![Investigation into fire incident at YSRCP central office](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/fire.jpg.webp?itok=nofiitMe)
ఆధారాలు సేకరిస్తున్న ఎఫ్‌ఎస్‌ఎల్, ఫోరెన్సిక్ అధికారులు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద రోడ్డు వెంబడి ఏర్పడిన మంటలపై తాడేపల్లి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం విచారణ చేపట్టారు. దీన్లోభాగంగా గుంటూరు జిల్లా లా అండ్ ఆర్డర్ ఎస్పీ రవికుమార్, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు పర్యవేక్షణలో గుంటూరు జిల్లా ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం, ఫోరెన్సిక్ బృందాలు మంటలు ఏర్పడిన ప్రాంతం వద్ద ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు, ఎస్‌ఐలు ఖాజావలి, జె. శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద పార్కులో మంటలు చెలరేగడం వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతోందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని తాడేపల్లి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసినట్టు వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నాగనారాయణమూర్తి చెప్పారు.
తరచూ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా గొడవ చేస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతకు భంగం కలిగేలా నిత్యం ఏదో ఒక ఘటన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment