Cyber Crime Police Station
-
సెలబ్రిటీలపై అసత్య ప్రచారం.. పోలీసులను ఆశ్రయించిన నటి
సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్ అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని సినీ నటి హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం తన భర్తతో ఉన్న ఫొటోలు, వీడియోలను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాత ఫోటోలు, వీడియోలకు ఫేక్ థంబ్‌నైల్స్ పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని హేమ ఆరోపించారు. దీంతో పాటు ఇటీవల కొంత మంది సెలబ్రిటీలు చనిపోయారని దుష్ప్రచారం చేయడంపై కూడా ఆమె ప్రస్తావించారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిపై తప్పుడు వార్తలు రాసి సొమ్ము చేసుకుంటున్నాయని హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: డబ్బుల కోసం అలాంటి వార్తలు రాయడం దుర్మార్గం: కోటా శ్రీనివాసరావు) సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు బతికే ఉన్నా.. ఆయనపై తప్పుడు వార్తలు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వేధింపులు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
కేసుల్లో ఈ కేసులు వేరయా.. పతి, పత్నీ ఔర్ ఓ.. ప్చ్! యాప్ ఎంతపని చేసింది?
సాక్షి, హైదరాబాద్: నగర కమిషనరేట్ పరిధిలోని మహిళ, సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లకు అనునిత్యం పదుల సంఖ్యలో బాధితులు వస్తుంటారు. వేధింపులు ఎదురైన, బెదిరింపులకు లోనైన వారితో పాటు ఆర్థికంగా నష్టపోయిన వాళ్లూ వీటి మెట్లు ఎక్కుతారు. అప్పుడప్పుడు ఈ ఠాణాలకు వస్తున్న కొన్ని కేసులు పోలీసులనే షాక్‌కు గురి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎవరికి ఎలా న్యాయం చేయాలో, ఎవరికి ఎలా సర్ది చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఇటీవల పోలీసుల వద్దకు వచ్చిన ఆ తరహాకు చెందిన కేసుల్లో కొన్ని... పతి, పత్నీ ఔర్ ఓ... భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడనో, ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనో, పెళ్లి పేరుతో ప్రేమాయణం నడిపి మోసం చేశాడనో...ఇలా అనే కేసులు పోలీసుల వద్దకు వస్తుంటాయి. అయితే బుధవారం మహిళ ఠాణాకు వచ్చిన ఓ కేసు అధికారులకే మతి పోగొట్టింది. వివాహితుడైన ఓ వ్యక్తికి ఆన్లైన్లో నగరానికే చెందిన యువతితో పరిచయమైంది. వీరి మధ్య ప్రేమ చిగురించడం అనేక కేసుల్లో వింటూనే ఉంటాం. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... ఈ ప్రేమాయణం కథ మొత్తం అతడి భార్యకూ తెలిసి ఉండటం. ఈ భార్య, ఆ ప్రియురాలు ఓ అండర్ స్టాడింగ్కు వచ్చి కలిసే అతడితో కాపురం చేసుకుంటామని నిర్ణయించుకున్నారు. ఈ విషయం సదరు యువతి ఇంట్లో తెలియడంతో కథ అడ్డం తిరిగింది. వివాహితుడికి రెండో భార్యగా ఉంటావా? అంటూ యువతిని మందలించారు. అయినప్పటికీ ఆమె వినకపోవడంతో విషయం ఠాణా వరకు వచి్చంది. ‘నా భర్త ఆమెను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే.. ముగ్గురం కలిసే ఉంటాం’ అంటూ భార్య, ‘ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను’ అంటూ యువతి చెప్తుండగా... ఆమె తల్లిదండ్రులు మాత్రం ససేమిరా అన్నారు. భార్య ఉండగా ఆమె సమ్మతించినా రెండో పెళ్లి చేసుకోవడం నేరమంటూ చట్టాన్ని వివరించిన పోలీసులు ముగ్గురికీ కౌన్సిలింగ్ చేశారు. ఫలితంగా పరిస్థితులు అదుపులోకి రావడంతో ఎవరి ఇళ్లకు వాళ్లు చేరారు. నిందితుడిగా మారిన మాజీ ప్రియుడు... వివాహిత అయిన మాజీ ప్రేయసి నుంచి సందేశం అందుకున్న ఆ ప్రియుడు ఎగిరి గంతేసి మరీ లండన్ నుంచి నగరానికి వచ్చాడు. సీన్ కట్ చేస్తే ఆమే తనను పెళ్లి పేరుతో వేధిస్తున్నాడంటూ అతడిపై సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. అతను నగరంలో చదువుకునే సమయంలో ఈమెతో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన ఈ జంట ప్రయాణం పెళ్లి వరకు వెళ్లలేదు. మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి కావడంతో అతడు ఉద్యోగరీత్యా లండన్ వెళ్లిపోయాడు. వివాహమైన కొన్నాళ్లకే భర్తతో విభేదాలు రావడంతో ఆమె విడాకులు తీసుకోవాలని భావించింది. ఆ తంతు పూర్తయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామంటూ మాజీ ప్రియుడికి సందేశం ఇచ్చింది. ఇంకేముంది ఉన్న ఫళంగా నగరానికి వచ్చేశాడు. ఆమె భర్తతోనే కలిసి ఉండటాన్ని చూసి అవాక్కయ్యాడు. పెళ్లి చేసుకుందామంటూ పదేపదే ఆమెకు సందేశాలు పెట్టాడు. విడాకులు తీసుకోకుండా అదెలా సాధ్యమంటూ దాటవేస్తూ వచ్చింది. అలాంటప్పుడు తనను ఎందుకు రమ్మన్నావంటూ అతడు గొడవకు దిగాడు. తన వేదనను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. కట్ చేస్తే బాధితురాలిగా మారిన ఆ యువతి తన మాజీ ప్రియుడి పైనే సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు పెట్టింది. కౌన్సిలింగ్‌తో ఈ కథ లండన్‌కు చేరింది. చదవండి: కీచక ఉపాధ్యాయులు.. మొన్న మహిళా ఉద్యోగి.. నేడు విద్యార్థినితో యాప్... ఎంతపని చేసింది... ఓయూ ప్రాంతానికి చెందిన ఓ నిరక్షరాస్యుడు గొర్రెలు, మేకల వ్యాపారి. ఇతడికి స్థానికంగా ఉండే యువతితో పరిచయమైంది. ఇద్దరూ కొన్నాళ్లు చెట్టపట్టాలుగా తిరిగారు. నిరక్షరాస్యుడని తెలియడం..ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఆమె అతడిని దూరంగా పెట్టింది. దీంతో తనను ప్రేమిస్తున్నానంటూ మోసం చేసిందని వ్యాఖ్యానిస్తూ ఇన్‌స్ట్రాగామ్‌లో యువతి ఫొటోతో సహా అతడు పోస్టు చేశాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య చాటింగ్ యుద్ధం కూడా జరిగింది. అవాక్కైన పోలీసులు ఆవేదనకు గురైన ఆమె అతడిపై సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించింది. నిరక్షరాస్యుడైన అతడికి చాటింగ్, పోస్టులు పెట్టడం రాదని, అతడి వెనుక ఎవరో ఉన్నారని ఆరోపించింది. కేసు నమోదు కావడంతో ఆ యువకుడిని పోలీసులు ఠాణాకు తీసుకొచ్చారు. విచారణ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన విషయాలు విని అవాక్కయ్యారు. ఏ మాత్రం ఆంగ్ల పరిజ్ఞానం లేని అతడు ఓ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ యువతి పంపిన సందేశాన్ని కాపీ చేసి అందులో పేస్ట్ చేసే వాడు. దానికి ఏం సమాధానం చెప్పాలన్నది ఆ యాప్ సూచించేది. దాన్ని మళ్లీ కాపీ చేసే అతడు యువతికి పోస్టు చేసేవాడు. కొన్నిసార్లు వాయిస్ కమాండ్స్‌ను టెక్టస్గా మార్చి పోస్టు చేసే వాడు. నిందితుడిగా మారిన అతగాడు తనను ఆ యువతి ఎలా మోసం చేసిందో కూడా వివరించాడు. ఈ విషయాలను ఆమె కూడా అంగీకరించడంతో అరెస్టు పర్వం తప్పింది. -
బోనాల జాతరలో పరిచయం.. జోగిని శ్యామలపై పాతబస్తీ మౌనిక వేధింపులు
సాక్షి, సిటీబ్యూరో: జోగిని శ్యామలగా ప్రాచుర్యం పొందిన శ్యామలా దేవికి సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. తనకు భక్తురాలిగా పరిచయమైన పాతబస్తీకి చెందిన మౌనిక యాదవ్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలతో వేధింపులకు గురి చేస్తున్నట్లు సోమవారం శ్యామల సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం ప్రకారం... బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన శ్యామల నగరంలో బోనాల సందర్భంలో ఎక్కువగా వార్తల్లో కనిపిస్తుంటారు. బోనాలు సమర్పించే సమయంలో అనేక మంది భక్తులు ఆమె వెంట ఉంటారు. పాతబస్తీకి చెందిన మౌనిక యాదవ్ సైతం ఇలానే శ్యామలకు పరిచయమయ్యింది. కొన్నాళ్ల క్రితం ఓ అంశానికి సంబంధించి ఇద్దరి మధ్యా స్పర్థలు వచ్చాయి. తనను వేధించిన వ్యక్తికి శ్యామల మద్దతు ఇస్తున్నారనేది మౌనిక ఆరోపణ. దీంతో కక్షకట్టిన ఆమె ఓ సందర్భంలో శ్యామల ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగింది. అయితే కొన్నాళ్లుగా శ్యామల ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలను మౌనిక పంపిస్తున్నారు. వాటిలో శ్యామలతో పాటు ఆమె కుటుంబాన్నీ కించపరిచే, అవమానించేలా అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్యామల సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. (చదవండి: ఎంతటి విషాదం.. భార్య మరణవార్త తెలియకుండానే భర్త కూడా..) -
వీడు మామూలోడు కాదు.. విచారించాలంటూ పోలీసులకే లేఖ
సాక్షి, హైదరాబాద్: కేసుల దర్యాప్తు సందర్భంగా నిందితులతో పాటు అనుమానితులకూ నోటీసులు ఇస్తుంటారు. అయితే సిటీ సైబర్ క్రైం పోలీసులకు చిత్రమైన అనుభవం ఎదురైంది. రూ.60 లక్షల మోసం కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న మధ్యప్రదేశ్ వాసి ‘నన్ను పిలవండి.. విచారించండి’అంటూ లేఖ రాశాడు. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటారు. ఆమె వివరాలు తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, ట్రేడింగ్ పేరిట రూ.5 లక్షలు తమ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. కొద్దిరోజుల తర్వాత మరోసారి ఫోన్ చేసి తమ వద్ద ఉన్న ట్రేడింగ్ ఖాతాలో ఉన్న మొత్తం రూ.4 కోట్లకు చేరిందని చెప్పారు. అది బదిలీ చేయాలంటే ముందుగా బ్రోకరేజ్ చెల్లించాలని షరతు విధించారు. దీంతో దాదాపు రూ.60 లక్షలు బ్యాంకు ఖాతా ల్లోకి ఆ మహిళ బదిలీ చేశారు. తర్వాత వారి నుంచి స్పందన లేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రజత్ పటారియాను ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావించారు. తప్పుడు ధ్రువీకరణలతో సిమ్ వినియోగించడంతో చిరుమానా పట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో చందన్నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో రజత్ ఉంటాడని తెలుసుకుని వారికి సమాచారం ఇచ్చారు. ఇటీవల ఓ పని కోసం చందన్నగర్ ఠాణాకు వెళ్లిన రజత్‌కు పలానా కేసులో అనుమానితుడిగా ఉన్నట్లు అక్కడి పోలీసులు చెప్పారు. దీంతో సైబర్ క్రైం పోలీసులకు పోస్టు ద్వారా లేఖ పంపాడు. తనకు నోటీసులిస్తే వస్తానంటూ అందులో పేర్కొన్నాడు. -
పోలీసులను ఆశ్రయించిన తరుణ్ భాస్కర్
హైదరాబాద్ : దర్శకుడు తరుణ్ భాస్కర్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై ఆన్లైన్లో ట్రోలింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులపై ఆయన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు అసభ్య పదజాలం వాడుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని తరుణ భాస్కర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో ఎదుర్కొంటున్న వేధింపుల గురించి ఆయన వివరించారు.(చదవండి : నటి కిడ్నాప్ ప్లాన్: ముఠా అరెస్టు) ‘సాధారణంగా సినిమాలకు సంబంధించి చేసిన ఓ పోస్ట్.. సోషల్ మీడియాలో వేరే రకంగా ప్రొజెక్టు అయింది. గత కొద్ది రోజులుగా కొందరకు నన్ను, నా టీమ్‌ను ట్రోల్ చేస్తున్నారు. దీంతో నేను సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ట్రోలింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరి వివరాలు వారికి అందజేశాను. ఇందుకు సంబంధించి తొలుత మేము వారిని పిలిచి చాలా మార్యాదగా మాట్లాడాం. ట్రోలింగ్ అనేది ఇతరుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వివరించాం. అలాగే వ్యక్తిగత దూషణ అనేది తీవ్రంగా పరిగణించబడుతుందని హెచ్చరించాం. కానీ వారు దీనికి సానుకూలంగా స్పందించలేదు. దీంతో మా వద్ద ఉన్న అన్ని ఆధారాలను అధికారులకు సమర్పించాం. దీనిని మేము చాలా సీరియస్‌గా తీసుకున్నాం.. మాపై తప్పుడు వ్యాఖ్యలు, పోస్ట్‌లు చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. కాగా, ఇటీవల మలయాళ చిత్రం కప్పేలా చూసిన తరుణ్ భాస్కర్.. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అలాగే తెలుగు సినిమాల్లో ఉండే అనవసరమైన కమర్షియల్ డ్రామా అందులో ఉండదని కూడా పేర్కొన్నారు. దీంతో ఓ హీరో అభిమానులు ఆయనకు వ్యతిరేంగా సోషల్ మీడియాలో విమర్శలకు దిగారు. To whomsoever it may concern...@hydcitypolice pic.twitter.com/MX5GXfMVX0 — Tharun Bhascker Dhaassyam (@TharunBhasckerD) July 1, 2020 -
‘అశ్లీల వీడియో పంపుతూ వేధిస్తున్నారు’
సాక్షి, హైదారాబాద్ : తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, అశ్లీల వీడియోలు పంపుతున్నారని వేధిస్తున్నారంటూ సినీ నటి కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. గుర్తుతెలియన వ్యక్తులు కొద్ది రోజులుగా ఈ పనులు చేస్తున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయాన్నే లేచి ఫోన్ చూడాలంటేనే భయమేస్తుందని ఆమె పోలీసులతో తన బాధను చెప్పుకున్నారు. కొన్ని నంబర్లు బ్లాక్ చేసినా.. వేరే నంబర్ల నుంచి అశ్లీల వీడియోలు పంపుతూ, తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని, వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. కల్యాణి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ చేపట్టారు. -
ప్రియాంక హత్యపై అసభ్య పోస్ట్‌లు,కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య ఉదంతంపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై పోలీసులు విచారణ చేపట్టారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు రావడంతో... దీనిపై కేసు నమోదు చేసి ఇలాంటి సంఘటనలపై పోస్టింగ్ పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. కాగా నిందితులకు మద్దతు తెలుపుతూ బాధితురాలను కించపరిచేలా స్మైలీ నాని అనే యువకుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. పైగా అమ్మాయిలను అత్యాచారం చేస్తే తప్పులేదంటూ నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేశాడు. ఈ ఉదంతంపై యువకులు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ పోస్టులు పెట్టుకున్నారు. దీంతో దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమర్నాథ్, శ్రవణ్, సందీప్ కుమార్, స్మైలీ నానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రియాంకా రెడ్డి హత్య కేసులో అరెస్టైన నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించడంతో వారిని శనివారం కట్టుదిట్టమైన భద్రత నడుమ షాద్‌నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. చదవండి: ముందే దొరికినా వదిలేశారు! చర్లపల్లి జైలుకు ఉన్మాదులు ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు -
నాకు సోషల్ మీడియా అకౌంట్లు లేవు
-
‘తప్పుడు ట్వీట్లు చేసి మోసం చేయకండి’
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు ఫిష్ వెంకట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. తన పేరుతో తప్పుడు ట్వీట్లు చేసిన వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవు. ట్వీట్ చేయటం కూడా నాకు రావు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. తప్పుడు ట్వీట్లు చేసి ఎవరినీ మోసం చేయకండి’ అంటూ విజ్ఞప్తి చేశారు. తనకు సీఎం జగన్ అంటే ఎంతో అభిమానం అన్న వెంకట్, ‘నేను కేవలం నటుడ్ని మాత్రమే, అనవసరంగా నన్ను వివాదాల్లోకి లాగకండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
చిరంజీవి అల్లుడికి సైబర్ వేధింపులు
సాక్షి, హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు ప్రముఖులను సైతం వదలడం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, హీరో కల్యాణ్ దేవ్‌కు సైబర్ వేధింపులు మొదలయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన కామెంట్లు పెడుతూ ఆయనను వేధిస్తున్నారు. కొంతమంది ఆగాంతకులు ఇన్‌స్టాగ్రామ్‌లో తనపై, తన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో కల్యాణ్ దేవ్ ఫిర్యాదు చేశారు. హీరో కల్యాణ్ దేవ్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కల్యాణ్ దేవ్‌ను వేధిస్తున్న 10 మందిని గుర్తించామని, వారి వివరాల కోసం ఇన్స్టాగ్రామ్ వారికి లేఖ రాశామని పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే వారి పట్టుకొని చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్ మీడియాకు తెలిపారు. ( చదవండి : రెండో పెళ్లి చేసుకున్న శిరీష్ భరద్వాజ్) -
ఠాణాను సందర్శించిన మిలన్ ప్రీత్ కౌర్
సాక్షి, సిటీబ్యూరో: ‘మిసెస్ ఇండియా పంజాబ్–2019’ మిలన్ ప్రీత్ కౌర్ శుక్రవారం నగర సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌ను సందర్శించారు. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్‌తో దాదాపు గంటకు పైగా సమావేశమైన ఆమె ఇటీవల సైబర్‌క్రైమ్స్‌లో వస్తున్న మార్పులు, ఐటీ విభాగంలో విధులు నిర్వర్తించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరాలను తెలుసుకున్నారు. చంఢీగడ్‌కు చెందిన మిలన్ భారత వాయుసేనలో స్వాడ్రన్ లీడర్‌గా పని చేస్తున్నారు. వడోదరలో విధులు నిర్వర్తిస్తూ చంఢీగడ్‌లో ఈ నెల 12న జరిగిన ‘మిసెస్ ఇండియా పంజాబ్’ పోటీల్లో పాల్గొని కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె ఇటీవలే బేగంపేటలోని ఎయిర్‌పోర్స్ బేస్‌కు బదిలీ అయ్యారు. ప్రధానంగా ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ (ఐటీ) వింగ్‌ను పర్యవేక్షిస్తున్న కౌర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేసిన, ఛేదించిన కేసుల వివరాలు, చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను మీడియా ద్వారా తెలుసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తుండటంతో నేరుగా వచ్చి అదనపు డీసీపీతో అనేక అంశాలపై చర్చించారు. -
ఆ వార్తలు అబద్ధం: మేయర్ రామ్మోహన్
సాక్షి, హైదరాబాద్ : తన రాజీనామా వార్తను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్రావు ఖండించారు. తాను రాజీనామా చేశానంటూ కొన్ని సోషల్ మీడియా సైట్లలో వచ్చిన తప్పుడు వార్తలపై కఠిన చర్యలను తీసుకోవాలని ఆయన మంగళవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెట్రో రైల్ ప్రారంభోత్సవం సందర్భంగా అవమానం జరిగిందని ఈ విషయం లో తీవ్ర మనస్తాపానికి లోనై మేయర్ పదవికి రాజీనామా చేశానని మంగళవారం పలు సోషల్ మీడియాల్లో తప్పుడు వార్తలు తనపై వస్తున్నాయని, ఈ తప్పుడు వార్తలను పోస్ట్ చేసిన వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ సైబర్ నేర విభాగం అడిషనల్ డీసీపీ రఘువీర్ కు ఫిర్యాదు చేసినట్టు మేయర్ రామ్మోహన్ తెలిపారు. బీసీకి చెందిన వ్యక్తిని కాబట్టే తన పేరు వేయలేదంటూ తాను పేర్కొన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తెలంగాణతో పాటు హైదరాబాద్ పురోభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, యువమంత్రి కేటీఆర్ నేతృత్వంలో చిత్తశుద్ధితో పనిచేయనున్నట్టు మేయర్ స్పష్టం చేశారు. -
సైబర్ నేరాలకు చెక్
విజయవాడలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఇప్పటికే పనిచేస్తున్న సైబర్ సెల్ విజయవాడ : రాజధాని నగరంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల్ని మోసం చేయడంతో మొదలవుతున్న సైబర్ నేరాలు ఫేస్బుక్ ఖాతాల వరకు విస్తరించాయి. నగరంలో వారానికి సగటున రెండు సైబర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో నగరంలో కొత్తగా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటుకానుంది. కమిషనరేట్‌ను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా దీన్ని మంజూరు చేశారు. ఇప్పటికే కమిషనరేట్‌లోని సైబర్ సెల్ సైబర్ క్రైం కేసుల్ని పర్యవేక్షిస్తోంది. సైబర్ క్రైం స్టేషన్ మంజూరుతోపాటు అదనంగా కొంతమంది సిబ్బందిని కూడా కేటాయించారు. మరింత పటిష్ఠంగా కమిషనరేట్ విజయవాడలో కెడ్రిట్ కార్డుల మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు ధ్రువీకరిస్తున్నారు. రాజధాని నగరం కూడా కావడంతో ముందుగానే పోలీస్ కమిషనరేట్‌ను రేంజ్ డీఐజీ క్యాడర్ నుంచి అడిషనల్ డీజీ క్యాడర్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ఇది జరిగిన రెండేళ్లకు అప్‌గ్రేడ్‌కు అనుగుణంగా వసతులు, సౌకర్యాలు, ఐపీఎస్‌ల సంఖ్య, పోలీస్ సిబ్బంది సంఖ్య పెంచారు. ఈ క్రమంలో కమిషనరేట్ బలోపేతానికి ఐపీఎస్ అధికారులతో కలిపి 471 మంది పోలీసుల్ని కొత్తగా కేటాయించి కొత్తగా కొన్ని ప్రత్యేక వింగ్‌లు ఏర్పాటు చేసుకోవటానికి వీలుగా ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతి ఇచ్చింది. నగరంలో కమిషనర్ పోస్ట్‌తో పాటు అదనపు కమిషనర్ పోస్టులో ఐజీ క్యాడర్ అధికారిని, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పోస్టులో డీఐజీ క్యాడర్ అధికారిని నియమించనున్నారు. వీరిలో అదనపు కమిషనర్ పోస్టు ఇప్పటికే భర్తీ కాగా మిగిలిన పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. మరోవైపు దీంతోపాటు కొత్తగా కొన్ని జోన్లు, సబ్ డివిజన్లు, సర్కిళ్లు ఏర్పాటవుతున్నాయి. వీటిలో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటు కీలకం కానుంది. 30 మంది నైపుణ్యతగల పోలీసులతో... కమిషనరేట్‌లో ఐటీ పరిజ్ఞానం ఉన్న సుమారు 30 మంది పోలీసులతో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఆవిర్భవించనుంది. ఏటా నగరంలో సగటున 100 వరకు సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. వీటిలో ఎక్కువగా బ్యాంకుల్ని మోసగించిన కేసులు, క్రెడిట్ కార్డు మోసాలు, నకిలీ ఏటీఎం కార్డులతో బురిడీ కొట్టించడం, యూరో లాటరీ మోసాలు, బ్యాంక్ అకౌంట్లలోని లావాదేవీల సమాచారం హైక్ చేయడం, వివిధ కీలక కంపెనీల డేటాను హైక్ చేయడం లాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక ఫేస్బుక్లో నకిలీ అకౌంట్లతో యువతుల్ని వేధించడం, ప్రేమ పేరుతో వలవేయడం లాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేరాలన్నింటిని ప్రస్తుతం కమిషనరేట్‌లో ఉన్న సైబర్ సెల్ పర్యవేక్షిస్తుంది. స్టేషన్లలో నమోదైన కేసుల్లో సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్ని మాత్రమే ఈ టీమ్ పర్యవేక్షిస్తుంది. ప్రత్యేకంగా సైబర్ క్రైం స్టేషన్ ఏర్పాటు ద్వారా నగరంలో ఎక్కడ సైబర్ నేరం జరిగినా ఇక్కడి స్టేషన్లోనే కేసు నమోదు చేసి దర్యాపు చేయనున్నారు. దీనిని ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. ఒక సీఐతో పాటు ఇద్దరు ఎస్‌లతో కలిపి 30 మంది వరకు సిబ్బందిని డెప్యుటేషన్‌పై కేటాయించనున్నారు. ఇప్పటికే సైబర్ సెల్ పోలీసులకు నైపుణ్యత పెంపు కోసం రెండు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మరో నెల రోజుల వ్యవధిలో స్టేషన్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కేసుల్ని పర్యవేక్షించనున్నారు. దీని కోసం బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారు.