ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ కుమ్మక్కై ఖజానాకు భారీ నష్టం కలిగించారు
మేడిగడ్డ బరాజ్‌పై మధ్యంతర నివేదికలో విజిలెన్స్ స్పష్టీకరణ
అధికారుల తీరుతో నిర్మాణ సంస్థకు అనుచిత లబ్ధి..
పనులను పరిశీలించకుండానే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు
కాఫర్ డ్యామ్ తొలగించకుండా నిర్మాణ సంస్థ తప్పిదం చేసింది
దానితోపాటు నిర్వహణ లోపాలతో బరాజ్‌కు ముప్పు కలిగింది
అధికారులు, సంస్థపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని సూచనలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధంగా భారీ కుట్రకు పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పేర్కొంది. రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం కలిగించినందుకు ఆ అధికారులు, నిర్మాణ సంస్థపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టవచ్చని స్పష్టం చేసింది. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచిన మధ్యంతర నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. విజిలెన్స్ ఆ నివేదికలో పేర్కొన్న కీలక అంశాలివీ..
ఈఈ, ఎస్‌ఈలపై క్రిమినల్ చర్యలు!
మేడిగడ్డ బరాజ్‌లో మిగులు పనుల పూర్తికి ఎలాంటి హామీ తీసుకోకుండానే.. పనులు దాదాపుగా పూర్తయినట్టుగా ధ్రువీకరిస్తూ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’కి మహదేవ్‌పూర్ డివిజన్–1 ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) సీహెచ్ తిరుపతిరావు, ఎస్‌ఈ బీవీ రమణారెడ్డి సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయంలో అధికారులిద్దరూ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’తో కుమ్మక్కై అనుచిత లబ్ధి కల్పించారు.
రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ.. ఒప్పందంలోని 42వ క్లాజ్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండానే పనులు పూర్తయినట్టు తప్పుడు ధ్రువీకరణ ఇచ్చారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తిని సరిగ్గా పరిశీలించలేదు. ఏ పని పూర్తయిందో స్పష్టంగా పేర్కొనలేదు. ప్రభుత్వ ఖజానాకు రూ.22.9 కోట్ల నష్టం వాటిల్లింది. ఎస్‌ఈ, ఈఈతోపాటు నిర్మాణ సంస్థ కూడా సంబంధిత చట్టాల కింద క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అర్హులే.
తప్పుడు వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్..
మేడిగడ్డ బరాజ్ మిగులు పనులు పూర్తిచేయాలని... దెబ్బతిన్న సీసీ బ్లాకులు, వియరింగ్ కోట్‌కు మరమ్మతులు చేయాలని 2021 ఫిబ్రవరి 17న కాంట్రాక్టర్‌కు జారీచేసిన నోటీసులను విస్మరిస్తూ, 2021 మార్చి 15న వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. బరాజ్‌లో లోపాలు సరిదిద్దాలంటూ 2020 మే 18న స్వయంగా తానే జారీ చేసిన నోటీసులను విస్మరిస్తూ.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్‌పై ఎస్‌ఈ రమణారెడ్డి కౌంటర్ సంతకం చేసి ఒప్పందంలోని 52.2(సీ) క్లాజును ఉల్లంఘించారు. మిగులు పనుల పూర్తి, మరమ్మతుల నిర్వహణలో ఎల్ అండ్ టీ విఫలమైంది.
మెజర్‌మెంట్ బుక్ నం.56/2000 పేరుతో వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేశారు. కానీ అసలు అలాంటి సర్టిఫికెటే లేదని తేలింది. అంటే పనులు పూర్తయ్యాయా లేదా అన్నది పరిశీలించలేదని అర్థమవుతోంది. ఉద్దేశపూర్వకంగానే నిర్మాణ సంస్థకు అనుచిత లబ్ధి కలిగించారు. బరాజ్ దెబ్బతిన్నా నిర్మాణ సంస్థను బాధ్యులుగా చేయలేని పరిస్థితి కల్పించి ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితిలో పడేశారు. గడువుకు ముందే బ్యాంకు గ్యారంటీలనూ తిరిగి ఇచ్చేయడం కూడా.. నిర్మాణ సంస్థతో మరమ్మతులు చేయించే అవకాశానికి గండికొట్టింది.
నిర్వహణలో నేరపూరిత నిర్లక్ష్యం
బరాజ్ ప్రారంభించిన నాటి నుంచే డ్యామేజీలు, లీకేజీలు బయటపడినా.. అధికారులు, నిర్మాణ సంస్థ మరమ్మతులు చేపట్టలేదు. డ్యామ్ అధికారులు నిర్వహణను గాలికి వదిలేసి, నిర్మాణ సంస్థకు లేఖలు రాయడంతో సరిపెట్టారు. డ్యామ్ అధికారుల నేరపూరిత నిర్లక్ష్యంతోనే బరాజ్ కుంగిపోయి ఖజానాకు తీవ్ర నష్టం కలిగించింది. అధికారులు, కాంట్రాక్టర్‌ను ప్రాసిక్యూట్ చేయాలి.
కొంపముంచిన కాఫర్ డ్యామ్!
బరాజ్ నిర్మాణానికి ముందు వరదను మళ్లించడానికి ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్, దానికి సంబంధించిన షీట్‌పైల్స్‌ను నిర్మాణం పూర్తయిన తర్వాత సంపూర్ణంగా తొలగించలేదు. అవి నదిలో సహజ వరద ప్రవాహానికి అడ్డంకిగా మారి బరాజ్‌కు ముప్పు కలిగించాయి. కాఫర్ డ్యామ్ తొలగించడం పూర్తిగా కాంట్రాక్టర్ బాధ్యతే. బరాజ్‌ను ప్రారంభించాక కాంట్రాక్టర్‌కు అధిక చెల్లింపులు చేసి.. ఉద్దేశపూర్వకంగా నిధుల దురి్వనియోగానికి పాల్పడేందుకు కాఫర్ డ్యామ్ అంచనాలను రూ.61.21 కోట్లకు పెంచారు. ఈ అంశంలో అధికారులు, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
– డీవాటరింగ్ పనుల్లో అధికారులు కాంట్రాక్టర్‌కు రూ.39.43 కోట్ల అనుచిత లబ్ధి కలిగించారు. పని విలువలో డీవాటరింగ్ వ్యయం 3శాతంలోపే ఉండాలి. కానీ 2017 డిసెంబర్ 9న నాటి సీఎం నిర్వహించిన సమీక్షలో 5 శాతానికి మించిన వ్యయంతో సవరణ అంచనాలను ఆమోదించారు.
నాణ్యత పరీక్షలు లేకుండానే చెల్లింపులు
బరాజ్‌లకు నాణ్యత పరీక్షలు నిర్వహించకుండానే కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించారు. నాణ్యత పరీక్షలు నిర్వహించకుండా క్షేత్రస్థాయి ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు భారీ తప్పిదం చేశారు..’’ అని విజిలెన్స్ మధ్యంతర నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment