ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ మహేంద్ర, (ఇన్‌సెట్లో) కామరాజు(ఫైల్)
రణస్థలం (శ్రీకాకుళం): ఆ ఇల్లాలు ఎప్పటిలాగే మధ్యాహ్న భోజనం కోసం భర్తను పిలిచింది. అయితే, తన స్నేహితుడి పెళ్లికి బాణసంచా తయారు చేస్తున్నానని, కొద్ది సమయంలోనే వచ్చేస్తానని చెప్పి ఆమెను పంపించేశాడు. ఇది జరిగిన కాసేపటికే భారీ పేలుడు సంభవించడంతో భార్య నిర్ఘాంతపోయింది. వెంటనే బయటకు వచ్చి పూర్తిగా కాలిపోయిన తన భర్తను చూసి అక్కడే కూలిపోయింది. మృతుని కుమారులు సైతం స్కూల్‌కు వెళ్లి ఇంటికి వచ్చేసరికే మంటలు ఎగసిపడటంతో భయంతో వెనక్కు పారిపోయారు. ఈ విషాద ఘటన రణస్థలం మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీ పరిధిలో ఫ్రెండ్స్‌కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రెండ్స్ కాలనీలో నివాసముంటున్న కామరాజు(39) కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు.
స్వగ్రామం లావేరు మండలం వేణుగోపాలపురంలో తన స్నేహితుని పెళ్లి వేడుక నిమిత్తం బాణసంచా తయారుచేసేందుకు సామ్రగి తెచ్చుకున్నాడు. మధ్యా హ్నం 12.25 గంటల సమయంలో కామరాజు బాణసంచా తయారు చేస్తుండగా చేతిలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలు చెలరేగి పక్కనే ఉన్న నిల్వ ఉంచిన బాణసంచా సామగ్రికి అంటుకోవడంతో భారీ శబ్దంతో రేకు షెడ్డు ఎగిరిపడింది. ఈ ఘటనలో కామరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. పేలుడు ధాటికి ఇంటి ప్రహరీ సైతం కూలిపోయింది. విద్యుత్ తీగకు సైతం మంటలు అంటుకోవడంతో దగ్గరకు వెళ్లేందుకు స్థానికులు సాహసం చేయలేకపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి పైల అశోక్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
చదవండి: (ఫస్ట్‌నైట్ అంటే భయపడ్డాడు.. అందుకే ఇలా చేశాడు: వరుడి తల్లి)
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ..
ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని శ్రీకాకుళం డీఎస్పీ ఎం.మహేంద్ర పరిశీలించారు. జె.ఆర్.పురం సీఐ బీసీహెచ్ స్వామినాయుడుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించారు. కామరాజు భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జి.రాజేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం తరలించినట్లు చెప్పారు. కామరాజు 20 ఏళ్ల కిందటే స్వగ్రామం వేణుగోపాలపురం నుంచి జె.ఆర్.పురం వచ్చి అన్నయ్య కృష్ణతో కలిసి వడ్రంగి పనులు చేస్తున్నాడు.
మందుగుండు తయారీ కేంద్రాలపై దాడులు
అరసవల్లి/శ్రీకాకుళం/కాశీబుగ్గ:జె.ఆర్.పురంలో మందుగుండు పేలిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో సీఐ అంబేడ్కర్, ఎస్సైలు విజయ్‌కుమార్, రామకృష్ణలు మంగళవారం 19 చోట్ల సోదాలు నిర్వహించగా ఐదుచోట్ల మందుగుండు సామగ్రి గుర్తించారు. పది మందిని అదుపులోకి తీసుకున్నారు. అరసవల్లి రెల్లివీధి, ఆదిత్యనగర్ కాలనీ తదితర చోట్ల ఈ సోదాలు జరిగాయి. పలాస–కాశీబుగ్గలోనూ పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment