= 80 చెరువుల వద్ద గ్రీనరీ అభివృద్ధికి శ్రీకారం
= పక్కా ప్రణాళికతో కదలిన అర్బన్ ఫారెస్ట్రీ
= హెచ్‌ఎండీఏలో మొగ్గతొడిగిన పనులు
సాక్షి, సిటీబ్యూరో : ప్రపంచ నగరాలకు దీటుగా గ్రేటర్ హైదరాబాద్‌ను ఆవిష్కరించేందుకు హెచ్‌ఎండీఏ కంకణం కట్టుకుంది. నగరంలో రోజురోజుకూ క్షీణిస్తున్న పర్యావరణాన్ని పరిరక్షించి, జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు వీలుగా వివిధ చెరువుల వద్ద సుందర నందన వనాలను సృష్టించేందుకు రంగంలోకి దిగింది. చీఫ్ సెక్రటరీ మహంతి ఆదేశాల మేరకు చెరువుల అభివృద్ధిపై హెచ్‌ఎండీఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఆక్రమణలకు గురవుతున్న చెరువులను గుర్తించి వాటిని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ పకడ్బందీ ప్రణాళికను రూపొందించారు. పాత హుడా పరిధిలోని 80 చెరువుల వద్ద తాజాగా మొక్కలు నాటాలని, ఈ కార్యక్రమాన్ని వచ్చే డిసెంబర్‌లోగా పూర్తిచేయాలని ఆయన అధికారులకు గడువు నిర్దేశించారు. ఈ మేరకు అర్బన్ ఫారెస్ట్రీ/ ఇంజనీరింగ్ అధికారులు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన వివిధ పనులకు శ్రీకారం చుట్టారు.
ప్రత్యేకించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించేందుకు అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు కదిలారు. ఇప్పటికే 35 చెరువుల వద్ద మొక్కలు నాటేందుకు అనువుగా గుంతలు (పిట్స్) సిద్ధం చేస్తున్నారు. తమ పరిధిలోని 80 జలాశయాల వద్ద పచ్చదనం పరిఢవిల్లేందుకు అందమైన, ఆకర్షణీయమైన పూల మొక్కలతో పాటు నీడనిచ్చే వృక్ష జాతులకు చెందిన మొక్కలను నాటుతున్నారు.
ప్రధానంగా చెరువు కట్టపైన ఆకాశమల్లె, సిల్వర్‌ఓక్, బాటిబ్రష్, బోగన్ విలియా ఇతర పూల మొక్కలు నాటుతుండగా, చెరువుల ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో తుమ్మ, కానుగ, నేరెడు, బరింగ్‌టోనియా, ఏరుమద్ది రకాల మొక్కలు నాటుతున్నారు. ఇవి నీటిలో సైతం ఎదుగుతాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం 80 చెరువుల వద్ద సుమారు 5-6 లక్షల మొక్కలు నాటేందుకు సన్నద్ధమయ్యారు. తొలిదశలో భాగంగా మేడ్చెల్ చెరువు, తెల్లాపూర్, మేళ్ల చెరువు, వనంచెరువు తదితర చెరువుల వద్ద మొక్కలు నాటే కార్యక్రమం ఇప్పటికే మొదలైందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. చెరువుల వద్ద పచ్చని వనాలను అభివృద్ధి చేయడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడమే గాక వలస పక్షులకు సైతం ఆవాసం కల్పించేందుకు ఇవి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆక్రమణలకు అడ్డుకట్ట...
చెరువుల ఎఫ్‌టీఎల్ బౌండ్రీస్‌ను ఖరారు చేసిన హెచ్‌ఎండీఏ ఇప్పుడు ఆక్రమణలను అడ్డుకొనేందుకు పక్కాగా చర్యలు చేపట్టింది. ఇందులో భాంగా ఇంజనీరింగ్ విభాగం పలు చెరువుల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటుకు పూనుకొంది. ప్రధానంగా పాత హుడా పరిధిలో మొత్తం 501 చెరువులున్నట్లు రికార్డుల్లో గుర్తించగా.. ఇటీవల క్షేత్రస్థాయిలో సర్వే జరిపించగా ప్రస్తుతం 301 చెరువులు మాత్రమే భౌతికంగా ఉన్నట్లు లెక్క తేలింది. వీటిలో కొన్ని చెరువులను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చే యాలని ఇటీవల లేక్ ప్రొటెక్షన్ కమిటీ నిర్ణయించింది.
ఆ మేరకు హెచ్‌ఎండీఏ పరిధిలో 80 చెరువులు, జీహెచ్‌ఎంసీ 128, ఇరిగేషన్ విభాగం 50 చెరువులను అభివృద్ధి చేసేందు కు నిర్ణయం తీసుకొన్నారు. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ తన పరిధిలోని 80 చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఒక్కో చెరువు వద్ద గ్రీనరీ, ఫెన్సింగ్ వంటివి అభివృద్ధి చేసేందుకు రూ.15-20 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
అయితే... పెద్ద చెరువులకు అంచనాలు పెరగవచ్చంటున్నారు. మేడ్చెల్ చెరువుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు రూ.64.8 లక్షల అంచనా వ్యయంతో తాజాగా టెండర్లు ఆహ్వానించడం ఇందుకు నిదర్శనం. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా వచ్చే డిసెంబర్/మార్చి నాటికల్లా అన్ని పనులు పూర్తిచేసి మొత్తం 80 చెరువుల వద్ద పచ్చదనం పరిఢవిల్లేలా చేయాలన్నది హెచ్‌ఎండీఏ లక్ష్యంగా పెట్టుకొన్నట్లు అధికారులు చెబుతున్నారు.