లావేరు/రణస్థలం: ఏంకష్టం వచ్చిందో తెలియదు కాని.. వివాహమైన ఐదు నెలలకే ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిండునూరేళ్లు కలిసి ఉంటానని బాసలు చేసిన అర్ధాంగిని అర్ధాంతరంగా విడిచిపెట్టేశాడు. తీవ్ర విషాదాంతమైన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. లావేరు మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన యువకుడు కలిగెట్ల తిరుపతిరావు (27) రణస్థలంలోని రామతీర్థాలు కూడలిలో మామయ్యతో కలిసి కార్పెంటర్ పని చేసుకుంటుండేవాడు. ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస గ్రామానికి చెందిన గోవిందమ్మను ఈ ఏడాది జూన్ నెలలో వివాహం చేసుకున్నాడు.
చదవండి: (పెళ్లైనప్పటి నుంచే పద్మజ అంటే చిన్నచూపు.. అనుమానంతో)
బుధవారం ఉదయం రణస్థలంలోని షాపు వద్దకు వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే మధ్యాహ్న సమయానికి తిరుపతిరావు రణస్థలం మండలంలోని జేఆర్‌పురం పంచాయతీ పరిధిలోని గరికిపాలెం పరిధిలోని తోటలో జీడి చెట్టుకు ఉరివేసుకొని చనిపోయి ఉండటాన్ని అటుగా వెళ్తున్నవారు చూసి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తల్లి పద్మావతి, భార్య గోవిందమ్మ, ఇద్దరు సోదరులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని తిరుపతిరావు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. నాకు ఇక దిక్కెవరూ అంటూ భార్య గోవిందమ్మ విలపించిన తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది.
చదవండి: (ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..)
ఎటువంటి సమస్యలు లేవని, భార్యతో కూడా అన్యోన్యంగా ఉండేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గ్రామంలో కూడా అందరితో ఎంతో సన్నిహితంగా ఉండేవాడని స్థానికులు చెప్పారు. ఈ తిరుపతిరావు ఆత్మహత్యతో స్వగ్రామం తాళ్లవలసలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జె.ఆర్.పురం ఎస్సై జి.రాజేష్ చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ లావేరు మండల ప్రధాన కార్యదర్శి దేశేట్టి తిరుపతిరావు, ఎఫ్‌ఎస్‌సీఎస్ డైరెక్టర్ మీసాల శ్రీనివాసరావు తదితరులు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment