అధికారులతో కలిసి మియావాకి ప్లాంటేషన్‌ను పరిశీలిస్తున్న జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణలో దక్షిణ మధ్య రైల్వే అగ్రగామిగా నిలిచింది. జోన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పెద్దఎత్తున మొక్కల పెంపకం చేపట్టింది. సికింద్రాబాద్ నార్త్ లాలాగూడలోని శాంతినగర్ రైల్వేకాలనీలో 4,300 చదరపు మీటర్ల పరిధిలో మియావాకి ప్లాంటేషన్ పూర్తిచేశారు. త్వరలో మరో 1,100 చదరపు మీటర్ల పరిధిలో మియావాకి మొక్కలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
దీంతో శాంతినగర్ కాలనీలో 20 వేల మొక్కలతో 5,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మియావాకీ ప్లాంటేషన్ అందుబాటులోకి రానుంది. ‘సే ట్రీస్ ఎన్విరాన్‌మెంటల్ ట్రస్ట్‘అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో దక్షిణ మధ్యరైల్వేలో అటవీ విస్తరణకు కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు.
దట్టమైన అడవిలా..
మొక్కల పెంపకంలో మియావాకి ప్లాంటేషన్ విస్తృత ప్రాధాన్యతను సంతరించుకుంది. కొంతకాలంగా వివిధ ప్రభుత్వ విభాగాలు హైదరాబాద్ నగరంలో ఈ మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాయి. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే కూడా మియావాకి పెంపకానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతోపాటు జోన్ పరిధిలోని ఖాళీస్థలాల్లో మియావాకి ప్లాంటేషన్‌ను దశలవారీగా విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.
మియావాకి దట్టమైన బహుళజాతుల మొక్కలతో కూడిన పట్టణ అటవీప్రాంతం. పర్యావరణ ఇంజనీరింగ్ విధానంలో ఈ మొక్కలను పెంచడం వల్ల త్వరితగతిన పెరగడమే కాకుండా దట్టంగా పచ్చదనంతో అడవిలాగా కనిపిస్తాయి. విభిన్నజాతుల మొక్కలను నాటడమే ఈ విధానంలోని ప్రత్యేకత. రెండేళ్లలో అవి స్వయం సమృద్ధిని సంతరించుకుంటాయి.
రైల్వేస్టేషన్ ప్రాంగణాల్లో...
మియావాకి విధానంలో మొక్కలు వందశాతం జీవించే అవకాశాలు ఉంటాయి. మొత్తం 5,055 రకాల స్థానిక పండ్లు, ఔషధ, పూల జాతి మొక్కలు, కలప వంటివి ఎంపిక చేసి పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు గద్వాల, నిజామాబాద్ రైల్వేస్టేషన్ల ప్రాంగణాల్లోనూ మియావాకి ప్లాంటేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. సుమారు 2,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 8,500 మొక్కలను పెంచారు.
ఖాళీ స్థలాలను పర్యావరణ పరిరక్షణ కోసం వినియోగించడంపట్ల దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. జోన్ అంతటా పట్టణ అడవుల విస్తరణను ఒక ఉద్యమంలా చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ఎంతో కీలకమన్నారు. పచ్చదనం వల్ల మాత్రమే సురక్షితమైన వాతావరణాన్ని కాపాడుకోగలుగుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment