
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం పచ్చదనంతో పరిఢవిల్లుతోంది. రహదారులు, ఉద్యానాలు, ఔటర్ రింగురోడ్డు, ప్రధాన కూడళ్లు పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇటీవల కాలంలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఉద్యమస్థాయిలో చేపట్టిన హరితహారం, అర్బన్ ఫారెస్టుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాన్ని సాధించాయి. పదేళ్ల క్రితం కేవలం 33 చదరపు కిలోమీటర్లున్న అటవీ ప్రాంతం తాజాగా సుమారు 85 చ.కి.మీ వరకు విస్తరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పదేళ్ల క్రితం వరకు అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులతో తల్లడిల్లిన భాగ్యనగరంలో కొంతకాలంగా వాతావరణంలోనూ అనూహ్యమైన పురోగతి కనిపిస్తోంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావడమే కాకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
జీవ వైవిధ్యంలోనూ మార్పులు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. నగమంతటా చెట్లు భారీగా పెరగడం వల్ల వివిధ రకాల పక్షులు, వన్యప్రాణులు తిరిగి తమ ఆవాసాలకు చేరుకుంటున్నాయి. కొన్ని చోట్ల అరుదైన పక్షులు కూడా కనిపిస్తున్నాయని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఒక వైపు ఆకాశ హరŠామ్యలతో నలువైపులా మహానగరం శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలోనే మరోవైపు అటవీ ప్రాంతం, పచ్చదనం కూడా విస్తరించుకోవడం విశేషం. హరితహారంలో భాగంగా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఇందుకోసం పెద్ద ఎత్తున కృషి చేశాయి.
హైదరాబాద్ టాప్...
రాష్ట్రవ్యాప్తంగా 109 పట్టణ అటవీ ఉద్యానాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.700 కోట్లతో ప్రణాళికలను రూపొందించింది. ఇందులో సుమారు 45 అర్బన్ ఫారెస్టు పార్కులను రూ.400 కోట్లతో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుకు ఇరువైపులా ఈ పార్కులు వివిధ ప్రాంతాల్లో విస్తరించుకొని ఉన్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాలతో పోల్చితే పచ్చదనంలో హైదరాబాద్ హానగరం టాప్‌లో ఉంది. ఏటా ఆకుపచ్చ విస్తీర్ణం పెరుగుతోంది.
గత పదేళ్లలో పచ్చదనం గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. తాజాగా సుమారు 85 చదరపు కిలోమీటర్ల వరకు పచ్చదనం విస్తరించుకుంది. 2011లో చదరపు కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు ఏకంగా 85 చదరపు కిలోమీటర్లకు పెరగడం గమనార్హం. అంటే ఈ దశాబ్ద కాలంలో అనూహ్యంగా 150 శాతం వరకు అటవీ ప్రాంతం విస్తరించినట్లు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై తదితర ప్రధాన నగరాలతో పోలి్చతే పచ్చదనంలో హైదరాబాద్ నగరం టాప్‌లో ఉంది.
గ్రీన్‌సిటీ అవార్డు...
పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరాల సరసన చేరింది.నగరానికి వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డు లభించడం విశేషం. అంతర్జాతీయ ఉద్యాన ఉత్పాదకుల సమాఖ్య (ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్) ఈ ఏడాదికి వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డులను ప్రకటించగా ఏకంగా ఆరు అంశాల్లో హైదరాబాద్ ఈ అవార్డును సాధించడం గమనార్హం. దేశంలోనే ఈ అవార్డును గెలుచుకున్న ఏకైక నగరం హైదరాబాద్. కొలంబియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, టర్కీ, మెక్సికో, బ్రెజిల్, కెనడా, అర్జెంటీనా, తదితర 18 దేశాలు ఈ పోటీలో ఉన్నాయి. లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్‌లో భారతదేశం నుంచి హైదరాబాద్ అవార్డును సాధించింది.
జీవ వైవిధ్యానికి పట్టం...
భాగ్యనగరం ఉద్యానాలకు నిలయం. నిజాం నవాబుల కాలంలో వందలాది ఉద్యానవనాలతో, అడవులతో విలసిల్లిసిన హైదబాద్‌లో క్రమంగా పచ్చదనం అంతరించింది. దీంతో అనేక రకాల పక్షులు, జంతువులు, వన్యప్రాణులు ఉనికిని కోల్పోయాయి. తాజాగా చేపట్టిన పచ్చదనం అభివృద్ధి, విస్తరణ వల్ల హైదరాబాద్ జీవవైవిధ్య నగరంగా పూర్వవైభవాన్ని సంతరించుకొనే అవకాశం ఉంది.