సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న పట్టణీకరణ ప్రభావంతోపాటు వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో అర్బన్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్‌కు ప్రాధాన్యత ఏర్పడిందని మాజీ సీఎస్ ఎస్‌కే జోషి అన్నారు. మంగళవారం తన పదవీ విరమణకు ముందు అర్బన్ పార్కులపై అటవీ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌కే జోషి మాట్లాడుతూ.. పట్టణాల్లో జనసాంద్రత పెరుగుతున్నందున, మరింత పచ్చదనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అర్బన్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్ అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడం కీలకమన్నారు.
రాష్ట్రంలోని మొత్తం 129 రిజర్వ్ ఫారెస్ట్ క్లస్టర్లలో 70 క్లస్టర్లను కన్జర్వేషన్ బ్లాక్‌లుగా ఉంచుతామని.. నగరాలు పెరిగే కొద్దీ వాటిని అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. 193 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లలో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేస్తున్నామని, రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లున్న మున్సిపల్ పట్టణాల్లో అర్బన్ పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పీసీసీఎఫ్ ఆర్.శోభ, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment