
సాక్షి, సిటీబ్యూరో: మహానగర అవసరాలకు అనుగుణంగా ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధి ఫలితాలనిస్తోంది. హరితహారంలో భాగంగా హైదరాబాద్ చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో కొద్ది భాగాన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ సిటీ అయిన నగరానికి పర్యావరణ అవసరాలు తీరేలా మొదటి దశలో 109 అర్బన్ ఫారెస్ట్ బ్లాకులలో పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 59 పార్కులు పూర్తి కాగా మరో 50 అర్బన్ పార్కులు వివిధ దశల్లో ఉన్నాయి.
ఆనందంగా విహరించేలా..
నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఔటర్‌కు ఇరువైపులా అనేక కొత్త కాలనీలు, నివాస ప్రాంతాలు వెలిశాయి. దీంతో శివారు ప్రాంతాలను ఆనుకొని ఉన్న పట్టణ అడవుల్లో కొంతభాగాన్ని ఉద్యానాలుగా మార్పు చేయడం వల్ల వివిధ ప్రాంతాల ప్రజలకు పార్కుల్లో ఆహ్లాదంగా గడిపేందుకు అవకాశం లభిస్తుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో త్వరలో 59 పార్కులు అందుబాటులోకి రానున్నాయి.
ఇందులో 39 పార్కులు ఇప్పటికే పూర్తయ్యాయి, సందర్శకులను అనుమతిస్తున్నారు. మరికొన్ని పార్కులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 20 వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం 59లో 27 పార్కులను అటవీ శాఖ అభివృద్ధి చేయగా, 16 పార్కులను హెచ్‌ఎండీఏ చేపట్టింది. టీఎస్‌ఐఐసీ, ఎఫ్‌డీసీ, జీహెచ్‌ఎంసీ, మెట్రో రైల్ సంస్థలు మిగతా పార్కులను అభివృద్ది చేస్తున్నాయి.
వాకింగ్ ట్రాక్‌లు, యోగా ప్లేస్‌లు..
►ప్రతి అర్బన్ ఫారెస్ట్ పార్కులో తప్పనిసరిగా ప్రవేశ ద్వారం, నడకదారి, వ్యూ పాయింట్ ఏర్పాటు ఉండేలా ఏర్పాటు చేశారు.
►పిల్లలకు ఆట స్థలం, యోగా షెడ్, సైక్లింగ్, వనదర్శిని కేంద్రం వంటి వాటికి ఈ పార్కుల్లో ప్రాధాన్యమిస్తున్నారు. పార్కు కోసం కేటాయించిన అడవిని మినహాయించి మిగతా అటవీప్రాంతాన్ని కన్జర్వేషన్ జోన్‌గా పరిరక్షణ చర్యలు చేపడతారు. జీవ వైవిధ్యం, నీటి వసతి వంటి సదుపాయాల పెంపునకు చర్యలు చేపట్టారు. అర్బన్ పార్కులను గాంధారి వనం, ప్రశాంతి వనం, ఆక్సీజన్ పార్కు, శాంతి వనం, ఆయుష్ వనం, పంచతత్వ పార్క్ వంటి రకరకాల థీమ్ పార్కులుగా అభివృద్ధి చేయడం విశేషం.
పెరిగిన అడవుల విస్తరణ...
►హరితహారంతో నగరంలో అడవుల విస్తరణ 33.15 చదరపు కిలో మీటర్ల నుంచి 81.81 చదరపు కిలో మీటర్లకు విస్తరించింది. అంటే ఏడాదికి సగటు విస్తరణ 4.3 నుంచి 8.2 చదరపు మీటర్లకు పెరిగింది. అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిని వరల్డ్ ఫారెస్ట్ సైన్స్ గుర్తించడం మరో విశేషం. నగరంలో పచ్చదనం పెంపుదలతో పాటు కాలుష్యం బారిన పడకుండా అటవీ, మున్సిపల్ శాఖలు నిరంతరం శ్రమిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి ఎఫ్‌ఏఓ నుంచి ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ ట్యాగ్ లభించడానికి విశేషంగా కృషి చేశాయి.