ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం–కవిటి మండలాల సరిహద్దుల్లో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో డొంకూరు, లక్ష్మీపురం, సీమూరు నెలవంక పరిధిలోని 50 ఎకరాల జీడితోట సోమవారం అగి్నకి ఆహుతైంది. ఈ గ్రామాల పరిధిలో పాతిక మంది రైతులు జీడి, మొగలి, సరుగుడు, నీలగిరి తోటలు సాగు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉన్నట్టుండి తోటలో మంటలు చెలరేగడంతో నిమిషాల వ్యవధిలో అగ్నికీలలు 50 ఎకరాలకు వ్యాపించాయి. తోటలు గ్రామాలకు దూరంగా ఉండడంతో ప్రమాదాన్ని పసిగట్టి అక్కడకు వెళ్లే సరికే ఘోరం జరిగిపోయింది. కాలిపోయిన పంటలను చూసి రైతులు కన్నీరుమున్నీరయ్యారు. అటవీ శాఖకు సంబంధించి సరుగుడు తోటకు కూడా కొంత మేర నష్టం వాటిల్లింది. కాలిపోయిన తోటల్లో 40 ఎకరాలు తమకు చెందిందే ఉందని డొంకూరు గ్రామానికి చెందిన రైతులు లబోదిబోమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment