉదంతం ప్రమాదవశాత్తు జరిగినట్లు తేల్చారు. బేగ్ కుటుంబీలకూ సీసీఎస్ అధికారుల దర్యాప్తుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడంతో కేసు క్లోజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment