Urban Forestry
-
Hyderabad: గత పదేళ్లలో భారీగా పెరిగిన అడవుల విస్తీర్ణం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం పచ్చదనంతో పరిఢవిల్లుతోంది. రహదారులు, ఉద్యానాలు, ఔటర్ రింగురోడ్డు, ప్రధాన కూడళ్లు పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇటీవల కాలంలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉద్యమస్థాయిలో చేపట్టిన హరితహారం, అర్బన్ ఫారెస్టుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాన్ని సాధించాయి. పదేళ్ల క్రితం కేవలం 33 చదరపు కిలోమీటర్లున్న అటవీ ప్రాంతం తాజాగా సుమారు 85 చ.కి.మీ వరకు విస్తరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పదేళ్ల క్రితం వరకు అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులతో తల్లడిల్లిన భాగ్యనగరంలో కొంతకాలంగా వాతావరణంలోనూ అనూహ్యమైన పురోగతి కనిపిస్తోంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావడమే కాకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జీవ వైవిధ్యంలోనూ మార్పులు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. నగమంతటా చెట్లు భారీగా పెరగడం వల్ల వివిధ రకాల పక్షులు, వన్యప్రాణులు తిరిగి తమ ఆవాసాలకు చేరుకుంటున్నాయి. కొన్ని చోట్ల అరుదైన పక్షులు కూడా కనిపిస్తున్నాయని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఒక వైపు ఆకాశ హరŠామ్యలతో నలువైపులా మహానగరం శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలోనే మరోవైపు అటవీ ప్రాంతం, పచ్చదనం కూడా విస్తరించుకోవడం విశేషం. హరితహారంలో భాగంగా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఇందుకోసం పెద్ద ఎత్తున కృషి చేశాయి. హైదరాబాద్ టాప్... రాష్ట్రవ్యాప్తంగా 109 పట్టణ అటవీ ఉద్యానాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.700 కోట్లతో ప్రణాళికలను రూపొందించింది. ఇందులో సుమారు 45 అర్బన్ ఫారెస్టు పార్కులను రూ.400 కోట్లతో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుకు ఇరువైపులా ఈ పార్కులు వివిధ ప్రాంతాల్లో విస్తరించుకొని ఉన్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాలతో పోల్చితే పచ్చదనంలో హైదరాబాద్ హానగరం టాప్‌లో ఉంది. ఏటా ఆకుపచ్చ విస్తీర్ణం పెరుగుతోంది. గత పదేళ్లలో పచ్చదనం గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. తాజాగా సుమారు 85 చదరపు కిలోమీటర్ల వరకు పచ్చదనం విస్తరించుకుంది. 2011లో చదరపు కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు ఏకంగా 85 చదరపు కిలోమీటర్లకు పెరగడం గమనార్హం. అంటే ఈ దశాబ్ద కాలంలో అనూహ్యంగా 150 శాతం వరకు అటవీ ప్రాంతం విస్తరించినట్లు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై తదితర ప్రధాన నగరాలతో పోలి్చతే పచ్చదనంలో హైదరాబాద్ నగరం టాప్‌లో ఉంది. గ్రీన్‌సిటీ అవార్డు... పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరాల సరసన చేరింది.నగరానికి వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డు లభించడం విశేషం. అంతర్జాతీయ ఉద్యాన ఉత్పాదకుల సమాఖ్య (ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్) ఈ ఏడాదికి వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డులను ప్రకటించగా ఏకంగా ఆరు అంశాల్లో హైదరాబాద్ ఈ అవార్డును సాధించడం గమనార్హం. దేశంలోనే ఈ అవార్డును గెలుచుకున్న ఏకైక నగరం హైదరాబాద్. కొలంబియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, టర్కీ, మెక్సికో, బ్రెజిల్, కెనడా, అర్జెంటీనా, తదితర 18 దేశాలు ఈ పోటీలో ఉన్నాయి. లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్‌లో భారతదేశం నుంచి హైదరాబాద్ అవార్డును సాధించింది. జీవ వైవిధ్యానికి పట్టం... భాగ్యనగరం ఉద్యానాలకు నిలయం. నిజాం నవాబుల కాలంలో వందలాది ఉద్యానవనాలతో, అడవులతో విలసిల్లిసిన హైదబాద్‌లో క్రమంగా పచ్చదనం అంతరించింది. దీంతో అనేక రకాల పక్షులు, జంతువులు, వన్యప్రాణులు ఉనికిని కోల్పోయాయి. తాజాగా చేపట్టిన పచ్చదనం అభివృద్ధి, విస్తరణ వల్ల హైదరాబాద్ జీవవైవిధ్య నగరంగా పూర్వవైభవాన్ని సంతరించుకొనే అవకాశం ఉంది. -
ద.మ.రైల్వేలో మియావాకి ప్లాంటేషన్
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణలో దక్షిణ మధ్య రైల్వే అగ్రగామిగా నిలిచింది. జోన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పెద్దఎత్తున మొక్కల పెంపకం చేపట్టింది. సికింద్రాబాద్ నార్త్ లాలాగూడలోని శాంతినగర్ రైల్వేకాలనీలో 4,300 చదరపు మీటర్ల పరిధిలో మియావాకి ప్లాంటేషన్ పూర్తిచేశారు. త్వరలో మరో 1,100 చదరపు మీటర్ల పరిధిలో మియావాకి మొక్కలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో శాంతినగర్ కాలనీలో 20 వేల మొక్కలతో 5,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మియావాకీ ప్లాంటేషన్ అందుబాటులోకి రానుంది. ‘సే ట్రీస్ ఎన్విరాన్మెంటల్ ట్రస్ట్‘అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో దక్షిణ మధ్యరైల్వేలో అటవీ విస్తరణకు కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. దట్టమైన అడవిలా.. మొక్కల పెంపకంలో మియావాకి ప్లాంటేషన్ విస్తృత ప్రాధాన్యతను సంతరించుకుంది. కొంతకాలంగా వివిధ ప్రభుత్వ విభాగాలు హైదరాబాద్ నగరంలో ఈ మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాయి. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే కూడా మియావాకి పెంపకానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతోపాటు జోన్ పరిధిలోని ఖాళీస్థలాల్లో మియావాకి ప్లాంటేషన్‌ను దశలవారీగా విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. మియావాకి దట్టమైన బహుళజాతుల మొక్కలతో కూడిన పట్టణ అటవీప్రాంతం. పర్యావరణ ఇంజనీరింగ్ విధానంలో ఈ మొక్కలను పెంచడం వల్ల త్వరితగతిన పెరగడమే కాకుండా దట్టంగా పచ్చదనంతో అడవిలాగా కనిపిస్తాయి. విభిన్నజాతుల మొక్కలను నాటడమే ఈ విధానంలోని ప్రత్యేకత. రెండేళ్లలో అవి స్వయం సమృద్ధిని సంతరించుకుంటాయి. రైల్వేస్టేషన్ ప్రాంగణాల్లో... మియావాకి విధానంలో మొక్కలు వందశాతం జీవించే అవకాశాలు ఉంటాయి. మొత్తం 5,055 రకాల స్థానిక పండ్లు, ఔషధ, పూల జాతి మొక్కలు, కలప వంటివి ఎంపిక చేసి పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు గద్వాల, నిజామాబాద్ రైల్వేస్టేషన్ల ప్రాంగణాల్లోనూ మియావాకి ప్లాంటేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. సుమారు 2,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 8,500 మొక్కలను పెంచారు. ఖాళీ స్థలాలను పర్యావరణ పరిరక్షణ కోసం వినియోగించడంపట్ల దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. జోన్ అంతటా పట్టణ అడవుల విస్తరణను ఒక ఉద్యమంలా చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ఎంతో కీలకమన్నారు. పచ్చదనం వల్ల మాత్రమే సురక్షితమైన వాతావరణాన్ని కాపాడుకోగలుగుతామని చెప్పారు. -
భాగ్యనగరానికి పచ్చలహారం
సాక్షి, సిటీబ్యూరో: మహానగర అవసరాలకు అనుగుణంగా ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధి ఫలితాలనిస్తోంది. హరితహారంలో భాగంగా హైదరాబాద్ చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో కొద్ది భాగాన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ సిటీ అయిన నగరానికి పర్యావరణ అవసరాలు తీరేలా మొదటి దశలో 109 అర్బన్ ఫారెస్ట్ బ్లాకులలో పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 59 పార్కులు పూర్తి కాగా మరో 50 అర్బన్ పార్కులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆనందంగా విహరించేలా.. నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఔటర్‌కు ఇరువైపులా అనేక కొత్త కాలనీలు, నివాస ప్రాంతాలు వెలిశాయి. దీంతో శివారు ప్రాంతాలను ఆనుకొని ఉన్న పట్టణ అడవుల్లో కొంతభాగాన్ని ఉద్యానాలుగా మార్పు చేయడం వల్ల వివిధ ప్రాంతాల ప్రజలకు పార్కుల్లో ఆహ్లాదంగా గడిపేందుకు అవకాశం లభిస్తుంది. హెచ్ఎండీఏ పరిధిలో త్వరలో 59 పార్కులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 39 పార్కులు ఇప్పటికే పూర్తయ్యాయి, సందర్శకులను అనుమతిస్తున్నారు. మరికొన్ని పార్కులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 20 వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం 59లో 27 పార్కులను అటవీ శాఖ అభివృద్ధి చేయగా, 16 పార్కులను హెచ్ఎండీఏ చేపట్టింది. టీఎస్ఐఐసీ, ఎఫ్డీసీ, జీహెచ్ఎంసీ, మెట్రో రైల్ సంస్థలు మిగతా పార్కులను అభివృద్ది చేస్తున్నాయి. వాకింగ్ ట్రాక్‌లు, యోగా ప్లేస్‌లు.. ►ప్రతి అర్బన్ ఫారెస్ట్ పార్కులో తప్పనిసరిగా ప్రవేశ ద్వారం, నడకదారి, వ్యూ పాయింట్ ఏర్పాటు ఉండేలా ఏర్పాటు చేశారు. ►పిల్లలకు ఆట స్థలం, యోగా షెడ్, సైక్లింగ్, వనదర్శిని కేంద్రం వంటి వాటికి ఈ పార్కుల్లో ప్రాధాన్యమిస్తున్నారు. పార్కు కోసం కేటాయించిన అడవిని మినహాయించి మిగతా అటవీప్రాంతాన్ని కన్జర్వేషన్ జోన్‌గా పరిరక్షణ చర్యలు చేపడతారు. జీవ వైవిధ్యం, నీటి వసతి వంటి సదుపాయాల పెంపునకు చర్యలు చేపట్టారు. అర్బన్ పార్కులను గాంధారి వనం, ప్రశాంతి వనం, ఆక్సీజన్ పార్కు, శాంతి వనం, ఆయుష్ వనం, పంచతత్వ పార్క్ వంటి రకరకాల థీమ్ పార్కులుగా అభివృద్ధి చేయడం విశేషం. పెరిగిన అడవుల విస్తరణ... ►హరితహారంతో నగరంలో అడవుల విస్తరణ 33.15 చదరపు కిలో మీటర్ల నుంచి 81.81 చదరపు కిలో మీటర్లకు విస్తరించింది. అంటే ఏడాదికి సగటు విస్తరణ 4.3 నుంచి 8.2 చదరపు మీటర్లకు పెరిగింది. అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిని వరల్డ్ ఫారెస్ట్ సైన్స్ గుర్తించడం మరో విశేషం. నగరంలో పచ్చదనం పెంపుదలతో పాటు కాలుష్యం బారిన పడకుండా అటవీ, మున్సిపల్ శాఖలు నిరంతరం శ్రమిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి ఎఫ్ఏఓ నుంచి ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ ట్యాగ్ లభించడానికి విశేషంగా కృషి చేశాయి. -
అర్బన్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్‌కు ప్రాధాన్యత: ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న పట్టణీకరణ ప్రభావంతోపాటు వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో అర్బన్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్‌కు ప్రాధాన్యత ఏర్పడిందని మాజీ సీఎస్ ఎస్కే జోషి అన్నారు. మంగళవారం తన పదవీ విరమణకు ముందు అర్బన్ పార్కులపై అటవీ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్కే జోషి మాట్లాడుతూ.. పట్టణాల్లో జనసాంద్రత పెరుగుతున్నందున, మరింత పచ్చదనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అర్బన్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్ అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడం కీలకమన్నారు. రాష్ట్రంలోని మొత్తం 129 రిజర్వ్ ఫారెస్ట్ క్లస్టర్లలో 70 క్లస్టర్లను కన్జర్వేషన్ బ్లాక్‌లుగా ఉంచుతామని.. నగరాలు పెరిగే కొద్దీ వాటిని అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. 193 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లలో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేస్తున్నామని, రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లున్న మున్సిపల్ పట్టణాల్లో అర్బన్ పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పీసీసీఎఫ్ ఆర్.శోభ, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులోకి మరో రెండు అర్బన్ పార్క్‌లు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర వాసులకు మరో రెండు అటవీ ఉద్యానవనాలు (అర్బన్ ఫారెస్ట్ పార్కులు) అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో ఆరోగ్య వనం, మేడిపల్లిలో జటాయు పార్క్‌లను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లు దోహదం చేస్తాయని ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నగరంలో స్వచ్ఛమైన గాలికోసం హైదరాబాద్‌కు నలువైపులా ప్రభుత్వం ‘అర్బన్ లంగ్ స్పేస్’పేరిట రిజర్వ్ ఫారెస్టులను అభివృద్ధి చేస్తోందన్నారు. దమ్మాయిగూడలో 298 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో రూ.74 లక్షల వ్యయంతో బెంచ్‌లు, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ పార్కుల్లో ఫుడ్ కోర్ట్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ గేమ్‌జోన్ ఏరియా ఏర్పాటు చేస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, అదనపు పీసీసీఎఫ్‌లు స్వర్గం శ్రీనివాస్, పర్గెయిన్, మేడ్చల్ జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పచ్చదనానికి జై
= 80 చెరువుల వద్ద గ్రీనరీ అభివృద్ధికి శ్రీకారం = పక్కా ప్రణాళికతో కదలిన అర్బన్ ఫారెస్ట్రీ = హెచ్ఎండీఏలో మొగ్గతొడిగిన పనులు సాక్షి, సిటీబ్యూరో : ప్రపంచ నగరాలకు దీటుగా గ్రేటర్ హైదరాబాద్‌ను ఆవిష్కరించేందుకు హెచ్ఎండీఏ కంకణం కట్టుకుంది. నగరంలో రోజురోజుకూ క్షీణిస్తున్న పర్యావరణాన్ని పరిరక్షించి, జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు వీలుగా వివిధ చెరువుల వద్ద సుందర నందన వనాలను సృష్టించేందుకు రంగంలోకి దిగింది. చీఫ్ సెక్రటరీ మహంతి ఆదేశాల మేరకు చెరువుల అభివృద్ధిపై హెచ్ఎండీఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆక్రమణలకు గురవుతున్న చెరువులను గుర్తించి వాటిని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ పకడ్బందీ ప్రణాళికను రూపొందించారు. పాత హుడా పరిధిలోని 80 చెరువుల వద్ద తాజాగా మొక్కలు నాటాలని, ఈ కార్యక్రమాన్ని వచ్చే డిసెంబర్‌లోగా పూర్తిచేయాలని ఆయన అధికారులకు గడువు నిర్దేశించారు. ఈ మేరకు అర్బన్ ఫారెస్ట్రీ/ ఇంజనీరింగ్ అధికారులు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన వివిధ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించేందుకు అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు కదిలారు. ఇప్పటికే 35 చెరువుల వద్ద మొక్కలు నాటేందుకు అనువుగా గుంతలు (పిట్స్) సిద్ధం చేస్తున్నారు. తమ పరిధిలోని 80 జలాశయాల వద్ద పచ్చదనం పరిఢవిల్లేందుకు అందమైన, ఆకర్షణీయమైన పూల మొక్కలతో పాటు నీడనిచ్చే వృక్ష జాతులకు చెందిన మొక్కలను నాటుతున్నారు. ప్రధానంగా చెరువు కట్టపైన ఆకాశమల్లె, సిల్వర్‌ఓక్, బాటిబ్రష్, బోగన్ విలియా ఇతర పూల మొక్కలు నాటుతుండగా, చెరువుల ఎఫ్టీఎల్ ప్రాంతంలో తుమ్మ, కానుగ, నేరెడు, బరింగ్టోనియా, ఏరుమద్ది రకాల మొక్కలు నాటుతున్నారు. ఇవి నీటిలో సైతం ఎదుగుతాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం 80 చెరువుల వద్ద సుమారు 5-6 లక్షల మొక్కలు నాటేందుకు సన్నద్ధమయ్యారు. తొలిదశలో భాగంగా మేడ్చెల్ చెరువు, తెల్లాపూర్, మేళ్ల చెరువు, వనంచెరువు తదితర చెరువుల వద్ద మొక్కలు నాటే కార్యక్రమం ఇప్పటికే మొదలైందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. చెరువుల వద్ద పచ్చని వనాలను అభివృద్ధి చేయడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడమే గాక వలస పక్షులకు సైతం ఆవాసం కల్పించేందుకు ఇవి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆక్రమణలకు అడ్డుకట్ట... చెరువుల ఎఫ్టీఎల్ బౌండ్రీస్ను ఖరారు చేసిన హెచ్ఎండీఏ ఇప్పుడు ఆక్రమణలను అడ్డుకొనేందుకు పక్కాగా చర్యలు చేపట్టింది. ఇందులో భాంగా ఇంజనీరింగ్ విభాగం పలు చెరువుల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటుకు పూనుకొంది. ప్రధానంగా పాత హుడా పరిధిలో మొత్తం 501 చెరువులున్నట్లు రికార్డుల్లో గుర్తించగా.. ఇటీవల క్షేత్రస్థాయిలో సర్వే జరిపించగా ప్రస్తుతం 301 చెరువులు మాత్రమే భౌతికంగా ఉన్నట్లు లెక్క తేలింది. వీటిలో కొన్ని చెరువులను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చే యాలని ఇటీవల లేక్ ప్రొటెక్షన్ కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు హెచ్ఎండీఏ పరిధిలో 80 చెరువులు, జీహెచ్ఎంసీ 128, ఇరిగేషన్ విభాగం 50 చెరువులను అభివృద్ధి చేసేందు కు నిర్ణయం తీసుకొన్నారు. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ తన పరిధిలోని 80 చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఒక్కో చెరువు వద్ద గ్రీనరీ, ఫెన్సింగ్ వంటివి అభివృద్ధి చేసేందుకు రూ.15-20 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే... పెద్ద చెరువులకు అంచనాలు పెరగవచ్చంటున్నారు. మేడ్చెల్ చెరువుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు రూ.64.8 లక్షల అంచనా వ్యయంతో తాజాగా టెండర్లు ఆహ్వానించడం ఇందుకు నిదర్శనం. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా వచ్చే డిసెంబర్/మార్చి నాటికల్లా అన్ని పనులు పూర్తిచేసి మొత్తం 80 చెరువుల వద్ద పచ్చదనం పరిఢవిల్లేలా చేయాలన్నది హెచ్ఎండీఏ లక్ష్యంగా పెట్టుకొన్నట్లు అధికారులు చెబుతున్నారు.