ranasthalam
-
మానవత్వం మరిచి.. వదినపై కర్రలతో దాడి..
సాక్షి, రణస్థలం(శ్రీకాకుళం): అయ్యో.. వద్దు అని అరుస్తున్నా వారి మనసు కరగలేదు. కొట్టొద్దు.. కొట్టొద్దు అంటూ వేడుకున్నా వారు కనికరం చూపలేదు. మానవత్వాన్ని మర్చిపోయి, సాటి మహిళ అని చూడకుండా ఇద్దరు మహిళలు తమ సొంత అన్న భార్యపై కర్కశంగా కర్రలతో దాడి చేశారు. బాధితురాలు ఎంతగా ఏడుస్తున్నా వదలకుండా పాశవికంగా కొట్టారు. రణస్థలం మండలం పిషిణి గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ దాడిని చుట్టుపక్కల వారు వీడియో తీయడంతో అది వైరల్ అయ్యింది. జేఆర్‌పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పిషిణి గ్రామానికి చెందిన రెడ్డి జానకి, కొత్తకోట్ల సుశీల, రెడ్డి నారాయణరావులు అన్నాచెల్లెళ్లు. నారాయణరావుకు భార్య కమల, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. జానకి అవివాహితురాలు కావడంతో తండ్రితో కలిసి ఉంటోంది. పక్కనే వేరే ఇంటిలో నారాయణ రావు కుటుంబంతో ఉంటున్నారు. సుశీలకు వివాహమై అత్తవారింటికి వెళ్లిపోయింది. ఇటీవల నారాయణరావు తండ్రి రామ్మూర్తి పిషిణి రెవెన్యూ పరిధిలో తన భూమిని రూ.70 లక్షలకు విక్రయించారు. వచ్చిన సొమ్మును కుమారుడికి ఇవ్వకుండా ఆడపడుచులే పంచుకున్నారు. గతంలో కూడా ఆస్తులు అమ్మినప్పుడు ఇలాగే జరిగింది. దీంతో వదిన, ఆడపడుచుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని కమల ఆడపడుచులతో తగాదా పడుతూ ఉంటుంది. గతంలోనూ.. కర్రతో కర్కశంగా దాడికి పాల్పడిన రెడ్డి జానకి వ్యవహారం గతంలోనూ వివాదాస్పదమే. 2020లో ఏకంగా జేఆర్‌పురం ఎస్ఐపైనే ఆమె కేసు పెట్టింది. అప్పుడు ప్రకృతి లే–అవుట్లో అన్నాచెల్లెళ్ల మధ్య భూ వివాదంలో ఎస్ఐ అశోక్‌బాబు తలదూర్చడం, ఆ సెటిల్మెంట్ వ్యవహారం అక్రమ సంబంధం ఆరోపణల వైపు దారి తీయడం స్థానికంగా సంచలనం రేపింది. దీనిపై అప్పటి సీఐ హెచ్.మల్లేశ్వరరావుకు జానకి ఫిర్యాదు చేయడంతో ఆ పంచాయతీ ఎస్పీ వరకు వెళ్లింది. అప్పట్లో ఎస్ఐపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు కూడా. తాజా ఘటన నేపథ్యంలో గత పంచాయతీని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. పోలీసుల అదుపులో నిందితులు కేసు నమోదు.. ఉదయం జరిగిన ఈ ఘటనపై స్థానికులు 112 నంబర్‌కు ఫోన్ చేయడంతో జేఆర్‌పురం ఎస్ఐ రాజేష్ సంఘటన స్థలానికి 7.15కు వె ళ్లారు. బాధితురాలు క మలను 108లో శ్రీకాకు ళం రిమ్స్‌కు తరలించారు. నిందితులైన జానకి, సుశీలను అదుపులోకి తీసుకుని జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హత్యాయత్నంగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ప్లాన్ ప్రకారమే.. గొడవల నేపథ్యంలో వదినపై దాడి చేయడానికి ఆడపడుచులు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అత్తవారింటిలో ఉన్న సుశీలను ముందురోజే జానకి ఇంటికి పిలిచింది. నారాయణరావు ఉదయం ఐదున్నరకే ఒక పరిశ్రమలో పనిచేసేందుకు వెళ్లిపోతారు. ఆయన పరిశ్రమకు వెళ్లిపోయాక ఉదయం 6.45 గంటలకు వదిన కమలపై ఇద్దరూ కలిసి కిరాతకంగా దాడి చేశారు. కాళ్లు కట్టేసి మరీ కసి తీరా కొట్టారని గ్రామస్తులు చెబుతున్నారు. వైరల్ అయిన వీడియోలోనే జానకి 24 సార్లు కర్రతో కొట్టినట్లు తెలుస్తోంది. వీడియో తీయకముందు ఎంతగా దాడి చేసిందోనంటూ స్థానికులు అనుకుంటున్నారు. -
అయ్యో బిడ్డా! ఏమైందిరా?
రణస్థలం (శ్రీకాకుళం): పదమూడేళ్ల కుర్రవాడు. అప్పటివరకు ఉత్సాహంగా ఉన్నవాడు. ఏమైందో ఏమో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. క్షణాల వ్యవధిలో ప్రా ణాలు వదిలేసి తల్లిదండ్రులకు శోకం మిగిల్చాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రంలోని జేఆర్ పురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బౌరోతు సంతోష్(13) ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో బెంచీపై కూర్చుని ఉన్న సంతోష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు టీచర్‌కు చెప్పగా ఆయన స్కూల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే స్కూల్ వ్యాన్లోనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. నిమిషాల వ్యవధిలో ఇంత విషాదం చోటుచేసుకోవడంతో ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. దీనిపై బాలుడి తల్లి మణికి సమాచారం అందించగా.. ఆమె ఆస్పత్రికి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. వీరు జేఆర్‌పురంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. బాలుడి తండ్రి జయరావు అరబిందో పరిశ్రమలో టెక్నికల్ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు కూడా విషయం చెప్పడంతో ఆస్పత్రికి వచ్చి గుండెలవిసేలా రోదించారు. వీరి స్వగ్రామం విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలంలోని గొడుగువలస. మృతదేహాన్ని అక్కడకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. జేఆర్ పురం ఎస్ఐ జి.రాజేష్ ఆస్పత్రికి వచ్చి ఆరా తీశారు. అనంతరం ప్రైవేటు స్కూల్‌కు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు. (చదవండి: భార్య ప్రవర్తనపై అనుమానం.. భర్త ఎంతపని చేశాడంటే?) -
అక్కడంతా ఆ నలుగురే
తాడేల రామకృష్ణ. రణస్థలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేస్తున్నాడు. ఈయన సంబంధిత కార్యాలయ ఉద్యోగి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆయన లావేరు మండలం బొంతుపేటకు చెందిన ప్రైవేటు వ్యక్తి. కానీ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన హడావుడి చూస్తే అంతా ఇంతా కాదు. ఆర్థిక వ్యవహారాలన్నీ తానే చూసుకుంటున్నాడు. దన్నాన మహేష్. జేఆర్‌పురం గ్రామానికి చెందిన ప్రైవేటు వ్యక్తి. ఈయన కూడా రణస్థలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఉంటారు. అక్కడ వ్యవహారాలన్నీ చక్కబెడతారు. ఈయనొక మధ్యవర్తి. ఈయన్ను కలిస్తే రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఎంచక్కా జరిగిపోతాయన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఈ ఇద్దరే కాదు మరో ఇద్దరు ఇదే రకంగా పనిచేస్తున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలోకి బయట వ్యక్తులకు అనుమతి లేదు. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రవేశం ఉంది. ప్రైవేటు వ్యక్తులు పెత్తనం ఉండకూడదని సీసీ కెమెరాలతో నిఘా కూడా పెట్టారు. కానీ ఇక్కడవేమి పట్టించుకోలేదు. బయట వ్యక్తుల హవాయే ఎక్కువగా ఉంది. వీరిని సంప్రదిస్తేనే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు వేగవంతంగా జరుగుతాయి. లేదంటే కొర్రీలతో ఇబ్బందులు తప్పవు. ఇదంతా అధికారుల ప్రోత్సాహంతోనే జరుగుతోంది. వారి పేరు చెప్పుకుని ప్రతి డాక్యుమెంట్‌కు రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. అధికారులకు ఇవ్వాలని చెబుతూ భూములు, ఇతర ఆస్తుల క్రయవిక్రయాలు చేసుకునే వారి వద్ద నుంచి వసూళ్ల పర్వం సాగిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘా ఉండటంతో కార్యాలయ వేళలు ముగిశాక వసూలు చేసిన సొమ్మును ముట్టజెబుతారు. ఇదంతా బహిరంగ రహస్యమే. అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు.. మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువవడంతో వీరికి ఇష్టం లేని వ్యక్తుల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు చేయడంలో తాత్సారం జరుగుతున్నందున కొందరు బయటికొస్తున్నారు. వారు చెప్పినట్టు నడుచుకోవడం లేదని తమ డాక్యుమెంట్లకు రకరకాల కొర్రీలు పెట్టి రిజిస్ట్రేషన్లు చేయకుండా పక్కన పెడుతున్నారని వాపోతున్నారు. తాజాగా ఇదే విషయమై ఓ వ్యక్తి ఏకంగా రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. రణస్థలం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్నారని, రిజిస్ట్రేషన్‌కు అవసరమయ్యే పత్రాలు సక్రమంగా ఉంటున్నా కొర్రీలు పెడుతున్నారని, అధిక మొత్తంలో సొమ్ము చెల్లిస్తేనే పని చేస్తున్నారని జేఆర్‌పురం గ్రామ పంచాయతీ గరికిపాలెం గ్రామానికి చెందిన జల్లేపల్లి సూర్యప్రకాశరావు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఆ శాఖ డీఐజీకి ఫిర్యాదు చేశారు. ఎవరెవరు అవినీతికి పాల్పడుతున్నారు? ఎంత వసూలు చేస్తున్నారు? ఎవరి పాత్ర ఎంత? తదితర వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. సక్రమంగా ఉన్న వాటికి కొర్రీలు పెట్టి, అడ్డగోలుగా ఉన్నవి ముఖ్యంగా ఫోర్జరీ సంతకాలతో ఉన్న డాక్యుమెంట్లను ముడుపులు తీసుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారని ఫిర్యాదులో వివరించారు. ఏ డాక్యుమెంట్ విషయంలో ఇలా జరిగిందో.. వాటి వివరాలను కూడా ప్రస్తావించారు. మధ్యవర్తులు, కార్యాలయ బాధ్యులు కొందరు కుమ్మక్కై ఈ దందా చేస్తున్నారని స్పష్టంగా వివరించారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులే నిత్యం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అనుమతించడం లేదు గత పది రోజుల నుంచి బయట వ్యక్తులను అనుమతించడం లేదు. బయటేదో జరిగితే నాకు సంబంధం లేదు. ఎవరికి వారు ఊహించుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి. మాట్లాడటానికి కుదరదు. – కె.వేణు, సబ్ రిజిస్ట్రార్, రణస్థలం దృష్టి పెడతా.. నేనొచ్చాక ఫిర్యాదు రాలేదు. అంతకుముందు వచ్చిందో లేదో తెలియదు. పరిశీలిస్తాను. ఏదేమైనప్పటికీ అక్కడేం జరుగుతుందో దృష్టి పెడతాను. అడ్డగోలు కార్యకలాపాలు జరిగితే చర్యలు తీసుకుంటాం. – కిల్లి మన్మధరావు, జిల్లా రిజిస్ట్రార్ -
ఏంకష్టం వచ్చిందో.. వివాహమైన ఐదు నెలలకే..
లావేరు/రణస్థలం: ఏంకష్టం వచ్చిందో తెలియదు కాని.. వివాహమైన ఐదు నెలలకే ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిండునూరేళ్లు కలిసి ఉంటానని బాసలు చేసిన అర్ధాంగిని అర్ధాంతరంగా విడిచిపెట్టేశాడు. తీవ్ర విషాదాంతమైన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. లావేరు మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన యువకుడు కలిగెట్ల తిరుపతిరావు (27) రణస్థలంలోని రామతీర్థాలు కూడలిలో మామయ్యతో కలిసి కార్పెంటర్ పని చేసుకుంటుండేవాడు. ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస గ్రామానికి చెందిన గోవిందమ్మను ఈ ఏడాది జూన్ నెలలో వివాహం చేసుకున్నాడు. చదవండి: (పెళ్లైనప్పటి నుంచే పద్మజ అంటే చిన్నచూపు.. అనుమానంతో) బుధవారం ఉదయం రణస్థలంలోని షాపు వద్దకు వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే మధ్యాహ్న సమయానికి తిరుపతిరావు రణస్థలం మండలంలోని జేఆర్‌పురం పంచాయతీ పరిధిలోని గరికిపాలెం పరిధిలోని తోటలో జీడి చెట్టుకు ఉరివేసుకొని చనిపోయి ఉండటాన్ని అటుగా వెళ్తున్నవారు చూసి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తల్లి పద్మావతి, భార్య గోవిందమ్మ, ఇద్దరు సోదరులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని తిరుపతిరావు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. నాకు ఇక దిక్కెవరూ అంటూ భార్య గోవిందమ్మ విలపించిన తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. చదవండి: (ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..) ఎటువంటి సమస్యలు లేవని, భార్యతో కూడా అన్యోన్యంగా ఉండేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గ్రామంలో కూడా అందరితో ఎంతో సన్నిహితంగా ఉండేవాడని స్థానికులు చెప్పారు. ఈ తిరుపతిరావు ఆత్మహత్యతో స్వగ్రామం తాళ్లవలసలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జె.ఆర్.పురం ఎస్సై జి.రాజేష్ చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ లావేరు మండల ప్రధాన కార్యదర్శి దేశేట్టి తిరుపతిరావు, ఎఫ్ఎస్సీఎస్ డైరెక్టర్ మీసాల శ్రీనివాసరావు తదితరులు పరామర్శించారు. -
గుండెపోటుతో భర్త మృతి.. ఇలా రుణం తీర్చుకున్న భార్య
సాక్షి, శ్రీకాకుళం( రణస్థలం): భర్త చితికి భార్య నిప్పుపెట్టి రుణం తీర్చుకుంది. ఈ సంఘటన కోష్ట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వరసాల సత్యనారాయణ (45) 15 రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందడంతో కోలుకున్నారు. దీంతో కుటుంబీకులు ఇంటికి తీసుకొచ్చేశారు. అయితే శుక్రవారం రాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కరోనా భయంతో బంధువులు ముందుకురాలేదు. మృతుడికి కుమారులు లేరు. దీంతో భార్య పద్మ అన్నీతానై కొంతమంది సాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతునికి ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. చదవండి: విషాదం: పిల్లల కళ్లెదుటే.. -
కదిపిన కొద్దీ అందరినోటా కన్నీటి గాథలే
కండలు కరిగించి.. చెమట చుక్కలన్నిటినీ ఓ చోట చేర్చి.. గుప్పెడు కరెన్సీ నోట్ల కింద మార్చి.. రేపటి అవసరం కోసం దాచిందొకరు. ముత్యంలాటి మురిపాల చిన్నారి కూతురి కోసం పిసరంత బంగారం కొని..గుండె గదిలాంటి బీరువాలో పదిలంగా ఉంచిందొకరు. పండుగకు పిల్లలకు కొన్న కొత్త బట్టలో.. పని దొరక్కపోతే పొట్ట నిండేందుకు పిడికెడు బియ్యం గింజలో.. ఏ కష్టార్జితమో.. ఏ ఇష్టమైన బహుమానమో.. కూలి బతుకులకు కొండంత అనిపించే వస్తువుల సముదాయమో.. వీటన్నిటినీ ఆ బడుగు జీవులు ఇంటింటా అమర్చుకున్నారు. అలాంటిది.. మబ్బు నుంచి మెరుపు వచ్చినట్టు అకస్మాత్తుగా చెలరేగిన అగ్ని ప్రమాదంతో అంతా కళ్లెదుటే కాలిపోతే.. అన్ని ఆశలూ తమ పూరిళ్ల సాక్షిగా బూడిదైపోతే.. నోట మాటలేక.. కార్చేందుకు కన్నీళ్లు రాక.. గొల్లపేట ఉపాధి కూలీలు మౌనంగా రోదిస్తున్నారు. పిడుగు పడ్డట్టు పేలిన గ్యాస్ సిలిండర్ల విస్ఫోట శబ్ధాలు ఇంకా గుండెల్లో హోరెత్తిస్తూ ఉంటే.. రేపటి బతుకేమిటని దిగులుగా చూస్తున్నారు. దీనంగా ప్రశ్నిస్తున్నారు. రణస్థలం: మండల కేంద్రం జె.ఆర్.పురం పంచాయతీలోని గొల్లపేటలో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో 15 పూరిళ్లు దగ్ధమయ్యాయి. సర్వం కాలిబూడిదవడంతో బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని మహిళలు, పెద్దలు శుక్రవారం సాయంత్రం ఉపాధి పనుల నిమిత్తం చెరువు వద్దకు వెళ్లిపోయారు. తొలుత పిట్ట అసిరప్పడు ఇంట్లో మంటలు చెలరేగడంతో గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో రెండు గ్యాస్‌బండలు ఒకేసారి పేలడంతో అందరూ పరుగులు తీశారు. మరో నాలుగు గ్యాస్ బండలు పేలడంతో మంటలు ఆర్పేందుకు ఎవరు సాహసించలేకపోయారు. విషయం తెలుసుకున్న ఉపాధి వేతనదారులంతా పరుగుపరుగున గ్రామంలోకి వచ్చినా అప్పటికే సర్వం బూడిదైపోయింది. భారీగా నగదు, విలువైన పత్రాలు, బంగారు నగలు కాలిపోవడంతో బాధితులు బోరుమని విలపించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు పక్కా భవనాలు మంజూరు చేస్తామని భరోసా కల్పించారు. రణస్థలం, పైడిభీమవరం పరిశ్రమల అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలు ఆర్పాయి. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియలేదు. బాధితులు వీరే.. పిట్ట రాము, గంగులు, ఆసిరప్పడు, గజ్జి శ్రీను, గండమాన అప్పలరాముడు, కోరాడ అచ్చిరాజు, పెసల రామలక్ష్మీ, జోగ రమణ, బోప్ప గంగులు, శిడగాన కొరమయ్య, శిడగాన లచ్చోడు, కోరాడ తౌడు, ఇప్పిలి చిన్న, గండమాన గంగమ్మ, పిల్ల నీలమ్మ, గండమాన లక్ష్మి, కోరాడ చిన్నప్పమ్మల ఇళ్లు కాలిపోయాయి. ప్రభుత్వ సహాయంగా తక్షణమే ఒక్కొక్క కుటుంబానికి 10 కేజీల బియ్యం, దుస్తులు, భోజన సదుపాయాలను తహసీల్దార్ ఎం.సుధారాణి ఏర్పాటు చేయించారు. దాదాపు రూ.30 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. ఈ సహాయక చర్యల్లో ఆర్ఐ సుబ్రహ్మణ్యం, అగ్నిమాపక అధికారి పి.అశోక్, రెవెన్యూ అధికారి వెంకన్న, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. -
ఆదర్శ పాఠశాల టు అమెరికా
రణస్థలం: తన కుమారుడిని డాక్టరు చదివించాలన్న తండ్రి తపన అందుకు మార్గాలను అన్వేషించింది. తండ్రి చూపించిన బాటలో కష్టపడి చదివిన ఆ బాలుడు ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రీ మెడికల్ స్కూల్లో సీటు సాధించాడు. అమెరికా యూనివర్సిటీలో ఈ సీటు సాధించి తల్లిదండ్రులకు, ఊరికేగాక చదువుకున్న పాఠశాలకు, జిల్లాకు కూడా పేరుతీసుకొచ్చాడు.. గుడివాడ హేమకుమార్. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం గ్రామానికి చెందిన హేమకుమార్ రణస్థలం ఆదర్శ ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. తండ్రి సూర్యనారాయణ పైడిభీమవరంలోని అరబిందో పరిశ్రమలో పనిచేస్తుండగా తల్లి అరుణ గృహిణి. సూర్యనారాయణ తన కుమారుడిని డాక్టరు చదివించాలని వైద్య కళాశాలలు, ప్రవేశాల గురించి తెలుసుకునేవారు. స్నేహితుల ద్వారా అమెరికాలోని బోట్సన్ రాష్ట్రంలోగల హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రీ మెడికల్ స్కూల్ గురించి విన్న ఆయన హేమకుమార్తో ప్రవేశ పరీక్ష రాయించాలనుకున్నారు. అవసరమైన పుస్తకాలు సమకూర్చటమేగాక ఆన్లైన్లో శిక్షణ ఇప్పించారు. గత నెల 19న హేమకుమార్ ప్రవేశ పరీక్ష రాశాడు. అందులో 93 శాతం మార్కులు రావడంతో హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ మెడికల్ కోర్సులో సీటు లభించింది. ఈ మేరకు యూనివర్సిటీ నుంచి ఈ నెల 17న సమాచారం వచ్చింది. దీంతో హేమకుమార్ ఆదర్శ పాఠశాలకు వచ్చి మిఠాయిలు పంచిపెట్టాడు. ప్రిన్సిపాల్ పి.శ్రీధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అతడిని అభినందించారు. ఆన్లైన్ క్లాసులు విన్నాను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు పైడిభీమవరంలోనే ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకున్నా. 5వ తరగతి రణస్థలం ఆర్సీఎం స్కూల్లో, 6 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో చదువుకున్నా. డాక్టర్ కావాలనే లక్ష్యంతో రోజుకు 6 గంటలకు పైగా ఆన్లైన్ క్లాసులు విన్నాను. ఇంటరీ్మడియల్ బయాలజీ పుస్తకాలు చదివాను. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. ఇంటిగ్రేటెడ్ మెడికల్ కోర్సులో.. ముందు 11, 11ప్లస్ రెండేళ్లు పూర్తిచేయాలి. తరువాత నాలుగేళ్లు ఎంబీబీఎస్ చదవాలి. జూన్‌లో క్లాస్‌లు ప్రారంభమవుతాయి. అక్కడకు వెళ్లిన తరువాత స్కాలర్షిప్ పరీక్ష రాయాల్సి ఉంది. నాన్న సూర్యనారాయణ ప్రోత్సాహంతోనే ఈ పరీక్ష రాశాను. కష్టపడి చదివి ఆయన కల నెరవేరుస్తాను. – హేమకుమార్, విద్యార్థి బాగా చదువుతాడు.. నా కుమారుడు మంచి డాక్టర్ అవ్వాలనేది నా కోరిక. కొందరిని సంప్రదిస్తే మెడికల్ విద్యకు హార్వర్డ్ యూనివర్సిటీ ది బెస్ట్ అని తెలిసింది. అందుకే ఆన్లైన్లో అప్లై చేయించాను. మంచిగా చదువుతాడు కాబట్టే సీటు వచ్చింది. సీటు రావడం సంతోషంగా ఉంది. ఎంత కష్టమైనా నా బిడ్డను చదివిస్తాను. – సూర్యనారాయణ, విద్యార్థి తండ్రి -
రణస్థలం హిట్ అవ్వాలి – పూరి జగన్నాథ్
‘‘ఆది అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా వద్ద చాలా సంవత్సరాలు పని చేశాడు. ఇప్పుడు తను దర్శకునిగా ‘రణస్థలం’ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. టీమ్‌కి అల్ ద బెస్ట్’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. రాజ్, షాలు జంటగా ఆది అరవల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణస్థలం’. సంతోష ఆంజనేయులు సమర్పణలో శ్రీలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కావలి రాజు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఆది అరవల మాట్లాడుతూ– ‘‘పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. ప్రేమకథ కూడా ఉంటుంది. మా గురువు పూరి జగన్నాథ్‌గారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘కెమెరామన్ ప్రభాకర్, సంగీత దర్శకుడు రాజకిరణ్ చక్కటి అవుట్‌పుట్ ఇచ్చారు. మా చిత్రాన్ని నవంబర్ ఆఖరులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు కావలి రాజు. -
ప్రేమ.. వినోదం.. రణస్థలం
‘‘రణస్థలం’ సినిమాని మా ప్రాంతం వారు తీసినందుకు గర్వపడుతున్నాను. రాజు చిన్న స్థాయి నుంచి ఈరోజు సినిమాలు నిర్మించే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజ్, షాలు జంటగా ఆది అరవల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణస్థలం’. సంతోష ఆంజనేయులు సమర్పణలో శ్రీలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కావాలి రాజు నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. కావాలి రాజు మాట్లాడుతూ–‘‘లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘రణస్థలం’. ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాం. ప్రస్తుతం సెన్సార్ చివరి దశలో ఉంది. నవంబర్ మొదటి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మా సినిమాకి కథే హీరో. మంచి కథతో చక్కటి అవుట్‌పుట్ తీసుకొచ్చాం. ప్రతి ఒక్కర్నీ మా చిత్రం ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’’అన్నారు ఆది అరవల. చిత్ర సంగీత దర్శకుడు రాజకిరణ్, కెమెరామన్ ప్రభాకర్, పాటల రచయిత రామారావు, కో డైరెక్టర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల బియ్యం మట్టిపాలు
సాక్షి, రణస్థలం (శ్రీకాకుళం): నిత్యం లక్షలాది మంది ప్రజలు తిండికి నోచుకోక ఆకలితో అలమటిస్తున్నారు. ఎంతోమంది పేదలు బక్కిచిక్కిపోతున్నారు. చిన్నారుల డొక్కలు తేలుతున్నాయి. ఇటువంటి ఎన్నో అంశాలు పాఠ్యాంశంగా బోధిస్తున్న ఉపాధ్యాయులే ఘోర తప్పిదం చేశారు. విద్యార్థులకు తిండి పెట్టాలని పంపించిన రేషన్ బియ్యాన్ని వృథా పాల్జేశారు. వీరి నిర్లక్ష్యం మూలంగా 22 బస్తాల బియ్యం ముక్కిపోయి పనికి రాకుండా పోయాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని జేఆర్‌పురం (రణస్థలం)లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిది వందలకుపైగా విద్యార్థులు ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. వీరందరికీగాను మధ్యాహ్న భోజనంగా పెట్టేందుకు మార్చిలో 22 బస్తాలు అంటే 11 క్వింటాళ్లు రేషన్ బియ్యం వచ్చాయి. పౌర సరఫరాల అధికారులు ఆయా పాఠశాలలు ఇచ్చిన ఇండెంట్ ప్రకారమే రేషన్ బియ్యాన్ని పాఠశాలలకు పంపిస్తారు. జేఆర్‌పురం హైస్కూలు ఉపాధ్యాయులు మాత్రం ముందస్తు ఆలోచన లేకుండా రేషన్ బియ్యం వృథా చేశారు. మార్చి, ఏప్రిల్‌లో ఒంటిపూట బడుల నిమిత్తం ఎక్కువ మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు ఆసక్తి చూపరు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తించలేదు. దీంతో ఇటు విద్యార్థులు తినడం కుదరక, అటు తిరిగి పౌర సరఫరాల అధికారులకు అప్పగించక వదిలేయడంతో పట్టులుపట్టి, ముక్కిపోయి తినేందుకు పనికిరాకుండా పోయాయి. శనివారం ఇక్కడకు కొత్తగా రేషన్ బియ్యం రావడంతో మార్చిలో విడుదల చేసిన రేషన్ బియ్యం పాడవడంతో పాఠశాల ఆవరణలో వృథాగా పడేశారు. స్థానికులు కొంతమంది ఆ బియ్యాన్ని చూసి ఇంతలా దుర్వినియోగం చేయడం దారుణమని చర్చించుకుంటున్నారు. తిరిగి మార్చేస్తాం మార్చిలో బియ్యం విడుదల చేయించాం. విద్యార్థులు తినకపోవడంతో మిగిలిపోయా యి. తహసీల్దారుతో మాట్లాడి తిరిగి పంపించేస్తాం. అందులో జూనియర్ కళాశాలకు సంబంధించి బియ్యం ఆరున్నర క్వింటాళ్లు ఉన్నాయి. – జీ రాజాకిషోర్, హెచ్ఎం, జెడ్పీ హైస్కూల్ రణస్థలం పరిశీలించి చర్యలు తీసుకుంటాం బియ్యం వృథా జరగిందని ఎవరూ చెప్పలేదు. తక్కువ మోతాదు బియ్యం అయితే మార్చవచ్చు. 11 క్వింటాళ్లంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలి. అయితే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – బీ రాజేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్, సివిల్ సప్లయి -
రణస్థలం వద్ద తమ్మినేని సీతారాంకు ఘనస్వాగతం
-
రణస్థలంలో వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం
-
రణస్థలంలో వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం
శ్రీకాకుళం: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఘనస్వాగతం లభించింది. వంశాధార ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలిచేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయనకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతంతో బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసిరెడ్డి వరద రామారావు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వాసిరెడ్డిని పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మరింతమంది స్థానిక నేతల వైఎస్ఆర్సీపీలో చేరారు. హీరమండలం పాతపట్నం నియోజకవర్గంలోని వంశధార ప్రాజెక్టు నిర్వాసితులపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మొత్తం 13 గ్రామాల బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ ప్రస్తుతం రణస్థలం చేరుకున్నారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ పర్యటనలో శుక్రవారం నిర్వాసితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. సాయంత్రం ఐదు గంటలకు హీరమండలంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. -
ఆంధ్రా ఆర్గానిక్స్ పైప్‌లైన్ లీకు
రణస్థలం: ఆంధ్రా ఆర్గానిక్స్ రసాయన పరిశ్రమకు సంబంధించి వ్యర్థ జలాలు తరలించేందుకు మండలంలోని దోనిపేట సముద్రం వరకు పైపులైను వేశా రు. ఈ పైపులైను అక్కయ్యపాలెం వద్ద సోమవారం లీకైంది.దీంతో వ్యర్థ జలాలు సమీపంలోని గెడ్డలోనికి, పొలాల్లోనికి ప్రవేశించడంతో రైతులు, స్థాని కులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైప్‌లైన్ లీక్ కావడంతో ఈ కంపెనీకి సాధారణంగా మారిపోయిం దని, ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పైప్‌లైన్ లీకేజీ వల్ల దుర్వాసన వస్తోందని, చుట్టు పక్కల పొలం పనులు కూడా చేయలేకపోతున్నామని చెబుతున్నారు. ఉద యం 5 గంటలకు పైప్‌లైన్ లీకైనట్లు సమాచారం అందిస్తే యాజమాన్యం 11 గంటలకు గానీ రాలేదని వారు తెలిపారు. ఆంధ్రా ఆర్గానిక్స్ పైపులైను సమీపంలోనే అరబిందో ఫార్మా, ల్యాన్ టెక్, సరకా వంటి కంపెనీల వ్యర్థ జలాలు తరలించే పైపులైన్లు ఉన్నా వాటి వల్ల ఎలాంటి నష్టం లేదని, ఇవి మాత్రమే చాలా పైకి ఉండి ఎప్పటికప్పుడు లీకవుతున్నాయని ఆరోపించారు. దీనివల్ల రైతులకు చాలా ఇబ్బందిగా ఉందని, యాజమాన్య ప్రతి నిధులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇబ్బందిగా ఉంది పైప్‌లైన్ లీకుల వల్ల రైతులు చాలా ఇబ్బం దులు పడుతున్నారు. నా పొలం గెడ్డ అవతల ఉం ది. ఈ పైపులైను భూమి పైకి ఉండటం వల్ల నాటుబళ్లు వెళ్లటం కష్టంగా ఉంది. – లంకలపల్లి రామరావు, మాజీ వైస్ సర్పంచ్ పట్టించుకోవడం లేదు పైప్‌లైన్ భూమి లోపలకు ఏర్పాటు చేయాలని చాలాసార్లు యాజమాన్యానికి చెప్పాం. అయినా పట్టించుకోవడం లేదు. రైతులం దరం కలిసి అడిగితే పోలీస్ కేసులు పెడుతున్నారు. – నాగవరపు బాబూరావు, రైతు -
ఎమ్మెల్యే విష్ణు క్షమాపణ చెప్పాలి
రణస్థలం : ఉపాధి హామీ చట్టం, కిలో రూపాయి బియ్యం పథకాల వల్ల వ్యవసాయ కూలీలు, పేదలు సోమరిపోతులౌతున్నారని, వాటిని సత్వరం ఎత్తివేయాలని అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభాపక్ష నాయుకుడు విష్ణుకుమార్‌రాజు తక్షణమే క్షమాపణ చెప్పాలని సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్. అమ్మన్నాయుడు శుక్రవారం డిమాండ్ చేశారు. పేదలు, వ్యవసాయ కూలీలు ఓట్లతో గెలిచి న ప్రజాప్రతినిధులు ఇలా మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. దేశానికి తిండిని అందిస్తున్న వ్యవసాయ కూలీలు, పేదల పట్ల ఇలా అహంకార పూరితంగా మాట్లాడడం తగదని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో 46.43 హెక్టార్ల భూమి సాగులోకి వచ్చిందని గుర్తు చేశారు. ఇటువంటి పథకాన్ని ఎత్తివేయాలని బీజేపీ నాయుకులు చెప్పడం సమంజసం కాదని విమర్శించారు. -
తోటపల్లి కాలువ పనులను అడ్డుకున్న రైతులు
రణస్థలం/లావేరు: రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా రణస్థలం, లావేరు మండలాల్లో అధికారులు చేపట్టిన తోటపల్లి కాలువ తవ్వకాలను గురువారం అడ్డుకున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పక్వానికి వచ్చే పంటల్లో కాలువల తవ్వకంపై మండిపడ్డారు. రణస్థలం మండలంలోని రణస్థలం రెవెన్యూ, లావేరు మండలంలోని తాళ్లవలస రెవెన్యూ పరిధిల్లో పొక్లెయిన్లతో చేపట్టిన తవ్వకాలను రణస్థలం, రావివలస రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న లావేరు మండల తహశీల్దార్ పి.వేణుగోపాలరావు, ఎస్సై రామారావులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. శివారు భూములకు సాగునీరందించేందుకు చేపట్టే కాలువ తవ్వకాలకు సహకరించాలని కోరారు. దీనిపై పలువురు రైతులు మాట్లాడుతూ పంటలు పక్వానికి వచ్చే దశలో ఉన్నాయని, ఇప్పుడు వాటిని నాశనం చేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. భూము లు ఏ మేరకు పోతున్నాయి, ఎంత నష్టపరిహారం అందజేస్తారన్నది తెలియజేయకుండా పనులు చేపట్టడాన్ని తప్పుబట్టారు. స్థానికంగా భూములు లేని టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన తప్పుడు నివేదికల ఆధారంగా పనులకు పూనుకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.అధికారులు నచ్చజెప్పినా రైతులు ససేమిరా అనడంతో అధికారులు వెనుదిరిగారు. పక్కా సర్వే, పరి హారం లెక్క తేలాకే పనులు చేపట్టాలని రణస్థలం, తాళ్లవలస గ్రామాలకు చెందిన రైతులు పిన్నింటి అప్పలనాయడు, సత్యం, పి.పాపినాయుడు, కుప్పిలి అప్పారావు, నీలకంఠం, లక్ష్మణరావు తదితరులు కోరారు. ఎకరాభూమి నష్టపోతున్నా... రావివలస గ్రామంలో ఉన్న ఎకరా భూమి తోటపల్లి కాలువకు పోతోంది. ఇక్కడ భూమిని సాగుచేయడానికి బోరుకూడా వేశాను. ఇప్పుడు ఎకరాభూమితో పాటు బోరుకూడా నష్టపోతున్నాను. ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేస్తుందో తెలియజేసి కాలువల తవ్వకాలు జరపాలి -పిన్నింటి సత్యనారాయణ, రైతు, రణస్థలం పంట చేతికొచ్చే సమయంలో...కాలువకు 40 సెంట్లు భూమి పోతోంది. ఇందులో ప్రస్తుతం మొక్కజొన్న సాగుచేస్తున్నా. పక్వానికి వచ్చింది. ఈ సమయంలో కాలువ తవ్వితే పెట్టుబడి అంతా మట్టిలో కలిసిపోతుంది. పరిహారం ఇచ్చాకే పనులు జరపాలి -పిన్నింటి అప్పలనాయుడు, రైతు, రణస్థలం -
కన్నీటి వీడ్కోలు
రణస్థలం: ఎయిర్‌ఫోర్స్ సైనికుడు దుంప లక్ష్మునాయు డి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ఆదివారం జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఉత్తరప్రదేశ్ నుంచి లక్ష్మునాయుడి మృతదేహన్ని ప్రత్యేక విమానంలో విశాఖపట్నం తీసుకువచ్చి, అక్కడి నుంచి నేవీ వాహనంలో మృతదేహాన్ని సాయంత్రానికి గోసాం తీసుకువచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, రమణయ్య, అసిరితల్లి, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహాన్ని చూసి..భోరున విలపించారు. అనంతరం సైనికులు..లక్ష్మునాయుడి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువచ్చి, రెండు నిమిషాలు మౌనం పౌటించారు. గౌరవ వందనం సమర్పించారు. గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి, చితికి నిప్పంటించారు. పరిసర గ్రామాల ప్రజల రాక.. లక్ష్మునాయుడి మృతదేహం గోసాంకి వస్తున్నట్టు ముం దుగానే తెలియడంతో..పరిసర గ్రామాల ప్రజలు, స్నేహితులు, బంధువులు మధ్యాహ్నం రెండు గంట లకు గోసాం చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు,. ప్రభుత్వ సాయం.. లక్ష్మునాయుడి తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని బెనిఫిట్స్ అందిస్తామని ఎయిర్‌ఫోర్స్ అధికారి ఎజ్‌జీఎన్‌చౌహాన్ తెలిపారు. ఇన్సూరెన్స్ మొత్తా న్ని అందిస్తామన్నారు. అంత్యక్రియల్లో ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో పాటు పోలీస్ శాఖ తరఫున హెచ్‌సీ అడివన్న, రెవెన్యూ కార్యదర్శి జె.వి.రమణమూర్తి పాల్గొన్నారు. పరామర్శలు.. మృతుని కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నాయకులు గొర్లె నరసింహాప్పలనాయుడు, పిన్నింటి సాయికుమార్, మహంతి చినరామినాయుడు, సర్పంచ్ కంబపు రామిరెడ్డి, ఎంపీటీసీసభ్యుడు ముల్లు కృష్ణ, టీడీపీ నాయకులు గొర్లె హరిబాబునాయుడు, నడుకుదిటి ఈశ్వరరావు, వెలిచేటి సురేష్, మహంతి అసిరినాయుడు తదితరులు పరామర్శించారు. -
రణస్థలం రణభేరి విజయవంతం
రణస్థలం, రణస్థలం రూరల్, న్యూస్‌లైన్: రణస్థలంలో శనివారం సమైక్య భేరి మోగింది. సమైక్యాంధ్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మహిళలు, యువకులు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, ముస్లింలు, క్రైస్తవులు స్వచ్ఛందగా తరలివచ్చి రణస్థలం రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉదయూన్నే జాతీయరహదారిపై బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వేద పండితులు సమైక్య యూగం చేశారు. అనంతరం రణభేరి వేదికపై మండలానికి చెందిన సర్పంచ్‌లు సమైక్య ప్రతిజ్ఞ చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు తహశీల్దార్ పి.రమేష్‌బాబు అధ్యక్షతన జరిగిన సభలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనే ఊపిరిగా పోరాటం సాగిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను విడిచిపెడితే రెండు తరాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఒకసారి మద్రాస్, మరోసారి కర్నూల్ రాజధానులను వదులుకుని తీవ్రంగా నష్టపోయామన్నారు. జిల్లా జేఏసీ కార్యదర్శి జామి భీమశంకర్ మాట్లాడుతూ ఉద్యమాలకు శ్రీకాకుళం జిల్లా పుట్టినిల్లన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంపై దిగ్విజయ్‌సింగ్ చేస్తున్న విమర్శలు మానుకోవాలన్నారు. సీనియర్ పాత్రికేయుడు నల్లి ధర్మారావు మాట్లాడుతూ ఐటీ రంగంలో ప్రపంచ స్థాయిలో ముందంజలో ఉన్న హైదరాబాద్ ను వదులుకుంటే భావితరాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. ప్రొఫెసర్ విష్ణుమూర్తి, సమైక్యాంధ్ర విద్యార్థి రాష్ట్ర ఫోరం అధ్యక్షుడు వి.ప్రకాష్, ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధి దుప్పల వెంకటరావు, సీపీఓ అప్పలనాయుడు, అంబేద్కర్ విశ్వ విద్యాలయం విద్యార్థి జేఏసీ నర్సునాయుడు, బాలి రామినాయుడు తదితరులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర వాదాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపించడంలో మంత్రులు, ఎంపీలు విఫలమయ్యారన్నారు. రాజకీయ నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నారని, రాజీనామాలు చేయకుండా డ్రామాలాడుతున్నార న్నారు. వీరిని రాష్ట్ర ద్రోహులుగా గుర్తించి ప్రజలందరూ సహాయ నిరాకరణ చేయాలన్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల సమైక్య సాంస్కతిక ప్రదర్శనలతో అలరించారు. కార్యక్రమానికి హాజరైనవారికి బొంతు అప్పలనాయుడు, నారాయణశెట్టి శ్రీనువాసరావు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గొర్లె కిరణ్‌కుమార్, కలిశెట్టి అప్పలనాయుడు స్థానిక జేఏసీ సభ్యులు డి.గోవిందరావు, బలివాడ శ్రీనివాసరావు, వేదుల రామకృష్ణ, బోంతు అప్పలనాయుడు, డి.శ్యాంసన్కుమార్, జి.వేణుగోపాలరావు, పున్నాన నరిసింహులునాయు డు, బోడ్డేపల్లి రవికుమార్, జి.చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.