కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీలో భారీగా బయటపడిన ఇసుక మేటలు
బ్యారేజీ నుంచి నీటిని వదిలేయడంతో భారీగా బయటపడిన ఇసుక
1.92 కోట్ల మెట్రిక్ టన్నుల మేర నిల్వ ఉన్నట్లు అంచనా
ఇసుకను విక్రయించి ఆదాయం సమకూర్చుకునేందుకు సర్కారు ప్రణాళికలు
వేలంతో ఖజానాకు రూ.800 కోట్ల మేర ఆదాయం వచ్చే చాన్స్
ప్రస్తుతానికి 14 బ్లాకుల్లో రూ.380 కోట్ల విలువైన ఇసుకే వెలికితీత
తవ్వకాలు, స్టాక్ యార్డుకు చేరవేసే బాధ్యత కాంట్రాక్టర్లకు..
ఈ నెల 25 వరకు టెండర్ల స్వీకరణ..షెడ్యూల్ విడుదల చేసిన టీజీఎండీసీ
అన్నారం, సుందిళ్లలోని ఇసుక నిల్వలపై డీఎల్‌ఎస్‌సీల దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాజకీయ విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువుగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ‘మేడిగడ్డ బ్యారేజీ’ రాష్ట్ర ఖజానాకు భారీగా కాసుల వర్షం కురిపించబోతోంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో నీటిని దిగువకు వదలడంతో ప్రాజెక్టు ఎగువ భాగాన భారీగా ఇసుక మేటలు బయట పడ్డాయి. దీంతో వీటిని తవ్వి ఇసుకను విక్రయించడం ద్వారా భారీఎత్తున ఆదాయాన్ని రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మేడిగడ్డలో బయటపడిన ఇసుక నిల్వల ద్వారా ఖజానాకు రూ.800 కోట్ల మేర ఆదాయం లభించే అవకాశమున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
తొలిదశలో రూ.380 కోట్ల మేర ఆదాయం సమకూర్చుకునేలా 14 బ్లాక్‌లను వేలం వేసే బాధ్యతను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ)కు అప్పగించారు. ఈ మేరకు ఇప్పటికే టెండర్ల షెడ్యూల్‌ను ప్రకటించిన టీజీఎండీసీ జూలై మొదటి వారంలో వేలం ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే మరిన్ని బ్లాక్‌ల నుంచి ఇసుకను వెలికి తీయాలని భావిస్తోంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన ఉన్న సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ ఇసుక లభ్యతపై ఇప్పటికే జిల్లా స్థాయి ఇసుక కమిటీలు (డీఎల్‌ఎస్‌సీ) ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇసుక వెలికితీతకు ఇతరత్రా ఎలాంటి ఆటంకాలు లేకుంటే రికార్డు స్థాయిలో ఆదాయం వస్తుందని టీజీఎండీసీ లెక్కలు వేస్తోంది.
వెలికితీతకు 18–24 నెలల గడువు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద సుమారు రూ.800 కోట్ల విలువైన సుమారు 1.92 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక మేట వేసినట్లు డీఎల్‌ఎస్‌సీ గుర్తించింది. అయితే ప్రస్తుతానికి రూ.380 కోట్ల విలువైన 92.77 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక వెలికితీత సాధ్యమవుతుందనే నిర్ణయానికి వచ్చారు. ఇసుక వెలికితీత, స్టాక్ యార్డుకు చేరవేసే బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ‘ఇ ప్రొక్యూర్‌మెంట్ టెండర్’ ద్వారా టీజీఎండీసీ కాంట్రాక్టర్లను ఎంపిక చేయనుంది.
ఈ నెల 25 వరకు టెండర్లు స్వీకరించి, వచ్చే నెల 3న తెరిచేలా సంస్థ ఇప్పటికే టెండర్ షెడ్యూల్‌ను ప్రకటించింది. మహదేవ్‌పూర్ మండలంలోని 14 బ్లాక్‌ల నుంచి ఇసుకను వెలికితీస్తారు. బెగ్లూరు, ఎలే్కశ్వరం, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి, మహదేవపూర్ పరిధిలో ఈ బ్లాక్‌లు ఉన్నాయి. గోదావరి నదికి ఎగువ నుంచి వచ్చే వరద, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇసుక వెలికితీతకు 18 నుంచి 24 నెలల గడువును టీజీఎండీసీ నిర్దేశించింది.
అన్నారం, సుందిళ్ల ఇసుకతో రూ.500 కోట్ల ఆదాయం!
మేడిగడ్డ బ్యారేజీ ఎగువ భాగంలోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ ఉన్న ఇసుక మేటల పరిమాణాన్ని గుర్తించడంపై డీఎల్‌ఎస్‌సీలు దృష్టి సారించాయి. సంబంధిత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డీఎల్‌ఎస్‌సీ సభ్యులుగా ఉన్న రెవెన్యూ, పంచాయతీ, భూగర్భ జలవనరుల శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, భూగర్భ వనరుల విభాగాలకు చెందిన అధికారులు ఇప్పటికే ఈ బ్యారేజీలను సందర్శించినట్లు సమాచారం. రెండు బ్యారేజీల్లోని ఇసుకతో మరో రూ.500 కోట్ల ఆదాయం లభించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. డీఎల్‌ఎస్‌సీల నుంచి నివేదికలు అందిన తర్వాత వీటికి సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తామని టీజీఎండీసీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment