సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్ అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని సినీ నటి హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం తన భర్తతో ఉన్న ఫొటోలు, వీడియోలను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పాత ఫోటోలు, వీడియోలకు ఫేక్ థంబ్‌నైల్స్ పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని హేమ ఆరోపించారు. దీంతో పాటు ఇటీవల కొంత మంది సెలబ్రిటీలు చనిపోయారని దుష్ప్రచారం చేయడంపై కూడా ఆమె ప్రస్తావించారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిపై తప్పుడు వార్తలు రాసి సొమ్ము చేసుకుంటున్నాయని హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
(ఇది చదవండి: డబ్బుల కోసం అలాంటి వార్తలు రాయడం దుర్మార్గం: కోటా శ్రీనివాసరావు)
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు బతికే ఉన్నా.. ఆయనపై తప్పుడు వార్తలు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వేధింపులు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment