భద్రాచలం వద్ద 35.5 అడుగులకు చేరిన నీటిమట్టం
ప్రాజెక్టులు, బరాజ్‌ల్లోకి పెరుగుతున్న ప్రవాహం
పలుచోట్ల గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
నేడు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్‌వర్క్: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పోటెత్తుతోంది. ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శనివారం నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను, ఆసిఫాబాద్ జిల్లా కుమురంభీం (ఆడ) ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తారు. పలు బరాజ్‌ల గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద శనివారం రాత్రి 35 అడుగులు దాటి ప్రవహిస్తోంది. తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడం, వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉండటంతో గోదావరికి వరద పెరగొచ్చని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మేడిగడ్డకు వచ్చిన నీళ్లు వచ్చినట్లే..
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కి 3,73,500 క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచడంతో వచ్చిన నీళ్లు వచ్చినట్టు కిందికి వెళ్లిపోతున్నాయి. బరాజ్ ఇప్పటికే దెబ్బతిని ఉండడంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నిరంతరం వరద పరిస్థితిని, బరాజ్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బరాజ్‌లో నీటి మట్టం 100 మీటర్లకు గాను 93 మీటర్లు ఉంది.
మహదేవపూర్ మండలం అన్నారం (సరస్వతీ) బరాజ్‌లో నీటి మట్టం 119 మీటర్లకు గాను 106.96 మీటర్లు ఉంది. బరాజ్‌లోని 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్‌లోకి 4,82,800 క్యూసెక్కులు చేరుతుండగా 59 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. వాటి దిగువన ఉన్న దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బరాజ్‌లోకి 5,93,167 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో వరదను దిగువకు వదిలేస్తున్నారు.
దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. శనివారం రాత్రి వరద తీవ్రత 6,02,985 క్యూసెక్కులు చేరగా, నీటి మట్టం 35.5 అడుగులకు పెరిగిపోయింది. అధికార యంత్రాంగం అప్రమత్తమై కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసింది. నీటిమట్టం 43 అడుగులకు పెరిగితే తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఇక పోలవరం ప్రాజెక్టులోకి 4.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా 48 గేట్ల ద్వారా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు.
6 రోజుల్లో 73 టీఎంసీలు సముద్రం పాలు
మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంతో గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచారు. దీంతో వచ్చిన వరద వచ్చినట్టు దిగువనకు వెళ్లిపోతోంది. గత ఆరు రోజుల్లో ఏకంగా 73 టీఎంసీల వరద మేడిగడ్డ బరాజ్ గుండా ప్రవహించి సముద్రంలో కలిసిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాలిపేరుకు పోటెత్తిన వరద
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరుకు వరద పోటెత్తుతోంది. దీంతో 25 గేట్లు ఎత్తి 1,45,078 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలావుండగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను శనివారం ఎత్తారు. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 15,338 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 (7.603 టీఎంసీ) అడుగులు కాగా, ప్రస్తుతం 690.400 (5.345టీఎంసీ) అడుగులు ఉంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడ గ్రామంలోని కుమురంభీం (అడ) ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తారు. ప్రాజెకుŠట్ సామర్థ్యం 5.9 టీఎంసీలు కాగా 1,941 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా వరద కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి 18,245 క్యూసెక్కుల వరద నిలకడగా కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా òపెరిగింది. అయితే సాయంత్రానికి 15,100 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 (80 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం రాత్రికి 1,067.00 (18.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి 9గంటల వరకు నీటిమట్టం 140.91 మీటర్లుగా, నీటి నిల్వ 5.96 టీఎంసీలుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment