రణస్థలంలో వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం
శ్రీకాకుళం: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఘనస్వాగతం లభించింది. వంశాధార ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలిచేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయనకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతంతో బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసిరెడ్డి వరద రామారావు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వాసిరెడ్డిని పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మరింతమంది స్థానిక నేతల వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. హీరమండలం పాతపట్నం నియోజకవర్గంలోని వంశధార ప్రాజెక్టు నిర్వాసితులపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మొత్తం 13 గ్రామాల బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ ప్రస్తుతం రణస్థలం చేరుకున్నారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ పర్యటనలో శుక్రవారం నిర్వాసితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. సాయంత్రం ఐదు గంటలకు హీరమండలంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.