ప్రగతినగర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పార్కు దుస్థితి..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పలు పార్కుల అభివృద్ధి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కార్పొరేషన్‌లోని నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్‌లలో పార్కులు ఉండగా ఎక్కువగా ప్రగతినగర్‌లోనే ఉన్నాయి. అయితే ఉన్న వాటిలో కొన్ని పార్కుల నిర్వహణ, అభివృద్ధి బాగానే ఉన్నా ఎక్కువ పార్కులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. పలు పార్కుల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పార్కుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్కుల అభివృద్ధికి లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా ప్రయోజనం కనపించడం లేదని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఆట పరికరాలు కరువు...
► కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని పార్కుల్లో పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన ఆట వస్తువులు లేకపోవడంతో పరిసర ప్రాంతల్లో నివసించే పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (చదవండి: తెలంగాణలో నిరుద్యోగం తగ్గుముఖం..7.4 నుంచి 4.2 శాతానికి..)
► కేవలం కొన్ని పార్కుల్లోనే పిల్లల ఆట పరికరాలు ఉండటంతో అనేక మంది అట్టి పార్కులకు వెళ్తుండటంతో అక్కడ తీవ్ర రద్దీ ఏర్పడుతుంది.
ఓపెన్ జిమ్‌లు కూడా...
► అదే విధంగా ఓపెన్ జీమ్‌లు కూడా అన్ని పార్కుల్లో లేకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
► ప్రతి కాలనీలో ఉన్న పార్కులో ఓపెన్ జీమ్‌లు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
పార్కుల నిర్వహణలో లోపం...
పార్కుల నిర్వహణలో క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలు కాలనీల ప్రజలు వాపోతున్నారు.
► పార్కుల్లో చెట్లు, పిచ్చిమొక్కలు పెరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
► పెద్దపెద్ద రాళ్లు కూడా పార్కుల్లో ఇబ్బందికరంగా ఉన్నాయి.
► అదేవిధంగా పూర్తి స్థాయిలో గ్రీనరీ కోసం నీటిని కూడా సక్రమంగా పట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి.
► పార్కులకు ఉన్న గేట్లు కూడా సరిగ్గా లేకపోవడంతో పశువులకు పార్కులు అవాసాలుగా మారాయని వాపోతున్నారు.
► కొన్ని పార్కుల్లో అయితే చెత్తాచెదారం పేరుకుపోయి అస్తవ్యస్తంగా మారుతున్నాయి.
నిర్వహణ నిరంతరం చేయాలి
పార్కుల అభివృద్ధి, నిర్వహణ నిరంతరం కొనసాగాలి. ప్రజలు ప్రతి రోజు ఆహ్లాదం కోసం పార్కులకు వస్తుంటారు. అలాంటి సమయంలో అక్కడ ఉన్న ప్రకృతి, గ్రీనరీతో అనుభూతి పొందాలి. కానీ అలాంటి పరిస్థితి అనేక పార్కుల్లో లేదు. కేవలం కొన్ని పార్కుల్లోనే ఉంది. కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఉన్న పార్కుల్లో గ్రీనరీని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి జీమ్‌లు, ఆట పరికారాలు లేని పార్కుల్లో వాటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
– మురళి, స్థానికుడు
అభివృద్ధి, నిర్వహణకు చర్యలు తీసుకుంటా..
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధికి నోచుకొని పార్కులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. అదే విధంగా నిర్వహణకు నోచుకొని పార్కులను వెంటనే గుర్తించి ప్రతి రోజు పార్కుల నిర్వహణ సక్రమంగా జరిగే విధంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తా. అదే విధంగా పార్కుల్లో గ్రీనరీ పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటా.
– శంకరయ్య, కమిషనర్, నిజాంపేట్
Comments
Please login to add a commentAdd a comment