మాజీ ఈఎన్‌సీ మురళీధర్, డిప్యూటీ సీఈ అజ్మల్ ఖాన్ నుంచి వివరాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి గల కారణాలపై తుది నివేదిక అందించడానికి వీలుగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కసరత్తును ముమ్మరం చేసింది. మేడిగడ్డ బరాజ్‌కి సంబంధించిన అంశాలపై లోతైన విచారణలో భాగంగా కీలక అధికారులను విచారించింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు శనివారం నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్‌సీ (జనరల్) సి.మురళీధర్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అజ్మల్ ఖాన్ హాజరయ్యారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో మార్పులు, చేర్పులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు..? సవరణ అంచనాలకు ఆమోదం తెలిపిందెవరు..?
మేడిగడ్డ నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయాలని ఆదేశించింది ఎవరు..? వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 7న ఈఎన్‌సీ (ఓ అండ్ ఎం), స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు బి.నాగేంద్రరావును, 8న సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) మాజీ చీఫ్ ఇంజనీర్ టి.శ్రీనివాస్, డైరెక్టర్ వర్క్ అకౌంట్స్ డైరెక్టర్ వి.ఫణిభూషణ్‌శర్మను విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సంస్థ ప్రాథమిక, మధ్యంతర నివేదికలు అందించగా...తుది నివేదికను సత్వరం అందించాలని కాళేశ్వరం విచారణ కమిషన్ విజిలెన్స్‌ను ఆదేశించింది. సెప్టెంబర్ నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించగా..ఆ సంస్థ మరింత గడువును కోరినట్లు తెలిసింది. దాంతో ఈ నెలాఖరుకల్లా తుది నివేదికను సమర్పించడానికి అవసరమైన వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకోవడానికి వీలుగా కసరత్తును చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment