Gardens
-
రోబో తోటమాలి!
కృత్రిమ మేధ ఇందుగలదు, అందులేదనే సందేహానికి తావులేకుండా విస్తరిస్తోంది. అన్ని రంగాల్లోనూ ఏఐ వాడకం ఇంతింతై... అన్నట్టుగా క్రమంగా పెరిగిపోతోంది. వ్యవసాయంలో కూడా ఇప్పటికే కృత్రిమ మేధను పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. నెదర్లాండ్స్‌లో తులిప్స్ రైతులు ఈ విషయంలో ఇంకో అడుగు ముందుకేశారు. తెగుళ్ల బారిన పడ్డ పూల ఏరివేతకు హైటెక్ బాట పట్టారు. వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి ఏరేసేందుకు ఏఐ సాయంతో రూపొందిన రోబోను ఉపయోగిస్తున్నారు. ఖరీదు చాలా ఎక్కువే అయినా ఈ రోబో మనుషులకు ఏమాత్రంతీసిపోకుండా పని పూర్తి చేస్తూ మన్ననలు అందుకుంటోంది. దాంతో నెదర్లాండ్స్ అంతటా తులిప్ తోటల్లో ఈ రోబోల వాడకం నానాటికీ పెరిగిపోతోంది. అందాల తులిప్ పూలకు నెదర్లాండ్స్ పెట్టింది పేరు. అంతేగాక ప్రపంచంలోకెల్లా అతి పెద్ద తులిప్స్ ఉత్పత్తిదారు కూడా. సీజన్లో విరగబూసి అందాలు వెదజల్లే అక్కడి తులిప్ తోటలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు బారులు తీరతారు. ఇలా తులిప్స్ సాగు ఉత్పత్తిపరంగానే గాక పర్యాటకంగా కూడా నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అయితే వాటి సాగు ఖరీదైన వ్యవహారం. పూలను, మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. చీడపీడల బారిన పడకుండా నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. వైరస్లు, తెగుళ్ల బారిన పడ్డ పూలు, మొక్కలను ఎప్పటికప్పుడు కనిపెట్టి ఏరివేయడం చాలా కీలకం. లేదంటే మొక్కలు బలహీనపడిపోతాయి. పూలు కూడా చిన్నగా, బలహీనంగా పూస్తాయి. పైగా వైరస్ తోటంతా విస్తరించి మొత్తానికే చేటు తప్పదు. ఇప్పటిదాకా మనుషులే రాత్రింబవళ్లూ తోటల్లో కలియదిరుగుతూ ఒక్కో మొక్కనూ, పువ్వునూ పట్టి చూస్తూ పాడైన వాటిని గుర్తించి ఏరేసేవారు. ఇందుకు ప్రత్యేక నైపుణ్యం అవసరం. వారిని సిక్నెస్ స్పాటర్స్‌గా పిలిచేవారు. కానీ ఏఐ సాయంతో తయారు చేసిన రోబో ఇప్పుడు వారికి దీటుగా ఈ పని చేసి పెడుతోంది. తులిప్ తోటలను తెగుళ్ల బారినుంచి కాపాడే హైటెక్ ఆయుధంగా మారుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45కు పైగా ఏఐ రోబోలు తులిప్ తోటలను కాపు కాస్తున్నాయి. చీడపీడలు, రోగాల బారినుంచి వాటిని కాపాడే పనిలో తలమునకలుగా ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ ఇలా పని చేస్తుంది... ► ఏఐ రోబో తులిప్ తోటల్లో ఒక్కో సాలు గుండా గంటకు కిలోమీటర్ వేగంతో నింపాదిగా కదులుతుంది. ►ఒక్కో మొక్కనూ, ఒక్కో పూవునూ, దాని తాలూకు రెమ్మలను అణువణువూ పరీక్షిస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వేలాది పొటోలు తీస్తుంది. ►తనలో స్టోరై ఉన్న సమాచారం సాయంతో ఆ ఫొటోలను కూలంకషంగా విశ్లేషిస్తుంది. తద్వారా సదరు మొక్క, పూవు పాడైందీ, బాగున్నదీ నిర్ణయిస్తుంది. ►పాడైనవాటిని ఎప్పటికప్పుడు ఏరేస్తూ ముందుకు సాగుతుంది. ►ఈ రోబోలను తయారు చేసింది హెచ్2ఎల్ రోబోటిక్స్ లిమిటెడ్‌కు చెందిన ఎరిక్ డీ జోంగ్ కంపెనీ. ►తెగుళ్ల బారిన పడ్డ మొక్కలు, పూలను పక్కగా గుర్తించేందుకు కావాల్సిన సమాచారమంతటినీ రోబోకు ఫీడ్ చేసినట్టు కంపెనీ వివరించింది. ►ఈ సమాచారాన్ని తులిప్స్ సాగు చేసే రైతులు, సిక్నెస్ స్పాటర్ల నుంచి కంపెనీ సేకరించింది. కచ్చితత్వంతో కూడిన సాగు... అలెన్ విసర్ అనే ఆసామి తన తులిప్ తోటలో రెండేళ్లుగా ఏఐ రోబోను వాడుతున్నాడు. ఆయన కుటుంబం మూడు తరాలుగా తులిప్స్సాగు చేస్తోంది. ‘‘ఈ రోబో ఖరీదు 2 లక్షల డాలర్లు! అంత డబ్బుతో ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారే కొనుక్కోవచ్చు’’ అన్నాడాయన. అయితే, ‘స్పోర్ట్స్ కారు పాడైన తులిప్‌లను ఏరిపడేయదు కదా!’ అంటూ చమత్కరించాడు. ‘‘ఈ రోబో ఖరీదైనదే. కానీ నిపుణులైన సిక్నెస్ స్పాటర్లు నానాటికీ తగ్గిపోతున్న సమయంలో సరిగ్గా చేతికి అందివచ్చింది’’ అని చెప్పాడు. దీన్ని ‘కచ్చితత్వంతో కూడిన సాగు’గా అభివరి్ణంచాడు! కొసమెరుపు నెదర్లాండ్స్ ఉత్తర కోస్తా తీరంలో ప్రఖ్యాత డబ్ల్యూఏఎం పెన్సింగ్స్ తులిప్ తోటలోని ఏఐ రోబోకు అక్క డే జీవితాంతం సిక్నెస్ స్పాటర్‌గా పని చేసి రిటైరైన థియో వాన్‌డర్ వూర్ట్ పేరు పెట్టారు. దీని పనితీరు ఆయన్ను కూడా మెప్పించడం విశేషం. ‘‘తోటల్లో తిరిగీ మా నడుములు పడిపోయేవి! మా పనిని ఈ రోబో అలవోకగా చేసేస్తోంది. పాడైన మొ క్కలు, పూలను మాకు ఏ మాత్రమూ తీసిపోని విధంగా గుర్తించి ఏరేస్తోంది’’ అంటూ కితాబిచ్చాడాయన! -
మిగిలిపోయిన అన్నం, కూరల్ని మొక్కలకు పడేయండి
అన్నం, కూరలు మిగిలిపోతే పడేస్తుంటారు. అయితే ఆ పడేసేదేదో మొక్కల దగ్గర పడేస్తే వాటికి కావాల్సిన పోషకాలు అంది, అవి ఏపుగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ►మిగిలిపోయిన పప్పులో నీళ్లు కలిపి పలుచగా చేయాలి. ఈ పప్పు నీళ్లను మొక్కలకు పోయాలి. మజ్జిగ మరీ పుల్లగా అయితే తాగలేము. ఈ పుల్లటి మజ్జిగను బకెట్ నీళ్లల్లో పోసి కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోయాలి. ► మిగిలిపోయిన అన్నాన్ని మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోయాలి. బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు కడిగిన నీటిని సింక్‌లో పోయకుండా మొక్కలకు పోస్తే మంచిది. ► ఉల్లిపాయ తొక్కలు, అరటి తొక్కలను పడేయకుండా నీటిలో నానబెట్టాలి. పదిగంటల తరువాత ఈ నీటిని మొక్కలకు పోయాలి. ఈ నీటి నుంచి నైట్రోజన్, పొటాషియం, ఫాస్పరస్‌లు మొక్కలకు పుష్కలంగా అందుతాయి. చూశారుగా... మిగిలిపోయినవి మొక్కలకు ఎంత మేలు చేస్తున్నాయో. ఇంకెందుకు ఆలస్యం మీ గార్డెన్ మరింత పచ్చగా కళకళలాడించేందుకు ప్రయత్నించండి. -
పచ్చదనంపై ప్రేమ, ఏకంగా డబుల్ డెక్కర్ గార్డెన్‌నే పెంచేస్తోంది
పచ్చదనంతో కళకళలాడే పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు. చాలామందికి చిన్నతనమంతా పల్లెల్లోనే గడుస్తుంది. ఇప్పటి పిల్లలకు ఆ అవకాశం లేదు. పల్లెటూళ్లంటే పండగలు, పబ్బాలు, సెలవలు గడపడానికి వెళ్లే పర్యాటక స్థలాలుగా భావిస్తున్నారు. అరవైపదుల వయసు వారు మాత్రం పల్లెల మట్టివాసనలు, పచ్చదనం పరిమళాలను ఇప్పటికీ కోరుకుంటూనే ఉన్నారు. ఈ కోవకు చెందిన నీలిమా దింగ్రా... తన చిన్ననాటి పచ్చదనాన్ని ఆస్వాదించేందుకు ఏకంగా డబుల్ డెక్కర్ గార్డెన్‌నే పెంచేస్తోంది. తనలాగా పచ్చదనాన్ని ఆస్వాదించాలనుకునేవారికీ సలహాలు సూచనలు ఇస్తూ వారితో మొక్కలు నాటిస్తోంది. అరవై ఏళ్ల వయసులో ఇవన్నీ చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది నీలిమా దింగ్రా. ఢిల్లీకి చెందిన నీలిమా దింగ్రా స్టాండర్డ్ సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటర్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్. దీని విలువ కోట్లలోనే ఉంటుంది. వ్యాపార భాగస్వామితో కలిసి, రూ.75 లక్షల పెట్టుబడితో నీలిమ దీనిని ప్రారంభించింది. కొద్దిసంవత్సరాల్లోనే కంపెనీని లాభాల బాట పట్టించింది. డిల్లీలో ప్రధాన కార్యాలయంతో పాటు, ముంబైలో మరో రెండు కార్యాలయాలు నిర్వహిస్తూ సక్సెస్‌పుల్ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది. ఇంతపెద్ద వ్యాపారం చూసుకునేవారికి ఏమాత్రం తీరిక దొరికినా.. వయసు రీత్యా కాస్త విశ్రాంతి తీసుకుంటారు. కానీ నీలిమ మాత్రం ఇంట్లో డబుల్ డెక్కర్ గార్డెన్‌ను పెంచుతూ అబ్బురపరుస్తోంది. చిన్నప్పటిలా ఉండాలని... నీలిమ చిన్నప్పుడు హర్యాణాలోని రోహ్తక్లో పెరిగింది. అక్కడ ఎటుచూసిన పచ్చదనమే కనిపించేది. స్కూలు నుంచి రాగానే జామ చెట్టు కింద కూర్చుని అన్నం, స్నాక్స్ వంటివి తినేది. ఆకుపచ్చని పరిసరాల్లో పెరగడం వల్ల మొక్కలపైన ఎనలేని మక్కువ ఏర్పడింది. పెద్దయ్యి చదువులు, పెళ్లితో పెద్దపట్టణంలో స్థిరపడింది. అభివృద్ధి పేరుతో ఎక్కడ చూసిన కాంక్రీట్ నిర్మాణాలే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ షో కోసం పెంచుతున్న ఒకటి రెండు మొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. అందరికీ ప్రాణవాయువు ఇచ్చేంత పచ్చదనం మచ్చుకైనా కనిపించడంలేదు. పచ్చదనాన్ని ఇష్టపడే నీలిమ ఏ మాత్రం సమయం దొరికినా దగ్గర్లోని పార్క్‌కు వెళ్లేది. చల్లని సాయంత్రాల్లో పార్క్‌లో నడుస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉండేది తనకు. అయితే కొద్దిరోజులకు మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. దీంతో 2015 నుంచి పార్క్‌కు వెళ్లడం మానేసింది. పార్క్‌లో నడిచే సమయాన్నీ ఇంట్లో మొక్కలు నాటడానికి కేటాయించింది. ఇంట్లో ఒక మూలన కొద్దిపాటి స్థలంలో విత్తనాలు వేసింది. అవి చక్కగా మొలకెత్తడంతో ఆమె గార్డెన్‌ను విస్తరించడం మొదలు పెట్టింది. ఇలా విస్తరిస్తూ రెండు అంతస్తుల్లో పచ్చటి గార్డెన్‌ను అభివృద్ది చేసింది. ఈ డబుల్ డెక్కర్ టెర్రస్ గార్డెన్‌ను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో నిర్వహించడం విశేషం. ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ సమయం కేటాయిస్తూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అందమైన టెర్రస్ గార్డెన్‌ను నిర్వహిస్తోంది. పెంచుతూ పంచుతోంది.. తన డబుల్ డెక్కర్ గార్డెన్ పచ్చదనంతో కళకళలాడుతుండడం నీలిమకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ సంతోషంతో మొక్కలను ఇతరులకు ఉచితంగా అందించేది. తన గార్డెన్లో పెరిగిన మొక్కల పిలకలు, అంటుకట్టడం ద్వారా వచ్చిన కొత్త మొక్కలను తెలిసినవారికి, గుళ్లకు ఇస్తోంది. ఇలా ఇప్పటి దాకా వెయ్యికి పైగా మొక్కలను పంచింది. నీలిమ గార్డెన్ చూసిన వారంతా మొక్కలు చక్కగా పెరగాలంటే ఏంచేయాలంటూ అని అడిగి మరీ నీలిమ దగ్గర సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఆసక్తితో శాంతి... ఇతరులు చిట్కాలు, సూచనలు తీసుకోవడం గమనించిన నీలిమ గార్డెనింగ్ జ్ఞానాన్నీ మరింతమందికి పంచాలన్న ఉద్దేశంతో ‘శాంతి క్రియేషన్స్’ పేరిట యూ ట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి గార్డెనింగ్ చిట్కాలు చెబుతోంది. నెటిజన్లు అడిగే సందేహాలను నివృత్తి చేస్తోంది. ఎక్కువ స్థలం లేనివారు వర్టికల్ గార్డెన్‌ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, చీడపీడల నుంచి మొక్కలను ఎలా కాపాడుకోవాలి. తక్కువ ఖర్చులో అందమైన గార్డెన్‌ను ఎలా పెంచుకోవాలి, వంటి సందేహాలకు చక్కని సలహాలు ఇస్తోంది. ఆరుపదుల వయసులో పచ్చదనంతో బిజీగా ఉంటూ నేటియువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది. -
పచ్చదనం పెరిగింది!
గత 20 ఏళ్లలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చెట్లతో కూడిన విస్తీర్ణం (ట్రీ కవర్) పెరిగింది. 2000–2020 మధ్యకాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే 13.09 కోట్ల హెక్టార్ల మేరకు ట్రీ కవర్ పెరిగిందని ‘ధరిత్రీ దినోత్సవం’సందర్భంగా వెలువరించిన ‘గ్లోబల్ ఫారెస్ట్ రివ్యూ’తాజా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్ధ ‘వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్’కు అనుబంధంగా గ్లోబల్ ఫారెస్ట్ రివ్యూ పనిచేస్తోంది. మరోవైపు ఎక్కువ విస్తీర్ణంలోనే పచ్చని అడవుల నరికివేత కొనసాగుతోంది. ఈ 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా నికరంగా 10.06 కోట్ల హెక్టార్లలో అడవుల్ని కోల్పోయినట్లు నివేదిక వెల్లడిస్తోంది అయితే 36 దేశాల్లో మొక్కలు నాటడం, కలప తోటలు, పండ్ల తోటల విస్తీర్ణం పెరుగుతున్నందున.. అడవులు, కలప/పండ్ల తోటలతో కలిపి పచ్చని చెట్ల విస్తీర్ణం నికరంగా పెరిగిందని గ్లోబల్ ఫారెస్ట్ పేర్కొంది. అయితే దీర్ఘకాలం ఎదిగిన అడవుల్ని నరికివేయటం వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని.. తాజా ట్రీ కవర్ పూర్తిగా భర్తీ చేయలేదని నివేదిక స్పష్టం చేసింది. పెరిగిన 13.09 కోట్ల హెక్టార్ల ట్రీ కవర్లో 91% (11.86 కోట్ల హెక్టార్లు) అడవులు ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన పెరుగుదలతో పాటు అడవుల పునరుద్ధరణ పథకాల అమలు ఇందుకు దోహదపడుతున్నాయి. మిగతా 9% (1.23 కోట్ల హెక్టార్లు)లో వాణిజ్యపరంగా సాగు చేస్తున్న యూకలిప్టస్, సుబాబుల్, ఆయిల్‌పామ్, రబ్బరు, పండ్ల తోటలు ఉన్నాయి. కలప తోటలు, పండ్ల తోటల సాగు ద్వారా పెరిగిన 1.23 కోట్ల హెక్టార్లలో దాదాపు సగం ఇండోనేసియాలోని ఆయిల్‌పామ్, బ్రెజిల్‌లోనే కలప తోటలే కావటం విశేషం. మలేసియా, ఉరుగ్వే, న్యూజిలాండ్ దేశాల్లోని ట్రీ కవర్లో 70% వాణిజ్య, ఉద్యాన తోటల వల్లనే సాధ్యమైంది. భారత్‌లో అడవులు, కలప / పండ్ల తోటలతో నికరంగా 8,74,100 హెక్టార్ల విస్తీర్ణంలో ట్రీ కవర్ పెరిగినట్లు గ్లోబల్ ఫారెస్ట్ రివ్యూ నివేదిక తెలిపింది. ఐరోపా దేశాల్లో 60 లక్షల హెక్టార్లలో.. సియా దేశాల్లోనూ అంతే. అడవుల పునరుద్ధరణ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేయటం, వ్యవసాయ భూములను పడావుగా వదిలేయటంతో చెట్లు పెరగటం వల్ల ఈ నికర పెరుగుదల నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ఇరవై ఏళ్లలో ట్రీ కవర్ నికరంగా పెరిగిన దేశాలు 36 ఉండగా అందులో చైనా, భారత్ కూడా ఉండటం విశేషం. ఐరోపా దేశాల్లో 60 లక్షల హెక్టార్లలో నికరంగా ట్రీ కవర్ పెరిగింది. భారత్, చైనా సహా అనేక మధ్య, దక్షిణాసియా దేశాల్లోనూ అంతే. అడవుల పునరుద్ధరణ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేయటం, వ్యవసాయ భూములను పడావుగా వదిలేయటంతో చెట్లు పెరగటం వల్ల ఈ నికర పెరుగుదల నమోదైనట్లు నివేదిక పేర్కొంది. అత్యధికంగా చైనాలో.. అత్యధికంగా చైనాలో 21,44,900 హెక్టార్ల మేర ట్రీ కవర్ పెరుగుదల చోటు చేసుకుంది. భారత్‌లో 8,74,100 హెక్టార్ల మేర నికర ట్రీ కవర్ పెరుగుదల ఉంది. ఉరుగ్వే మినహా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లోని ఏ దేశంలోనూ ట్రీ కవర్లో నికర పెరుగుదల లేదు. అడవుల నరికివేత, కార్చిచ్చుల నష్టం అక్కడ ఎంత ఎక్కువగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. -
గ్రీన్ రూఫ్‌టాప్‌లు.. నగరాలకు చలువ పందిళ్లు!
ప్రపంచవ్యాప్తంగా భవనాల పైకప్పులు ఆకుపచ్చగా మారుతున్నాయి. నగరాలను మరింత నివాసయోగ్యంగా మార్చుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇళ్లు, వాణిజ్య భవనాల పైకప్పులు ‘గ్రీన్ రూఫ్’లుగా మారుతున్నాయి. అవి పూల మొక్కలు కావచ్చు లేదా కూరగాయ మొక్కలు కావచ్చు.. గ్రీన్ రూఫ్ల వల్ల ఒకటికి పది ప్రయోజనాలున్నాయని ప్రపంచం కోడై కూస్తోంది. ‘ప్రపంచ నగరాల దినోత్సవం’ సందర్భంగా గ్రీన్ రూఫ్‌లు అందించే పర్యావరణ, ఆరోగ్య, ఆహార ప్రయోజనాలను గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు! సగం మంది ప్రజలు పట్టణాలు, నగరాల్లోనే నివాసం ఉంటున్నారు. 2030 నాటికి ఈ శాతం మరింత పెరుగుతుంది. భూతాపోన్నతి వల్ల వాతావరణంలో ప్రతికూల మార్పులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా హెచ్చు తగ్గుల పాలవుతూ ప్రజల జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. అతి వేడి, అతి చలి ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. వాయు కాలుష్యానికి నగరాలే కేంద్ర బిందువులుగా మారాయి. ఇటీవలికాలంలో నగరాలు ఎదుర్కొంటున్న మరో ఉపద్రవం ఆకస్మిక కుండపోత వర్షాలు–వరదలు. ఇవి ప్రజల జీవన నాణ్యతను దెబ్బతీయటమే కాకుండా వారి శారీరక, మానసిక ఆరోగ్యాలనూ ప్రభావితం చేస్తున్నాయి. నగరాలు ఎదుర్కొంటున్న ఈ పర్యావరణ, సామాజిక, ఆరోగ్య సమస్యలకు గ్రీన్ రూఫ్‌లు పరిష్కారంగా కనిపిస్తున్నాయి. గ్రీన్ రూఫ్ గార్డెన్లు పచ్చదనాన్ని నగరాల్లోకి తిరిగి తీసుకొస్తున్నాయి. గ్రీన్ రూఫ్ గార్డెన్ అంటే? గ్రీన్ రూఫ్‌టాప్ గార్డెన్ (మిద్దె తోట) అంటే.. ఇంటి పైకప్పు మీద ఉండే ఆకుపచ్చని తోట. మెసొపొటేమియా జిగ్గురాట్ల కాలం నుంచే భవనాల పైకప్పులపై తోటలు పెంచుతున్నారు. గ్రీన్ రూఫ్‌లు ఆధునిక రూపాన్ని సంతరించుకోవటం జర్మనీలో 50 ఏళ్ళ క్రితమే ప్రారంభమైంది. అప్పట్లో ఇది విడ్డూరంగా చెప్పుకునేవారు. అదే జర్మనీ ఇప్పుడు ‘ఐరోపా గ్రీన్ రూఫ్ క్యాపిటల్’గా పేరుగాంచింది. గ్రీన్ గార్డెన్... కంటికి ఆహ్లాదాన్నిస్తూనే, వేసవిలో చల్లదనాన్నీ/శీతాకాలంలో వెచ్చదనాన్నీ పంచుతూ విద్యుత్తును ఆదా చేస్తోంది. మిద్దెతోట... పూలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి ఆహారాన్ని, మూలికలను అందిస్తున్నాయి. ఇక విద్యుత్తును అందించే సౌర ఫలకాలూ గ్రీన్ రూఫ్ గార్డెన్‌కు కొత్త సొబగులను అద్దుతున్నాయి. రూఫ్ గార్డెన్ ఖర్చెంత? గ్రీన్ రూఫ్ గార్డెన్లను ఏర్పాటు చేయటం కొంచెం ఖర్చుతో కూడిన పనే. భవనం స్లాబ్ దెబ్బ తినకుండా ఉండేందుకు, నీటిని ఒడిసి పట్టేందుకు, మొక్కలు/చెట్ల వేర్లు స్లాబ్‌లోకి చొరబడకుండా నివారించడానికి, ఇన్సులేషన్ కోసం అనేక దొంతర్లు వేసిన తర్వాత.. ఆపైన మొక్కలు/చెట్లు పెంచేందుకు రూఫ్ పైభాగంలో మట్టి మిశ్రమాన్ని 6 నుంచి 12 అంగుళాల మందంతో వేస్తారు. ఆ తర్వాత పచ్చని మొక్కలు లేదా పంటలు వేస్తారు. ఇదంతా చెయ్యటానికి చదరపు అడుగుకు 15 నుంచి 20 డాలర్లు ఖర్చు అవుతుందని ఒక అమెరికా సంస్థ అంచనా. గ్రీన్ రూఫ్‌టాప్ గార్డెన్లకు జర్మనీ, అమెరికా, జపాన్, కెనడా, సింగపూర్ అతిపెద్ద మార్కెట్లుగా మారాయి. ఈ మార్కెట్ 2025 నాటికి 880 కోట్ల డాలర్లకు పెరగనుందని పరిశోధనా సంస్థ టెక్నావియో అంచనా. అయితే.. సేంద్రియ ఇంటి పంటలు సాగు చేసుకోవటం వరకే అయితే పెద్దగా ఖర్చు అవసరం లేదు. కంటైనర్లు, కుండీలు, ఎత్తు మడుల్లో వేసుకోవచ్చు. రూఫ్ మొత్తాన్నీ కప్పి ఉంచేలా అనేక దొంతర్లుగా గార్డెన్‌ను నిర్మించాలనుకుంటేనే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇంటిపంటలతో ప్రాణవాయువు 10 అడుగుల వెడల్పు, 10 అడుగులు పొడవు వుండే స్థలంలో పెరిగే మొక్కలు 13 అడుగులఎత్తయిన చెట్టుతో సమానంగా బొగ్గుపులుసు వాయువును పీల్చుకొని ప్రాణవాయువును విడుదల చేస్తాయని అంచనా. గ్రీన్ రూఫ్ మన దేశానికీ కొత్త కాన్సెప్ట్ అయినప్పటికీ, దేశవ్యాప్తంగా సానుకూల స్పందన కనిపిస్తోంది. పెద్ద నగరాల్లో గ్రీన్ రూఫ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సుస్థిర జీవనం, పర్యావరణ స్పృహ కలిగిన నగరవాసులు సేంద్రియ ఆహారం ప్రాముఖ్యతను, సేంద్రియ ఇంటిపంటల సాగు ఆవశ్యకతను గ్రహిస్తున్నారు. కొసమెరుపు హైదరాబాద్ నగరంలో భవనాల పైకప్పుల విస్తీర్ణం కనీసం 50 వేల ఎకరాలకు పైగా ఉండొచ్చని ఒక అంచనా. దాదాపుగా ఈ రూఫ్లన్నీ ఖాళీగానే వున్నాయి. వీటిని గ్రీన్ రూఫ్ గార్డెన్లు గానో లేదా సేంద్రియ ఇంటిపంటల తోటలుగానో (సౌర ఫలకాలను కూడా వీటిలోనే పెట్టుకోవచ్చు) మార్చితే..? ఇదే మాదిరిగా ఇతర నగరాలూ, పట్టణాలను మార్చితే? పర్యావరణ పరంగా, ఆహార భద్రతా పరంగా, ప్రజారోగ్యపరంగా మహా అద్భుతమే ఆవిష్కృతమవుతుంది! – సాక్షి, సాగుబడి డెస్క్ నగరాలను చల్లబరిచే మార్గం పట్టణ ప్రాంతాల్లో భవనాల పైకప్పుల విస్తీర్ణం సాధారణంగా పట్టణ భూభాగంలో 5–35 శాతం వరకు ఉంటుంది. అమెరికాలో 90 శాతానికి పైగా భవనాల పైకప్పులు ఖాళీగా ఉన్నాయని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంచనా. చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల కంటే నగర వాతావరణంలో 5.6 డిగ్రీల సెంటీగ్రేడ్ అధిక వేడి ఉంటుంది. దీన్నే ‘అర్బన్ హీట్ ఐలాండ్‘ అని పిలుస్తారు. గాలి కూడా సాధారణం కంటే వేడిగా ఉంటుంది. పైకప్పులు వేడిగా ఉన్నప్పుడు, భవనాల లోపలి గదులను చల్లబరచడం కష్టం. ఇది నగర విద్యుత్ గ్రిడ్‌పై అధిక భారాన్ని మోపుతుంది. అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం వల్ల నగరంలో వాయు కాలుష్యం కూడా తీవ్రమవుతుంది. ఉదాహరణకు, నగరాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల గాలిలో ఓజోన్ వాయువు సాంద్రత పెరుగుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. అయితే.. భవనాల పైకప్పులపై కనీసం 30% విస్తీర్ణంలో మొక్కలు, చెట్లు పెంచినప్పుడు దాదాపు 1 డిగ్రీ సెల్సియస్ వరకు వాతావరణం చల్లబడిందని బాల్టిమోర్–వాషింగ్టన్ మెట్రోపాలిటన్‌లో జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. -
Hyderabad: గత పదేళ్లలో భారీగా పెరిగిన అడవుల విస్తీర్ణం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం పచ్చదనంతో పరిఢవిల్లుతోంది. రహదారులు, ఉద్యానాలు, ఔటర్ రింగురోడ్డు, ప్రధాన కూడళ్లు పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇటీవల కాలంలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉద్యమస్థాయిలో చేపట్టిన హరితహారం, అర్బన్ ఫారెస్టుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాన్ని సాధించాయి. పదేళ్ల క్రితం కేవలం 33 చదరపు కిలోమీటర్లున్న అటవీ ప్రాంతం తాజాగా సుమారు 85 చ.కి.మీ వరకు విస్తరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పదేళ్ల క్రితం వరకు అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులతో తల్లడిల్లిన భాగ్యనగరంలో కొంతకాలంగా వాతావరణంలోనూ అనూహ్యమైన పురోగతి కనిపిస్తోంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావడమే కాకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జీవ వైవిధ్యంలోనూ మార్పులు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. నగమంతటా చెట్లు భారీగా పెరగడం వల్ల వివిధ రకాల పక్షులు, వన్యప్రాణులు తిరిగి తమ ఆవాసాలకు చేరుకుంటున్నాయి. కొన్ని చోట్ల అరుదైన పక్షులు కూడా కనిపిస్తున్నాయని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఒక వైపు ఆకాశ హరŠామ్యలతో నలువైపులా మహానగరం శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలోనే మరోవైపు అటవీ ప్రాంతం, పచ్చదనం కూడా విస్తరించుకోవడం విశేషం. హరితహారంలో భాగంగా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఇందుకోసం పెద్ద ఎత్తున కృషి చేశాయి. హైదరాబాద్ టాప్... రాష్ట్రవ్యాప్తంగా 109 పట్టణ అటవీ ఉద్యానాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.700 కోట్లతో ప్రణాళికలను రూపొందించింది. ఇందులో సుమారు 45 అర్బన్ ఫారెస్టు పార్కులను రూ.400 కోట్లతో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుకు ఇరువైపులా ఈ పార్కులు వివిధ ప్రాంతాల్లో విస్తరించుకొని ఉన్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాలతో పోల్చితే పచ్చదనంలో హైదరాబాద్ హానగరం టాప్‌లో ఉంది. ఏటా ఆకుపచ్చ విస్తీర్ణం పెరుగుతోంది. గత పదేళ్లలో పచ్చదనం గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. తాజాగా సుమారు 85 చదరపు కిలోమీటర్ల వరకు పచ్చదనం విస్తరించుకుంది. 2011లో చదరపు కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు ఏకంగా 85 చదరపు కిలోమీటర్లకు పెరగడం గమనార్హం. అంటే ఈ దశాబ్ద కాలంలో అనూహ్యంగా 150 శాతం వరకు అటవీ ప్రాంతం విస్తరించినట్లు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై తదితర ప్రధాన నగరాలతో పోలి్చతే పచ్చదనంలో హైదరాబాద్ నగరం టాప్‌లో ఉంది. గ్రీన్‌సిటీ అవార్డు... పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరాల సరసన చేరింది.నగరానికి వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డు లభించడం విశేషం. అంతర్జాతీయ ఉద్యాన ఉత్పాదకుల సమాఖ్య (ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్) ఈ ఏడాదికి వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డులను ప్రకటించగా ఏకంగా ఆరు అంశాల్లో హైదరాబాద్ ఈ అవార్డును సాధించడం గమనార్హం. దేశంలోనే ఈ అవార్డును గెలుచుకున్న ఏకైక నగరం హైదరాబాద్. కొలంబియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, టర్కీ, మెక్సికో, బ్రెజిల్, కెనడా, అర్జెంటీనా, తదితర 18 దేశాలు ఈ పోటీలో ఉన్నాయి. లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్‌లో భారతదేశం నుంచి హైదరాబాద్ అవార్డును సాధించింది. జీవ వైవిధ్యానికి పట్టం... భాగ్యనగరం ఉద్యానాలకు నిలయం. నిజాం నవాబుల కాలంలో వందలాది ఉద్యానవనాలతో, అడవులతో విలసిల్లిసిన హైదబాద్‌లో క్రమంగా పచ్చదనం అంతరించింది. దీంతో అనేక రకాల పక్షులు, జంతువులు, వన్యప్రాణులు ఉనికిని కోల్పోయాయి. తాజాగా చేపట్టిన పచ్చదనం అభివృద్ధి, విస్తరణ వల్ల హైదరాబాద్ జీవవైవిధ్య నగరంగా పూర్వవైభవాన్ని సంతరించుకొనే అవకాశం ఉంది. -
బతుకమ్మ, దసరా, దీపావళి.. పండుగ ఏదైనా పూల సాగుతో సిరులే..
సాక్షి, కరీంనగర్: కొందరు రైతులు సీజనల్ పంటలతోపాటు పూల సాగు చేస్తుంటే మరికొందరు సాధారణ పంటలతో విసిగిపోయి, పూల తోటలపై దృష్టిసారించారు. పండుగలు, శుభకార్యాల నెలలకు అనుగుణంగా రకరకాల పూలతో సిరులు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి, మల్లన్న పట్నాలు, శివరాత్రి తదితర పర్వదినాల్లో, పెళ్లిళ్లలో పూలకు డిమాండ్ ఉంటుంది. ఆయా పండుగలకు అనుగుణంగా రైతన్నలు బంతి, చామంతి, గడ్డి చామంతి, పట్టుకుచ్చులు, గల్లండ, లిల్లీపూలు సాగు చేస్తూ మంచి దిగుబడులు, ఆదాయం పొందుతున్నారు. తొమ్మిది రోజుల బతుకమ్మ సందడి ప్రారంభమైన నేపథ్యంలో పూలు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్న కర్షకులపై ప్రత్యేక కథనం. చింతల్‌పేట్‌లో బంతి, చామంతి పూలు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని చింతల్‌పేట్‌కు చెందిన రైతు ఇప్ప గంగాధర్ ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం పరిసరాల నుంచి బంతి, చామంతి, గడ్డి చామంతి మొక్కలను రూ.3 నుంచి రూ.5 చొప్పున వెచ్చించి, తీసుకువస్తున్నాడు. వీటిని ఎకరం 10 గుంటల్లో నాటుతున్నాడు. నాటిన నెల రోజుల నుంచి పూతకు వస్తాయి. ఆ తర్వాత వారం, పది రోజుల్లోనే తెంపి విక్రయిస్తున్నాడు. చీడపీడల నివారణకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పురుగు మందులు ఖర్చవుతుందని, భూసారం పెంచడానికి ఎక్కువగా సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తున్నానని గంగాధర్ తెలిపాడు. చదవండి: బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజులు ఎనిమిది నైవేద్యాలు! సాధారణ సీజన్లో బంతి కిలో ధర రూ.50 నుంచి రూ.60, చామంతి, గడ్డి చామంతి కిలో ధర రూ.150 నుంచి రూ.170 వరకు ఉంటుంది. ఇక బతుకమ్మ, దసరా సీజన్లలో బంతికి కిలో రూ.100, చామంతి రూ.200 వరకు, గడ్డి చామంతి రూ.50 వరకు ఉంటుందని పేర్కొన్నాడు. ప్రస్తుత సీజన్లో పూలన్నీ విక్రయిస్తే రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పాడు. కండ్లపల్లిలో లిల్లీపూలు జగిత్యాల మండలంలోని కండ్లపల్లికి చెందిన చందా సుధాకర్ లిల్లీపూలు సాగు చేస్తున్నాడు. వీటి గడ్డలు 20 కిలోలకు రూ.800 వెచ్చించి, నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం నుంచి తీసుకువస్తున్నాడు. భూమిని నాలుగైదు సార్లు బాగా దున్ని, పొడి దుక్కి చేస్తాడు. తర్వాత పేడ, కోడి ఎరువు వేస్తాడు. అనంతరం లిల్లీపూల గడ్డలను పొలంలో నాటుతాడు. ఒక్కసారి నాటితే మూడేళ్ల వరకు పూలు పూస్తాయి. నాటిన 3 నెలలకు దిగుబడి వస్తుంది. చదవండి: Bathukamma: పండగ వెనుక ఎన్ని కథలున్నా.. బతుకమ్మ ప్రత్యేకత ఇదే ఫిబ్రవరి, మార్చి, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో పూలు ఎక్కువగా వస్తాయి. వీటిని జగిత్యాల మార్కెట్‌కు తరలిస్తున్నాడు. ఏటా రెండుసార్లు తోటకు డీఏపీతోపాటు 3 నెలలకోసారి పొటాష్, యూరియా అందిస్తుంటాడు. ఈ పూలు మార్కెట్లో కిలోకు రూ.100 పలుకుతున్నాయి. నిత్యం 8 నుంచి 10 కిలోలను మార్కెట్‌కు తరలిస్తున్నట్లు సుధాకర్ తెలిపాడు. ఏడాదికి పంటకు రూ.60 వేల వరకు ఖర్చు పెడితే, మార్కెట్లో డిమాండ్‌ను బట్టి రూ.1.75 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పాడు. నాగారం, తెనుగుపల్లెలో పట్టుకుచ్చులు బతుకమ్మ పేర్చాలంటే తంగేడు పూలతోపాటు గుమ్మడి, కట్ల, గోరింట, పట్టుకుచ్చుల(సీతమ్మ జడ) పూలు ఉండాల్సిందే. ముఖ్యంగా పట్టుకుచ్చులు బతుకమ్మకు ప్రత్యేక ఆకర్షణ తీసుకువస్తాయి. ఈ పూలకు పెట్టింది పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలోని నాగారం, తెనుగుపల్లె గ్రామాలు. గ్రామస్తులు ఏటా బతుకమ్మ సందర్భంగా 10 గుంటల నుంచి ఎకరం వరకు పట్టుకుచ్చులు సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. పూలను సమీపంలోని గోదావరిఖని, ఎన్టీపీసీ, రామగుండం తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. నాగారానికి చెందిన తాళ్ల శ్రీనివాస్ 20 ఏళ్లుగా ఎకరం భూమిలో పట్టుకుచ్చులు సాగు చేస్తున్నాడు. విత్తనం అలికిననాటి నుంచి పువ్వుకోసే వరకు వరి, పత్తి పంటల్లాగే అన్నిరకాల ఎరువులు వేస్తామని తెలిపాడు. ఈ ఏడాది కొత్త రకం సాగు చేశానని, ఇటీవల కురిసిన వర్షాలకు తోటలో కలుపు తీయలేకపోయామని చెప్పాడు. ఇప్పటివరకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టానని, వర్షాల వల్ల ఆశించిన దిగుబడి రాలేదన్నాడు. పెట్టుబడి వస్తుందో, రాదోనని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపాడు. గతేడాది ఇదే పెట్టుబడికి ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల ఆదాయం పొందినట్లు పేర్కొన్నాడు. మామిడాలపల్లిలో బంతి, పట్టుకుచ్చులు వరి పంటతో నష్టాలు చూసిన కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని మామిడాలపల్లి రైతు కొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి బంతి, పట్టుకుచ్చుల పూలు సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. గతేడాది 1.20 ఎకరాల్లో బంతి విత్తనాలు వేయగా పంట చేతికివచ్చే సమయంలో వర్షాలు కురిసి, పెట్టుబడి కూడా చేతికి రాలేదు. ఈ ఏడాది ఎకరన్నర భూమిలో బంతి, 20 గుంటల్లో పట్టుకుచ్చుల విత్తనాలు వేశాడు. మొక్కలు ఏపుగా పెరిగి, పూలు విపరీతంగా పూశాయి. వారం రోజుల్లో సద్దుల బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నాయి. ప్రస్తుతం కిలోకు రూ.100 నుంచి రూ.130 వరకు చేను వద్దే విక్రయిస్తున్నానని తెలిపాడు. ఇతర ప్రాంతాల నుంచి ఇప్పటికే ఆర్డర్లు వచ్చాయన్నాడు. పూల సాగుకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టానని, రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. మొక్కలకు నీటి కోసం మల్చింగ్‌తోపాటు డ్రిప్ ఏర్పాటు చేశానని, దీనివల్ల నీటి తడులకు కూడా ఇబ్బంది కలగలేదని పేర్కొన్నాడు. వరి సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సూచిస్తున్నాడు. మంగళ్లపల్లిలో బంతి, చామంతి, మల్లె పూలు రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మంగళ్లపల్లిలో 190 కుటుంబాలున్నాయి. అందరికీ వ్యవసాయమే జీవనాధారం. సుమారు 50 కుటుంబాలు బంతి, చామంతి, మల్లె పూలతో ఉపాధి పొందుతున్నారు. సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా పూలు సాగు చేస్తామని రైతు బాదనవేణి బాలరాజు తెలిపాడు. వీటిని సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలతోపాటు కరీంనగర్ మార్కెట్‌కు కూడా తరలిస్తామన్నాడు. నిత్యం 2 నుంచి 3 క్వింటాళ్ల వరకు విక్రయిస్తామని, శుభకార్యాలు, పండుగల సమయాల్లో గిరాకీ ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. సాధారణ రోజుల్లో కిలోకు రూ.50 నుంచి 70 వరకు, దసరా, బతుకమ్మ, దీపావళి తదితర ప్రత్యేక రోజుల్లో రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తామని పేర్కొన్నాడు. పూల సాగుతో వచ్చిన ఆదాయాన్ని కుటుంబ పోషణకు, పత్తిసాగు పెట్టుబడికి వినియోగిస్తామని చెప్పాడు. పూల విత్తనాలను ప్రభుత్వం రాయితీపై ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాడు. తిమ్మాపూర్‌లో బతుకమ్మ కోసమే.. తిమ్మాపూర్(మానకొండూర్): మండలంలో అనేక మంది రైతులు బతుకమ్మ పండుగ కోసమే సుమారు 50 ఎకరాల్లో సీతజడ(పట్టుకుచ్చులు), 50 ఎకరాల్లో బంతి తోటలు సాగు చేస్తున్నారు. ఇందుకు కావాల్సిన మొక్కలను నర్సరీల నుంచి తెచ్చుకుంటున్నారు. వ్యాపారులు ఆయా తోటల వద్దకే వెళ్లి, ముందస్తుగా డబ్బులు చెల్లించి, బుక్ చేసుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ గార్డెన్లో గాలి పీలిస్తే పైకే!
ఎవరినైనా పార్క్ లేదా గార్డెన్‌కు ఎందుకు వెళ్తారని అడిగితే ఏం చెబుతారు? రకరకాల పూల మొక్కలు, చెట్లతో కూడిన అక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని చూస్తూ సేదతీరేందుకు, స్వచ్ఛమైన గాలిని పీల్చేందుకు వెళ్తామని బదులిస్తారు. కానీ ఇంగ్లండ్‌లోని ఆల్న్విక్లో ఉన్న ఓ గార్డెన్‌కు ఎవరైనా వెళ్లాలనుకుంటే మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిందే! ఎందుకంటే ఇది మామూలు గార్డెన్ కాదు మరి.. పూలచెట్లు, పరిమళభరిత గులాబీలు కూడా ఉన్న ఈ పార్క్‌లో ఎవరైనా కాస్త గట్టిగా అక్కడి గాలి పీలిస్తే కళ్లు తిరిగి పడిపోవడమో లేదా మరణించే అవకాశం కూడా ఉందట! ఈ మిస్టరీ వెనక కాస్త హిస్టరీ ఉందిలెండి. అదేమిటంటే.. ఈశాన్య ఇంగ్లాండ్‌లోని నార్త్అంబర్ల్యాండ్ కౌంటీ రాజ్యవంశ పాలనాధికారి సతీమణి అయిన జేన్ పెర్సీ కొన్నేళ్ల కిందట తమ కోట ఆవరణలోని 14 ఎకరాల తోట సుందరీకరణకు నడుంబిగించింది. గార్డెన్‌కు ప్రత్యేక ఆకర్షణ తెచ్చేందుకు సాధారణ పూల మొక్కలతోపాటు 100 రకాల విషపూరిత మొక్కలను వివిధ దేశాల నుంచి తెప్పించింది. ఇందులో మాంక్స్‌హుడ్, రోడోడెడ్రాన్స్, వోల్ఫ్స్ బేన్ వంటి విషపూరిత జాతుల మొక్కలు ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత విషపూరితమైన మొక్కగా గిన్నిస్ బుక్ గుర్తించిన రిసిన్ (వాడుక భాషలో క్యాస్టర్ బీన్ మొక్కగా పిలుస్తుంటారు) కూడా ఈ గార్డెన్లో ఉంది. దీంతో అవి ఎలా ఉంటాయో చూసేందుకు సందర్శకులు క్యూ కడుతున్నారు. అయితే సాధారణంగా పార్కుల్లో ‘పూలను తెంచొద్దు’ అని రాసి ఉండటాన్ని చూసే ఉంటారు. కానీ ఈ ‘పాయిజన్ గార్డెన్’ దగ్గర మాత్రం ‘ఇక్కడ ఆగొద్దు, పూల వాసన చూడొద్దు’ అని రాసి ఉండటం గమనార్హం! ఎందుకంటే ఇందులోని విషపూరిత మొక్కలు విడుదల చేసే విషవాయువులను పీలిస్తే సొమ్మసిల్లి పడిపోవడం లేదా మరణించడం ఖాయమట! అందుకే ‘ద పాయిజన్ గార్డెన్’ వద్ద ఉన్న భారీ గేటుపై పుర్రె, ఎముక గుర్తును ఉంచి మరీ ఈ విషయాన్ని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఎవరైనా ఇందులోకి ప్రవేశించాలంటే కచ్చితంగా గైడ్ సాయం తీసుకోవాలని చెబుతున్నారు. అయినా కొందరు ఆకతాయితనంతో ఆ మొక్కల ఆకులు, పూల వాసన పీల్చి స్పృహ తప్పుతుంటారని పేర్కొన్నారు. నిర్వాహకుల లెక్కల ప్రకారం ఈ గార్డెన్‌ను ఏటా 6 లక్షల మంది సందర్శిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది వృక్ష శాస్త్రవేత్తలే. ‘వరల్డ్స్ డెడ్లీయెస్ట్ గార్డెన్’ అంటూ ట్విట్టర్లో తాజాగా ఓ వ్యక్తి ఈ గార్డెన్ గేటు ఫొటో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. -
విధ్వంసం: నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త!
నత్తలు.. నత్తలు.. నత్తలు దండు కడుతున్నాయి.. పంటలపై దాడి చేస్తున్నాయి.. రాత్రివేళ యథేచ్ఛగా పొలాల్లో చేరిపోతున్నాయి.. మొక్క మొదళ్లలోని మృదువైన భాగాలను తినేస్తున్నాయి.. ముఖ్యంగా వివిధ రకాల కూరగాయలను ఆరగించేస్తున్నాయి.. డ్రిప్ పైపుల్లోకి దూరి నీటి సరఫరాను అడ్డుకుంటున్నాయి.. తోటల్లోకి ప్రవేశించి తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాయి.. ఆరుగాలం కష్టించిన అన్నదాతకు ఫలితం దక్కకుండా చేస్తున్నాయి. నివారణకు ఏంచేయాలో తెలియక తలలు పట్టుకునే పరిస్థితి కల్పిస్తున్నాయి. పలమనేరు(చిత్తూరు జిల్లా): కూరగాయ పంటలు సాగుచేసే రైతులకు కొత్త కష్టం వచ్చిపడింది. పలమనేరు హార్టికల్చర్ డివిజన్ పరిధిలోని 32 మండలాల్లో నత్తల దండు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. టమాట, బంగాళాదుంప, బీన్సు, బీర, మిరప తదితర పంటల మొదళ్లలోని మృధువైన భాగాన్ని నత్త పురుగులు తినేస్తున్నాయి. మొక్కకు అందాల్సిన సూక్ష్మ పోషకాలు తగ్గి పంట ఎదుగుదల దెబ్బతింటోంది. మొక్కలకు రోగనిరోధక శక్తి తగ్గి ఫంగస్ కారణంగా తెగుళ్లు సోకుతున్నాయి. వీటిని ఎలా అరికట్టాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో దాడి డివిజన్ పరిధిలోని పలు రకాల పంటలు ప్రస్తుతం పూత, పిందె దశలో ఉన్నాయి. గతంలో కురిసిన వర్షాలతో పంటకు ఆకు మాడు, ఫంగస్ తెగుళ్లు సోకుతున్నాయి. అన్నింటికీ మించి నత్తల సమస్య ఎక్కువగా ఉంది. పగటిపూట కనిపించని నత్తలు రాత్రి సమయాల్లో తోటల్లోకి ప్రవేశిస్తున్నాయి. డ్రిప్పులు అమర్చిన పొలాల్లో మలి్చంగ్‌షీట్ కిందకు చేరి మొక్క మొదళ్లను నాశనం చేస్తున్నాయి. మరోవైపు డ్రిప్పులేటర్లలోకి నత్తలు వెళ్లడంతో పైపుల్లో నీళ్లు రాకుండా బ్లాక్ అవుతున్నాయి. ఉదయం పూట ఓ తోట నుంచి మరో పొలంలోకి పాకిపోతున్నాయి. ఇవి జిగటలాంటి ద్రవాన్ని విసర్జిస్తూ వెళుతున్నట్టు రైతులు చెబుతున్నారు. గత ఏడాది రబీలో అక్టోబర్, నవంబర్‌లో అక్కడక్కడా కనిపించిన నత్తలు ఈ దఫా వేల సంఖ్యలో తోటలపై పడి సర్వనాశనం చేస్తున్నాయని రైతులు వెల్లడిస్తున్నారు. ఈ మండలాల్లోనే అధికం తేమ వాతావరణం కలిగిన భూముల్లో అధిక సంఖ్యలో నత్తలు చేరుతున్నాయి. కొబ్బరి చెట్ల నీడలోని పొలాలు, మామిడి తోటల్లోని అంతర పంటలు, చెరువు కింద ఆయకట్టు భూములు వీటికి ఆవాసాలుగా మారాయి. వి.కోట, బైరెడ్డిపల్లె, పలమనేరు, రామసముద్రం మండలాల్లోని బంగాళదుంప, గంగవరం, పలమనేరు, బైరెడ్డిపల్లె, వి.కోట మండలాలతోపాటు పుంగనూరు, మదనపల్లె, వాల్మీకిపురం నియోజకవర్గాల్లో సాగు చేస్తున్న టమాటా పంటకు సమస్య ఎక్కువగా ఉంది. నష్టాల బెంగలో రైతులు టమాటా ఎకరా సాగుకు రూ.60 వేలు, బంగాళాదుంపకు రూ.80 వేలు, మిరపకు రూ.30 వేలు, బీన్సుకు రూ.50 వేలు ఇతర తీగ పంటలకు ఎకరానికి రూ.30 నుంచి రూ.40 వేల దాకా పెట్టుబడి పెడుతున్నట్టు రైతులు చెబుతున్నారు. ఈ తరుణంలో నత్తల కారణంగా లక్షలాది రూపాయల్లో పంటకు నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నత్తల సమస్య నిజమే నత్తల దాడులు నిజమే. ఈ ప్రాంతంలో ప్రస్తుతం తేమ వాతావరణం ఉంది. నత్తలనబడే స్లగ్స్ కూరగాయ పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. వీటి నివారణకు డ్రిప్పుల్లోగానీ నేరుగా కానీ క్లోరిఫైరిపాస్, కాఫర్‌ఆక్సిక్లోరైడ్‌ను పిచికారీ చేయాలి. పొలం చుట్టూ సున్నం వేస్తే మంచిది. ఇవి అక్కడికి చేరి కొంతవరకు చనిపోతాయి. – శ్రీనివాసులురెడ్డి, ఉద్యానశాఖ అధికారి, పలమనేరు నివారణ తెలియజేయాలి ప్రస్తుతం పలు రకాల పంటలకు నత్తల సమస్య అధికంగా ఉంది. నవంబర్, డిసెంబర్లో మంచు కురుస్తుంది కాబట్టి వీటి సంచారం మరింత ఎక్కువ కావొచ్చు. అధికారులు వెంటనే స్పందించి వీటి నివారణ మార్గాలపై అవగాహన కల్పించాలి. – గోవిందరెడ్డి, ఆత్మా చైర్మన్, పలమనేరు -
కళ్ల ముందే కష్టం బూడిద
ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం–కవిటి మండలాల సరిహద్దుల్లో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో డొంకూరు, లక్ష్మీపురం, సీమూరు నెలవంక పరిధిలోని 50 ఎకరాల జీడితోట సోమవారం అగి్నకి ఆహుతైంది. ఈ గ్రామాల పరిధిలో పాతిక మంది రైతులు జీడి, మొగలి, సరుగుడు, నీలగిరి తోటలు సాగు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉన్నట్టుండి తోటలో మంటలు చెలరేగడంతో నిమిషాల వ్యవధిలో అగ్నికీలలు 50 ఎకరాలకు వ్యాపించాయి. తోటలు గ్రామాలకు దూరంగా ఉండడంతో ప్రమాదాన్ని పసిగట్టి అక్కడకు వెళ్లే సరికే ఘోరం జరిగిపోయింది. కాలిపోయిన పంటలను చూసి రైతులు కన్నీరుమున్నీరయ్యారు. అటవీ శాఖకు సంబంధించి సరుగుడు తోటకు కూడా కొంత మేర నష్టం వాటిల్లింది. కాలిపోయిన తోటల్లో 40 ఎకరాలు తమకు చెందిందే ఉందని డొంకూరు గ్రామానికి చెందిన రైతులు లబోదిబోమంటున్నారు. -
‘స్మార్ట్’గా మొక్కలకు చుక్కలు
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో అడుగు ముందుకేసింది. దేశంలో మరెక్కడా లేనివిధంగా క్లౌడ్ బేస్డ్ సెంట్రల్ ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా ఎయిర్‌పోర్టులోని గార్డెన్లు, ఇతర అవసరాలకు నీటిని పొదుపుగా వినియోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘ఇరిగేషన్ మేనేజ్మెంట్, మానిటరింగ్ సాఫ్ట్వేర్’పరిజ్ఞానంతో పని చేసే ఈ నీటిపారుదల వ్యవస్థ ద్వారా సుమారు 10 కిలోమీటర్ల మార్గంలోని ఎనభైకి పైగా ఎకరాల్లోని గార్డెన్స్‌కు నీటిని అందజేస్తారు. దీంతో 35 శాతానికి పైగా నీరు ఆదా కానుంది. మొబైల్ ఫోన్ ద్వారా నియంత్రణ.. క్లౌడ్‌బేస్డ్ సెంట్రల్ ఆటోమేటిక్ టెక్నాలజీలో మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌ట్యాప్, కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లోనే నీటి నిర్వహణ జరుగుతుంది. తొలుత 2018 జనవరిలో ఎయిర్‌పోర్టులోని ప్రధాన రహదారి గుండా ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రారంభించారు. 2.4 కిలోమీటర్ల చొప్పున మూడు పొడవైన భాగాలను ఏర్పాటు చేసి వాటిలో రెండు సైట్ కంట్రోలర్లు అమర్చారు. మొదటి దశలో నీటిపారుదల షెడ్యూల్‌ను, విడుదల చేసే నీటి పరిణామాన్ని సైట్ కంట్రోలర్ల ద్వారా నియంత్రించారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేశారు.దీంతో నీటి పారుదల వ్యవస్థలో ఇప్పటి వరకు వినియోగించిన కంట్రోలర్లు ఇక నుంచి క్లౌడ్ బేస్డ్ సెంట్రల్ ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమై ఉంటాయి. ఈ వ్యవస్థ నిరంతరం నీటి పారుదలను పర్యవేక్షిస్తుంది. ఈ క్లౌడ్ బేస్డ్ సెంట్రల్ ఇరిగేషన్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఎక్కడి నుంచైనా మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, టాబ్లెట్ లాంటి ఏ ఇంటర్నెట్ కనెక్టెడ్ పరికరంతోనైనా నీటి పారుదలను నిర్వహించవచ్చు. పర్యావరణ పరిరక్షణకు దోహదం సహజ వనరులను పరిరక్షించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఎయిర్‌పోర్టులో నీటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో క్లౌడ్ బేస్డ్ ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ చాలా ముఖ్యమైంది. దీనివల్ల నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు నీటిపారుదల వ్యవస్థను ఇంటర్నెట్ ఆధారిత ఉపకరణాల ద్వారా నియంత్రించొచ్చు. – కిశోర్, సీఈవో, శంషాబాద్ ఎయిర్‌పోర్టు పొదుపు మంత్రం.. - ఈ టెక్నాలజీ ద్వారా నీటి పొదుపు సాధ్యమవుతుంది. - వేసవిలో విమానాశ్రయంలోని ప్రధాన రహదారిపై నీటిపారుదలకు రోజూ 1,684 కిలో లీటర్ల నీరు అవసరమవుతుంది. క్లౌడ్ బేస్డ్ నీటిపారుదల వల్ల 35% వరకు నీరు ఆదా చేయొచ్చు. - లీకేజీలు, నీటి వృథాను గుర్తించి అరికట్టొచ్చు. - నీటి పారుదలలో లోటుపాట్లను గుర్తించి మెసేజీల రూపంలో చేరవేస్తుంది. - ఎయిర్ పోర్టు పరి ధిలో భూగర్భ జలాల పెంపు కోసం 40 ఎకరాల విస్తీర్ణం లో రీచార్జ్ బేసిన్‌ను, 10 కృత్రిమ రీచార్జ్ బావులను అభివృద్ధి చేశారు. - నీటి సంరక్షణలో పాటిస్తున్న చర్యలకు ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుంచి ‘గ్రీన్ ఎయిర్ పోర్ట్స్ రికగ్నిషన్–2019’పురస్కారం లభించింది. -
ఆ తోటల్లో...
నర్సీపట్నం : నర్సీపట్నానికి కూత వేటు దూరం.... విశాఖ వెళ్లే దారిలో రెండు కిలోమీటర్ల దూరంలో అప్పన్నదొరపాలెం తోటలు.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. చీకటి పడితే చాలు అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో నేర సామ్రాజ్యం విస్తరిస్తోంది. చీకటి కార్యకలాపాలకు అనువుగా... సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో జీడిమామిడి, సరుగుడు తోటలు ఉన్నాయి. అందువల్ల చీకటి కార్యకలాపాలకు అనువుగా మారాయి. ఇక్కడికి మోటార్ సైకిళ్లపై వచ్చి కార్యకలాపాలు ముగించుకుని వెళ్తుంటారు. పాత నేరస్తులు కూడా వస్తుంటారు. యువతులను తీసుకువచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వారి మధ్య గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. హత్యకు దారి తీసిన సందర్భాలు..: పరిస్థితి విషమిస్తే హత్యలకు దారితీసిన పరిస్థితులు లేకపోలేదు. విశాఖ నగరంలో చంపేసిన వారిని సైతం ఇక్కడికి తీసుకువచ్చి పడేస్తుంటారు. ఇదే తోటలో ఏడాది క్రితం ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. మరో రెండు మూడు నెలలు గడిచిన తరువాత విశాఖలో భూ తగాదాకు సంబంధించి మరో యువకుడిని చంపేసి ఇక్కడ రోడ్డు పక్కనే పడేసి వెళ్లిపోయారు. తాజాగా శనివారం ఒక మహిళను కర్కశంగా గొంతు కోసి చంపేశారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా చోటుచేసుకున్నాయి. పోలీసుల నిఘా కరువు నేరాలకు నిలయంగా మారిన ఈ ప్రాంతంపై పోలీసులు దృష్టి సారించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిని ఆసరాగా తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు అనువుగా మార్చుకున్నారు. దీనివల్ల పరిసర ప్రాంతాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో నేర సామ్రాజ్యం విస్తరిస్తున్నా పోలీసుల నిఘా కరువైంది. కనీసం రోజూ సాయంత్రం వేళల్లోనైనా వీరు దృష్టి సారిస్తే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని పలువురు సూచిస్తున్నారు. గస్తీ ఏర్పాటు చేస్తాం అప్పనదొరపాలెం తోటలపై దృష్టి సారిస్తాం. అసాంఘిక కార్యకలాపాలకు అడ్టుకట్ట వేస్తాం. గస్తీ ఏర్పాటుచేసి నిఘా పెంచుతాం. నేరాల నియంత్రణకు ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటున్నాం. – ఎన్.సింహాద్రినాయుడు, పట్టణ సీఐ -
నరికేస్తున్నారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పతనమవుతున్న ఆయిల్‌పామ్ గెలల ధరలు రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించక.. మరోవైపు సబ్సిడీ అందక ఆయిల్‌పామ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. దీంతో ఆయిల్‌పామ్ తోటలను నరికివేయడానికి సైతం రైతులు వెనకాడటం లేదు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటికే సుమారు 600 ఎకరాల్లో తోటలను తొలగించారు. దేశంలోనే ప్రథమం.. ధర అథమం దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలోనే ఆయిల్‌పామ్ పంట సాగవుతోంది. దేశవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో దీనిని సాగు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మూడు లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు ఉన్నాయి. అందులోనూ మన జిల్లాలో అత్యధికంగా 1.30 లక్షల ఎకరాల్లో దీనిని సాగు చేస్తున్నారు. ఏటా రాష్ట్రంలో 10 లక్షల టన్నుల ఆయిల్‌పామ్ గెలల దిగుబడి వస్తున్నట్టు అంచనా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌పామ్ రీసెర్చి సెంటర్ అంచనా ప్రకారం టన్ను అయిల్‌పామ్ గెలల ఉత్పత్తికి రూ.8,145 ఖర్చవుతోంది. ఇది నాలుగేళ్ల క్రితం నాటి అంచనా. ప్రస్తుతం చెల్లిస్తున్న ధర మాత్రం చెల్లిస్తున్న ధర మాత్రం రూ.7,400 లోపే ఉంటోంది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ముడి పామాయిల్‌పై కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని 12.5 శాతానికి తగ్గించడంతో దిగుమతులు పెరిగాయి. ఈ పోటీని తట్టుకోలేక దేశీయంగా ధర తగ్గించారు. గతేడాది మార్చిలో టన్ను గెలల ధర రూ.8,400 వరకు ఉంటే.. ప్రస్తుతం రూ.7,376కు పడిపోయింది. దీంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. గెలల దిగుబడి జూన్ నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ వరకూ ఉంటుంది. ఈ సమయంలో ధరలు పడిపోతున్నాయి. దీంతో నష్టాలను తట్టుకోలేక రైతులు తోటలను నరికేస్తున్నారు. ఎకరానికి ఏటా రూ.40 వేలకు పైగా పెట్టుబడి అవుతోంది. కోత, రవాణా ఖర్చులు కలుపుకుంటే ఈ మొత్తం మరింత పెరుగుతోంది. అయితే, ఎకరానికి 7 టన్నుల దిగుబడి కూడా రావడం లేదు. పెట్టుబడులు సైతం దక్కకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. అంతర పంటగా వేసిన కోకోకు కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా.. ఆయిల్‌పామ్ రైతులు తమ ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామ¯ŒS ఈ రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, ఆ దిశగా అడుగులు పడటం లేదు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ముడి పామాయిల్‌పై సుంకం విధించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సబ్సిడీ ప్రకటించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు సైతం ఆయిల్‌పామ్‌కు గిట్టుబాటు ధర పెంచుతామని ప్రకటించినా వాస్తవ రూపం దాల్చలేదు. ఒకవైపు గిట్టుబాటు ధరరాక, మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహం లేక రైతులు నష్టాలతో ఈ పంటను పండించడానికి అంతగా ఇష్టపడటం లేదు. తోటలను తొలగించాలన్నా లక్షలాది రూపాయల ఖర్చవుతుండటంతో భరించలేక ఎటూ పాలుపోలేని స్థితిలో ఉన్నారు. టన్ను గెలలకు మద్దతు ధర రూ.10 వేలు ఇస్తేనే గట్టెక్కుతామని, ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రూ.8,900 కూడా తమకు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా బిళ్లనపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు కాకుమాను శ్రీనివాసరావు. కొన్నేళ్లుగా ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలో 20 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. ఏటా ఎకరానికి రూ.40 వేలకు పైగా పెట్టుబడి అవుతోంది. కోత, కూలి ఖర్చులు దీనికి అదనం. ఎకరానికి గెలల దిగుబడి 7 టన్నులు కూడా రావడం లేదు. గెలలను కోయించి అమ్మితే ఖర్చులు కూడా దక్కడం లేదు. దీంతో ఏంచేయాలో దిక్కుతోచక చివరకు తోటల్లోని చెట్లను పొక్లెయిన్ సాయంతో ఇలా తొలగిస్తున్నారు. ఆయన స్వగ్రామమైన బిళ్లనపల్లిలో 15 ఎకరాల్లో వేసిన ఆయిల్‌పామ్ తోటను ఇప్పటికే తొలగించిన శ్రీనివాసరావు.. ఇప్పుడు సీహెచ్.పోతేపలి్లలోని తోటలను సైతం నరికిస్తున్నారు. ఎకరం తోట తొలగించడానికి రూ.4 వేల వరకు ఖర్చవుతోంది. ఈ పరిస్థితి శ్రీనివాసరావు ఒక్కరికే పరిమితం కాలేదు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులందరి దుస్థితి ఇలాగే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపట్లేదు ఆయిల్‌పామ్ రైతులపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. దీనివల్లే తోటలను తొలగిస్తున్నాం. నాకున్న 6 ఎకరాల తోటను తొలగించేందుకు నిర్ణయించుకున్నాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించి పరిష్కారాన్ని చూపకుంటే రాబోయే రోజుల్లో ఆయిల్‌పామ్ సాగు ప్రశ్నార్థకమవుతుంది. – బసివిరెడ్డి వెంకటరామయ్య, సాయన్నపాలెం, ద్వారకాతిరుమల మండలం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతుల్లో ఎక్కువ మంది టీడీపీ వాళ్లే ఉన్నారు. ప్రభుత్వ తీరుతో కక్కలేక మింగలేక సతమతమవు తున్నారు. మద్దతు ధర కల్పించకుంటే నష్టాలు భరిస్తూ ఎన్నాళ్లు సాగు చేస్తాం. చంద్రబాబు ఈ జిల్లాపై కపటప్రేమ నటిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు. – నెక్కంటి రమేష్, రైతు, సీహెచ్.పోతేపల్లి, ద్వారకాతిరుమల మండలం -
కార్తీకం..ధరలు ప్రియం
డోన్‌టౌన్: కార్తీక మాసం.. భక్తులు దీక్షలు స్వీకరించే కాలం. ఈ నెలలో వ్రతాలు, పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి. వనభోజనాల సందడీ కనిపిస్తుంది. ఆదివారం వచ్చిందంటే తోటలు, పార్కులు జనంతో కిటకిటలాడుతాయి. వనభోజనాల్లో అందరూ శాఖాహారమే భుజిస్తారు. దీంతో కూరగాయలకు విపరీతమైన గిరాకీ ఏర్పడుతోంది. సాధారణ రోజుల్లో కంటే ఈ కాలంలో 60 శాతానికి పైగా ధరలు పెంచేసి వీటిని విక్రయిస్తున్నారు. గత అక్టోబరు నెలలో కిలో 10రూపాయలకే లభించే వంకాయలు ప్రస్తుతం రూ. 40 పలుకుతున్నాయి. బీరకాయలు రూ.12 నుంచి రూ.40, క్యారెట్ రూ.20నుంచి రూ. 50లకు పెరిగాయి. పూలకు భలే డిమాండ్.. కార్తీక పూజలతోపాటు అయ్యప్ప భక్తులు చేసే పడి పూజలకు పూల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో బంతి, చామంతి రకాలే కాకుండా అన్నిరకాల పూలకూ డిమాండ్ రావడంతో వ్యాపారులు అమాంతం వాటి ధరలు పెంచేశారు. చామంతులు కిలో ధర రూ. 90, బంతి కిలో ధర రూ. 80 వరకూ పలుకుతున్నాయి. కొండెక్కిన ‘కొబ్బరి’ సహజంగానే కార్తీక మాసంలో కొబ్బరికాయలకు ధర పెరుగుతుంది. ఈ మాసంలో కొబ్బరి వినియోగం ఎక్కువకావడంతో కిరాణందుకాణాలలోనూ, రిటైల్ మార్కెట్లల్లోనూ వినియోగదారుని అవసరాన్ని బట్టి ధర పెంచేస్తుంటారు. గతంలో రూ. 8 ఉండే టెంకాయ.. 16 రూపాయలకు విక్రయిస్తున్నారు. అరటి పండ్లు డజను 40 రూపాయల ధర పలుకుతున్నాయి. వెలగని ‘కర్పూరం’ ప్రస్తుతం మార్కెట్లో పూజా సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. భక్తులు విధిగా వినియోగించే అగరరబత్తీలు, కర్పూరం, కుంకుమ, పసుపు వంటి వాటిపై రూ.10 నుంచి రూ.20 వరకు రేట్లు పెంచారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది వీటి ధరలు రెట్టింపయ్యాయని దీంతో కర్పూరాన్ని వెలిగించలేక పోతున్నామని భక్తులు పేర్కొంటున్నారు. -
వడలిన తోటలు
జూన్ ముగుస్తున్నా తగ్గని ఎండలు, వడగాడ్పులు నీటితడి లేక ఎండుతున్న తమలపాకులు సాగుకు అనుకూలించని వాతావరణం రూ.లక్షలు పెట్టుబడి పెట్టినా రైతుకు దక్కని ప్రతిఫలం ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రుతుపవనాల రాక ఆలస్యం కావడం, జూన్ మాసాంతంలోనూ వడగాడ్పుల తీవ్రత తగ్గక పోవడంతో తోటలు ఎండుముఖం పడుతున్నాయి. నీరు సమృద్ధిగా అందక ముఖ్యంగా తమలపాకులు వడలి పోతున్నాయి. వాతావరణంలో తేమశాతం తక్కువగా ఉండటంతో నోరు పండించాల్సిన తమలపాకులు తోటల్లోనే ఎండిపోతున్నాయి. ఈ పంట సాగు చేస్తున్న రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. కౌలుదారులే అధికం.. పొన్నూరు మండలంలోని చింతలపూడి, ఆరెమండ, గాయంవారిపాలెం, దండమూడి తదితర గ్రామాల్లో సుమారు 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో తమలపాకు తోటలు సాగవుతున్నాయి. సారవంతమైన ఇక్కడి నేలలు తీగజాతికి చెందిన తమలపాకు సాగుకు అనుకూలమైనవి. ఈ మొక్కలను కర్రలను ఆలంబనగా మార్చి రైతులు ఎన్నో మెలకువలతో సాగు చేస్తుంటారు. ఈ పంట సాగు కాలం 18 నెలలు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ఇక్కడకు వ స్తుంటారు. 20 ఏళ్లుగా వారు ఇక్కడి పొలాలు కౌలుకు తీసుకుని తమలపాకు సేద్యం చేస్తున్నారు. తమలపాకు సాగుపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు 750 ఉన్నాయి. ఈ ప్రాంతంలో పండించే తమలపాకుకు మంచి డిమాండ్ ఉండటంతో రాష్ట్ర నలుమూలకే కాక, ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతోంది. తమలపాకు సాగు చేసే భూములు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు కౌలు పలుకుతోంది. ఎరువుల ధరలు, కూలీ రేట్లు అధిక ం కావడంతో సాగు ఖర్చులు ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు భరించాల్సి వస్తోంది. ఈ ఏడాది వర్షాలు లేక, విద్యుత్ కోతల కారణంగా తోటలకు నీరందక తోటలు వడలిపోయాయి. వర్షాలు కురవాల్సిన సమయంలోనూ ఎండల ఉద్ధృతి తగ్గకపోవడంతో ఆకులు ఎండిపోయాయి. వాతావరణం అనుకూలించి పంట బాగా పండితే ఎకరాకు రూ. 50,000 వరకు మిగిలేది. కానీ ఈ సంవత్సరం 40,000 నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఆదుకోవాలి.. గత ఏడాది కంటే ఈ ఏడాది తమలపాకు రైతులు కోలుకోని విధంగా దెబ్బతిన్నారు. ఒక వైపు విపరీతమైన ఎం డ, వడగాలులతో తోటలు మొత్తం ఎండిపోయాయి.. ప్రభుత్వం స్పందించి తమలపాకు రైతులను ఆదుకోవాలి. - చిలుకూరి వెంకటనరసింహారావు, చింతలపూడి, పొన్నూరు మండలం కరెంటు కోసం పడిగాపులు కాస్తున్నాం.. నీటి కొరతతో తోటలు పూర్తిగా పాడైపోయాయి. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక కంటిమీద కునుకు లేకుండా పోలాల గట్లపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. తెగిన కరెంటు వైర్లను సరిచేయాలన్నా, పోయిన ఫీజులు వేయాలన్నా అధికారులు స్పందించటం లేదు. ఫోన్లు చేసినప్పటికీ పట్టించుకునే వారు లేరు. - బెజవాడ రామకృష్ణ, చింతలపూడి, పొన్నూరు మండలం