రణస్థలం రణభేరి విజయవంతం
Published Sun, Sep 29 2013 4:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
రణస్థలం, రణస్థలం రూరల్, న్యూస్‌లైన్: రణస్థలంలో శనివారం సమైక్య భేరి మోగింది. సమైక్యాంధ్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మహిళలు, యువకులు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, ముస్లింలు, క్రైస్తవులు స్వచ్ఛందగా తరలివచ్చి రణస్థలం రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉదయూన్నే జాతీయరహదారిపై బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వేద పండితులు సమైక్య యూగం చేశారు. అనంతరం రణభేరి వేదికపై మండలానికి చెందిన సర్పంచ్‌లు సమైక్య ప్రతిజ్ఞ చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు తహశీల్దార్ పి.రమేష్‌బాబు అధ్యక్షతన జరిగిన సభలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనే ఊపిరిగా పోరాటం సాగిస్తున్నామన్నారు.
హైదరాబాద్‌ను విడిచిపెడితే రెండు తరాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఒకసారి మద్రాస్, మరోసారి కర్నూల్ రాజధానులను వదులుకుని తీవ్రంగా నష్టపోయామన్నారు. జిల్లా జేఏసీ కార్యదర్శి జామి భీమశంకర్ మాట్లాడుతూ ఉద్యమాలకు శ్రీకాకుళం జిల్లా పుట్టినిల్లన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంపై దిగ్విజయ్‌సింగ్ చేస్తున్న విమర్శలు మానుకోవాలన్నారు. సీనియర్ పాత్రికేయుడు నల్లి ధర్మారావు మాట్లాడుతూ ఐటీ రంగంలో ప్రపంచ స్థాయిలో ముందంజలో ఉన్న హైదరాబాద్ ను వదులుకుంటే భావితరాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. ప్రొఫెసర్ విష్ణుమూర్తి, సమైక్యాంధ్ర విద్యార్థి రాష్ట్ర ఫోరం అధ్యక్షుడు వి.ప్రకాష్, ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధి దుప్పల వెంకటరావు, సీపీఓ అప్పలనాయుడు, అంబేద్కర్ విశ్వ విద్యాలయం విద్యార్థి జేఏసీ నర్సునాయుడు, బాలి రామినాయుడు తదితరులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర వాదాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపించడంలో మంత్రులు, ఎంపీలు విఫలమయ్యారన్నారు.
రాజకీయ నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నారని, రాజీనామాలు చేయకుండా డ్రామాలాడుతున్నార న్నారు. వీరిని రాష్ట్ర ద్రోహులుగా గుర్తించి ప్రజలందరూ సహాయ నిరాకరణ చేయాలన్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల సమైక్య సాంస్కతిక ప్రదర్శనలతో అలరించారు. కార్యక్రమానికి హాజరైనవారికి బొంతు అప్పలనాయుడు, నారాయణశెట్టి శ్రీనువాసరావు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గొర్లె కిరణ్‌కుమార్, కలిశెట్టి అప్పలనాయుడు స్థానిక జేఏసీ సభ్యులు డి.గోవిందరావు, బలివాడ శ్రీనివాసరావు, వేదుల రామకృష్ణ, బోంతు అప్పలనాయుడు, డి.శ్యాంసన్‌కుమార్, జి.వేణుగోపాలరావు, పున్నాన నరిసింహులునాయు డు, బోడ్డేపల్లి రవికుమార్, జి.చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Advertisement