
వాతావరణంలో విభిన్న మార్పులు
మధ్యాహ్నం ఎండలు.. సాయంత్రం ఈదురు గాలులు
సాయంత్రం ఈదురు గాలులు, జడివానలు
నగరంలో మూడురోజులుగా ఇదే వరస
సగటున గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు
20 డిగ్రీలకు పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రత
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో గత మూడు రోజులుగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు మండుతున్న ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. ఆ తర్వాత వాతావరణంలో మార్పులతో పూర్తిగా చల్లబడుతోంది. ఇక వర్షం ప్రారంభమైతే అతలాకుతలం చేస్తోంది. భారీ ఈదురుగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చెట్లు విరిగిపడుతున్నాయి. వాహనాలు ధ్వంసమవుతున్నాయి. విద్యుత్ వైర్ల తెగిపడుతున్నాయి. రోజువారీగా సగటున గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 36 నుంచి 39 డిగ్రీల వరకు, కనిష్టంగా 26.5 నుంచి 20.8 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ మేర వీస్తున్నాయి. అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
నగరంలో ఉదయం 7 గంటల నుంచే ఎండ పెరుగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టలేని పరిస్థితి. మరో వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి ఆదివారం ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుండటంతో వరుసగా మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.