కండలు కరిగించి.. చెమట చుక్కలన్నిటినీ ఓ చోట చేర్చి.. గుప్పెడు కరెన్సీ నోట్ల కింద మార్చి.. రేపటి అవసరం కోసం దాచిందొకరు. ముత్యంలాటి మురిపాల చిన్నారి కూతురి కోసం పిసరంత బంగారం కొని..గుండె గదిలాంటి బీరువాలో పదిలంగా ఉంచిందొకరు. పండుగకు పిల్లలకు కొన్న కొత్త బట్టలో.. పని దొరక్కపోతే పొట్ట నిండేందుకు పిడికెడు బియ్యం గింజలో.. ఏ కష్టార్జితమో.. ఏ ఇష్టమైన బహుమానమో.. కూలి బతుకులకు కొండంత అనిపించే వస్తువుల సముదాయమో.. వీటన్నిటినీ ఆ బడుగు జీవులు ఇంటింటా అమర్చుకున్నారు.
అలాంటిది.. మబ్బు నుంచి మెరుపు వచ్చినట్టు అకస్మాత్తుగా చెలరేగిన అగ్ని ప్రమాదంతో అంతా కళ్లెదుటే కాలిపోతే.. అన్ని ఆశలూ తమ పూరిళ్ల సాక్షిగా బూడిదైపోతే.. నోట మాటలేక.. కార్చేందుకు కన్నీళ్లు రాక.. గొల్లపేట ఉపాధి కూలీలు మౌనంగా రోదిస్తున్నారు. పిడుగు పడ్డట్టు పేలిన గ్యాస్ సిలిండర్ల విస్ఫోట శబ్ధాలు ఇంకా గుండెల్లో హోరెత్తిస్తూ ఉంటే.. రేపటి బతుకేమిటని దిగులుగా చూస్తున్నారు. దీనంగా ప్రశ్నిస్తున్నారు.
రణస్థలం: మండల కేంద్రం జె.ఆర్.పురం పంచాయతీలోని గొల్లపేటలో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో 15 పూరిళ్లు దగ్ధమయ్యాయి. సర్వం కాలిబూడిదవడంతో బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని మహిళలు, పెద్దలు శుక్రవారం సాయంత్రం ఉపాధి పనుల నిమిత్తం చెరువు వద్దకు వెళ్లిపోయారు. తొలుత పిట్ట అసిరప్పడు ఇంట్లో మంటలు చెలరేగడంతో గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో రెండు గ్యాస్‌బండలు ఒకేసారి పేలడంతో అందరూ పరుగులు తీశారు. మరో నాలుగు గ్యాస్ బండలు పేలడంతో మంటలు ఆర్పేందుకు ఎవరు సాహసించలేకపోయారు.
విషయం తెలుసుకున్న ఉపాధి వేతనదారులంతా పరుగుపరుగున గ్రామంలోకి వచ్చినా అప్పటికే సర్వం బూడిదైపోయింది. భారీగా నగదు, విలువైన పత్రాలు, బంగారు నగలు కాలిపోవడంతో బాధితులు బోరుమని విలపించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు పక్కా భవనాలు మంజూరు చేస్తామని భరోసా కల్పించారు. రణస్థలం, పైడిభీమవరం పరిశ్రమల అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలు ఆర్పాయి. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియలేదు.
బాధితులు వీరే..
పిట్ట రాము, గంగులు, ఆసిరప్పడు, గజ్జి శ్రీను, గండమాన అప్పలరాముడు, కోరాడ అచ్చిరాజు, పెసల రామలక్ష్మీ, జోగ రమణ, బోప్ప గంగులు, శిడగాన కొరమయ్య, శిడగాన లచ్చోడు, కోరాడ తౌడు, ఇప్పిలి చిన్న, గండమాన గంగమ్మ, పిల్ల నీలమ్మ, గండమాన లక్ష్మి, కోరాడ చిన్నప్పమ్మల ఇళ్లు కాలిపోయాయి. ప్రభుత్వ సహాయంగా తక్షణమే ఒక్కొక్క కుటుంబానికి 10 కేజీల బియ్యం, దుస్తులు, భోజన సదుపాయాలను తహసీల్దార్ ఎం.సుధారాణి ఏర్పాటు చేయించారు. దాదాపు రూ.30 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. ఈ సహాయక చర్యల్లో ఆర్‌ఐ సుబ్రహ్మణ్యం, అగ్నిమాపక అధికారి పి.అశోక్, రెవెన్యూ అధికారి వెంకన్న, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment