జీడితోటల్లో ఎగసి పడుతున్న మంటలు
శ్రీకాకుళం, వజ్రపుకొత్తూరు: మండలంలో పెద్దమురహరిపురం గ్రామంలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో జీడితోటలు దగ్ధమైయ్యాయి. పీఎంపురం, రెయ్యిపాడు గ్రామాల మధ్య దట్టమైన పొగలతో కూడిన మంటలు ఎగసి పడటాన్ని గమనించిన రెయ్యిపాడు, పీఎంపురం గ్రామస్తులు పలాస అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదంలో పీఎంపురం గ్రామంలోని కె.గంగయ్యకు చెందిన జీడి తోటతో పాటు మరికొంత మంది రైతుల తోటలు దాదాపు రెండు ఎకరాలు పూర్తిగా కాలిపోయి బూడిదైయ్యాయని స్థానికులు చెప్పా రు. రూ.3 లక్షల వరకు రైతులకు నష్టం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. హుటాహుటీన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది రాత్రి 8 గంటల వరకు శ్రమించి మంటలను అదుపు చేశారు.
ఇతర రైతుల తోటలకు మంటలు విజృంభించకుండా ఫైరింగ్ గ్యాప్స్ ఏర్పాటు చేశారు. ఇటీవల తిత్లీ తుఫాన్ కారణంగా నేలకొరిగిన జీడి చెట్లు ఎండకు బాగా ఎండిపోయి ఉండడంతో తోటలు బాగు చేసే క్రమంలో స్థానిక రైతులు ఎవరో మంటల పెట్టడంతో అగ్ని కీలలు తోటలంతా వ్యాపించి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున మం టలు ఎగసి పడడంతో సమీపంలో ఉన్న తోట లకు చెందిన రైతులు ఆందోళన చెందారు. దాదాపు 300 ఎకరాల్లో అక్కడ నేలకొరిగిన జీడి తోటలు ఉన్నాయి. అవన్నీ ఎండువి కావడంతో మంటలు వ్యాపిస్తే భారీ నష్టంతో పాటు పెను ప్రమాదం జరిగి ఉండేదని భయభ్రాంతులకు గురైయ్యారు. మంటలు అదుపులోకి తేవడంతో అటు రెయ్యిపాడు, ఇటు పీఎంపురంనకు చెందిన రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మం టలు ఎగసి పడిన ప్రాంతాన్ని ఎంపీపీ జి.వసంతరావు, పీఎంపురం గ్రామాభివృద్ధి సంఘం అధ్యక్షుడు కె.గోపాల్, గ్రామపెద్దలు తదితరులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment