
సాక్షి, హైదరాబాద్ : తన రాజీనామా వార్తను జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌రావు ఖండించారు. తాను రాజీనామా చేశానంటూ కొన్ని సోషల్ మీడియా సైట్లలో వచ్చిన తప్పుడు వార్తలపై కఠిన చర్యలను తీసుకోవాలని ఆయన మంగళవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెట్రో రైల్ ప్రారంభోత్సవం సందర్భంగా అవమానం జరిగిందని ఈ విషయం లో తీవ్ర మనస్తాపానికి లోనై మేయర్ పదవికి రాజీనామా చేశానని మంగళవారం పలు సోషల్ మీడియాల్లో తప్పుడు వార్తలు తనపై వస్తున్నాయని, ఈ తప్పుడు వార్తలను పోస్ట్ చేసిన వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ సైబర్ నేర విభాగం అడిషనల్ డీసీపీ రఘువీర్ కు ఫిర్యాదు చేసినట్టు మేయర్ రామ్మోహన్ తెలిపారు.
బీసీకి చెందిన వ్యక్తిని కాబట్టే తన పేరు వేయలేదంటూ తాను పేర్కొన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తెలంగాణతో పాటు హైదరాబాద్ పురోభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, యువమంత్రి కేటీఆర్ నేతృత్వంలో చిత్తశుద్ధితో పనిచేయనున్నట్టు మేయర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment